ఉప ఎన్నికలు: బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్నాటక, పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో నాలుగు లోక్‌సభ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కమల దళం అత్యధిక చోట్ల పరాజయం పాలైంది.

నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా, మరొకటి బీజేపీ మిత్రపక్షం 'నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(‌ఎన్‌డీపీపీ)' సిట్టింగ్ స్థానం. రెండు లోక్‌సభ స్థానాలు బీజేపీ కోల్పోయింది.

సిట్టింగ్ స్థానాలైన కైరానా(యూపీ), పాల్ఘార్(మహారాష్ట్ర), భండారా గోండియా(మహారాష్ట్ర)లలో ఒక్క పాల్ఘార్ సీటును మాత్రమే బీజేపీ నిలబెట్టుకోగలిగింది. ఈశాన్య భారతంలో తన సిట్టింగ్ సీటైన నాగాలాండ్ లోక్‌సభ స్థానాన్ని ఎన్‌డీపీపీ కాపాడుకుంది.

ఫలితాలు గురువారం వెలువడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా

మహారాష్ట్ర: పాల్ఘార్‌లో రెండో స్థానంలో నిలిచిన శివసేన

అందరి దృష్టి కేంద్రీకృతమైన కైరానా లోక్‌సభ స్థానంలో అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) గెలుపొందింది. విపక్షాలు ఆర్‌ఎల్‌డీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ అన్నీ ఏకమై బీజేపీని ఓడించాయి.

బీజేపీ నేత హుకుం సింగ్ మరణంతో కైరానా ఖాళీ అయ్యింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి, హుకుం సింగ్ కుమార్తె మృగాంక సింగ్‌పై ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 44,618 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుత 16వ లోక్‌సభలో యూపీ నుంచి ప్రాతినిధ్యం వహించనున్న ఏకైక ముస్లిం ఆమెనే.

యూపీలో మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ రెండు లోక్‌సభ స్థానాలు- గోరఖ్‌పుర్, ఫుల్‌పుర్‌లను కోల్పోయింది.

భండారా గోండియా(మహారాష్ట్ర)లో 2014లో బీజేపీ తరపున ఎంపీగా గెలిచిన నానాభావ్ పటోలే ఈ ఏడాది జనవరిలో బీజేపీ సభ్యత్వానికి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఉప ఎన్నికలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అభ్యర్థి మధుకర్ కుకడే గెలుపొందారు.

పాల్ఘార్(మహారాష్ట్ర)లో బీజేపీ నేత చింతామన్ వనగ జనవరిలో గుండెపోటుతో మృతిచెందడంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గవిట్ రాజేంద్ర ధేడ్యా గెలుపొందారు. మహారాష్ట్రలో ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన శివసేన ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్,

బిహార్‌లోని జోకిహాత్‌లో ఎన్‌డీఏ భాగస్వామి జేడీయూపై ప్రతిపక్ష ఆర్‌జేడీ భారీ మెజారిటీతో గెలుపొందింది.

పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్, కర్నాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, మేఘాలయ రాష్ట్రాల్లోని పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీకి ఒకే ఒక్క స్థానం థరాలి(ఉత్తరాఖండ్) దక్కింది. యూపీలోని నూర్పూర్, పంజాబ్‌లోని షాహ్ కోట్ లాంటి స్థానాలను బీజేపీ, బీజేపీ మిత్రపక్షాలు నిలబెట్టుకోలేకపోయాయి. నూర్పూర్ బీజేపీ సిట్టింగ్ స్థానం కాగా, ప్రతిపక్షాలన్నీ ఒక్కటై కమల దళాన్ని ఓడించాయి.

ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు

  • షాహ్‌కోట్(పంజాబ్)
  • నూర్పూర్(ఉత్తర్ ప్రదేశ్)
  • థరాలి(ఉత్తరాఖండ్)
  • జోకిహాత్(బిహార్)
  • గోమియా(ఝార్ఖండ్)
  • సిల్లి(ఝార్ఖండ్)
  • మహేశ్ తాలా(పశ్చిమ్ బంగ)
  • అంపతి(మేఘాలయ)
  • రాజరాజేశ్వరినగర్(కర్నాటక)
  • చెంగన్నూర్(కేరళ)

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

మూడు చోట్ల కాంగ్రెస్ గెలుపు

కర్నాటక, పంజాబ్‌, మేఘాలయల్లోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది.

ఝార్ఖండ్‌లోని రెండు సీట్లను ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చేజిక్కించుకొంది.

కేరళలోని చెంగన్నూర్‌ను సీపీఎం, యూపీలోని నూర్పూర్‌ను సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లోని జోకిహాత్‌ను రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ), పశ్చిమ బెంగాల్‌లోని మహేశ్ తాలాను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకున్నాయి.

బిహార్‌లోని జోకిహాత్‌లో ఎన్‌డీఏ భాగస్వామి జనతాదళ్(యునైటెడ్)‌పై ప్రతిపక్ష ఆర్‌జేడీ భారీ మెజారిటీతో గెలుపొందింది.

ఝార్ఖండ్‌లోని గోమియాలో, కేరళలోని చెంగన్నూర్‌లో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)