No Smoking Day: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా... ‘నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే’

స్మోకింగ్

ఫొటో సోర్స్, Getty Images

(గమనిక: పొగతాగడం ఆరోగ్యానికి హానికరం)

'రోజుకెన్ని కాలుస్తావ్..!' పాదాలపై పడుతున్న లుంగీని కొద్దిగా పైకెత్తి కుడికాలి కింద సిగరెట్ పీకను నలిపేస్తూ అడిగాడు ఓనర్ అంకుల్.

నేనేమీ సమాధానం చెప్పలేదు.. చిన్న చిరునవ్వు నవ్వానంతే

పెట్టె అయిపోద్దా.. మళ్లీ ఆయనే అడిగాడు.

'హా..' తలూపాను..

'ఏ పెట్టో అడగండి..' రూంలోకి అప్పుడే వస్తున్న సాయినాథ్ అన్నాడు.

'అదేంటీ.. మనోడు తాగేది నేవీకట్ కదా! మళ్లీ అడగడం ఎందుకూ?' నుదుటి మీద చర్మాన్ని నాలుగు మడతలేసి మరీ అడిగాడు ఓనర్ అంకుల్.

'అదేమరి.. ఆయన చెప్పేది అగ్గిపెట్టె గురించి, సిగరెట్ పెట్టెకాదు..' సాయినాథ్ ఆ మాట అన్నాక ఓనర్ అంకుల్ తేరుకోవడానికి ఒకట్రెండు నిమిషాలు పట్టింది.

ఫొటో సోర్స్, Getty Images

'తగ్గించయ్యా..' అంటూ అక్కడి నుంచి లేచి పై పోర్షన్లోని ఇంటికి వెళ్లిపోయాడాయన.

... పదేళ్ల కిందట నేనెంత చైన్ స్మోకర్‌నో చెప్పడానికి ఈ ఒక్క సందర్భం చాలు.

అది జరిగిన ఆరేడు నెలలకే నేను సిగరెట్ మానేశాను. అది కూడా ఉన్న ఫళంగా..

నాకు తెలిసి సిగరెట్ అలవాటున్న ఎవ్వరూ కూడా ఈ మాట నమ్మరు. ఉన్న ఫళంగా మానేయడం అసాధ్యం అంటారు. కానీ.. అది నిజం.

ఫొటో సోర్స్, Getty Images

ఆ తరువాత నేనెప్పుడూ సిగరెట్ తాగలేదా..?

తాగాను.. రెండు సార్లు. రాజేశ్ గాడి కోసం..

హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కోర్టు పనులపై వాడొచ్చిన ప్రతిసారీ నన్ను కలవకుండా వెళ్లేవాడు కాదు. అప్పుడు పాత బెస్ట్ కేఫ్ దగ్గర టీ తాగుతూ వాడొక సిగరెట్ వెలిగించి నాకొకటి ఆఫర్ చేసేవాడు.

వద్దురా అన్నా వినేవాడు కాదు. 'నాకోసం తాగు బావా'.. అనేవాడు

వాడి వెధవ సెంటిమెంటుతో పడలేక రెండుసార్లు తాగాను.

ఆ తరువాత వాడికే అర్థమైంది.. నేను నిజంగానే మానేశానని.

'బాగుపడుతున్నోడిని పాడుచేసిన పాపం నాకెందుకు బావా' అంటూ ఆఫర్ చేయడం మానేశాడు.

అప్పటి నుంచి సంపూర్ణ పొగ నిషేధాన్ని నేను విజయవంతంగా కొనసాగిస్తున్నాను.

రోజుకు అన్నేసి సిగరెట్లు కాల్చేవాడినంటున్నాడు.. మరి అంత అకస్మాత్తుగా ఎలా మానేశాడు.. అనుకుంటున్నారా..

నేనెలా మానేశానో చెప్పడానికి ముందు ఎలా మొదలుపెట్టానో చెబుతాను.

అదేమీ పెద్ద కథ కాదు.. అందరిలాంటిదే.. సింపుల్‌గా మొదలైపోయింది మన పొగంగేట్రం (సిగరెట్ తాగడం ప్రారంభించడమన్న మాట)

....పదో తరగతి. ఎప్పటిలాగే తెల్లారి ఆరో గంటకు సైకిలేసుకుని భాస్కరరావు మాస్టారింటికి ట్యూషన్‌కెళ్లా. మనమెళ్లేటప్పటికి ఆయనింటి డాబాపై వేసిన షెడ్లలో ముందు వరుసలన్నీ నిండిపోయి మనకోసం చివరి వరసలే మిగిలాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఒకవైపు శర్మ, మరోవైపు సిద్ధూగాడు.. 'రారా బావా నీకోసమే వెయిటింగ్' అంటూ పక్కకు జరిగి చోటిచ్చారు.

అసలే ఆలస్యంగా వచ్చాం కదా, మాస్టారి ఫోకస్ మనపై పడకుండా కొద్దిసేపు సైలెంటుగా కూర్చున్నాను.

'అరే చూపించరా.. చూపించరా..' అంటూ సిద్ధూగాడు శర్మని రీనాల్డ్స్ పెన్నుతో పొడుస్తున్నాడు.

వాడు మెల్లగా కాస్త వెనక్క వాలి, ప్యాంటు సైడు పోకెట్లోంచి చిన్న ప్యాకెట్ తీశాడు..

చూడగానే నాకర్థమైపోయంది అదేంటో.. 'నీయబ్బా..' అని మనసులోనే అనుకుని కిమ్మనకుండా కూర్చున్నాను

ఇంతలో ట్యూషన్ అయిపోయింది. సైకిలెక్కుతుంటే ఈ రోడ్లోకి తిప్పురా అంటూ శర్మగాడి ఆదేశం.

ఇంకేముంది నేను, శర్మ, సిద్ధూ ముగ్గురం పక్క రోడ్లోని మున్సిపల్ స్కూలు వెనక్కు వెళ్లాం. జనాలు పెద్దగా తిరగని రోడ్డు.. శర్మ సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేశాడు. మూడున్నాయి అందులో. అర్థమైపోయింది నాకు మా ముగ్గురి కోసం తెచ్చాడని.

'నేనెప్పుడూ తాగలేదురా..' అన్నాను

'ఆ.. మేం రోజూ తాగుతాం మరి' సిద్ధుగాడి ఎటకారం.

ఇద్దరూ బలవంతం చేశారు.. ఎలా ఉంటుందో చూడాలని నాకూ అనిపించింది.

అయిష్టం నటిస్తూ ఒక సిగరెట్ అందుకున్నాను..

ఎలా వెలిగించాలిరా..? అడిగాను.

ఫొటో సోర్స్, Getty Images

శర్మ ఈసారి చొక్కా జేబులో చెయ్యిపెట్టి ఒక వంగపండు రంగు దళసరి కాగితం ముక్క తీశాడు. అదింకేంటో కాదు. అగ్గిపెట్టెకు అగ్గిపుల్ల గీయడానికి పక్కనుండే భాస్వరం పట్టీ అది. దాంతో పాటు అయిదారు అగ్గిపుల్లలు.

'అగ్గిపెట్టె జేబులో పెట్టుకుంటే దొరికిపోతామని ఈ ఐడియా' చెప్పాడు వాడు.

వాడే అగ్గిపుల్ల వెలిగించి ఇచ్చాడు.. నా పొగంగేట్రం అయిపోయింది.

అనుభవం లేదు కదా, మొదటి పఫ్ కాస్త గట్టిగా పీల్చాను. నషాళానికి అంటినట్లయింది. దగ్గొచ్చింది. వెంటనే శర్మ వైపు చూశాను.. చిద్విలాసంగా ఊదేస్తున్నాడు.

నాకూ అర్థమైపోయింది.. పొగతాగడంలో నిదానమే ప్రధానం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంటు పాయింటని.

సిగరెట్ పూర్తయ్యాక ఇంకో డౌట్.. 'అరే స్మెల్లొస్తుందా?' అడిగాను

మళ్లీ జేబులో చేయిపెట్టాడు. ఈసారి జామ ఆకులు బయటకు తీశాడు.

ఇంట్లో దొరక్కుండా సిగరెట్ తాగడం అలా నేర్చేసుకున్నాను ఆరోజు.

అప్పటి నుంచి వీలు దొరికినప్పుడంతా మూణ్నాలుగు రోజులకోసారి సిగరెట్లు కాల్చేవాళ్లం.

ఇంటర్మీడియట్ దాటి డిగ్రీకొచ్చేసరికి ఆ మూణ్నాలుగు రోజులన్నది రోజుకు మూణ్నాలుగుసార్లకు చేరింది.

పొగ పీక్ స్టేజికి..

డిగ్రీ తరువాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ప్రిపరేషన్లు అంటూ ఇంటిపట్టున కాకుండా.. ఫ్రెండ్సు రూముల్లో మకాం వేసేవాళ్లం.

ఈలోగా డిగ్రీ క్లాస్‌మేట్ వెంకటేశ్ గాడి అన్నతో కలిసి చిన్న బిజినెస్ మొదలుపెట్టాను. దానికో ఆఫీస్ రూం.

వ్యాపారం బాగానే వర్కవుటడంతో అంతోఇంతో సొంత సంపాదన. దాంతో రోజుకు మూణ్నాలుగు సిగరెట్లను దాటి రోజుకు పదికి చేరింది.

అది అలాఅలా పెరిగి రోజుకు రెండు పెట్టెలకు వెళ్లింది(ఈసారి అగ్గిపెట్టెలు కాదు సిగరెట్ పెట్టెలే)

ఫొటో సోర్స్, Getty Images

ఆ సెగకు పొగ మానేశాను..

టెన్తు క్లాసు నుంచి ఒకటీ ఒకటీ చెప్పాను కానీ చివరకు ఏమైందో చెప్పలేదు కదా. అదీ చెప్పేస్తా ఇంకెందుకు మొహమాటం.

బిజినెస్ చేస్తూనే ఆ పరీక్షా ఈ పరీక్షా రాస్తుంటే ఉద్యోగం దొరికింది. కొత్త ఫ్రెండ్సు దొరికారు.

సెలవు రోజున రూంలో టీవీ చూస్తూనో.. పుస్తకం చదువుతూనో సిగరెట్ మీద సిగరెట్ ఊదేసేవాళ్లం.

రోజుకు రెండు పెట్టెలు గ్యారంటీ..

ఎక్కువవుతున్నాయిరా అని చెప్పే మిత్రులు.. ఆరోగ్యం పాడవుద్దిరా అని మందలించే శ్రేయోభిలాషులు ఎక్కువైపోయారు..

దీనికి తోడు 'మానేయొచ్చు కదా' అని ముద్దుముద్దుగా అడిగి మరో వ్యక్తి పరిచయం.

ఫొటో సోర్స్, Getty Images

మిత్రులు, శ్రేయోభిలాషుల మందలింపులు, హెచ్చరికల కంటే ఇదెక్కువైపోయింది.

ఆ ప్రభావమో ఏమో తెలియదు కానీ, ఒక రోజు ఇక దీన్ని ఆపేయాలనిపించింది.

ఆలోచించాను.. సరే చూద్దాం అనుకున్నాను.

మానేయమన్న ఒత్తిడి పెరిగాక.. మానేయాలని నాకూ అనిపించాక కూడా అంతే ఉద్ధృతంగా సిగరెట్లు తాగాను.

ఆ రోజు రాత్రి 11 గంటల సమయం. టీవీ చూస్తున్నాను. రూంలోని కిటీకిపై రెండు సిగరెట్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయి.

ఒకటి సగం అయిపోయింది.. రెండోది ఇంకా ఓపెన్ చేయలేదు.

లేచి తిన్నగా వెళ్లి సగమున్న ప్యాకెట్ తీశాను.. చూస్తే నాలుగున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఒకటి వెలిగించా.. ద్వారం దగ్గర నిల్చుని పొగతాగుతుంటే మనసులో ఆలోచనలు తిరుగుతున్నాయి.

తను చెప్పింది నిజమే కదా.. ఇన్నేసి సిగరెట్లు తాగితే ఏమవుతుంది? మరో పదేళ్లయ్యేసరికి మంచం పట్టేస్తానేమో అనిపించింది.

చేతిలో ఉన్నది ఫినిష్ చేసి జేబులోని తెల్ల రుమాలు నోటికి అడ్డం పెట్టుకుని గట్టిగా రెండుసార్లు గాలి ఊదాను.

తెల్ల రుమాలుపై అరచేతి వెడల్పున బ్రౌన్ కలర్ మరక పడింది.

ఎందుకో చెప్పలేనంత భయం వేసింది.. మానేయమని పట్టుపడుతున్న మనిషి కళ్ల ముందు కనిపించినట్లయింది.

లోపలికి వచ్చి కూర్చున్నాను. సిగరెట్ మానేయాలా? వద్దా? ఇదే ఆలోచన.

మెల్లమెల్లగా మానేయాలి.. నాలో నేనే అనుకున్నాను.

కాదు ఈ క్షణం నుంచే మానేయాలి..

ఫొటో సోర్స్, Getty Images

మొత్తానికైతే మానేయాలన్న ఆలోచన బలపడింది.

అక్కడికి అర గంట వ్యవధిలో మరో రెండు సిగరెట్లు పూర్తి చేసేశాను.

ఇకచాలు... ఇదే చివరిది అనుకుంటూ ఆ ప్యాకెట్లోని చివరి సిగరెట్ వెలిగించాను. గుండెల నిండా పొగ పీల్చి ముక్కులోంచి బయటకొదులుతూ ఆస్వాదించాను.

ఫిల్టర్ అంచుల వరకు వదలకుండా కాల్చేశాను. ఇదే చివరి సిగరెట్ అని గట్టిగా నిర్ణయించుకుని వచ్చి పడుకున్నాను.

మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే ఆలోచన సిగరెట్ వైపే మళ్లింది. చూపు కిటికీపైన ఉన్న ప్యాకెట్‌పై పడింది. కానీ.. అడుగులు మాత్రం అటు పడకుండా నిగ్రహించుకున్నాను.

అప్పటి నుంచి వారం రోజులు నరకయాతన. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా పావుగంటకోసారి సిగరెట్ తాగాలనిపించేది.

దేనిపైనా దృష్టి నిలిచేది కాదు. ఎవరైనా సిగరెట్ తాగుతూ కనిపిస్తే చాలు.. ఎక్కడినుంచైనా పొగ వాసన వస్తే చాలు.. ఒక్కటి తాగేసి ఆపేస్తాను అనిపించేది. ఏ పనీ చేయాలనిపించేది కాదు.

కానీ, అన్ని ఆలోచనలనూ జయించాను. వారం రోజుల తరువాత సిగరెట్ గుర్తుకు రావడం బాగా తగ్గిపోయింది.

ఆలోచన వచ్చినా ఎక్కువ సేపు ఉండేది కాదు.

మానేసి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది.. ఇప్పటికీ అప్పుడుప్పుడు సిగరెట్ తాగాలన్న కోరిక కలుగుతుంటుంది.

నా చుట్టూ ఉన్నవారు స్మోక్ చేస్తుంటే నాలోని ఒకప్పటి చైన్ స్మోకర్ నిద్ర లేస్తుంటాడు.

కానీ.. ఒక్క రోజులో సిగరెట్ మానేయడం అనేది నా జీవితంలో సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తుంటాను నేను. ఆ గెలుపును ఓడిపోనివ్వకూడదనే కారణంతో అప్పుడప్పుడు లేచే చైన్ స్మోకర్‌ను నిద్రపుచ్చేస్తుంటాను.

నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఒక్కటే.. నికోటిన్ కంటే నిగ్రహశక్తి గొప్పది.

(గతంలో చైన్ స్మోకర్‌గా ఉండి ఇప్పుడు పొగ మానేసిన వ్యక్తి నిజ జీవిత అనుభవమిది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)