ప్రెస్‌రివ్యూ: అమరావతిలో ఉష్ణోగ్రతను 10 డిగ్రీలు తగ్గించే దిశగా ప్రయత్నాలు?

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎండలు, ఉష్ణోగ్రతల తీవ్రతపై అధ్యయనం చేసిన నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ప్రతినిధులు.. ఆ అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారని 'ఈనాడు' తెలిపింది.

వెలగపూడి సచివాలయంలో గురువారం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం జరిగింది.

గత మూడు రోజుల్లో విజయవాడలో నమోదైన వాస్తవ ఉష్ణోగ్రత కంటే ప్రజలకు అనిపించే (ఫీలయ్యే) ఉష్ణోగ్రత అధికంగా ఉందని, దాదాపు 60 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్నట్లు అనిపించిందని నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రాజధానిలో పది డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

మరోవైపు, అమరావతి విషయంలో అనుకున్న స్థాయిలో పనులు వేగంగా జరగడం లేదని సీఆర్‌డీఏ అధికారులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ రూపొందించిన ప్రతిపాదనలను ముందే పరిశీలించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

కొత్త 'స్థానికత'తో మళ్లీ చిక్కులు

తెలంగాణలో ఏర్పాటు చేయ తలపెట్టిన కొత్త జోన్లు, స్థానికత నిర్ధారణపై కొత్త చిక్కులు ముసురుకుంటున్నాయి అని 'సాక్షి' పేర్కొంది.

ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి మధ్య నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడి స్థానికత వర్తిస్తుందన్న నిర్వచనంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దానివల్ల తెలంగాణ వారికి నష్టం జరిగే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉదాహరణకు ఎవరైనా అభ్యర్థి ఒకటి నుంచి 4 లేదా 5వ తరగతి వరకు తెలంగాణలో చదివి, తర్వాత పదో తరగతి వరకు ఏపీలో చదివితే... రెండు చోట్లా స్థానికులుగా అర్హత పొందుతారు.

అంటే ఏపీకి చెందినవారు తెలంగాణలోని స్థానిక కోటాలోనూ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని... అదే జరిగితే తెలంగాణ స్థానికులు నష్టపోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

స్థానికతకు కొత్త నిర్వచనం వివాదాస్పదంగానే ఉందని ఉద్యోగ సంఘాల నేతలు సైతం పేర్కొంటున్నారు అని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, jd laxminarayana fans club/facebook

'జేడీ' దారేదీ?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యూహం ఏమిటి? ఆయన రాజకీయ గమ్యం ఏమిటి? బీజేపీ వైపు చూస్తున్నారా? పవన్‌తో కలిసి నడుస్తారా? లేక... సొంత జెండా ఎగరేస్తారా? ఇవి సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్నలంటూ 'ఆంధ్రజ్యోతి' ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆరెస్సెస్‌ కార్యక్రమంలో జేడీ పాల్గొని, 'నమస్తే సదా వత్సలే మాతృభూమి' ప్రార్థన ఆలపిస్తున్న చిత్రం ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ సృష్టించింది.

స్వయంగా లక్ష్మీనారాయణ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోనే ఈ ఫొటో ఉంది. దీంతో... 'భావసారూప్యత' దృష్ట్యా ఆయన బీజేపీలో చేరడం ఖాయమంటూ జాతీయ మీడియాలోనూ వార్తలు గుప్పుమన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి లక్ష్మీనారాయణ సన్నిహితుల వాదన మరోలా ఉంది. ఆయనకు మొదటి నుంచీ ఆరెస్సెస్‌ అంటే అభిమానమే. దీనిని ఎప్పుడూ దాచుకోలేదు కూడా! ఆరెస్సెస్ కు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఇది ఒక సిద్ధాంతంతో కూడిన స్వచ్ఛంద సంస్థలాంటిదని ఆయన అభిప్రాయం.

అంతే తప్ప... తాజా పరిణామాలకు దీంతో ముడిపెట్టకూడదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన అంతిమ గమ్యం రాజకీయాలే అనే వార్తలు బలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన భావాల దృష్ట్యా ఆయన బీజేపీలోనే చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

సగౌరవ తెలంగాణ

తెలంగాణలోని 11 జిల్లాలను ఓడీఎఫ్‌ (ఆరు బయట మల విసర్జన రహిత) జిల్లాలుగా ప్రభుత్వం తాజాగా నిర్ధరించింది అని ఈనాడు పేర్కొంది.

అంటే అయా జిల్లాల్లోని నూరు శాతం ఇళ్లలో గౌరవ గృహాల (మరుగుదొడ్లు) సదుపాయం సమకూరిందన్న మాట.

అతి త్వరలోనే మరో 5 జిల్లాలు ఓడీఎఫ్‌ జాబితాలో చేరనున్నాయి. 2018, డిసెంబరు నాటికి అన్ని జిల్లాలను ఇలా తీర్చిదిద్ది 'స్వచ్ఛ తెలంగాణ'ను ఆవిష్కరించాలని సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది.

దీని కోసం స్వచ్ఛభారత్‌ పథకం ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.635 కోట్లు ఖర్చు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర అవిర్భావ సమయానికి తెలంగాణలో కేవలం 12 లక్షల (27 శాతం) గ్రామీణ ఇళ్లలో మాత్రమే గౌరవ గృహాలున్నాయి.

అదే ఏడాది కేంద్రం స్వచ్ఛ భారత్‌ను ప్రవేశపెట్టటం..'స్వచ్ఛ తెలంగాణ' లక్ష్యంగా రాష్ట్ర సర్కారు వాటి నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడంతో వాటి సంఖ్య ప్రస్తుతం 36 లక్షలకు(84 శాతం) చేరుకోగలిగింది.

ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇంకా 7 లక్షల గృహాల్లో వీటిని నిర్మించాల్సి వుంది అని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)