మన 'హీరో నంబర్ 1' ఏమైపోయాడు?

  • 3 జూన్ 2018
హీరో నంబర్ 1 ఏంమైపోయాడు Image copyright UGC/FACEBOOK
చిత్రం శీర్షిక భోపాల్ ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ్, గోవిందా

బాలీవుడ్ హీరో గోవిందా పాటకు డాన్స్ చేసిన ఒకే ఒక్క వీడియోతో భోపాల్‌కు చెందిన ఓ నడివయస్సు ప్రొఫెసర్ సోషల్ మీడియా స్టార్ అయిపోయారు.

46 ఏళ్ల ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ్ నిజానికి గోవిందాకు వీరాభిమాని.

అది చూడగానే, నాకు మనసులో ఒకటే అనిపించింది. ఒకప్పుడు 'హీరో నంబర్ వన్' అనిపించుకున్న గోవిందా అసలిప్పుడు ఏమైపోయారు?

ఇప్పుడు ప్రొఫెసర్ వీడియోలో వైరల్ అవుతున్న పాట 1987లో గోవిందా నటించిన 'ఖుద్‌గర్జ్' సినిమాలోనిది.

బాలీవుడ్ నటుడు రాకేష్ రోషన్ మొట్టమొదట దర్శకత్వం వహించిన సినిమా ఇదే. సినిమాల్లోకి అప్పుడప్పుడే వచ్చిన గోవిందాకు ఇది చాలా ప్లస్ అయ్యింది.

ఈ సినిమాకు ఏడాది ముందే 'లవ్ 86' హిట్ అయ్యింది. మరో హిట్‌తో గోవిందా తన సత్తా చూపించాలని ఆతృతతో ఉన్నారు.

Image copyright KHUDGARZ MOVIE

ఖుద్‌గర్జ్ సూపర్ హిట్

సినిమాలో ఈ హిట్ సాంగ్‌ గుర్తు చేసుకున్న గోవిందా బీబీసీ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

"నేను నా మేనల్లుడిని తీసుకుని వైష్ణో దేవీ యాత్రకు నడిచి వెళ్లా, తనను నా భుజాలపై కూర్చోపెట్టుకున్నా. తర్వాత నా కాళ్లు చాలా నొప్పిగా అనిపించాయి" అని చెప్పారు.

"సినిమా షూటింగ్ ఒక రోజు వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ తర్వాత రోజే ఈ పాట షూటింగ్ పెట్టుకున్నాం. నేను, నీలమ్ డాన్స్ చేసిన ఈ పాట షూటింగ్ ఆరు గంటల్లోనే పూర్తైంది. సూపర్ హిట్ అయ్యింది"

"నేను, నీలమ్ చాలా స్టేజ్ షోల్లో కూడా ఈ పాటను పెర్ఫామ్ చేశాం. కేవలం రాకేష్ రోషన్ మీద గౌరవంతో నేను ఈ పాట చేశాను" అన్నారు గోవిందా.

హిందీలో హిట్ అయిన 'ఖుద్‌గర్జ్' సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేశారు.

తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఈ సినిమా 'అన్నామలై'గా వస్తే, తెలుగులో వెంకటేష్, సుమన్‌తో 'కొండపల్లి రాజా'గా తీశారు. ఒడియాలో ఈ సినిమాను మిథున్ చక్రవర్తి చేశారు.

Image copyright HERO NUMBER1.GOVINDA/FACEBOOK
చిత్రం శీర్షిక తన తల్లితో గోవిందా

గోవిందా కుటుంబం

ఇక గోవిందా విషయానికి వస్తే, ఆయన తండ్రి అరుణ్ కుమార్ అహుజా కూడా నటుడే. తల్లి నిర్మలా దేవి.

అరుణ్ కుమార్ 40వ దశకంలో 30-40 సినిమాలు చేశారు. నిర్మలాదేవి గాయని, ఆమె ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు.

కానీ ఒక సినిమా నిర్మించిన గోవిందా తండ్రికి భారీ నష్టం వచ్చింది. దాంతో ఆయన తన బంగళాను కూడా వదిలి ముంబైలోని విరార్ వచ్చి స్థిరపడ్డారు.

ఇక్కడే గోవిందాకు 'విరార్ కుర్రోడు' అనే పేరొచ్చింది. కానీ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండేది.

Image copyright TAN-BADAN MOVIE

తన్-బదన్‌ సినిమాతో బ్రేక్

కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన గోవిందా ఉద్యోగం కోసం చాలా ప్రాంతాలకు వెళ్లారు. తాజ్‌లో ఉద్యోగానికి వెళ్తే ఆయన్ను రెజెక్ట్ చేశారు.

ఉద్యోగం రాలేదు కానీ, గోవిందాకు హీరో కావాలని రాసిపెట్టి ఉంది.

గోవిందాకు 80వ దశకంలో మొదట ఎల్విన్ అనే ఒక కంపెనీ నుంచి పిలుపు వచ్చింది. తన్-బదన్ సినిమాలో హీరో అయ్యే అవకాశం. ఖుష్బూ అందులో హీరోయిన్.

'లవ్ 86' సినిమా నుంచి ఆయనకు హిట్స్ రావడం మొదలయ్యాయి. దాంతో 90వ దశకంలో వచ్చీరాగానే ఇండస్ట్రీలో గోవిందా సంచలనాలు సృష్టించారు.

90వ దశకంలో ముగ్గురు ఖాన్‌లు కాకుండా బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపించే హీరో ఎవరైనా ఉన్నారు అంటే, అది గోవిందానే అనిపించుకున్నారు.

Image copyright HERO NUMBER1.GOVINDA/FACEBOOK

కామిక్ టైమింగ్

ఒక సమయంలో గోవిందా హీరోగా ఏడాదికి 8 నుంచి 9 సినిమాలు రిలీజ్ అయ్యేవి. మంచి లాభాలు కూడా తీసుకొచ్చేవి.

గోవిందా అద్భుతమైన కామిక్ టైమింగ్ కోసం రచయితలు స్పెషల్ డైలాగులు, పంచ్ డైలాగులు రాసేవారు. గోవిందా వేసుకునే కలర్ ఫుల్ కాస్టూమ్స్, ఆకట్టుకునే ఆయన డాన్స్, అన్నీ కలగలిసి బాక్సాఫీస్ దగ్గర కాసులవర్షం కురిపించేవి.

అమీర్ ఖాన్‌లా చాక్లెట్ హీరో కాదు, సల్మాన్ ఖాన్‌లా బాడీ ఉండదు, షారూక్ ఖాన్‌లా రొమాంటిక్ ఇమేజ్ లేదు, అక్షయ్ కుమార్‌లా యాక్షన్ రాదు.

అయినా గోవిందాలో తనదైన ఒక స్పెషల్ స్వాగ్ ఉండేది. ఒక విధంగా, అప్పుడు ఆయన టైం నడిచిందనే చెప్పుకోవాలి.

గోవిందా కామిక్ టైమింగ్ ఏ రేంజిలో ఉండేదంటే, 1998లో వచ్చిన బడే మియా, ఛోటే మియాలో గోవిందా అమితాబ్ బచ్చన్‌నే మించిపోయాడని చాలా మంది అనుకున్నారు.

Image copyright GOVINDA/FACEBOOK

హిట్ సినిమాల పరంపర

అయినా, 90వ దశకంలో గోవిందాపై అశ్లీల, డబుల్ మీనింగ్ పాటలు చేస్తున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి.

కానీ సాదాసీదా డైలాగును కూడా తెరపై పేల్చే గోవిందా, పాటల్లో చిన్న మూమెంట్‌తో థియేటర్స్‌లో డాన్స్ చేయించేవారు.

అందుకే వరసగా హిట్స్ అందుకున్న గోవిందా 90వ దశకంలో 'హిట్ మెషిన్' అనిపించుకున్నారు.

Image copyright BADE MIYAN CHOTE MIYA MOVIE

గంటలు వేచిచూసే డైరెక్టర్లు

గోవిందా నిజ జీవితం విషయానికి వస్తే, ఆయన తన కెరీర్ ప్రారంభంలోనే సునీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కానీ ఏడాది వరకూ ఆయన తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టారు. అది అందరికీ తెలిస్తే తన ఫాలోయింగ్‌ తగ్గిపోతుందేమో అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

గోవిందాకు లేటుగా షూటింగులకు వస్తాడనే చెడ్డ పేరు కూడా ఉంది. చాలా సార్లు దర్శకులు ఆయన కోసం కొన్ని గంటల వరకూ వేచిచూసేవారు.

Image copyright HERONUMBER1.GOVINDA/FACEBOOK

రాజకీయాల్లో గోవిందా

గోవిందా మెల్ల మెల్లగా "మాస్ హీరో" అంటే సామాన్యుల హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ ఆయన ప్రత్యేకతే ఆయన బలహీనతగా మారింది.

కొంతమంది దర్శకులు మినహా చాలా మంది ప్రముఖ దర్శకులతో కలిసి ఆయన పని చేయలేకపోయారు.

2000 తర్వాత షారూఖ్, అమీర్, సల్మాన్, హృతిక్ లాంటి హీరోలు దూసుకుపోతుంటే, గోవిందా మాత్రం తనను తాను రీఇన్వెంట్ చేసుకోలేకపోయారు. రేసులో వెనకబడిపోయారు.

2004లో గోవిందా రాజకీయాల్లోకి కూడా వెళ్లారు. అక్కడ 2008 వరకు ప్రయత్నించారు. కానీ తర్వాత, ఆ రంగాన్ని కూడా వదిలేశారు.

మణిరత్నం 'రావణ్' లాంటి సినిమా కూడా ఆయన కెరీర్‌ను మార్చలేకపోయింది. దాంతో 'స్వర్గ్ అవుర్ హత్య' లాంటి సినిమాల్లో గోవిందా సీరియస్ రోల్ కూడా చేశారు, ప్రశంసలు అందుకున్నారు.

గోవిందా పాటలకు ఊగిపోయే జనం

కొంతమంది మాత్రం మంచి నటుడైన గోవిందా టాలెంటును ఫిల్మ్ ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదని భావిస్తారు.

గత పదేళ్లలో ఆయన చేసిన ఎన్నో సినిమాలు వచ్చాయి, పోయాయి.

గోవిందా చేసిన 'ఆ గయా హీరో' అనే సినిమా గత ఏడాది రిలీజైంది. ఆ సినిమాలో గోవిందా తన పాత చిత్రాల్లోలా అభిమానులను ఆకట్టుకోలేకపోయారు.

త్వరలో రాబోతున్న 'ఫ్రైడే' సినిమాలో గోవిందా కనిపించబోతున్నారు. పహ్లాజ్ నిహలానీ తీస్తున్న 'రంగీలా రాజా' సినిమాలో విజయ్ మాల్యా రోల్ కోసం ఆయన సైన్ చేసినట్టు తెలుస్తోంది.

అయినా, ఈ రోజు కూడా పార్టీల్లో గోవిందా పాటలకు జనం డాన్సులు వేయడం కనిపిస్తూనే ఉంటుంది. భోపాల్ ప్రొఫెసర్ వైరల్ వీడియో దానికి ఒక ఉదాహరణ. ఇలాంటివి గోవిందా అసలు సిసలు 'హీరో నంబర్ వన్‌'గా ఉన్న ఆ రోజుల్ని అభిమానులకు గుర్తు చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)