ఈ తెలుగు చాయ్‌వాలాకు నరేంద్ర మోదీ ‘సెల్యూట్’ చేశారు.. ఇంతకూ ఎవరాయన?

  • 4 జూన్ 2018
చాయ్ వాలా ప్రకాశరావు, ఆయన విద్యార్థులతో కలిసి మోదీ దిగిన ఫొటో Image copyright Narendra Modi/Twitter

కటక్‌లోని ఓ మురికివాడలో టీ కొట్టు నడుపుకునే ఒక 'చాయ్ వాలా'... ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల కటక్ వెళ్లినపుడు ఆ చాయ్‌వాలాను పిలిపించుకుని కలిశారు. అభినందనలు చెప్తూ కరచాలనం చేశారు. ఆయనతో, ఆయన ‘పిల్లల’తో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను మరుసటి రోజు ట్విటర్‌లో పెట్టి ‘సెల్యూట్’ చేశారు.

ఆ తర్వాత మోదీ తన ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలోనూ ఆ టీ కొట్టు యజమాని గురించి చెప్తూ మరోసారి ప్రశంసించారు. ఇంతకూ ఆ చాయ్ వాలా ప్రత్యేకత ఏమిటి? ఆయన చేస్తున్న కృషి ఏమిటి?

‘‘ఏడేళ్ల వయసు నుంచే మా నాన్న టీ కొట్టు పెట్టి అందులో నన్ను ఉంచాడు. పొద్దుట్నుంచి రాత్రి వరకూ టీ కప్పులు కడుగుతూ పనిచేసేవాడిని. నెలకు నాలుగైదు రోజులే బడికి వెళ్లేవాడిని. పాతిక రోజులు వెళ్లలేకపోయేవాడిని. చాలా దెబ్బలు తినేవాడిని. కళ్లల్లో నీళ్లు వచ్చేవి. కానీ ఎవరికీ చెప్పేవాడిని కాదు’’ అని అచ్చమైన తెలుగులో చెప్పారు ఆ చాయ్ వాలా.

ఆయన పేరు దేవరపల్లి ప్రకాశరావు. ఆయన పూర్వీకులు రెండు శతాబ్దాల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాతం నుంచి కటక్ వలస వెళ్లి స్థిరపడ్డారు. ఆరున్నరేళ్ల వయసులో మొదలుపెట్టి ఐదున్నర దశాబ్దాలుగా టీ కొట్టు నడుపుతూ జీవిస్తున్నారు. ఇప్పుడు ఆయన వయసు 61 సంవత్సరాలు.

ఆ టీకొట్టు యజమాని గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న ‘సేవ’ ఆయనకీ అరుదైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

Image copyright pilelo-ho

‘నాడు 42 రూపాయలు లేక చదువుకోలేకపోయాను...’

‘‘నేను ఇక్కడే పుట్టాను. మా నాన్న ఇక్కడే పుట్టాడు. మా తాత ఇక్కడే పుట్టాడు. మా ముత్తాత దాదాపు 200 ఏళ్ల కిందట కాకినాడ దగ్గరున్న రేచర్లపేట నుంచి జీవనోపాధి కోసం కాలి నడకన బయల్దేరి కటక్ వచ్చి ఇక్కడ ఆగాడు’’ అని ప్రకాశరావు బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ వివరించారు.

ఒడిషా రాజధానికి సమీపంలో ఉన్న కటక్‌కి ఆ కాలంలో చాలా మంది తెలుగు వాళ్లు ఇలాగే జీవనోపాధి కోసం వచ్చారు. వారిలో ఎక్కువ మంది మురికివాడల్లో నివసిస్తున్నారు.

‘‘మా నాన్న రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పనిచేశారు. కటక్ తిరిగి వచ్చాక ఆర్థిక పరిస్థితి దిగజారింది. జీవనోపాధి కోసం ఆయన ఓ టీకొట్టు పెట్టారు. మా ఇంట్లో నేను పెద్దవాడ్ని. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. కుటుంబం కోసం చిన్నప్పటి నుంచే నేను టీ కొట్లో పని చేయక తప్పేది కాదు’’ అని ఆయన చాయ్‌ వాలాగా తన జీవితారంభం గురించి చెప్పారు.

అయినా అతి కష్టం మీద పదకొండో తరగతి వరకూ చదువుకున్నారు. ఐదో తరగతిలో స్కాలర్‌షిప్‌తో చదువుకున్న ప్రకాశరావు.. ఆ తర్వాత 42 రూపాయలు లేక 12వ తరగతి ఫామ్ నింపలేకపోయానని తెలిపారు.

అయితే.. అనంతర కాలంలో ఆయన స్వయం కృషితో చాలా చదువుకున్నారు. అచ్చమైన తెలుగులోనే కాదు.. చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడతారు. ఒడియా, హిందీల్లో అనర్గళంగా సంభాషిస్తారు. మరో నాలుగు భాషలు కూడా మాట్లాడగలరు.

Image copyright Prakasha Rao D

ఒక బ్లడ్ బాటిల్... ఓ టర్నింగ్ పాయింట్...

‘‘మా నాన్న నాకు టీ కొట్టు ఇచ్చి పోయారు. నాకు తెలిసింది టీ కొట్టు నడపటం ఒక్కటే. ఆ పని చేస్తూ జీవిస్తున్నాను’’ అని ఆయన చెప్తారు.

ప్రకాశరావు 20 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురయ్యారు. టీబీతో పాటు పాక్షిక పక్షవాతానికి గురై కటక్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి ‘ఎస్.సి.బి. మెడికల్ కాలేజీ’లో చికిత్స కోసం చేరారు. అప్పుడు వెన్నెముకకు శస్త్ర చికిత్స అవసరమైంది. అందుకోసం ఒక బాటిల్ రక్తం అవసరం. వారి ఇంట్లో ఎవరి రక్తమూ సరిపోలేదు.

అది 1976. అప్పట్లో ఇప్పటి లాగా రక్తదానం మీద పెద్దగా అవగాహన లేదు. ఎన్నో అపోహలు ఉండేవి. ‘‘ఆ సమయంలో ఓ వ్యక్తి దేవదూతలా వచ్చి రక్తం దానం చేశారు. ఎవరో నాకు తెలీదు. ఆ సర్జరీ సక్సెస్ అయింది. నేను తిరిగి కోలుకున్నాను’’ అని ఆయన చెప్పారు.

చికిత్స, అనంతరం కోలుకోవటం కోసం ఆర్నెల్లు ఆస్పత్రిలోనే ఉన్నారు. ‘‘అప్పుడు అక్కడికి వచ్చే పేద రోగుల అవస్థలు చూసేవాడిని. నాకు ఎవరో సాయం చేస్తే నేను బతికాను. నేను కూడా నాకు చేతనైనంత సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు ప్రకాశరావు.

అదే ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు వేడి నీళ్లు కాచి ఇస్తున్నారు. రోగులకు ఆస్పత్రి ఇచ్చే పాలు కాగబెట్టి అందిస్తారు. ఆయన కృషిని గుర్తించిన ఆస్పత్రి ఆయన కోసం ప్రత్యేకంగా ఒక గదిని కూడా కేటాయించింది. ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రకాశరావు ఒక సమాచార గనిగా కూడా ఉపయోగపడుతుంటారు.

ఇరవై ఏళ్లుగా ఆస్పత్రిలో ఈ సేవను కొనసాగిస్తున్నానని ప్రకాశరావు తెలిపారు. అంతేకాదు.. తనకు రక్తదానం చేసిన వ్యక్తి స్ఫూర్తితో ప్రకాశరావు కూడా రక్తదానం చేయటం ఆరంభించారు.

అది అడపా దడపా కాదు. ‘‘మొన్న జనవరి 23వ తేదీన 214వ సారి రక్తదానం చేశాను. ఆసియాలో అత్యధిక రక్తదానాల రికార్డు ఇదే’’ అని ఆయన బీబీసీతో సంతోషంగా చెప్పారు. ఆయన 17 సార్లు ప్లేట్‌లెట్లు కూడా దానం చేశానని తెలిపారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేస్తుంటారాయన.

Image copyright pilelo-ho

పేద పిల్లల కోసం ‘ఆశా ఓ ఆశ్వాసన్’

కటక్‌లో తెలుగు వాళ్లు చాలా మంది ఉన్నారు. ‘‘ప్రస్తుతం 70 వేల మంది నుంచి 80 వేల మంది వరకూ ఉన్నారు. చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారూ ఉన్నారు. కానీ ఎక్కువ మంది రిక్షా కార్మికులుగా, మురికి కాల్వలు శుభ్రం చేసేవారిగా, రోజు కూలీలుగా, ఆడవాళ్లు ఇళ్లలో పనిమనిషులుగా పనిచేస్తున్నారు’’ అని ప్రకాశరావు తెలిపారు. వాళ్లు ఎక్కువగా స్లమ్స్‌లోనే నివసిస్తున్నారు.

కటక్‌లోని ఈ పేదల బస్తీల్లో నివసించే వారికి పిల్లలను చదివించుకునే అవకాశం లేదు. పెద్దలకు చేదోడుగా పిల్లలు కూడా చెత్త కాగితాలు ఏరటం, కూరగాయలు అమ్మటం, ఉల్లిపాయలు తరగటం వంటి పనులు చేయాల్సిన దుస్థితి.

చదువుకోవాలని ఎంతో పరితపించిన ప్రకాశరావుకు.. తన చుట్టూ పేదల వాడల్లో రోడ్ల మీద తిరిగే పిల్లల్ని చూసినపుడు.. ‘‘నా పరిస్థితే ఇలా ఉంటే వీరి గతి ఏమిటి? వీరు కూడా చదువుకు దూరం కావలసిందేనా?’’ అనే బాధ కలిగేది.

‘‘ఆ ఆలోచనతోనే 2000 సంవత్సరంలో నేను ఉండే స్లమ్‌లో పిల్లల కోసం స్కూల్ ప్రారంభించాను’’ అని సంతోషంగా చెప్తారాయన. ‘ఆశా ఓ ఆశ్వాసన్’ ఆ స్కూల్ పేరు. బక్సీ బాజార్‌లోని తన రెండు గదుల ఇంట్లోని ఒక గదిలో ఆ స్కూల్‌ని ఏర్పాటు చేశారు.

Image copyright Prakasha Rao D

టీ కొట్టు ఆదాయంతో పిల్లలకు పుస్తకాలు, బట్టలు...

అందులో ప్రస్తుతం 70 మంది చిన్నారులు, ఆరుగురు టీచర్లు ఉన్నారు. టీ కొట్టు ద్వారా తనకు వచ్చే ఆదాయంలో అధిక భాగం ఆ స్కూల్ కోసం, అందులో చదువుకోవటానికి వచ్చే పిల్లల కోసమే వెచ్చిస్తున్నారు ప్రకాశరావు.

స్కూలుకు వచ్చే పిల్లలకి పుస్తకాలు, యూనిఫాం, చెప్పులు ప్రకాశరావే అందిస్తారు. మధ్యాహ్నం పాలు, బిస్కెట్లు కూడా ఇస్తారు.

ఇంట్లో తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించి పిల్లలను స్కూలుకి రప్పిస్తున్నారు. రోజుకు మూడు గంటలే చదువు. కిండర్‌గార్డెన్ నుంచి మూడో తరగతి వరకూ చదివిస్తారు. ఆ పై తరగతుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు.

‘‘ఈ స్కూల్‌కి రావటమంటే పిల్లలకు చాలా ఇష్టం. వాళ్లు ఇక్కడికి ఆడుకోవటానికి వస్తారు. డ్రామాలు, డాన్సులు, ఆటపాటలతో చదువు నేర్పిస్తాం’’ అని ప్రకాశరావు తెలిపారు.

ఇప్పటి వరకూ దాదాపు 300 మంది పిల్లలు ఈ స్కూలులో చదువుకున్నారని ఆయన చెప్పారు. వారిని చదువు కొనసాగించేలా చేయటానికి తమ శాయశక్తులా కృషి చేస్తుంటామన్నారు. ప్రస్తుతం తమ స్కూలులో చదువు ఆరంభించిన విద్యార్థుల్లో ఎనిమిది మంది బాలికలు కాలేజీలో చదువుతున్నారని వివరించారు.

ఈ స్కూల్ గురించి తెలుసుకున్న అప్పటి కటక్ కలెక్టర్ గిరీశ్ ఎస్.ఎన్. 2013లో ఈ స్కూల్‌ని నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టులో చేర్చారని ప్రకాశరావు తెలిపారు. దానివల్ల స్కూలుకు వచ్చే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందేది. కానీ.. అనంతర కాలంలో ఆ పథకం రద్దవటంతో మళ్లీ పిల్లలకు ప్రకాశరావు అందించే పాలు, బిస్కెట్లే మధ్యాహ్న భోజనంగా మారాయి.

Image copyright Prakasha Rao

బస్తీల్లోని తల్లిదండ్రుల్లోనూ మార్పు...

స్కూలు పిల్లల కోసం ప్రకాశరావు ఆర్నెల్లకోసారి డీవార్మింగ్, ఏడాదికోసారి ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ స్కూలు ప్రభావం కేవలం పిల్లలకే పరిమితం కాలేదు. ఆ పిల్లల తల్లిదండ్రుల్లో కూడా మార్పు తెస్తోందని ప్రకాశరావు ఆనందంగా చెప్తారు. పిల్లల తిండితిప్పల నుంచి పట్టించుకోవటం మొదలుకుని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వరకూ తల్లిదండ్రుల్లో పరివర్తన వస్తోందని అంటున్నారు.

అలాగే.. బస్తీలో ఎవరైనా అనారోగ్యాల పాలైనపుడు మూఢనమ్మకాలతో కాలయాపన చేయకుండా వైద్య చికిత్స పొందేలా కూడా అవగాహన పెంపొందించేందుకు ఆయన కృషి చేస్తున్నారు.

అయితే.. మద్యం అలవాటు నుంచి బస్తీలోని పురుషులు బయటపడలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం వల్ల బస్తీల్లో గృహ హింస ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు.

పేద చిన్నారుల కోసం ప్రకాశరావు చేస్తున్న కృషికి మంచి గుర్తింపే లభించింది. 2016లో ఆయనకు హ్యూమన్ రైట్స్ అవార్డ్ లభించింది. 2015లో అనిబీసెంట్ పురస్కారం దక్కింది. ఇటువంటి అవార్డులు, అభినందలు ఇంకా వచ్చాయి.

Image copyright Prakasha Rao

ఆ ఫోన్ వచ్చినపుడు జోక్ చేస్తున్నారనుకున్నా...

అయితే తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఆయనను కలవటం.. ఆ ఫొటోను ట్వీట్ చేయటం.. ఆయన కృషిని వివరిస్తూ ‘మన్ కీ బాత్’లో అభినందించటంతో.. ప్రకాశరావు కృషికి దేశమంతటా గుర్తింపు లభించినట్లయింది.

ప్రకాశరావుకు మే 25వ తేదీ మధ్యాహ్నం ఒక ఫోన్ వచ్చింది. ‘‘హలో ప్రకాశరావు గారు మాట్లాడుతున్నారా?’’ అని అడిగారు. ‘‘అవును. ప్రకాశరావునే మాట్లాడుతున్నా’’ అని ఆయన బదులిచ్చారు.

‘‘మేం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం. నరేంద్రమోదీ గారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. రేపు కటక్ వస్తున్నారు. మీరు, మీ స్కూలులో పిల్లలతో వచ్చి కలవండి’’ అని ఫోన్ చేసిన వాళ్లు చెప్పారు. ‘‘అవునా. చాలా సంతోషం. అలాగే కలుస్తా’’ అని ఆయన చెప్పారు.

‘‘కానీ.. నేను నమ్మలేదు. ఎవరో జోక్ చేస్తున్నారని అనుకున్నా. కాసేపటికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి మరో ఫోన్ వచ్చింది. ‘ప్రధానమంత్రిని కలవటానికి రావాల’ని చెప్పారు. దీంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి’’ అని ప్రకాశరావు బీబీసీకి వివరించారు.

‘చాయ్ వాలా సేవ’ను అభినందిస్తూ మోదీ ట్వీట్...

‘‘ఇతరుల కలలను తనవిగా చేసుకుని వాటిని సాకారం చేయటానికి తనను తాను అర్పించుకునే ఓ వ్యక్తిని కలిసే అదృష్టం నాకు దక్కింది. పేదల బస్తీల్లో నివసించే ఒక సాధారణ చాయ్ వాలా.. డెబ్బై మందికి పైగా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. తన ఆదాయంలో సగం డబ్బులు ఆ పిల్లల కోసం వెచ్చిస్తున్నారు. వారికి చదువులు చెప్తున్నారు. వారి జీవితాల్లో చీకట్లను పారద్రోలుతున్నారు. కొత్త దిశ అందిస్తున్నారు. ఆయనకు నా అభినందనలు’’ అని మోదీ ‘మన్ కీ బాత్’లో వివరించారు.

ప్రధానమంత్రి స్వయంగా తనను కలవటం, తన కృషిని అభినందిస్తూ రేడియోలో మాట్లాడటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ప్రకాశరావు చెప్తారు.

‘‘నేనొక సాధారణ చాయ్ వాలాని. ప్రధానమంత్రి నన్ను పొగుడుతారని నేను కలలో కూడా అనుకోలేదు’’ అంటారాయన.

‘‘మే 26వ తేదీన కటక్‌లో బహిరంగ సభలో పాల్గొనటానికి వచ్చిన మోదీజీ నన్ను, నా స్కూలు పిల్లల్ని పిలిపించారు. ఆయనను దాదాపు 20 నిమిషాలు కలిశాం. మా స్కూలు గురించి ఒక కుటుంబ సభ్యుడి లాగా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు’’ అని ఆయన తెలిపారు.

తను చనిపోయాక కూడా సేవ చేయాలని...

ఈ సాధారణ చాయ్ వాలా.. తనకున్న స్వల్ప ఆదాయంతోనే ఈ సామాజిక సేవను కొనసాగిస్తున్నారు. ఆయనకు ఒక పాత సైకిల్ మాత్రమే ఉంది.

ఉదయాన్నే టీ కొట్టులో పనిచేసుకుంటారు. ఆ తర్వాత 10:30 గంటల నుంచి రెండు, మూడు గంటల పాటు స్కూలులో పనిచేస్తారు. మధ్యాహ్నం సైకిల్ మీద ఆస్పత్రికి వెళ్తారు. అక్కడ రోగుల కోసం వేడినీళ్లు కాచి ఇస్తారు. పాలు కాగబెట్టి ఇస్తారు. మళ్లీ వచ్చి టీ కొట్టులో పనిచేసుకుంటారు.

ఈ మధ్యలో బస్తీలో ఎవరికి ఏ సాయం అవసరమైనా తాను ఉన్నానంటూ వెళ్తారు. ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారని ప్రశ్నిస్తే.. ‘‘నేను అల్ప సంతోషిని. చిన్న చిన్న విషయాలే నాకు సంతోషాన్నిస్తాయి. నా ఖర్చులకు పోగా మిగిలింది నలుగురికి ఉపయోగపడితే మరింత సంతోషంగా ఉంటుంది. పేదల కోసం పని చేయటం ఇంకా సంతోషాన్నిస్తుంది’’ అని ఆయన చెప్తారు.

ప్రకాశరావు విద్యా దానం, అన్న దానం, రక్త దానాలే కాదు.. తను చనిపోయాక కూడా తన శరీరం సమాజానికి ఉపయోగపడాలని భావించారు. అందుకే తన భౌతిక కాయాన్ని కటక్‌లోని అదే ఆస్పత్రికి దానమిస్తూ పుష్కర కాలం కిందటే పత్రాలపై సంతకాలు చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)