జపాన్ నుంచి అమెరికా వరకు పసిఫిక్ మహాసముద్రాన్ని ఈదేస్తున్నారీయన..

  • 6 జూన్ 2018
బెన్ లెకోమ్తే Image copyright thelongestswim.com
చిత్రం శీర్షిక బెన్ లెకొమ్తే

జీవితమే ఒక సాహసం. ఆ సాహసం లేకపోతే విజయాన్ని ఒడిసి పట్టలేం. ఈ సూత్రం పాతాళభైరవిలోని తోటరాముడికే కాదు, ఎవరికైనా వర్తిస్తుంది.

ఫ్రాన్స్‌కు చెందిన బెన్ లెకోమ్తే ఇలాంటి సిద్ధాంతాన్నే నమ్ముకున్నారు.

అతనికో లక్ష్యం ఉంది. దానికోసం ఏం చేయటానికైనా సిద్ధపడగల తెగువ ఉంది. అతను చేస్తున్న సాహసం ఏమిటంటే.. ఈదడం. ఈత కూడా ఒక సాహసమేనా అనుకోవచ్చు. ఈదేది పల్లెల్లోని పిల్లకాలువను కాదు. పట్టణాల్లోని స్విమ్మింగ్ పూల్‌ కాదు. అది మహాసముద్రం.

పర్యావరణ పరిరక్షణపై అందరికి అవగాహన కల్పించేందుకు, జపాన్ నుంచి అమెరికా వరకు పసిఫిక్ సముద్రాన్ని బెన్ మంగళవారం నుంచి ఈదడం ప్రారంభించారు. 9,000 కిలోమీటర్ల ఈ దూరాన్ని దాదాపు ఆరు నెలల్లో పూర్తి చేయనున్నారు.

Image copyright AFP

51 ఏళ్ల వయసులో..

బెన్ లెకోమ్తే వయసు 51 ఏళ్లు. రోజుకు 8 గంటలు ఈదుతారు. ఆ తరువాత అతనికి సహాయంగా వచ్చే పడవలో విశ్రాంతి తీసుకుంటారు. ఈ పడవకు జీపీఎస్ పరికరాలను అమర్చారు. తద్వారా ఎప్పటికప్పుడు బెన్ కదలికలు తెలుసుకోవచ్చు.

ప్రయాణంలో సొరచేపలు, తుపానులు, ప్రమాదకరమైన జెల్లీ ఫిష్‌లు, అంతకంతకూ పడిపోయే ఉష్ణోగ్రతలు వంటి సవాళ్లను బెన్ అధిగమించాల్సి ఉంది.

ఆరేళ్ల శ్రమ

బెన్..1998లో అట్లాంటిక్ సముద్రాన్ని ఈదారు. 73 రోజుల్లో 6,400 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇప్పుడు పసిఫిక్ సముద్రాన్ని ఈదడం కోసమని ఆరేళ్లు శ్రమించారు. మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన కసరత్తులు నేర్చుకున్నారు.

Image copyright thelongestswim.com

'చాలు అనుకున్నా కానీ..'

అట్లాంటిక్ సముద్రాన్ని ఈదినప్పుడు, జీవితంలో ఇంత పెద్ద సాహసం ఇక చేయొద్దని అనుకున్నాని బెన్ అన్నారు. అయితే మూడునాలుగు నెలలు పోయాకా, మనసు మళ్లీ సాహస చేయమని మనసు మారం చేసినట్లు వార్తాసంస్థ ఎన్‌పీఆర్‌తో చెప్పారు.

శాస్త్రవేత్తల పరిశోధన

శాస్త్రవేత్తల బృందం కూడా ఒకటి బెన్‌తోపాటు ఉంటుంది. ఈ ప్రయాణంలో వారు అనేక పరిశోధనలు చేయనున్నారు. సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఫుకిషిమాపై అణుబాంబు వేసిన సమయంలో సముద్రంపై పడిన ప్రభావం, అత్యంత కఠినమైన శ్రమ చేసినప్పుడు మనిషి గుండె స్పందించే తీరు వంటి వాటిని శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు