ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’

  • రవిందర్ సింగ్ రాబిన్
  • అమృత్ సర్, బీబీసీ కోసం
బ్లూ స్టార్ తూటాల శబ్దం

ఫొటో సోర్స్, SATPAL DANISH

సిక్కుల పవిత్ర క్షేత్రమైన స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం 'ఆపరేషన్ బ్లూస్టార్'ను నిర్వహించి 35 ఏళ్లయింది. ఆనాటి జ్ఞాపకాలు ఇంకా నా మనసులో అలాగే ఉన్నాయి.

అది 1984 జూన్ 1.. స్వర్ణ దేవాలయం కాంప్లెక్సులోని సిక్ రెఫరెన్స్ లైబ్రరీని సందర్శించేందుకు వెళ్తున్నాను. కాంప్లెక్సులో సాయుధ సిక్కులు ఏర్పాటు చేసుకున్న పికెట్లు కూడా నాకు కనిపించాయి.

పికెట్ల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని తీసుకెళ్తూ స్వచ్ఛంద సేవలో పాల్గొంటున్న భక్తులు కనిపించారు.

అమ్మ కోసం స్వర్ణ దేవాలయం చేరుకున్నాం

1984 ప్రారంభంలో మా అమ్మకు కిడ్నీలో రాళ్లు తొలగించాల్సి రావడంతో శస్త్రచికిత్స కోసం అమృత్‌సర్‌లోని వర్యామ్ సింగ్ ఆస్పత్రిలో చేర్పించాం. ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.

మా అమ్మ స్థితిని చూసి మా నాన్న ఎంతో ఆందోళన చెందారు. అమ్మను అమృత్‌సర్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని తర్ణ్ తారన్‌లో ఉండే మా బంధువు ఇంటికి తీసుకెళ్లారు.

మా సొంతిల్లు అమృత్‌సర్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ఉంది.

ఆమె కోలుకొనేందుకు స్వర్ణ దేవాలయం కొలనులోంచి నీటిని తీసుకువచ్చి ప్రార్థనలు చేయాలని ఒక శ్రేయోభిలాషి సూచించారు.

మా అమ్మ ఆరోగ్య స్థితి గురించి తెలిశాక ఆమెకు తోడుగా ఉండేందుకు నా ఇద్దరు సోదరిలతో కలిసి నేను శ్రీగంగానగర్‌ నుంచి తర్ణ్ తారన్ చేరుకున్నాను.

స్వర్ణ దేవాలయం కొలనులోంచి నీటిని తీసుకొచ్చేందుకు జూన్ 1న తర్ణ్ తారన్ నుంచి పంజాబ్ రోడ్ వేస్ బస్సులో అమృత్‌సర్ బయల్దేరాం.

ఫొటో సోర్స్, Getty Images

భద్రతాదళాలు మా బస్సును ఆపేశాయి

మా బస్సును భద్రతా సిబ్బంది బాబా నౌద్ సింగ్ సమాధి దగ్గరే ఆపేశారు. అందరూ బస్సు దిగాలన్నారు. మేం ఆశ్చర్యపోయాం.

బస్సు దిగాక అందరినీ తనిఖీ చేశారు. తర్వాత బస్సు ఎక్కండని చెప్పారు. బస్సు అమృత్‌సర్‌ దగ్గరికి చేరుకోగానే మళ్లీ తనిఖీలు చేశారు.

గురుద్వారా షాహీదన్ సాహిబ్ సమీపంలో మేం బస్సులోంచి దిగాం. ఇరుకుగా, రద్దీగా ఉండే మార్కెట్ వీధుల్లోంచి స్వర్ణ దేవాలయానికి నడుచుకుంటూ వెళ్లాం.

అక్కడ దుకాణాల్లో అమ్ముతున్న వస్తువులు మా దృష్టిని ఆకర్షించాయి. మాతోపాటు ఉన్న మా నాన్న, మార్కెట్‌లో ప్లాస్టిక్ సీసా కొనుక్కొచ్చారు.

మేం స్వర్ణ దేవాలయం ముందు గేటు దగ్గరికి చేరుకున్నాం. అది ఆటా మండీ వైపు ఉంటుంది.

బజారులో మారిన పరిస్థితులు

ఆ రోజుల్లో అక్కడ పాదరక్షలు వదిలేందుకు 'జోరా ఘర్' ఉండేది కాదు. కానీ పాదరక్షలు చూసుకొనేందుకు ఒక వ్యక్తి ఉండేవారు. మా పాదరక్షలు ఆయనకు ఇచ్చేసి, మేం స్వర్ణ దేవాలయంలోకి వెళ్లాం.

ఆలయం గర్భగుడిలో మేం ప్రార్థనలు చేశాం. తర్వాత గుడికి దగ్గర్లో లక్చ్‌మన్సర్ చౌక్‌లో ఉండే మా అత్త (నాన్న సోదరి) ఇంటికి వెళ్లాలనుకున్నాం.

మేం దర్శినీ దేవరీ దాటి గ్రంథ్ సాహిబ్ నుంచి ప్రదక్షిణ చేసే కారిడార్లోకి ముందుకు వెళ్లగానే అక్కడ నాకు సోదరుడు అమరీక్ సింగ్ కనిపించాడు.

అమరీక్ సింగ్, సంత్ కరతార్ సింగ్ భిండరావాలే, సంత్ జనరైల్ సింగ్ భిండరావాలేతోపాటూ సిక్కు మతం వృద్ధి కోసం శ్రీగంగానగర్ నుంచి వస్తుండేవారు.

ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టి క్షేమసమాచారం అడిగారు.

ఎర్రటి గుండ్రటి తలపాగా కట్టుకున్న ఆయన ఒక చేతిలో ఖడ్గం ఉంది, రెండు భుజాలకు రెండు మౌజర్‌లు వేలాడుతున్నాయి.

ఫొటో సోర్స్, SATPAL DANISH

తూటాల శబ్దం వినిపించింది

ప్రతి రోజూలాగే, రాగీ వాళ్లు గీతాలు పాడుతున్నారు. అందరూ వాహెగురూ-వాహెగురూ అని అంటున్నారు.

కానీ మేం దర్శినీ దేవరీ నుంచి ప్రదక్షిణ చేసే ప్రాంతంలోకి అడుగు పెట్టగానే, అక్కడ మాకు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత జనం భవనం లోపల దాక్కోవడం మొదలైంది.

స్వర్ణ దేవాలయం దగ్గర రోజూ కాల్పుల శబ్దాలు రావడం, అక్కడ ఉన్నవారు సురక్షితంగా దాక్కోవడం కొత్త విషయం కాదు. కానీ ఆ పరిస్థితి మాకే రావడం అనేది ఒక కొత్త అనుభవంగా నిలిచింది.

స్వర్ణ దేవాలయంలో ఉన్న సాయుధ సిక్కులను అందరూ గౌరవించడం కూడా నాకు కనిపించింది. అప్పుడే ప్రదక్షిణ జరిగే ప్రాంతంలో మా నాన్నకు ఆయన స్నేహితుడు కనిపించారు. ఆయన ఇల్లు స్వర్ణ దేవాలయానికి దగ్గర్లోనే ఉంది.

భయపడిపోయి ఉన్న మమ్మల్ని చూసి మా నాన్న స్నేహితుడు ఖజన్ సింగ్ కంగారు పడ్డారు. ఆయన మా నాన్నతో త్వరగా తన ఇంటికి వెళ్దాం పదండి అన్నారు. అలా మేం మా అత్త ఇంటికి వెళ్లడం కుదరలేదు.

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN/BBC

మొట్టమొదట కర్ఫ్యూ చూసింది అప్పుడే

మా నాన్న, ఆయన స్నేహితుడు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ పరిస్థితి సాధారణంగా లేదని మాకు, పిల్లలకు అర్థమైంది.

అంతలోనే, పోలీసులు కర్ఫ్యూ విధించడంతో దుకాణదారులందరూ తమ షట్టర్లను మూసేయడం ప్రారంభించారు. అసలైన కర్ఫ్యూ అంటే ఏంటో నేను మొట్టమొదట అప్పుడే చూశాను.

మధ్యాహ్నం భోజనం చేశాక, "సేవ చేసేందుకు స్వర్ణ దేవాలయానికి వెళ్దామా", అని ఖజన్ సింగ్ మా నాన్నను అడిగారు. మా నాన్న "సరే", అన్నారు. రాత్రి స్వర్ణ దేవాలయంలో చేసే సేవకు మా నాన్నతో నేను కూడా వెళ్లాను.

సుమారు రాత్రి 12 గంటల సమయంలో నేను, మా నాన్న, ఖజన్ సింగ్ చారిత్రక బెర్రీ ప్లాంట్ దగ్గర నేలను శుభ్రం చేస్తూ సేవ చేస్తున్నాం. అక్కడ ఒక బల్బు వేలాడుతోంది.

హఠాత్తుగా దూసుకొచ్చిన ఒక బుల్లెట్ తగిలి అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. అక్కడంతా చీకటి అలముకుంది.

నాకు భయం వేసింది. హఠాత్తుగా సేవ చేస్తున్న వాళ్లు కొంతమంది వచ్చి మమ్మల్నందరినీ దర్శని దియోరికి తీసుకెళ్లారు. కానీ అరగంట తర్వాత, మేం మళ్లీ మా సేవ కొనసాగించాం.

వేకువజామున 2 గంటలకు తిరిగి ఖజన్ సింగ్ ఇంటికి చేరుకున్నాం.

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN/BBC

పంజాబ్‌లో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ

జూన్ 2 వరకూ పంజాబ్‌ను ఆర్మీ స్వాధీనం చేసుకుందనే విషయం మాకు తెలీదు. చాలా పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.

పగటి సమయంలో సీఆర్పీఎఫ్, సిక్కు యువకుల మధ్య కాల్పులు జరగడం కనిపించింది.

ఖజన్ సింగ్ ఇంటి పైనుంచి చూశా, దుకాణదారులందరూ తమ షాపుల ముందు ఉన్న డేరాలను తొలగిస్తున్నారు. వీధుల్లో ఉన్న భద్రతా దళాలు బాగా కనిపించడానికి వాటిని తీసేయాలని సాయుధ సిక్కు యువకులు వారికి చెప్పారు.

జూన్ 2 మధ్యాహ్నం, ఖజన్ సింగ్ మమ్మల్ని మళ్లీ స్వర్ణ దేవాలయం తీసుకెళ్లారు. అక్కడ మేం గంగానగర్‌కే చెందిన మొహిందర్ సింగ్ కబారియా అనే వ్యక్తిని కలిశాం.

కబారియా, సంప్రదాయ తలపాగాకు బదులు గుండ్రంగా ఉన్న తలపాగా కట్టుకుని ఉన్నారు. ఆయన భుజానికి 303 రైఫిల్ వేలాడుతోంది. నేను ఎన్సీసీ కాడెట్‌ను కావడంతో ఆ రైఫిల్ గురించి నాకు తెలుసు.

అప్పటి పరిస్థితి గురించి కబారియా మా నాన్నకు చెప్పారు. మమ్మల్ని ఇంటికి పంపించేయాలని హెచ్చరించారు. ఆయన మమ్మల్ని వదలడానికి స్వర్ణ దేవాలయంలోని ఆటా మండీ గేట్ వరకూ వచ్చారు.

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN / BBC

జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే బిజీ

మా నాన్న, ఆయన్ను జర్నైల్ భింద్రన్‌వాలే గురించి అడిగారు. దానికి ఆయన.. చాలా బిజీగా ఉన్నారని, ఆయుధాలు పట్టుకోడానికి సిద్ధంగా ఉన్న వారిని మాత్రమే ఆయన కలుస్తున్నారని చెప్పారు.

ఆటా మందిర్ గేట్ దగ్గర సేవ చేసేవారు, "సేవ చేయండి" అని అరుస్తున్నారు. భక్తులకు ఇటుకలు, ఇతర వస్తువులు అందిస్తున్నారు.

వాటిని సిక్ రెఫరెన్స్ లైబ్రరీ కోసం పికెట్స్ నిర్మించడానికి పైకి తీసుకెళ్లమని చెబుతున్నారు. వాళ్లు నాకూ, మా సోదరిలకు కూడా రెండు ఇటుకలు ఇచ్చారు. వాటిని పైకి తీసుకెళ్లమన్నారు.

నేను పైకి వెళ్లినపుడు, అక్కడ ప్రతి పికెట్ దగ్గరా ఇద్దరు, ముగ్గురు సాయుధ సిక్కు యువకులున్నారు. అక్కడ దాల్, రోటీ లాంటివి కూడా కనిపించాయి.

తర్వాత మేం తిరిగి ఖజన్ సింగ్ ఇంటికి చేరాం. కానీ సాయంత్రానికి మళ్లీ కాల్పులు మొదలయ్యాయి.

ఖజన్ సింగ్ ఇంటి కిటికీలోంచి నేను చూశా, ఒక వ్యక్తి భద్రతా దళాల కాల్పులకు, తన తుపాకీతో జవాబు ఇస్తున్నాడు.

ఒక సిక్కు యువకుల బృందం సీఆర్పీఎఫ్ ఆయుధాలను లాక్కున్నారని, అప్పుడు కొంతమంది మరణించారని అప్పుడు వదంతులు వచ్చాయి.

ఫొటో సోర్స్, ARRANGED BY ROBIN SINGH ROBIN

చీకటి పడేకొద్దీ పరిస్థితి మరింత ఘోరం

చీకటి పడగానే, పరిస్థితి మరింత ఘోరంగా మారింది. అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. మా నాన్న గస్తీ తిరుగుతున్న ఒక సీఆర్పీఎఫ్ పార్టీ దగ్గరకు వెళ్లాడు.

మహిళలను, పిల్లలు సురక్షితంగా వెళ్లడానికి అనుమతించాలని అడిగాడు. కానీ ఆయన అది తన చేతుల్లో లేదన్నారు. అదంతా ఆర్మీ చూసుకుంటుందని చెప్పాడు.

జూన్ 2 రాత్రి మా నాన్న, ఖజన్ సింగ్‌తో మళ్లీ స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. కానీ ఆయన నన్ను తనతోపాటూ తీసుకెళ్లలేదు. అయినా, ఆరోజు అర్థరాత్రికి ఆయన సురక్షితంగా తిరిగొచ్చారు.

ఆలోపు మాకు చాలాసార్లు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి.

జూన్ 4న సైన్యం, పరిస్థితిని అదుపులోకి తీసుకుంది. సిక్కు యువకులు, సైన్యం మధ్య కాల్పులు మరింత తీవ్రం అయ్యాయి.

మా నాన్న, ఖజన్ సింగ్ మధ్య మాటలు నాలో చాలా ఆసక్తి రేకెత్తించేవి. వాళ్లు హర్‌చాంద్ సింగ్ లాంగోవాల్, గుర్బచన్ సింగ్ తోహ్రా, ఇతర సిక్కు నేతల గురించి మాట్లాడుకునేవారు.

జూన్ 3న సిక్కుల ఐదో గురువు గురు అర్జున్ దేవ్ అమరుడైన రోజు. సాధారణంగా ఆ రోజున అక్కడ మజ్జిగ, పండ్ల రసాలు పంచుతారు. కానీ అక్కడ అలాంటిదేం కనిపించడం లేదు.

అప్పుడే హఠాత్తుగా అక్కడ ఉన్న వారు, సైన్యం హెచ్చరిక గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. స్వర్ణ దేవాలయం నుంచి బయటకు వెళ్లాలనుకునేవారు, వెళ్లొచ్చని చెప్పారని అంటున్నారు.

మా నాన్న, స్వర్ణ దేవాలయం నుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించారు. ఆయన ఆలయంలోని కొలను నుంచి పవిత్ర జలాన్ని తీసుకుని బయటికి వెళ్తున్నప్పుడు, చాలా మంది స్వర్ణ దేవాలయం నుంచి వెళ్తుండడం చూశారు.

సీఆర్పీఎఫ్ నన్ను ఆపినప్పుడు..

సీఆర్పీఎఫ్ జవాన్లు సిక్కు యువకులను తనిఖీ చేయడం నేను చూశాను. వాళ్లు నన్ను కూడా తనిఖీ చేస్తారని అనుకున్నా. వాళ్లు నన్ను ఆపారు కూడా.

అప్పుడే ఒక మహిళల బృందం వాహెగురుని కీర్తిస్తూ అక్కడికి వచ్చింది. దాంతో మేం సీఆర్పీఎఫ్ తనిఖీలు లేకుండా వెళ్లిపోగలిగాం.

మేమంతా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుంపుగా బయటికొచ్చాం, గురుద్వారా రహీదా సాహిబ్ చేరుకున్నాం. అక్కడ మాకు తర్ణ్ తారన్ వెళ్లే బస్సు కనిపించింది.

52 సీట్లున్న ఆ బస్సులో, దానికి మూడు రెట్లున్న జనం నిండిపోయి ఉన్నారు. ఆ బస్సును ఆపిన ఆర్మీ, దాన్ని తనిఖీ చేసింది. ఆ సమయంలో అందరూ వాహెగురూ అని అరుస్తున్నారు.

తర్ణ్ తారన్ చేరుకున్న మాకు ఆ ప్రాంతాన్ని కూడా సైన్యం తమ అధీనంలోకి తీసుకుందని తెలిసింది. ఆ సమయంలో మాకు కాల్పుల శబ్దం కూడా వినిపించింది.

ఆ సమయంలో స్వర్ణ దేవాలయం పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోడానికి మాకు ఎలాంటి దారీ లేదు. కేవలం బీబీసీ రేడియో ద్వారా మాకు సైన్యం స్వర్ణ దేవాలయంలోకి చొచ్చుకెళ్లిందని, ఆ సైనికచర్యకు "ఆపరేషన్ బ్లూ స్టార్" అని పేరు పెట్టారని తెలిసింది.

తీవ్రంగా కాల్పులు జరిగిన ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో ఖజన్ సింగ్ ఇల్లు కూడా ఉందని, ఆ ప్రాంతమంతా కాలిపోయి బూడిదలా మారిందని, నాకు తర్వాత తెలిసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)