ప్రణబ్ ముఖర్జీ: ఆర్ఎస్ఎస్ వేదికపై ‘నెహ్రూ స్వరం’

ప్రణబ్ ముఖర్జీ

ఫొటో సోర్స్, Getty Images

భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ ఆత్మ. ఏ రకమైన అసహనమైనా దాన్ని దెబ్బతీస్తుంది అనే సందేశాన్ని సున్నితంగా, స్పష్టంగా ఆరెస్సెస్ వేదికపై వినిపించారు ప్రణబ్ ముఖర్జీ.

కొన్ని రోజులుగా విపరీతమైన చర్చకు కేంద్రంగా మారిన ఈ కార్యక్రమం ఎటువంటి సంచలనాలు లేకుండా ముగిసింది. జాతి, జాతీయ వాదం, దేశభక్తి మూడు మౌలిక భావనల మీద తన అభిప్రాయాలు వివరించబోతున్నానంటూ ప్రసంగానికి పునాది భావనలుగా చెప్పారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్. భారతీయ ప్రాచీన వారసత్వ సంపద ఎంత గొప్పదో ఉదహరిస్తూ ప్రసంగం ఆరంభించారు.

చారిత్రక క్రమానుగతంగా ఘటనలను పరిణామాలను ప్రస్తావిస్తూ వచ్చారు. భారతదేశం సందర్శించిన నాటి విదేశీ యాత్రికులు చారిత్రక పరిశోధకులు చేసిన పరిశీలనలను ఉదహరించారు. ఆర్థికంగా, సామాజికంగా ఎంత ఘనమైన చరిత్ర ఉండిందో.. వారెలా వర్ణించారో చెప్పుకొచ్చారు. క్రీస్తుపూర్వం ఆరొందల సంవత్సరాల క్రితమే మనకు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని గుర్తుచేశారు.

రాజనీతికి అర్థశాస్ర్తానికి సంబంధించి చాణక్యుడు (కౌటిల్యుడు) అప్పట్లోనే ఎంత ముందున్నారో వివరించారు. ఐరోపాలో పారిశ్రామిక విప్లవం ఫలితంగా వచ్చిన ఆధునిక భావనల కంటే ముందే భారత గడ్డమీద ఆధునిక భావాలు మొగ్గతొడిగాయని చెప్పుకొచ్చారు. ఉమ్మడి శత్రువు ప్రాతిపదికగా ఏర్పడిన ఐరోపా జాతీయవాదంతో పోలిస్తే భారతీయ జాతీయవాదం పూర్తిగా భిన్నమైనదని చెప్పారు.

ఫొటో సోర్స్, RSSOrg/facebook

ఈస్టిండియా కంపెనీ అనే మర్కంటైల్ కంపెనీ ఎలా మన అంతర్గత విభేదాలను ఉపయోగించుకుని దేశాన్ని చేతుల్లోకి తీసుకోగలిగిందో వివరించారు. జాతీయోద్యమంలో నాటి కాంగ్రెస్ నేతలు సురేంద్రనాధ్ బెనర్జీ, గాంధీ, నెహ్రూలు వివిధ సందర్భాలలో జాతీయ వాదం గురించి చెప్పిన మాటలను ఉటంకించారు.

భాగవత్ తన ఉపన్యాసంలో సరిహద్దుల్లోపల ఉన్న భౌతిక మైన దేశం భావనకు, రక్షణ భావనకు ప్రాధాన్యమిస్తూ భారత్ విశ్వగురుగా ఉండిందని.. ఉండాలనే పరిభాషలో మాట్లాడితే, దానికి భిన్నంగా ప్రణబ్ ముఖర్జీ పూర్తిగా తాత్వికమైన ఏకత్వం, సహనం వంటి భావనలకు ప్రాధాన్యమిస్తూ భారతీయతను నిర్వచించే ప్రయత్నం చేశారు.

మతం, ప్రాంతం, భాష లాంటి ఏ ప్రాతిపదిక మీదనైనా విద్వేషం భారతీయతను దెబ్బతీస్తుందని మన ఆత్మ భిన్నత్వంలో ఏకత్వంలో సహనంలో ఉందనే విషయం అందరూ అర్థం చేసుకోవాలని నొక్కి చెప్పారు. కోపం, హింస లాంటి భావనలు ఎవరు ఏ రూపంలో ప్రేరేపించినా దేశానికి నష్టమని గట్టిగా చెప్పారు. వివిధ భావనల మధ్య సైద్ధాంతిక సంవాదం, సమ్మిళితం వల్లనే మన జాతీయవాదం రూపొందిందని వివరించారు.

ఫొటో సోర్స్, RSSOrg/facebook

నూట ముప్పై కోట్ల మంది 122 భాషలు, వేలాది మాండలికాలు, కొకేషియన్స్-మంగోలియన్స్-ద్రావిడియన్స్ జాతిమూలాలతో నిండిన భారతదేశానికి ఈ వైవిధ్యమే మన సంస్కృతికి పట్టుగొమ్మ అని వివరించారు. వివిధ విశ్వాసాల మధ్య నిరంతరమైన చర్చ అవసరమని చెప్పుకొచ్చారు. సెక్యులరిజం మన శ్వాస అని చెప్పారు.

అదే సమయంలో స్వాతంత్ర్యం తర్వాత రాజసంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ పోషించిన పాత్ర గొప్పదని కీర్తించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందినప్పటికీ సంతోషంగా ఉండే దేశాలజాబితాలో మనం ఎంతో వెనుకబడి ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. పౌరులందరూ సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని చెప్పారు.

ప్రజాక్షేత్రంలో జరిగే చర్చల్లో విద్వేషాల్ని రెచ్చగొట్టే అంశాలుండరాదని నిష్కర్షగా చెప్పారు. రాజ్యాంగస్ఫూర్తిని కాపాడుకోవాలని ఉద్భోదించారు. ముఖ్యంగా మతం, ప్రాంతం ఆధారంగా జాతిని నిర్వచించే ప్రయత్నం ఎవరూ చేయరాదని సూటిగా చెప్పారు.

మొత్తంగా ఏం చెప్తారో ఏం సంచలనం రేపుతారో అని రేగిన ఊహాగానాలకు పుల్ స్టాప్ పెడుతూ పండితునిలాగా ప్రసంగించారు. ప్రాచీన ఔన్నత్యాన్ని, పటేల్ కృషిని శ్లాఘించారు. అదే సమయంలో అంతకంటే ప్రధానంగా రాజకీయాల్లో భావజాల ప్రచారాల్లో అసహనానికి వ్యతిరేకంగా వాణి వినిపించారు. ఆధిపత్యం చెలాయించాలనే దృక్పథం ఎవ్వరికీ తగదని స్పష్టం చేశారు. లిబరల్ జాతీయ వాద స్ఫూర్తికి నెహ్రూవియన్ ప్రతినిధిగా పాత తరం కాంగ్రెస్ పండితునిగా కనిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)