BBC Top 5 News: ఆర్ఎస్‌ఎస్ వేదికపై ప్రణబ్ ప్రసంగానికి కాంగ్రెస్ ప్రశంసలు

ప్రణబ్ ముఖర్జీ

ఫొటో సోర్స్, RSS/Twitter

ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో ప్రణబ్ పాల్గొనడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

"భారతదేశ భిన్నత్వం, సహనం, లౌకికతత్వాలను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సంఘ్ శిబిరానికి గుర్తుచేశారు. విభిన్న అంశాలపై చర్చను భారతీయులుగా, కాంగ్రెస్ పార్టీ నేతలుగా మేమెప్పుడూ స్వాగతిస్తాం. కానీ ఆర్ఎస్ఎస్ వాటిని వినే పరిస్థితిలో ఉందా, మార్పును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందా?" అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.

"సిద్ధాంతాల విషయంలో ఆయనకున్న స్పష్టత, ధైర్యం, నమ్మకం, అంకితభావం విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరికీ అనుమానాలు లేవు" అని మరో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు.

ప్రణబ్ ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో పాల్గొనడానికి కొద్ది సేపటి ముందు ఎంతోమంది కాంగ్రెస్‌వాదుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వ్యాఖ్యానించిన ఆనంద్ శర్మ... ప్రసంగం అనంతరం ఈ మాటలన్నారు.

ఫొటో సోర్స్, EPA

కిమ్ జోంగ్ ఉన్‌కు ఆమెరికా ఆహ్వానం?

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్‌ను అమెరికాకు అహ్వానించగలనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

జూన్ 12న సింగపూర్‌లో కిమ్‌తో జరగాల్సిన భేటీ సఫలమైతే తాను ఈ దిశగా ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.

జూన్ 12న జరుగబోయే సమావేశం విషయంలో జపాన్ ప్రధాని షింజో అబేతో జరిగిన చర్చ అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్య చేశారు.

కొరియా యుద్ధానికి అంతం పలికే ఒప్పందం జరిగే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

"బహిరంగ ప్రదేశాల్లో బాలికలకు రక్షణ లేదు"

బహిరంగ ప్రదేశాల్లో బాలికలు వేధింపులకు గురవుతున్నారని బాలల హక్కులకోసం పోరాడుతున్న సేవ్ ద చిల్డ్రన్ సంస్థ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలకు ఈ వేధింపులు తప్పడంలేదని ఈ నివేదికలో తెలిపింది.

ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరు స్కూలుకు వెళ్లాలన్నా, ఇరుకైన, జనం తక్కువగా ఉండే రోడ్లలో నడవాలన్నా, ఏదైనా మార్కెట్‌కు వెళ్లాలన్నా భయపడుతున్నారని ఈ స్టడీలో తేలింది.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికల పరిస్థితి బాధాకరంగానే ఉందని, ప్రతి నలుగురు బాలికల్లో ఒకరు పంటపొలాలకు వెళ్లాలన్నా, మలవిసర్జనకు వెళ్లాలన్నా భయపడుతున్నారని పేర్కొంది.

జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగాలంటే భయమని ప్రతి ఐదుగురు బాలికల్లో ముగ్గురు తెలిపారని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

అండర్-19జట్టులో సచిన్ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్

శ్రీలంకతో ఆడనున్న భారత అండర్-19 క్రికెట్ జట్టులోకి సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

జులై 11 - అగస్ట్ 11 మధ్య భారత అండర్-19 జట్టు శ్రీలంకతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు, ఐదు వన్డేలు ఆడనుంది.

లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, బౌలర్ అయిన అర్జున్‌ను నాలుగు రోజుల మ్యాచ్ ఆడే జట్టులోకి ఎంపిక చేశారు.

1999 సెప్టెంబర్ 24న జన్మించిన అర్జున్‌ గత సంవత్సరం ముంబయి అండర్-19 జట్టులో ఆడిన విషయం తెలిసిందే.

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

ఝార్ఖండ్‌లో యాక్టివిస్ట్, ఇద్దరు పోలీసుల హత్య

ఉత్తర ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో సురేశ్ ఉరావ్ (27) అనే కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఉద్యోగి అయిన సురేశ్‌ను ఆయన స్వగ్రామం పుర్ణాడీహ్‌లో హత్య చేశారు. ఆయన ఓ కార్యక్రమంలో హాజరవడానికి అక్కడికి వెళ్లారు.

మరోవైపు, ఖుంటీ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన ఓ ఆపరేషన్ సందర్భంగా ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్ సబ్ ఇన్‌స్పెక్టర్ బోనువా ఉరావ్, కానిస్టేబుల్ ఉత్పల్ రావా మృతి చెందినట్టుగా 'ద హిందూ' తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)