ప్రెస్ రివ్యూ: 'మోదీని ఎదిరించిన మొదటి సీఎంను నేనే'

ముస్లిం మహిళలతో చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/Facebook

‘‘ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించిన మొదటి ముఖ్యమంత్రిని నేనే. గోద్రా అల్లర్ల సమయంలో, ఇటీవల ట్రిపుల్‌ తలాక్‌ విషయంలోని కొన్ని అంశాలపై ఆయన్ను వ్యతిరేకించా’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కధనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. ‘‘నాపై వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. నిధులు ఇస్తే మనమెక్కడ బలపడి భవిష్యత్‌లో ఆయనకు అడ్డు వస్తామేమోనన్న భయం పట్టుకుంది. అందుకే ప్రత్యేక హోదాపై మాటతప్పారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున చిత్తూరు జిల్లా మదనపల్లెలో గురువారం సాయంత్రం ముస్లిం మైనారిటీ సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విందుకు ముందు జామియా మసీదులో ముస్లిం మత పెద్దలతో కలిసి చంద్రబాబు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

‘‘ఆవిర్భావం నుంచీ టీడీపీ మైనారిటీల పక్షపాతిగానే ఉంది. 2014లో రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి కొంత మంది మైనారిటీ సోదరులు నొచ్చుకున్నా బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము అన్నింటికీ సిద్ధపడి కేంద్రంతో పోరాటం చేస్తుంటే.. వైసీపీ మాత్రం బీజేపీతో లోపాయకారీ ఒప్పందాలతో రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నాయకులు అడగకపోయినా వైసీపీ నాయకులు మద్దతు తెలిపారని విమర్శించారు.

ఫొటో సోర్స్, kcr/Facebook

సమ్మెకెళితే వేటే: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ హెచ్చరిక

ఆర్టీసీలో సమ్మెలను నిషేధించినా కొందరు స్వలాభం కోసం సమ్మె నోటీసు ఇచ్చారని, యూనియన్‌ నాయకుల మాటలు విని కార్మికులు మోసపోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించినట్లు ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు తెలిపింది.

‘సాక్షి’ కథనం ప్రకారం.. ఉద్యోగాలు పోగొట్టుకోదలచిన కార్మికులు మాత్రమే సమ్మెకు దిగాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమ్మెకు వెళితే తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందని.. ఆర్టీసీని మూసివేయాల్సి వస్తుందని చెప్పారు.

ఈ నెల 11వ తేదీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ యూనియన్లు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, డిమాండ్లు నెరవేర్చే విషయంలో సాధ్యాసాధ్యాలపై సీఎం గురువారం రాత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

''రూ. 3,000 కోట్ల అప్పు, ఏటా రూ. 250 కోట్ల వడ్డీ భారం, ఏటా రూ. 700 కోట్ల నష్టంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మనుగడ సాగిస్తోంది. ఒకసారి సమ్మెకు పోవడమంటూ జరిగితే.. ఇప్పుడున్న నష్టాలకు తోడు అదనంగా రోజుకు నాలుగు కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘యూనియన్‌ నాయకుల అసంబద్ధమైన కోరికలైన 25 శాతం ఐఆర్, 50 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఇప్పుడున్న నష్టాలకు ఏటా మరో రూ. 1,400 కోట్లు అదనపు భారం ఆర్టీసీపై పడుతుంది. సమ్మెకు వెళ్లి కార్మికుల గొంతు కోసేదానికంటే సంస్థను ఎలా బలోపేతం చేసుకోవాలనే దానిపై యూనియన్‌ నాయకులు దృష్టి పెట్టాలి..'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

దళిత కార్యకర్తలను నక్సలైట్ల పేరుతో అరెస్ట్ చేయటం సరికాదు: కేంద్రమంత్రి అఠవలే

భీమా-కోరెగావ్ కేసులో మహారాష్ట్రలో దళిత హక్కుల కార్యకర్తలను నక్సలైట్లుగా ముద్రవేసి అరెస్టు చేయటం సరికాదని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అఠవలే తప్పుపట్టినట్లు ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. భీమా-కోరెగావ్‌లో జనవరి ఒకటో తేదీన జరిగిన హింసను ప్రేరేపించినట్లు ఆరోపణలున్న హిందుత్వ నాయకుడు శంభాజీ భిడే మీద మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని ఆయన సూచించారు.

ఎన్‌డీఏ మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అఠవలే) అధ్యక్షుడు కూడా అయిన కేంద్రమంత్రి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘భీమా-కోరెగావ్ విషయంలో దళితులెవరినీ అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదు. అంబేద్కర్‌వాద ఉద్యమకారుల మీద చట్టపరమైన చర్యలు చేపట్టటానికి వారిని నక్సలైట్లుగా చిత్రీకరించటం సరికాదు’’ అని పేర్కొన్నారు.

ఈ విషయమై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో తను మాట్లాడతానని చెప్పారు. ‘‘వారికి ఏదైనా అన్యాయం జరిగితే నాకు వీలైన సాయమంతా వారికి అందిస్తాను’’ అని తెలిపారు.

పట్టణాల్లో అగ్ర స్థాయి మావోయిస్టు నిర్వాహకులుగా ఆరోపిస్తూ.. రిపబ్లికన్ పాంథర్స్ జాతి అంతాచీ చల్వల్ (ఆర్‌పీ) నేత సుధీర్ ధవలే, నాగ్‌పూర్‌కి చెందిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, దిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్‌లతో పాటు.. నాగ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సోమా సేన్, పీఎంఆర్‌డీ మాజీ పరిశోధకుడు మహేశ్ రావుట్‌లను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారన్న విషయం తెలిసందే.

ఫొటో సోర్స్, Getty Images

భార్య ఏటీఎం కార్డును భర్త ఉపయోగించరాదు!

ఏటీఎం నుంచి నగదు తీసుకురావాలంటూ మీ ఏటీఎం కార్డును సమీప బంధువులు, స్నేహితులకు ఇవ్వకూడదని, కనీసం భార్య కార్డునైనా భర్త ఉపయోగించకూడదని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) చెబుతోందని.. ఇది సబబేనని న్యాయస్థానం కూడా అంగీకరిస్తోందని ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

‘ఈనాడు’ కథనం ప్రకారం.. బెంగళూరులోని మారతహళ్లికి చెందిన వందన 2013 నవంబరు 14న తన డెబిట్‌ కార్డును భర్త రాజేశ్‌ కుమార్‌కు ఇచ్చి నగదు తీసుకురావాలని చెప్పింది. రాజేష్‌ స్థానికంగా ఉండే ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లి రూ. 25 వేలు తీయడానికి కార్డును స్వైప్‌ చేశారు. సొమ్ము వచ్చినట్టు రసీదు వచ్చినా, నగదు మాత్రం రాలేదు.

దాంతో ఆయన కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేశారు. ఎటీఎం తప్పిదం కారణంగా నగదు రాలేదని, 24 గంటల్లో సొమ్మును ఖాతాలో జమ అవుతుందని సమాధానం వచ్చింది. కొన్ని రోజుల తరువాత.. జరిగిన లావాదేవీ నిజమని, సొమ్ము ఖాతాదారునికి ముట్టిందంటూ సమాధానం వచ్చింది. ఏటీఎం సీసీటీవీల ఫుటేజీలో.. రాజేష్‌ కార్డును ఉపయోగించినట్టు, నగదు బయటకు రానట్టు కనిపించింది. సమాచార హక్కు చట్టం కింద 2014 నవంబరు 16 నాడు ఆ ఏటీఎంలో రూ. 25 వేలు మిగులు ఉన్నట్లు కూడా తెలుసుకున్నారు.

అయితే.. సీసీటీవీలో అసలు ఖాతాదారు వందన కనిపించడం లేదని, కార్డును ఉపయోగించింది అసలు ఖాతాదారు కాదని బ్యాంకు పేర్కొంది. బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేసినా.. 'రహస్య సంకేతా (పిన్‌)న్ని పంచుకున్నారు. కేసును ముగిస్తున్నాం' అంటూ తీర్పు వెలువడింది.

దీంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కొద్ది కాలం క్రితమే బిడ్డకు జన్మనిచ్చినందున, బయటకు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే భర్తకు ఏటీఎం కార్డు ఇచ్చానని ఆమె తెలిపింది. ఏటీఎం ద్వారా ఖాతాదారునకు నగదు అందిందని, ఎక్కడా సాంకేతిక తప్పిదాలు జరగలేదని, ఎస్‌బీఐ పత్రాలు సమర్పించింది. ఏటీఎంలో రూ. 25 వేలు మిగులు ఉన్నట్టు గతంలో సమాచార హక్కు కింద తెలపగా, కోర్టులో మాత్రం మిగులు నగదు ఏమీ లేదంటూ పత్రాలు ఇచ్చింది.

గత నెల 29న తీర్పు వెలువరించిన ఫోరం 'ఏటీఎం పిన్‌ను ఇతరులతో పంచుకోవడం ఉల్లంఘన కిందకు వస్తుంద'న్న నిబంధనను పేర్కొంటూ కేసును కొట్టివేసింది. ఏటీఎం కార్డు బదులు తన భర్తకు చెక్కుగానీ, ధ్రువీకరణ పత్రంగానీ ఇచ్చి డబ్బు తీసుకొని ఉంటే బాగుండేదని సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా గ్రీన్‌ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారిలో మూడొంతులు భారతీయులే

అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్‌ కార్డు) పొందేందుకు ఎదురుచూస్తున్న వృత్తినిపుణుల్లో నాలుగింట మూడు వంతుల మంది భారతీయులే ఉన్నారని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తాజా గణాంకాలను ఉటంకించింది.

ఆ కథనం ప్రకారం.. అమెరికాలో గత నెలాఖరు నాటికి ఉపాధి ఆధారిత ప్రాధాన్య క్యాటగిరీలో మొత్తం 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని, వీరిలో భారతీయులే 3,06,601 మంది ఉన్నారని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. భారత్ తర్వాత చైనా 67,031 మందితో ద్వితీయ స్థానంలో ఉన్నది. ఇక మిగిలిన ఏ దేశానికి చెందిన వారు కూడా 10 వేల మందికి మించి లేరు.

అమెరికాలో ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో జారీచేసే మొత్తం గ్రీన్‌ కార్డుల్లో ఏ దేశానికి చెందిన వారికైనా 7 శాతం కంటే ఎక్కువ మంజూరు చేయడానికి వీల్లేదు. దీని వలన భారతీయులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రీన్‌ కార్డుల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది.

ప్రపంచంలోనే అత్యంత వృత్తినిపుణులుగా ఖ్యాతిపొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వస్తున్నారు. అయితే 7 శాతం పరిమితి నిబంధన వలన అమెరికాలో శాశ్వత నివాస హోదాను పొందేందుకు భారతీయులు సుదీర్ఘ కాలం పాటు (25 నుంచి 92 ఏండ్ల వరకూ) నిరీక్షించాల్సి వస్తున్నది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)