తెలంగాణ మూలాలున్న హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్‌ను ఇలా స్థాపించారు

  • 8 జూన్ 2018
డాక్టర్ హెడ్గేవార్, ప్రణబ్ ముఖర్జీ, ఆర్‌ఎస్‌ఎస్ Image copyright RSS
చిత్రం శీర్షిక డాక్టర్ హెడ్గేవార్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి హాజరైనప్పటి నుంచి డాక్టర్ హెడ్గేవార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.

‘'హిందూ సంస్కృతి హిందుస్తాన్ గుండె చప్పుడు. అందుకే హిందుస్తాన్‌ను పరిరక్షించుకోవాలంటే, హిందూ సంస్కృతిని రక్షించాలి.''

''సంఘటితం కావడం వల్లనే శక్తి వస్తుందని గుర్తుంచుకోవాలి. హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రతి ప్రయత్నం చేయడం హిందువుల విధి.''

''దేశంలోని కోట్లాది మంది యువకులు ఈ లక్ష్యం దిశగా తమ జీవిత గమనాన్ని మార్చుకోకపోతే, దేశం భవిష్యత్తును మార్చలేము. యువత ఆలోచనలను ఆ దిశగా మార్చడమే సంఘ్ అంతిమ లక్ష్యం.''

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వెబ్‌సైట్‌లో విజన్ అండ్ మిషన్ కింద ఈ వాక్యాలన్నీ కనిపిస్తాయి.

ఇవన్నీ ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ వ్యాఖ్యలు.

Image copyright SURABHI SHIRPURKAR

ఇంతకూ ప్రణబ్ ముఖర్జీ ఏం రాశారు?

గురువారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనబోయే ముందు హెడ్గేవార్ నివాసాన్ని ప్రణబ్ ముఖర్జీ సందర్శించి, అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ''భరతమాత మహోన్నత పుత్రుడు డాక్టర్ కేబీ హెడ్గేవార్‌కు నివాళులు అర్పించడానికి వచ్చాను'' అని రాశారు.

ఆయన రాసిన కొద్ది సేపటికే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంతకూ ప్రణబ్ ప్రశంసలు కురిపించిన డాక్టర్ హెడ్గేవార్ నేపథ్యం ఏమిటి? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? సంఘ్‌ను ఎలా స్థాపించారు?

Image copyright RSSOrg/facebook

తెలంగాణకు చెందిన హెడ్గేవార్ పూర్వీకులు

ఆ రోజు 1897, జూన్ 22. అది విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం. కానీ దీనిపై ఒక ఎనిమిదేళ్ల బాలుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు.

పాఠశాలలో జరిగిన వేడుకలలో పాల్గొనకుండా ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చి, పుస్తకాలు పక్కన పడేసి, ఓ మూలన కూర్చున్నాడు.

ఆ బాలుణ్ని చూసి సోదరుడు, ''నీకు మిఠాయిలు ఇవ్వలేదా?'' అని ప్రశ్నించాడు.

''ఇచ్చారు. కానీ మన సంప్రదాయాలను నాశనం చేసిన ఈ బ్రిటీష్ వాళ్ల వేడుకలను మనమెలా జరుపుకోగలం?'' అని ప్రశ్నించాడు ఆ బాలుడు.

బీవీ దేశ్ పాండే, ఎస్ఆర్ రామస్వామి రచించిన 'డాక్టర్ హెడ్గేవార్, ద ఎపక్ మేకర్' అన్న పుస్తకంలో ఈ కథనాన్ని పేర్కొన్నారు.

నిజానికి తెలంగాణలోని కందకుర్తి గ్రామానికి చెందిన హెడ్గేవార్ కుటుంబం నాగ్‌పూర్‌లో స్థిరపడింది. 1889, ఏప్రిల్ 1న హెడ్గేవార్ నాగ్‌పూర్‌లో జన్మించారు. ఆయనకు 13 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో మరణించారు. దాంతో ఆయన సోదరులు, మహదేవ్ పంత, సీతారాం పంత్‌లు తమ సోదరుని సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు.

Image copyright RSS

కాంగ్రెస్ ప్రజా ఉద్యమంలో హెడ్గేవార్

పుణేలో చదువుకునేప్పుడు బ్రిటిష్ వారి ఆదేశాలను ఉల్లంఘించి, వందేమాతరం పాడినందుకు ఆయనను పాఠశాల నుంచి బహిష్కరించారని చెబుతారు.

మెట్రిక్యులేషన్ అనంతరం వైద్య విద్య కోసం ఆయన కలకత్తాకు వెళ్లారు. 1915లో వైద్య విద్య పూర్తి చేసుకుని నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చారు.

సంఘ్ ప్రకారం - ''ఆయన వైద్య విద్య చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనో, ఆసుపత్రి ప్రారంభించి డబ్బు చేసుకోవాలనో అనుకోలేదు. ఆయన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం. ఆ దిశగా ఆయన ఎన్నో విప్లవాత్మకమైన ఆలోచనలు చేశారు.''

''కేవలం కొంతమంది బ్రిటిష్ అధికారులను చంపినంత మాత్రాన బ్రిటిష్ పాలకులు భారతదేశం వీడిపోరు. ఏ ఉద్యమానికైనా ప్రజల మద్దతు చాలా అవసరం. అయితే విప్లవకారుల కార్యకలాపాలపై ఆయనకు అంత సదభిప్రాయం లేదు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజల నుంచే పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చినపుడు కానీ మనకు స్వాతంత్ర్యం సిద్ధించదు అన్నది ఆయన మెదడులో నాటుకుపోయింది.''

''నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఆయన పూర్తిస్థాయిలో కాంగ్రెస్ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగస్వామిగా మారారు. 1916 లో లోకమాన్య తిలక్‌కు బ్రిటిష్ పాలకులు ఆరేళ్ల జైలుశిక్ష విధించారు. దాంతో ఆయన స్వాతంత్ర్యం నా జన్మహక్కు అని నినదించారు. ఆ నినాదం ప్రజల్లో ఉత్తేజాన్ని రేకెత్తించింది.''

సంఘ్ స్థాపన

''నాటి నుంచి ఆయన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై నిషేధం విధించింది. అయినా ఆయన లెక్కచేయలేదు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి ఏడాది జైలు శిక్ష విధించారు. శిక్ష అనంతరం ఆయన 1922, జులై12న జైలు నుంచి విడుదలయ్యారు.''

1925లో విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో సంఘ్‌ను స్థాపించారు. 1936లో సంఘ్ మహిళా విభాగం ప్రారంభమైంది.

ఆయన అనుచరుల్లో భయ్యాజీ దానీ, బాబాసాహెబ్ ఆప్టే, బాలాసాహెబ్ దేవరస్, మధుకర్ రావ్ భాగవత్ ముఖ్యమైనవారు.

నాటి నుంచి హెడ్గేవార్ విస్తృతంగా పర్యటిస్తూ, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగిస్తూ, ప్రజల మద్దతు కూడగట్టడం ప్రారంభించారు. సంఘ్ శాఖలను ప్రారంభించడం కోసం తన సహాయకులను కాశీ, లక్నో తదితర ప్రాంతాలకు పంపారు.

Image copyright RSS

కాంగ్రెస్ కార్యకర్తలను ఆర్‌ఎస్‌ఎస్ వైపు తిప్పుకునేందుకు..

అయితే 1925లో సంఘ్‌ను స్థాపించిన అనంతరం డాక్టర్ హెడ్గేవార్ బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలకు దూరం అయ్యారని అంటారు. అదే సమయంలో స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్రను కూడా ప్రశ్నిస్తారు. ప్రముఖ చరిత్రకారులు శంసుల్ ఇస్లాం, హెడ్గేవార్ రెండుసార్లు జైలుకు వెళ్లారని చెబుతారు.

''హెడ్గేవార్ మొదటిసారి రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు 1920లో జైలుకు వెళ్లారు. అది కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు జరిగింది. ఆ తర్వాత 1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఆయన జైలుకెళ్ళారు.''

''తాను ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొననని ఆయన సంఘ్‌తో సంబంధమున్న వారికి తెలిపారు. ఇవన్నీ కూడా ఆర్‌ఎస్‌ఎస్ చరిత్ర పుటల్లో ఉన్నాయి. కానీ ఆయన స్వయంగా వాటిలో పాల్గొనేవారు. ఎందుకంటే - ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలను ఆర్‌ఎస్‌ఎస్ వైపు తిప్పుకునేందుకు. దీని ఫలితంగా 1933లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌లతో సంబంధాలు కలిగి ఉండరాదని తీర్మానం చేసింది'' అని శంసుల్ ఇస్లాం తెలిపారు.

Image copyright RSS

కాషాయ జెండాలతో స్వాతంత్ర్య వేడుకలు

1929, డిసెంబర్‌లో కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసి, 1930, జనవరి 26న ప్రజలంతా త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరింది. అయితే ఆ రోజు సంఘ్ శాఖలన్నీ కాషాయ జెండాను ఎగురవేసి ఆ వేడుకలను జరుపుకోవాలని హెడ్గేవార్ ఆదేశించారని విమర్శకులు అంటారు.

డాక్టర్ హెడ్గేవార్ అనేకమార్లు 'కాంగ్రెస్‌ జాతీయవాదం కేవలం మాటల వరకే' అనేవారని ప్రొఫెసర్ శంసుల్ ఇస్లాం తెలిపారు.

మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని ప్రారంభించినపుడు, డాక్టర్ హెడ్గేవార్ దానిలో కేవలం వ్యక్తిగతంగా పాల్గొంటాను కానీ సంస్థాగతంగా కాదని అన్నారు.

''1947 ఆగస్టు 14న సంఘ్ పత్రిక ఆర్గనైజర్ ఇలా రాసింది.. అదృష్టవశాత్తూ అధికారంలోకి వచ్చిన వాళ్లు, త్రివర్ణ పతాకాన్ని హిందువుల చేతుల్లో పెడతారని పేర్కొంది. కానీ ఈ దేశంలోని హిందువులకు అది అంగీకారం కాదు'' అని శంసుల్ ఇస్లాం అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం