ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం

  • 8 జూన్ 2018
విశాఖపట్నం బీచ్ Image copyright K Bhaskar Rao/The India Today Group/Getty Images

''తూరుపున చుక్క పొడవగానే ఏటకు ఎళ్లారండి... మద్దాన్నం రెండుదాటాక పడవను ఒడ్డుకు తెచ్చారు. పది పిత్త పరిగలు కూడా పడలేదు. ఒకపుడు సాగుడాయిలు, చందువాలతో పడవ నిండిపోయి కళకళలాడేది. ఇక్కడ కంపినీలొచ్చాక చేపలే తగ్గిపోయినాయి బాబూ.. ఎలా బతకాలండీ..'' పుడిమడక తీరంలో సముద్రంలో వేటకు వెళ్లి జాలరులు తెచ్చిన కొన్ని చేపలను చూపిస్తూ అక్కడి పల్లెకార మహిళలు మాతో అన్న మాటలివి.

ఈ పుడిమడక తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అచ్యుతాపురం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి 2008లో ఏర్పాటైంది. అక్కడి పరిశ్రమల్లోని వ్యర్థ జలాలు ఇక్కడి సముద్రంలో కలవడం వల్ల చేపల ఉత్పత్తి తగ్గిందని గ్రామస్థులు అంటున్నారు.

పరిశ్రమల్లోని కాలుష్యంతో పాటు ఇతర వ్యర్దాలు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. గత సంవత్సరం ఈ బీచ్‌లో చేపలు చనిపోయి తీరానికి కొట్టుకు వచ్చాయని అచ్యుతాపురం వాసులు అంటున్నారు.

అచ్యుతాపురమే కాదు అలలతో టూరిస్టులను అలరించే విశాఖ సాగర తీరం కాలుష్యంతో విలవిలలాడుతోంది.

సముద్ర జలాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యం కలిసి జీవవైవిధ్యానికి చేటు చేస్తోంది. చేపలకు హాని చేసే హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ వంటి ప్రమాదకర రసాయనాలు సాగర జలాల్లో ఉన్నట్లు, సముద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు.

Image copyright Shyammohan

సముద్రం మనకేమిస్తుంది?

భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడొంతులు సముద్రాలే నిండి ఉన్నాయి. మిగిలిన ఒక వంతులో మైదానాలు, అరణ్యాలు, ఎడారులు, నదులు, సరస్సులు లాంటివి ఉన్నాయి.

ఒకవంతు స్థలంలో జీవిస్తున్న మానవులు, మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం. సముద్రాలను కాపాడుకుంటేనే జీవులంతా క్షేమంగా ఉంటాయి. మానవులు వినియోగించే ప్రోటీన్లలో చాలావరకు సముద్రజీవులైన చేపలు, పీతలు,రొయ్యలు వంటి మత్స్యసంపద నుంచి వస్తున్నదే.

వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలంగా మారుస్తున్నది సముద్రాలే. నీటివనరులను అందించే వర్షాలు కురిసేది సముద్రజలాలు ఆవిరవడంవలనే. సహజవాయువు, ముడిచమురు వంటి నిక్షేపాలను సముద్రగర్భం నుంచే మనం పొందుతున్నాం.

మనం సముద్రానికి తిరిగి ఏమిస్తున్నాం?

ఇన్ని ఇచ్చిన సముద్రాలకి మనం ఏమిస్తున్నామంటే.. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కాలుష్యంతో నింపుతున్నాం.

పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 86.18 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. విశాఖ తీరంలో 200 టన్నులకు పైగా కలుస్తున్నాయి.

కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదుకు మించి సముద్రాల్లోకి చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతోంది. భూమ్మీద ఏర్పడే కాలుష్యం అంతిమంగా మహాసముద్రాలకు చేరుతోంది.

ఈ నేపథ్యంలో...

1992 బ్రెజిల్‌ లోధరిత్రి సదస్సు జరిగింది. వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సముద్రాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపాయి. ఐక్యరాజ్య సమితి జూన్‌ 8న వరల్డ్‌ ఓషన్స్‌ డేను 2008లో అధికారికంగా గుర్తించింది.

Image copyright Shyammohan

అందాల విశాఖలో అనుకోని కాలుష్యం

చుట్టూ కొండలు..ఒక వైపు సముద్రం ఉంటే దాన్ని బౌల్‌ ఏరియా అంటారు. ఇంత సహజమైన అద్బుత ప్రాంతం మరోచోట కానరాదని విశాఖను చూసిన పర్యాటకులు ముచ్చట పడుతుంటారు.

అయితే.. ఆ వృత్తాకార ఏరియాను ఇప్పుడు కాలుష్యం ఉక్కిరిబిక్కిరిచేస్తోంది.

''కైలాసగిరి,నరవ, యారాడ కొండలు సముద్రమట్టానికి 700 మీటర్ల నుంచి ఒక కిలోమీటరు ఎత్తు వరకు ఉండడంతో.. పరిశ్రమల నుండి వచ్చే కాలుష్య కారకాలు ఇక్కడే ఆగి పోతున్నాయి. అవి మరో వైపుకి పయనించే అవకాశంలేకుండా ఈ మూడు కొండలు అడ్డుగా ఉంటున్నాయి. బౌల్‌ ఏరియాలో కాలుష్యం నగరంతోపాటు సముద్రంపైనా ప్రభావం చూపుతోంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు సర్వసాధారణమైపోయాయి'' అని జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ వివిఎస్‌ఎస్‌ శర్మ బీబీసీతో అన్నారు.

విశాఖ తీరం నుంచి ఇరవై కిలోమీటర్లు వరకూ కాలుష్యం ఉందని వీరు గుర్తించారు. సాధారణంగా.. రోజూ 12 గంటల పాటు విశాఖ నగర ఉపరితలం నుంచి సముద్రంపైకి, సముద్రం నుంచి నగరం మీదికి గాలులు వీస్తుంటాయి. సముద్రం పైకి గాలులు వీస్తున్న సమయంలో బౌల్‌ ఏరియాలో ధూళి కణాలు సముద్రంపైకి పయనిస్తు, 80శాతం సముద్రంలో కలిసిపోతున్నాయని.. దీంతో సముద్రపు నీటిలో ఐదు మీటర్ల కింది వరకూ కాలుష్యం విస్తరించిందని గుర్తించారు. దీనివల్ల సముద్ర జలాలు ఆమ్లజనితమైపోతున్నట్టు తెలిపారు. సముద్రంలో చేపలే కాక.. మన కంటికి కనిపించని అనేక సూక్ష్మ జీవరాశులు ఉంటాయి. వాటిపై ఆధారపడి మరికొన్ని జాతులు బతుకుతుంటాయి. ఇలా గొలుసుకట్టు ఆహార విధానంలో జీవిస్తున్న జాతులపై కాలుష్యం ప్రభావం చూపుతుందని ఎన్‌ఐవో సైంటిస్టులు అంటున్నారు.

Image copyright Shyammohan

జలచరాల మనుగడకు..

''సముద్ర జీవులు మనుగడ సాగించడానికి ఆక్సిజన్‌, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుండి 10పిపిటి వరకు ఆక్సిజన్‌ ఉండాలి. 30 నుండి 33 శాతం ఉప్పు ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు కలవడంతో అసమతుల్యత ఏర్పడుతోంది. జలచరాలకు అందాల్సిన స్దాయిలో ఆక్సిజన్‌ అందక మృతి చెందుతున్నాయి. పోర్టులు, పరిశ్రమల నుండి విడుదలైన వ్యర్దాల వల్ల ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీని వల్ల జీవ వైవిధ్యం తగ్గిపోతోంది. ఈ ముప్పునకు అడ్డుకట్ట వేయాలంటే బౌల్‌ ఏరియాలో కొత్త పరిశ్రమలు రాకుండా చూడాలి. ఉన్న పరిశ్రమల నుంచి కాలుష్య కారకాలను తగ్గించాలి. ఆర్కేబీచ్‌లో నివాసాల నుండి మురికి నీటిని నేరుగా సముద్రంలోకి పంపుతున్నారు. నగరంలోని ఇళ్ల నుండి వచ్చే మురుగు నీటిని శుద్ది చేయడానికి కైలాస గిరి వద్ద మురుగునీటి శుద్ది కేంద్రం ఉన్నప్పటికీ ఓపెన్‌గా సముద్రంలోకి వదలడాన్ని ప్రభుత్వం ఆపాలి'' అన్నారు వీవీఎస్‌ఎస్‌ శర్మ.

ఇటీవల వీరు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌తో చేసిన ఒక పరిశోధనలో సముద్రం అడుగున సూక్ష్మ ప్లాస్టిక్‌ పదార్దాలు చేపల శరీరాల్లోకి చేరుతున్నట్టు నిర్ధరణ అయింది.

Image copyright Shyammohan

సముద్రంలోకి కాలుష్య జలాలు వదులుతున్నారా?

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉన్న విశాఖ సెజ్‌ లో కొన్ని కంపెనీలు పర్యావరణ నిబంధనలను పట్టించుకోకుండా కాలుష్యం స ష్టిస్తున్నాయంటూ, ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి ఒక ఫిర్యాదు అందింది.

''కాలుష్య జలాలను సముద్రంలోకి వదులుతున్నందున సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నఆరోపణలున్నాయి. మీరేం సమాధానం చెబుతారు?'' అని బ్రాండిక్స్‌ అపెరల్‌సిటీ ఇండియా పార్టనర్‌ పిసి దొరైస్వామిని బీబీసీ ప్రశ్నించగా...

''బ్రాండిక్స్‌ యూనిట్ల నుండి వెలువడే మురుగు నీటిని శుద్ది చేయడానికి 5ఎకరాల విస్తీర్ణంలో ఎఫ్లూయెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి నీటి శుద్ది నిర్వహిస్తున్నాం. అక్కడ అనేక దశల్లో మురుగునీటిని శుద్ది చేసిన తరువాతే సముద్రంలోకి వదులుతున్నాం. ప్రతీ రోజు 4మిలియన్‌ లీటర్లు నీటిని శుద్దిచేసిన తరువాత ఎపి పొల్యూషన్‌ బోర్డు నిపుణుల సమక్షంలో సముద్రంలోకి వదులుతున్నాం. పుడిమడక సముద్రతీరం నుండి సముద్రంలోకి 2.5కిలోమీటర్ల దూరంలో 15మీటర్ల లోతు వరకు పైపులు వేసి అక్కడ నీటిని సాగరంలో కలుపుతున్నాం'' ఆని ఆయన వివరించారు.

అయితే ఇక్కడి కొన్ని కంపెనీలు పర్యావరణ పరిరక్షణ కోసం మురుగు నీటిని శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయనందున కాలుష్య జలాలు సముద్రంలో కలుస్తున్నాయని పర్యావరణ వేత్తల ఆందోళన.

Image copyright Shyammohan

ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం

ఆర్కేబీచ్‌ నుండి ఫాం బీచ్‌ వరకు అపార్ట్‌ మెంట్స్‌ నుండి డ్రైన్‌లు సముద్రంలోకి కలుస్తున్న దృశ్యాలిక్కడ చూడవచ్చు. బీచ్‌ రోడ్‌లో నివాసాల నుండి సముద్రం వైపు మురుగునీరు పోవడానికి గొట్టాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్య నివారణ మండలి ఏం చేస్తుందని డిప్యూటీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌‌ ఆర్‌.లక్ష్యీనారాయణను అడిగినపుడు..

''జనావాసాల నుండి కాలుష్యం సముద్రంలో కలవడం వాస్తవమే. ఇది జీవీఎంసీ,కమిషనర్‌, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆర్కేబీచ్‌లోని అన్ని డ్రైన్స్‌ని మళ్లించి అప్పుగర్‌ దగ్గరున్న ఎఫ్లూయెంట్‌ ప్లాంట్‌కి కనెక్ట్‌ చేశారు. అయితే అక్కడి పంపింగ్‌ స్టేషన్స్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడినపుడు, మురుగు నీరు డైరెక్టుగా సముద్రంలో కలుస్తాయి. పరిశ్రమల నుండి రోజుకు 20మిలియన్‌ లీటర్లు శుద్ది చేసిన జలాలను సముద్రంలో కలుపుతున్నాం. ప్లాస్టిక్‌ నివారణకు ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం'' అన్నారాయన.

Image copyright Shyammohan

ఓషన్‌ గార్డులుండాలి

''అడవుల్లో చెట్లను కాపాడడానికి ఫారెస్ట్‌గార్డ్స్‌ ఉన్నట్టే, సముద్రతీరాన్ని కాపడే ఓషన్ గార్డ్సు కూడా ఉన్నపుడే కాలుష్యం నుండి సముద్రాలను కాపాడుకుంటాం. పోర్ట్‌లకు వచ్చీ పోయే ఓడల నుండి సముద్రంలో ఏం డంప్‌ చేస్తున్నారో నిఘా ఉండాలి. ప్రజలు బీచ్‌ల్లో ప్లాస్టిక్‌ వాడకుండా చూడాలి. నాగాలాండ్‌,మహరాష్ట్రలో ప్లాస్టిక్‌ని బ్యాన్‌ చేసినట్టు విశాఖలో ఎందుకు చేయరు?'' అని ప్రశ్నిస్తున్నారు సామాజిక వేత్త శశిప్రభ.

‘‘నగరంలో ప్లాస్టిక్‌ ఎంత వాడుతున్నారు? దానిలో రీసైక్లింగ్‌ ఎంత చేస్తున్నారు? ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్స్‌తయారీలో ఎంత మైక్రాన్లు వాడాలి ? అనే అంశాలపై విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కి ఎలాంటి అంచనాలు లేవు. యూనివర్సిటీలో సముద్ర కాలుష్యం పై సరైన రీసెర్చ్‌ జరగడం లేదు. సముద్రంలో డ్రైన్లు కలుస్తున్నాయని ఎన్నిసార్లు కార్పొరేషన్‌కి మొరపెట్టుకున్నా స్పందన లేదు. ప్లాస్టిక్‌ వ్యర్ధాల్ని తిన్న చేపల్ని తింటూ మేం రోగాల పాలవుతున్నాం. ప్లాస్టిక్‌ వినియోగాన్ని రద్దు చేస్తూ ఎంసీహెచ్‌ ఒక పాలసీని తెచ్చి, ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీగా విశాఖను డిక్లేర్‌ చేస్తేనే కొంత వరకు మేలు జరుగుతుంది’’ ఆంటారామె.

భూ ఉపరితలంతో పాటు, సముద్రతీరాలను కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి. భూమిని హరితమయంగా, ఆరోగ్య ప్రదాయినిగా మార్చాల్సిన బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకాన్ని కనీస స్థాయికి తగ్గిస్తే తప్ప సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోలేమని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు