లబ్ డబ్బు : వర్షాలకు, వడ్డీ రేట్లకు సంబంధం ఏమిటి?

  • 9 జూన్ 2018
లబ్ డబ్బు

వర్షాకాలం వచ్చేస్తోంది. వర్షాలు అనగానే ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఆశలు వారివి. వేసవి తాపం నుంచి విముక్తి పొందచ్చు అని చాలా మంది అనుకుంటారు, రైతులేమో తమ సాగుకోసం వర్షాల కోసం ఆశగా చూస్తుంటారు..

ఇక రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి రాజకీయ పార్టీలు కూడా వర్షాల వైపు చూస్తాయి. ఎందుకంటే సమృద్ధిగా వర్షాలు పడితే దేశ ఆర్ధిక స్థితి నుంచి వ్యక్తిగతంగా మన జీవితాల వరకు దాని ప్రభావం అన్ని రకాలుగా ఉంటుంది. ఆ విశేషాలు లబ్ డబ్బులో చూద్దాం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionలబ్ డబ్బు

అంతర్జాతీయంగా పెరుగుతోన్న ముడి చమురు ధరలు, దానికి ఫలితంగా దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటువంటి సంకట స్థితిలో రాబోయే వర్షా కాలంలో వర్షాలు బాగానే పడతాయన్న వార్త కొద్దిగా ప్రభుత్వాలకు ఊరటనిస్తోంది.

వర్షాలకు ఎందుకంత ప్రాధాన్యం?

అసలు వర్షాలు ఎందుకంత ముఖ్యం అనే విషయాన్ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుందాం! 130 కోట్ల భారత్ జనాభాలో ముప్పావు వంతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయం మీద ఆధార పడింది.

దాదాపు రెండు లక్షల యాభై వేలడాలర్ల విలువైన మన ఆర్ధిక వ్యవస్థలో పదిహేను శాతం వ్యవసాయానికే చెందుతుంది. కొన్ని అధికారిక లెక్కల ప్రకారం దేశ జనాభాలో దాదాపు సగం మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోంది.

అలాగే దాదాపు 50% ఆహార ఉత్పత్తి ఖరీఫ్ పంట నుంచే జరుగుతోంది. ఇక ఏడాది మొత్తం కురిసే వర్షాలలో డెబ్భై శాతం వర్షాకాలంలోనే కురుస్తాయి.

ఒకటి మాత్రం నిజం.. వర్షాలు ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

వర్షాలవల్ల ఆర్ధిక వ్యవస్థకు లాభాలేంటి?

భారత దేశ ఆర్ధిక వ్యవస్థలో ఒక కీలక నిర్ణయం చాలా వరకు వర్షాల మీద ఆధార పడుంటుంది. అదే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల నిర్ణయం.

వర్షాలు సరిగా పడట్లేదన్న కారణంతో గత మూడేళ్ళుగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించట్లేదు. వర్షాలు తక్కువగా ఉన్నందువల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని కారణం చెప్పింది ఆర్‌బీఐ.

ఎందుకంటే.. వడ్డీ రేట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సారి సమృద్ధిగా వర్షాలు కురిస్తే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంది. అపుడు తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి.

అలాగే వ్యాపార కార్యకలాపాలు వేగంగా సాగుతాయి. దేశంలోకి పెట్టుబడులు వస్తాయి, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

వర్షాలే ‘లైఫ్ లైన్’

వానలు బాగా పడితే జలాశయాలు నిండి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అలాగే భూగర్భ జలాల స్థాయి కూడా పెరుగుతుంది.

పల్లె ప్రాంతాల్లో తాగునీటి కోసం బోర్ పుంపులు, బావులపై ఆధారపడేవాళ్ళకి వర్షాలు బాగా పడితే మంచి నీటి కష్టాలు తీరుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది అపుడు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ లో ఉంటాయి. అలాగే రైతులకు లాభాలు లభిస్తాయి. వినిమయ వస్తువులకు డిమాండ్ కూడా పెరుగుతుంది.

అలాగే.. ఎఫ్.ఎమ్.సి.జి, అగ్రో కెమికల్స్, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది.

దీని వల్ల పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఫ్యాక్టరీలకు ఒకరకమైన లైఫ్ లైన్ ఈ వర్షాలు.

మరి వర్షాలు ఆలస్యమైతే?

కానీ ఒకవేళ రుతుపవనాలు ఆలస్యమైతే మాత్రం నష్టాలూ భారీగానే ఉంటాయి. అనేక ఉత్పత్తులకు సరఫరా విషయంలో సమస్యలు తలెత్తుతాయి.

అలాగే ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడవచ్చు. ఇక తక్కువ వర్షాలు పడితే అది కరువు పరిస్థితులకు దారితీయవచ్చు.

సాధారణంగా బియ్యం, గోధుమ, చక్కెర భారత్ లోనే రైతులు పండిస్తారు, కానీ వర్షాలు లేకపోతే వాటిని దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ ఏడాది మేలే!

భారత వాతావరణ విభాగం ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కావచ్చు అని అంచనా వేసింది. అంటే 97% వర్షపాతం నమోదు కావచ్చు.

96-104% లోపల వర్షపాతం నమోదైతే దాన్ని సాధారణ వర్షపాతం కింద లెక్కిస్తారు. ఒకవేళ వాతావరణ విభాగం అంచనాలు తారుమారై, వర్షాలు సరిగా పడకపోతే ఆ ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలే అవకాశముంటుంది.

మరోవైపు వర్షాలు సరిగా పడకపోతే రైతులకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఖజానాపై ప్రభావం చూపుతుంది. దీంతో ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు తక్కువవుతాయి. అలాగే ద్రవ్యలోటు పెరుగుతుంది.

కాబట్టి.. ఒక విధంగా చెప్పాలంటే భారత్ ఆర్థిక వ్యవస్థకు వర్షాలు ఒక జీవనాధారం లాంటివన్నమాట. అందుకే ఈ సంవత్సరంవర్షాలు భారీగానే కురవాలని కోరుకుందాం. వచ్చేవారం మరొక అంశంతో మళ్లీ కలుద్దాం..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు