‘ఇల్లు చూసుకుంటావా? రాజకీయాలు చేస్తావా?’

  • 10 జూన్ 2018
బిహార్ అసెంబ్లీ ఎదుట మహిళా ప్రజాప్రతినిధి ఆందోళన Image copyright Getty Images
చిత్రం శీర్షిక పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం 400 కంటె కొంచెం ఎక్కువ మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు

ఇటీవల భారతదేశంలో నిర్వహించిన ఒక పరిశోధనలో మహిళా రాజకీయవేత్తలే అభివృద్ధికి ఎక్కువగా దోహదపడతారని వెల్లడైంది.

ఈ పరిశోధనలో భారతదేశంలో 1990-2012 మధ్యకాలంలో (ఈ కాలంలో ఆర్థికాభివృద్ధి చాలా వేగంగా జరిగింది) పలు అసెంబ్లీలలో 4,265 సీట్లకు జరిగిన ఎన్నికల వివరాలను సేకరించారు. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన కాలం కూడా అదే.

ఆర్థికాభివృద్ధి ఎలా జరిగింది అన్న విషయం తెలుసుకోవడానికి వారు రాత్రి సమయంలో ఉపగ్రహం నుంచి తీసిన చిత్రాలను ఉపయోగించుకున్నారు.

దేశంలో సుమారు 5,000 మంది కేంద్ర, రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల్లో కేవలం 400 కంటే కొంచెం ఎక్కువ మంది మాత్రమే మహిళలు. అంటే పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య కేవలం 9 శాతమే. (అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 19 శాతం)

ప్రపంచంలో 100కు పైగా దేశాలు పార్లమెంట్‌లో లేదా తమ పార్టీ జాబితాలో మహిళలకు ప్రత్యేక కోటాను కేటాయించాయి. భారతదేశంలో 1993 నుంచి పల్లెలు, పట్టణాలలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయించారు. దీని వల్ల నిర్ణయాధికారంలో వాళ్ల పాత్ర పెరిగింది. కానీ పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా మూడో వంతు సీట్లను మహిళలకే కేటాయించాలన్న బిల్లు 2010 నుంచి వాయిదా పడుతూ వస్తోంది.

మరి ఈ కొద్ది మంది మహిళా ప్రజాప్రతినిధులే అభివృద్ధికి ఎలా దోహదపడ్డారు?

Image copyright AFP

నేరాలు తక్కువే..

భారతదేశంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విధానాలను, కేంద్ర నిధులను వేటికి కేటాయించాలి, గ్రామాల్లో వాటిని ఎలా ఖర్చు చేయాలన్న దానిని నిర్ణయిస్తారు. అంతే కాకుండా రహదారులు, విద్యుత్, శాంతిభద్రతలు, ఆరోగ్యం, విద్య తదితర అంశాల్లో కూడా పాలు పంచుకుంటారు.

భారతదేశంలో మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నికైన చోట ఆర్థికాభివృద్ధి ప్రతి యేడాది 2 శాతం పాయింట్లు మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు.

అంతే కాకుండా పరిశోధకులు 2000-15 మధ్యకాలంలో రూ.2.7 లక్షల కోట్లను వెచ్చించి, దేశంలోని సుమారు 2 వేల గ్రామాలను కలుపుతూ నిర్మించిన 4 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారుల డేటాను పరిశీలించారు.

వీరి పరిశోధనలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నప్పటికీ, మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న చోటే ఎక్కువ రహదారులను నిర్మించినట్లు తెలుస్తోందని పరిశోధకుల్లో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్ ఎస్సెక్స్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ సోనియా భలోత్ర తెలిపారు.

పురుషులతో పోలిస్తే వాళ్లు తక్కువ నేరాలు చేస్తారని, అంతే కాకుండా తక్కువ అవినీతికి పాల్పడతారు కాబట్టి అభివృద్ధి జరగాలంటే మహిళా రాజకీయవేత్తలు మేలని పరిశోధకులు వాదిస్తున్నారు. ఈ పరిశోధనలో భారతదేశంలోని మహిళా ప్రజాప్రతినిధుల్లో కేవలం 13 శాతం మందిపై మాత్రమే క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. అదే పురుష ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే, అది మూడు రెట్లు ఎక్కువ.

పురుషులతో పోలిస్తే, తమ పనితీరు చూసి, ప్రజలు తమకే ఓటు వేస్తారనే అభిప్రాయంతో మహిళలే ఎన్నికల్లో ఎక్కువగా మళ్లీ పోటీ పడతారని కూడా ఈ పరిశోధన తెలిపింది.

Image copyright AFP

ఇల్లు కావాలా? రాజకీయాలు కావాలా?

అయితే భారతదేశంలో మహిళా ప్రజాప్రతినిధులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది తమ పురుష కుటుంబసభ్యుల అడుగుజాడల్లో నడుస్తున్నారని, మహిళా ప్రజాప్రతినిధుల తరపున వాళ్ల భర్తలే అధికారం చలాయిస్తున్నారని భావిస్తున్నారు. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు.

అంతే కాకుండా మహిళా ప్రజాప్రతినిధులు వదంతులు, లైంగిక వేధింపులు, ఎత్తిపొడుపుమాటలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వాళ్లకు వేధింపులు పెరిగాయి. మరోవైపు.. రాజకీయాల్లో రాణించడానికి వాళ్లు తమ కుటుంబ బాధ్యతలను పక్కన పెడుతున్నారంటూ వారిపై విమర్శలు వస్తున్నాయి.

కొన్నేళ్ల క్రితం బిహార్‌కు చెందిన ఒక మహిళా రాజకీయవేత్త తన భర్తతో తాను రాజకీయాల్లో చేరుతున్నట్లు చెప్పింది.

''నువ్వు ఇంటిని చూసుకుంటావా, రాజకీయాలనా?'' అని ఆ భర్త ప్రశ్నించాడు.

''నేను ఇంటినీ చూసుకుంటాను. అదే సమయంలో రాజకీయాల్లో కూడా పాల్గొంటాను'' అని ఆమె సమాధానం ఇచ్చారు.

ఈ సంభాషణను దగ్గర నుంచి విన్న జర్నలిస్టు ఆమె తన లక్ష్యం కోసం భర్త నుంచి కూడా దూరమైందని తెలిపారు. ఐదేళ్ల తర్వాత ఆమె రాజకీయ జీవితాన్ని, కెరీర్‌ను పూర్తిగా అంగీకరించాకే ఆమె మళ్లీ భర్తతో కలిసి జీవిస్తున్నారు.

అందువల్ల అభివృద్ధి విషయంలో మహిళలు ఖచ్చితంగా పురుషులకన్నా బాగా పని చేస్తున్నారు. మరి అలాగైతే ఎందుకు రాజకీయ పార్టీలు వాళ్లకు తగినన్ని సీట్లు ఇవ్వడం లేదు?

''బహుశా ఆర్థికాభివృద్ధి వారి వల్లే ఎక్కువగా జరుగుతుందన్న విషయం ప్రజలకు తెలియకపోవడం వల్ల కావచ్చు'' అంటారు ప్రొఫెసర్ భలోత్రా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు