'ముందు నీళ్లు అందించండి.. ఆ తర్వాత మరుగుదొడ్లు వాడుతాం'

  • శ్యాంమోహన్‌
  • బీబీసీ కోసం
మరుగుదొడ్డి వద్ద గ్రామస్తుడు

ఫొటో సోర్స్, Shyam Mohan/BBC

ఫొటో క్యాప్షన్,

మరుగుదొడ్లను సామాన్లు నిల్వ చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

డుంబ్రిగుడ మండలంలోని కొర్రాయి కొత్తవలస గ్రామానికి వెళ్లాలంటే దట్టమైన సిల్వర్‌ ఓక్‌ చెట్ల మధ్య నుంచి నడచి వెళ్లాలి. నడుంలోతు నీళ్లుండే రెండు వాగులు దాటాలి.

విశాఖ నగరానికి 140 కిలోమీటర్ల దూరంలో అరకు కొండల అంచున ఉన్న ఆదివాసీ పల్లె అది.

ఈ పల్లెలో 170 మంది జీవిస్తున్నారు. కొందరు కాఫీతోటల్లో పనికి వెళితే, మరికొందరు కొండవాలులో వరి పండిస్తారు.

అయితే ఈ గ్రామంలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని వీరు వాడడం లేదు. అదే ప్రశ్న వారిని అడిగాను.

''ఇంటికో మరుగు దొడ్డి ఉంటే మీ గ్రామం స్వచ్ఛంగా ఉంటుంది కదా..? మీరెందుకు వద్దంటున్నారు?''

ఫొటో సోర్స్, Shyam Mohan

విశాఖ జిల్లాలో 99.90 శాతం గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన జరగడం లేదని స్వచ్ఛ భారత్ గణాంకాలు చెబుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ లక్ష్యం ఆరుబయట మలవిరసర్జనను పూర్తిగా అరికట్టడం, ఇంటింటికీ మరుగుదొడ్డి ఏర్పాటు చేయడం అన్న విషయం తెలిసిందే.

''ఇక్కడ టాయిలెట్లు లేక పోతేనే స్వచ్ఛంగా ఉంటుందండీ. మా గ్రామ పరిస్థితులు అలా ఉన్నాయి. ఒక చెంబు నీళ్లతో కొండ కిందకి పోయి పని పూర్తిచేసుకుంటాం. అదే మరుగుదొడ్డి లోకి వెళ్లాలంటే బకెట్‌ నీళ్లు కావాలి. వాటి కోసం కొండ మీదకు పోవాలి ?''అన్నారా గ్రామస్తులు.

వీరు రోజూ నీళ్ల కోసం చాలా అవస్థలు పడుతుంటారు. ఇంటి అవసరాల కోసం నిత్యం మహిళలు రెండు కిలో మీటర్ల దూరం.. కొండ ఎగువకు వెళ్లి ఊటనీటిని పట్టుకొని తెచ్చుకుంటారు.

అరకిలో మీటరు దూరంలో బావి ఉంది. కానీ, అందులో నీళ్లు అంతంత మాత్రమే. ప్రభుత్వం కొండ పైన ఊటనీటిని గ్రామంలోకి ఇవ్వడానికి పైపులైన్‌ పనులు మొదలు పెట్టింది. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ కొర్రాయికొత్తవలసలో అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేసింది. కానీ వాటిని ప్రజలు వద్దంటున్నారు. ఇప్పటికే నిర్మించిన కొన్ని టాయిలెట్లు నిరుపయోగంగా పడిఉన్నాయి.

ఫొటో సోర్స్, Shyam Mohan

ముందు నీటివసతి కావాలి

‘'మరుగుదొడ్లు వాడినపుడు రెండు బకెట్ల నీళ్లు కొడితే కానీ శుభ్రం కావు. అందుకే నీటి వసతి కల్పించే వరకు, టాయిలెట్లు మంజూరైనా, నిర్మించ వద్దని, ఉన్న వాటిని వాడకూడదని మేమంతా తీర్మానం చేశాం’' అని గ్రామస్తులంతా ముక్తకంఠంతో అన్నారు.

ఈ గ్రామంలో ఇప్పటికే నిర్మించిన మరుగుదొడ్లను ప్రజలు గోదాములుగా వాడుతున్నారు.

ప్రజల్లో చైతన్యం ఉంది

‘'తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే తపన ఈ గ్రామస్తుల్లో ఎక్కువ. పశువులను ఇళ్ల ముందు కట్టుకొని పరిసరాలను అపరిశుభ్రంగా మార్చకుండా తమ సొంత నిధులతో గోశాలను నిర్మించి పశు మూత్రం, పేడ నేరుగా పొలాలకు పారేలా ఏర్పాట్లు చేశారు’' అన్నారు ఈ గ్రామంలో అంగన్‌‌వాడీ పిల్లలకు ఆటపాటలతో పాఠాలు నేర్పుతున్న వందన.

''మా గ్రామం స్వచ్ఛంగా ఉండాలని మూకూ ఉంది. నీళ్ల సదుపాయం లేక ఇలా నిర్ణయించాం. కొండ మీది ఊటనీటిని పైపుల ద్వారా గ్రామానికి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నీటి వసతి రాగానే మరుగుదొడ్లు వాడుకుంటాం'' అంటున్నారు గ్రామసర్పంచ్‌ గంగాధర్‌.

ఫొటో సోర్స్, Shyam Mohan

స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికే

'‘బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల నేల, నదులు కలుషితమయి ప్రజల ఆరోగ్యం దెబ్బతింంటుంది. కొర్రాయి కొత్తవలసను కూడా బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని అందరికీ టాయిలెట్లు మంజూరు చేశాం. అయితే నీటి వసతి కల్పించడం మా పరిధిలోకి రాదు’' అని డ్వామా (జిల్లా నీటి యాజమాన్య సంస్థ) ఏపీడి శ్రీనివాస్‌ అన్నారు.

ఇక్కడ పది మంది ఇంటర్‌ చదివిన యువతీ, యువకులు గ్రామాభివృద్ధి కోసం పని చేస్తున్నారు. వారిలో కొందరు ఉచితంగా పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. ఇటుకలు కొనకుండా స్థానికంగా దొరికే మట్టితో శ్రమదానం చేసి బస్‌ షెల్టర్‌ నిర్మించుకున్నారు.

ఈ స్టోరీని రిపోర్ట్‌ చేసి కొర్రాయి కొత్తవలస నుండి మేం వెనక్కి వస్తుంటే, కొందరు విద్యార్ధులు రహదారి మీద చెత్తను ఏరి పరిశుభ్రం చేస్తూ, మాకు బై బై చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)