సౌదీ కథలు: 'ఆ నరకం భరించలేక ఏందన్నా తాగి సచ్చిపోదాం అనిపిస్తుంది సార్’

  • 5 ఏప్రిల్ 2019
ఊహాచిత్రం

'కాకి రెక్కంత కరిమబ్బు కోసం చూస్తున్నా..' అని అంటారు ఓ కవితలో సీమ కవి బద్వేలి రమేశ్. ఈ ఒక్క వాక్యంతో... రాయలసీమ దాహార్తిని వివరించే ప్రయత్నం చేస్తాడు.

‘‘అక్కడి భూమిలో నీరు లేదు, వీరి ఒంట్లో సారం లేదు. బతకడానికి వలసలే దిక్కు’’ అని రాయలసీమ మేధావులు, రచయితలు, ఉద్యమకారులు చెబుతున్నారు. వీరంతా నీటి కోసం కలగంటున్నారు.

వరస కరవుల ధాటికి, పిల్లల పెళ్లిళ్ల కోసం కొందరు రాయలసీమ రైతులు, రైతు కూలీలు గల్ఫ్ దేశాలకు పెద్దఎత్తున వలస పోతున్నారు.

తమ అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఏజెంట్లు మోసం చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

కదిరి ప్రాంతంలో ఏజెంట్లు ఊరూరికీ వెళ్లి, సౌదీ, ఖతార్‌లాంటి దేశాల్లో ఇంటి పని చేయడానికి పంపుతామని తమకు గాలం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీరి జీవితాల గురించి తెలుసుకోవడానికి బీబీసీ రాయలసీమలోని అనంతపురం జిల్లాకు వెళ్లింది. అది.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం యాదలవాండ్లపల్లి.

పొట్టకూటికి సౌదీపోయి, ఆ బాధలు భరించలేక తిరిగొచ్చిన కొందరు మహిళలను బీబీసీ కలిసింది.

ఎండాకాలం... మండుటెండ అన్నివైపులా పరుచుకుంది. ఊరు చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా ఇళ్లకు తాళాలు వేశారు. ఆ ఊళ్లో నాలుగైదు వీధులకు మించి లేవు. మనుషులు పలుచగా కనిపిస్తున్నారు. అది ఊరులా లేదు. ఒక్కో ఇంటిని దాటుకుంటూ నడుస్తున్నాం.

ఎదురుగా ఓ నడివయసు వ్యక్తి.. ఇంటి బయట గోడ కింద కూర్చున్నాడు ఆకాశంలోకి ఎటో చూస్తూ.

''అదిగో.. అయప్పే సార్ రామ్మోహన్ అంటే! నేను చెప్పినానే.. సౌదీకి పోయి పిచ్చోడై వచ్చినాడని..!'' అన్నారు రమణమ్మ.

అప్పుడు అర్థమైంది నాకు.. అతడి చూపుల్లోని నిర్లిప్తత. రెడ్స్ స్వచ్ఛంద సంస్థలో రమణమ్మ సభ్యురాలు.

మేం రామ్మోహన్‌ను పలకరించగానే, అతడి కూతురు గౌతమి ఇంటి నుంచి బయటకొచ్చింది.

''మా నాయన మాట్లాడడు సార్'' అంది గౌతమి. ఆమె రామ్మోహన్ చిన్న కూతురు. ఏడవ తరగతి చదువుతోంది. పెద్ద కూతురు తొమ్మిదో తరగతి.

గౌతమి వెనకే వాళ్ల అమ్మమ్మ కూడా బయటకు వచ్చింది.

రామ్మోహన్ కుటుంబం యాదలవాండ్ల పల్లిలోనే నివసించేది. వర్షాలు లేవు, వ్యవసాయం లేదు, కూలి పనులూ లేవు. కరువు పరిస్థితుల్లో జీవించలేక, భార్యతోపాటు బెంగళూరు చేరాడు. భార్య ఇంటిపనులు చేస్తుంటే ఆయన కూలి పని చేసేవాడు.

ఊర్లో ఒక్కొక్కరూ సౌదీకి పోవడం మొదలైంది. అక్కడ సంపాదన బాగా ఉంటుందని అందరూ చెప్పుకునేవారు. వారితోపాటే రామ్మోహన్ కూడా సౌదీలోని దమ్మామ్ వెళ్లాడు. అక్కడ ఒంటెల కాపరిగా ఓ పనిలో కుదిరాడు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘సౌదీకి పోయి మా నాయన పిచ్చోడైనాడు’

‘మాట్లాడేకి మనిషి లేడు, తినడానికి తిండి లేదు’

''వద్దు అన్నా ఇనకుండా మా నాయన దమ్మామ్‌ పోయినాడు సార్. మాకు భూముల్లేవు. అప్పులున్నాయి. అక్కడికి పోకముందు మా నాయన బాగుండె సార్. అక్కడకు పోయినంకే ఇట్లయిపాయ'' అంది గౌతమి.

ఎడారిలో ఒంటెల కావలి. ఒక్కడే ఉండాలి, తోడు ఎవరూ ఉండరు.. ఒక్కోసారి తాగడానికి నీళ్లుండవు, రోజులపాటు తిండీ ఉండదు అని గౌతమి అమ్మమ్మ అన్నారు.

ఒంటెలను సరిగా మేపనందుకు రామ్మోహన్‌పై యజమాని దాడి చేశాడని, ఆ దెబ్బలకు రామ్మోహన్ మతి భ్రమించి ఉంటుందని వారు చెబుతున్నారు.

‘‘అది మాత్రం నిజం సార్.. మమ్మల్ని మనుషులుగా చూడరు. కోపమొస్తే ఆడకూతురు అని కూడా చూడరు. ఇలా కొడితే చస్తారని కూడా ఆలోచించరు. ఆ బాధలు నేను కూడా చూసినా సార్!’’ అన్నారు రమణమ్మ.

ప్రస్తుతం గౌతమి, తన అక్క ఇద్దరూ వాళ్ల అమ్మమ్మ దగ్గరే ఉన్నారు. ప్రస్తుతం రామ్మోహన్ ఏ పనీ చేయడం లేదు.

''ఈయప్ప నా అల్లుడు. ఆర్నెల్ల కిందట దమ్మామ్ పోయినాడు. నెలనెలా పదివేలు పంపుతాండె. మూణ్ణెల్లు బాగానే ఉండెసార్. ఆ తర్వాత ఏమైందో ఎమో.. మనిషి గురించి సమాచారం ఉరువే లేదు. ఒకరోజు దమ్మామ్ నుంచి ఒకాయప్ప ఫోన్ చేసి, మీ మనిషికి ఆరోగ్యం బాగలేదు.. మద్రాసు విమానం ఎక్కిస్తున్నాం, మీరు దింపుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు’’ అన్నారు గౌతమి అమ్మమ్మ.

‘‘ఏం చేయాలో అర్థం కాలేదు. మద్రాసు పొయ్యే లోపల విమానం దిగి యాటికో పోయినాడు. మద్రాసు అంతా ఎతికి ఎట్లో కష్టపడి ఇంటికి తీసుకొచ్చినాం. చూస్తే.. ఇదీ పరిస్థితి. ఏం చేసేది?'' ఆమె కళ్లల్లో దిగులు.

ప్రస్తుతం ఇంటి బాధ్యత రామ్మోహన్ భార్య మోస్తోంది. బెంగళూరులో కూలి పనులు చేస్తూ సంపాదిస్తోంది.

‘ఊరు ఉంది.. మనుషులే లేరు’

''మమ్మల్ని సాకడానికి మా అమ్మ బెంగళూరుకు పోయింది. అమ్మమ్మ మాకు అన్నం చేసి పెడుతుంది. ఊళ్లో అందరి పరిస్థితీ ఇంతే సార్. ఈ కరువును తట్టుకోలేక.. కొంతమంది బెంగళూరుకు పోతే, ఇంకొంతమంది సౌదీ పోయినారు. ఊర్లో ఇండ్లు ఉన్నాయి కానీ మనుషులే లేరు. బతకలేక.. అందరూ దేశాల మీద ఎల్లిపోయినారు..'' అని గౌతమి చెప్పింది.

''సౌదీ పోవడానికి రూ.1.5 లక్షలు ఖర్చయ్యింది. తిరిగొచ్చినంక డాక్టర్ల చుట్టూ తిరిగేదానికి రూ.50 వేలు ఖర్చయ్యింది. ఇంకా మందులు వాడుతూనే ఉన్నాం..'' అని గౌతమి అమ్మమ్మ అన్నారు.

మేం ఇంతసేపు మాట్లాడుతున్నా, రామ్మోహన్‌లో ఏ స్పందన లేదు. దమ్మామ్‌లో ఏం జరిగిందో వీళ్లెవ్వరికీ తెలీదు. అసలు ఏం జరిగిందో.. ఆకాశంలోకి చూసే అతడి కళ్లకైనా గుర్తుందా?

గౌతమితో మాట్లాడుతుండగా, సౌదీకి వెళ్లి తిరిగొచ్చిన ఆ గ్రామంలోని కొందరు మహిళలు మాదగ్గరకొచ్చారు. రామ్మోహన్ పట్ల సహానుభూతి చెందుతూ, ఒక్కొక్కరూ తమ కథలు చెప్పడం మొదలుపెట్టారు.

అప్పు తీర్చడానికి ఒకరు, కూతురు పెళ్లికి కట్నం ఇవ్వడానికి మరొకరు.. ఇలా వారి కథలన్నీ కన్నీళ్లతో ముగిశాయి. బాధితుల గుర్తింపు గోప్యంగా ఉంచడానికి వారి పేర్లను మార్చాం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘నేను నర్సు అని చెప్పి సౌదీ పంపినాడు సార్..’

'నర్సు అని అపద్ధం చెప్పి నన్ను సౌదీ పంపినాడు..'

''వంటపని చేసేకి సౌదీ పోతావా అని అడిగినాడు ఏజెంట్. సరేనన్నాను. కానీ, సౌదీ వాళ్లకేమో.. నేను నర్సు అని చెప్పి, 8 లక్షలు తీసుకున్నాడు. ఆ విషయం నాకు తెలీదు. సౌదీ పోయినంక, నువ్వు నర్సువికదా అని ఆ ఇంటి ముసలమ్మకు సూది వేయమన్నారు. నాకేమీ అర్థం కాలేదు. సూది వేసేకిరాదని చెబితే, అపద్ధం చెబుతున్నానని కొట్టినారు. సంపుతామని నా తలకు తుపాకి గురిపెట్టినారు సార్!’’ అని రూప అనే మహిళ తన వ్యథను చెప్పసాగింది.

రూపది వ్యవసాయ కుటుంబం. 4 ఎకరాల పొలం ఉంది. కానీ వరస కరువులతో కళ్లముందే పంట ఎండిపోయింది. పంటను కాపాడుకునేందుకు వరుసగా సేద్యపు బోర్లు వేయడంతో అప్పు రూ.5 లక్షలకు చేరింది. అప్పు తీర్చడానికి వేరే మార్గం లేక, సౌదీ వెళ్లానని రూప చెబుతోంది.

''ఏజెంట్‌కు 8 లక్షలు ఇచ్చి, నన్ను కొనుక్కున్నారంట! సేద్యం, ఇంటి పని తప్ప నర్సుపని నాకు రాదు సార్. మోసం చేసినానని, తుపాకీతో బెదిరించినారు. ఎక్కడ సంపుతారోనని రాత్రంతా మేలుకుంటాంటి. నా తాళిబొట్టు తీసేసి, బాగా కొట్టినారు.''

''ఈ విషయాన్ని మావాళ్లకు ఫోన్ చేసి చెప్పినా. వాళ్లు ఏజెంట్‌తో కొట్లాడినారు. నేను అదృష్టవంతురాలిని. వాడు నన్ను ఎనక్కు పిలిపించినాడు. నా మొగుడిని, పిల్లల్ని జీవితంలో చూస్తాననుకోలేదు'' అని తన కథ చెప్పింది రూప.

‘‘ఆ నరకం భరించలేక ఏందన్నా తాగి సచ్చిపోదాం అనిపిస్తుంది సార్’’ అని రూప బాధను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఈశ్వరి.

ప్రస్తుతం రూప దంపతులు కూలి పనులకు వెళుతున్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతోటే తాము సౌదీకి వెళుతున్నామని, ఉపాధి దొరికితే తాము వలసెందుకు పోతామని రూప ప్రశ్నిస్తోంది.

ఉపాధిహామీ పథకం విజయవంతంగా అమలవుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ పథకం గురించి రూప అభిప్రాయం వేరుగా ఉంది.

''వాళ్లు నూరు, నూటాయాభై రోజులు మాత్రమే ఉపాధి పనులు ఇస్తాన్నారు సార్. ఆ తర్వాత మాకు ఏ పనీ దొరకదు. ఆ డబ్బులు చేతికి వచ్చేకి 3-4 నెలలు పడుతుంది. ఇంగేంటికి ఆ ఉపాధి హామీ?’’ అని రూప చెబుతోంది.

ఉపాధి హామీ డబ్బులు అందడంలో జాప్యం జరగడం వాస్తవమేనని అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్ బీబీసీతో అన్నారు.

‘‘కరువు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం పనిదినాలను పెంచింది. కానీ ఉపాధి హామీ డబ్బులు అందడం ఆలస్యమవుతుందన్న విషయంలో కూడా వాస్తవం ఉంది. కొన్ని కారణాలవల్ల ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో ఆలస్యం అవుతోంది. ఈ అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం’’ అని వీరపాండ్యన్ అన్నారు.

అప్పు తీర్చడానికి సౌదీ వెళ్లిన రూప కుటుంబం, ఆమెను మళ్లీ భారత్ తీసుకురావడానికి మరో లక్ష రూపాయలు అప్పు చేయాల్సివచ్చింది.

‘‘అప్పులోళ్లు ఇంటి దగ్గరకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడతుంటే, ఎట్లైనాసరే.. అప్పు తీరుద్దామన్న పౌరుషంతో రియాద్‌కు పోయినా. ఆడ నరకం చూడలేక ఇంటికి వచ్చేకి మళ్లీ లక్ష రూపాయలు అప్పు చేసినాం సార్. నేను రూపాయి కూడా సంపాదీలేదు. అప్పులు తీర్సేకి మా భూమి కూడా అమ్ముకున్నాం?'' అని కన్నీటి పర్యంతమైంది రూప.

ఏ భూమి కోసం అప్పు చేశారో, అదే భూమిని అమ్మేసి అప్పు తీర్చింది రూప కుటుంబం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘కూతురి కట్నం కోసం సౌదీ పోయినా!’

కూతురి కట్నం కోసం సౌదీ పోయినా!

''మాకు ఆస్తి లేదు. పెద్దపాపకు పెళ్లి చేయల్ల. కట్నం ఇవ్వడానికి డబ్బుల్లేవు. ఆ కట్నం సంపాదించేకి సౌదీ పోయినా సార్. నా బిడ్డకు కట్నం డబ్బులు సంపాదించినా కానీ, ఆ పెళ్లికి నేను రాలేదు..!'' అంది ఈశ్వరి.

ఈశ్వరి భర్తతోపాటుగా కూలి పనులకు వెళ్లేది. భూమి లేదు. పిల్లలకోసం సౌదీ వెళ్లింది. అక్కడే 20 నెలలు పని చేసి, ఆ కష్టాలు పడలేక ఇంటికొచ్చేసింది.

''రెండు ఇండ్లల్లో 20 నెలలు పని చేసినా. చాలా రోజులు ఒక పూట మాత్రమే భోజనం పెట్టినారు. అట్లా కడుపు కట్టుకుని 3 లక్షలు సంపాదించినా, తిరిగి వచ్చేటపుడు 4 నెలల జీతం ఇవ్వలేదు. బతికితే సాలు అనుకుని వచ్చేసినా సార్'' అని చెప్పుకొచ్చింది ఈశ్వరి.

''మమ్మల్ని గొడ్డును చూసినట్ల చూస్తారు. కాలిపై వేడి నీళ్లు పడి కొన్ని రోజులు నడసలేకపోయినా. డాక్టర్ దగ్గరకి తీసుకుపోలేదు. పని చేయలేదని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాళ్లు. అప్పులతో సౌదీ పోయి, గాయాలతో ఇంటికొచ్చినా సార్.''

''అయినా, మా పరిస్థితి ఏం మారలేదు. అప్పుడూ ఇప్పుడూ కూలిపనే మాకు గతి. అదే జీవితం, అదే కూలి.''

కరువు, వలసలు వాస్తవమే..!

అనంతపురం జిల్లాలో కరవుతో ప్రజలు వలసలు పోవడాన్ని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అంగీకరించారు. ఈ వలసలను ఆపేందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తోందని వీరపాండ్యన్ బీబీసీతో అన్నారు.

‘‘మహిళలను మోసం చేసి, వారిని కొందరు ఏజెంట్లు సౌదీ లాంటి దేశాలకు పంపుతున్నారని మాకు ఫిర్యాదులు అందాయి. మెప్మా, డ్వామా అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఒక బృందంగా ఏర్పడి, మహిళలను మోసం చేస్తున్న ఏజెంట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు.

మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఆర్.డి.టి.లాంటి స్వచ్ఛంద సంస్థల సహాయంతో, కదిరిలో కొన్ని వర్క్‌షాపులు నిర్వహించి, వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకునేలా వారికి శిక్షణ ఇచ్చామని ఆయన చెప్పారు.

ఎనిమిదేళ్లు నీటి కరువు

రామ్మోహన్‌ను ఇల్లు వదిలి, ఊరు వదిలి, దేశం కాని దేశానికి పంపింది వాళ్ల పేదరికమేనని అర్థమవుతుంది. కానీ ఆ పేదరికం వేర్లు మాత్రం... కరవు, నీళ్ళు, వ్యవసాయం చుట్టూ అల్లుకుని ఉన్నాయి. ప్రభుత్వ లెక్కలను, చరిత్ర పుస్తకాలను చదివితే, ఈ ప్రాంతాన్ని కరవు శతాబ్దాలుగా పట్టిపీడిస్తోందని అర్థమవుతుంది.

వందల ఏళ్లుగా ఎన్నో రాజ్యాలు, ఎన్నో ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. కానీ, కరవు, వలసలు, ఆత్మహత్యలు మాత్రం ఇక్కడ తిష్టవేసుకునే ఉన్నాయి.

వీరి కుటుంబాలే కాదు, రాయలసీమ ప్రాంతం దాదాపుగా.. కరవు నీడలోనే బతుకుతోందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

అనంతపురం జిల్లాలో.. గత 17 ఏళ్లలో 8 సంవత్సరాలను 'నీటి కరువు' సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెబుతోంది.

అధికారిక లెక్కల ప్రకారం.. 2002, 2003, 2004, 2006, 2011, 2012, 2013, 2014 సం.లను నీటి కరవు సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE భారత్ Vs పాకిస్తాన్‌: టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్ బ్యాటింగ్

క్రికెట్ ప్రపంచ కప్ 2019: పాకిస్తాన్‌తో ఆడిన 6 మ్యాచుల్లో భారత్ ఎలా గెలిచింది...

విక్టోరియా మోడెస్టా: కృత్రిమ కాలుతో.. పారిస్ కేబరేను షేక్ చేస్తున్న బయోనిక్ షోగర్ల్

ప్రెస్ రివ్యూ: 'టీఆర్‌ఎ‌స్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే' -కోమటిరెడ్డి రాజగోపాల్

క్రికెట్ ప్రపంచ కప్ 2019: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలిచేదెవరు...

క్రికెట్ ప్రపంచ కప్ 2019: 'పాకిస్తాన్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ మధ్యే పోటీ' -ఇంజమామ్ ఉల్ హక్

క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి

రెండో ప్రపంచ యుద్ధంలో విడిపోయి 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమజంట