షికాగో సెక్స్ రాకెట్: 'వ్యభిచారం ఈనాటిది కాదు.. సినీరంగాన్ని నిందించటం సరికాదు'

  • పద్మ మీనాక్షి, వేణుగోపాల్
  • బీబీసీ ప్రతినిధులు
getty

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలోని షికాగోలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు, యాంకర్లతో 'సెక్స్ రాకెట్' నడిపిస్తున్నారన్న ఆరోపణలపై ఓ తెలుగు జంటను అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో నిర్మాత, ఏపీ ఫిల్మ్ చాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె.సురేశ్‌ బాబు బీబీసీతో మాట్లాడుతూ.. షికాగోలో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషన్ మోదుగుమూడి అసలు నిర్మాతే కాదని, తనకు తెలిసి ఆ పేరుతో నిర్మాత ఎవరూ లేరని చెప్పారు.

అమెరికాలో వెలుగులోకి వచ్చిన తాజా ఉదంతం గురించి పూర్తిగా తనకు తెలియదని ఆయన అన్నారు.

‘‘హీరోయిన్లను అక్కడకు తీసుకెళ్లాలంటే.. వారిని ఎందుకు తీసుకెళ్లాలో వీసా కోసం దరఖాస్తు చేసినపుడు స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ అమెరికాలోని తెలుగు సంస్థలు గౌరవ అతిథిగా తీసుకెళ్తే.. చిన్న నటులకు ఆ అవకాశం రాదు. వీసా ఇవ్వరు కూడా. అందువల్ల చిన్న హీరోయిన్లను, నటులను తెలుగు సంస్థలు అక్కడకు తీసుకెళ్లడం అంత సులభం కాదు.’’ అన్నారు.

ఇంకేదైనా ఇతర కారణాలు చూపించో, లేదంటే పర్యటన పేరుతోనో తీసుకెళ్లి ఉండొచ్చని, అయితే, దీనిపై తమకు వివరాలు తెలియవని ఆయన అన్నారు.

అన్నింటికీ సినీ రంగాన్ని నిందించటం సరికాదనీ, గ్లామర్ ఫీల్డు కావడం వల్ల చిన్న విషయాలు కూడా మీడియాకు పెద్దగా కనిపిస్తాయని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

చాలాకాలంగా జరుగుతున్న వ్యవహారమే..

కొందరు చిన్నచిన్న హీరోయిన్లను.. మహిళా ఆర్టిస్టులను అమెరికాకు తీసుకెళ్లి వారితో అక్కడ వ్యభిచారం చేయించడం ఇవ్వాళ్టి విషయం కాదని, చాలా రోజులుగా ఇలాంటివి జరుగుతున్నాయని టాలీవుడ్‌కి చెందిన కొందరు బీబీసితో చెప్పారు.

అక్కడైతే వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరూ అడగరన్న భరోసా ఇచ్చి ఇక్కడివారిని మోసం చేస్తున్నారని వివరించారు.

తాజాగా షికాగోలో వ్యభిచారం రాకెట్ నడుపుతున్న ఆరోపణలపై కిషన్ మోదుగుమూడి (శ్రీరాజ్ చెన్నుపాటి అలియాస్ రాజు) ని అరెస్ట్ చేసిన సందర్భంగా బీబీసి సినిమా రంగానికి చెందిన పలువురితో మాట్లాడింది.

కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి అసలు నిర్మాతే కాదని.. అలా చెప్పుకొంటూ సినిమా వాళ్లతో వ్యాపారం చేసే దళారి అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

‘ఆయనతో నిర్మాతల మండలికి ఎలాంటి సంబంధం లేదు’

''అతను ఎప్పటి నుంచో అమెరికాలో ఉన్నారు. చాలా మందికి వీసాలు కూడా ఇప్పించారు. అమెరికాలో కూర్చొని ఇక్కడి వారికి వీసాలు ఇప్పించారంటే చాలా ఆలోచించాలి'' అని భరద్వాజ వివరించారు.

అతనిపై మూడు నెలల కిందటే ఫిర్యాదు చేశారని, తాజాగా అరెస్ట్ చేశారని తెలిపారు.

ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లినవారంతా సినిమా రంగానికి చెందినవారే అనుకోలేమని, ఆ పేరుతో ఇతరులనూ తీసుకెళ్లి ఇలాంటి పనులకు పాల్పడ్డారని భరద్వాజ ఆరోపించారు.

అక్కడ పలు తెలుగు సంస్థల పేరిట జరిగే కార్యక్రమాలకూ కొన్ని నెలల కిందట పలువురిని తీసుకెళ్లారని చెప్పారు.

కిషన్‌కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఎలాంటి సంబంధమూ లేదని భరద్వాజ వెల్లడించారు.

ఇలాంటివాటికి దూరంగా ఉండాలి

గ్లామర్ ఫీల్డ్‌లో ఇదో ధోరణిగా మారిపోయిందని గేయ రచయిత శ్రేష్ఠ అన్నారు. సినిమా, ఈవెంట్స్ అన్నీ బిజినెస్‌గా మారిపోయి అన్ని రకాల వ్యవహారాలూ ఎక్కువైపోతున్నాయన్నారు.

కొందరు అత్యాశ వల్ల అన్నింటికీ ఓకే చెప్పేస్తున్నారని అన్నారు. మనకు టాలెంట్ ఉన్నపుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చని సూచించారు.

ఇండస్ర్టీలో కిషన్ లాంటివాళ్లు చాలా మంది ఉంటారని చెప్పారు. కేవలం మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా ఇలాంటి వ్యవహారాలను నడిపిస్తున్నారని శ్రేష్ఠ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

'పచ్చి దగాకోరు వ్యాపారమది'

హీరోయిన్లను, హీరోయిన్ కావాలన్న ఆశతో వచ్చినవారిని ''అమెరికా వెళ్లాలి.. సినిమాలో నటించాలన్న ఆశను సాకుగా చూపి మోసం చేస్తున్నారు.'' అని రచయిత గౌతమ్ కశ్యప్ బీబీసీతో చెప్పారు.

'కిషన్ అనే వ్యక్తి నిజంగా సినిమా తీసుంటే ఆ విషయం అందరికీ తెలిసేది. ఆయనో ప్రొడ్యూసర్‌గా మేం ఎప్పడూ వినలేదు. అక్కడ ఆయన సినిమా నిర్మాతని చెప్పుకొంటూ ఉండొచ్చు.' అని గౌతమ్ పేర్కొన్నారు.

మొత్తానికి ఇదో దగాకోరు వ్యాపారమైపోయిందని అన్నారు.

''ఇది అన్ని చోట్లా జరుగుతోంది. ఈ విషయం చెబితే అవకాశాలు పోతాయని చాలామంది బయటపడరు. ఇది చాలా రోజులుగా జరుగుతోంది.'' అని గౌతమ్ చెప్పారు.

'నాటి నుంచి నేటి వరకు అనేక మందిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఒక అమ్మాయి.. కాస్టింగ్‌కి వచ్చిందంటే.. ఆ అమ్మాయిని వేరు దృష్టితో చూడటం కామనైపోయింది.' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)