నీతి ఆయోగ్: తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడోవంతు, తెలంగాణలో దాదాపు సగం

  • 16 జూన్ 2018
వివిధ రాష్ట్రాల్లో నీటి ఎద్దడిని తెలిపే చిత్రం Image copyright NITI Aayog
చిత్రం శీర్షిక ‘దేశ జనాభాలో 70 శాతం మంది.. అంటే దాదాపు 80 కోట్ల మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వీరికి సురక్షిత నీటిని సరఫరా చేయటం అతిపెద్ద సవాలు’

భారతదేశంలో నీటి సరఫరా చాలా పరిమితంగా ఉంది. దేశవ్యాప్తంగా 75 శాతం గృహాలకు ఇప్పటికీ తాగునీరు లభించట్లేదు. 84 శాతం గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా తాగునీటి సరఫరా లేదు. మన నీటిలో 70 శాతం కలుషితమైనదే. నీటి నాణ్యత ఇండెక్స్‌లో ప్రపంచంలోని 122 దేశాలకు గాను భారతదేశం ప్రస్తుతం 120వ స్థానంలో ఉంది.

భారతదేశంలో ఇప్పటికీ 53 శాతం వ్యవసాయం వర్షాధారమే. దేశంలో తరచూ సంభవిస్తున్న కరువుల కారణంగా వర్షాలపైనే ఆధారపడ్డ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

చాలామంది ప్రజలకు తాగునీరు అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న నీటి నాణ్యత దారుణంగా ఉంది. కలుషిత నీరు వల్ల ప్రతి ఏటా మన దేశంలో 2 లక్షల మంది చనిపోతున్నారు. మరోవైపు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పెరుగుతున్నాయి.

2030 నాటికి కూడా దేశ జనాభాలో 40 శాతం మందికి తాగునీరు అందుబాటులో ఉండదు. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో భూగర్భ జలాలు 2020 నాటికల్లా అడుగంటిపోతాయి. దీంతో 10 కోట్ల మంది ఇబ్బందులు పడతారు. నీటి సంక్షోభం కారణంగా 2050 నాటికి దేశ జీడీపీలో 6 శాతం కోల్పోవాల్సి వస్తుంది. తగినన్ని చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు, మరింత నష్టం తప్పదు.

అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘కంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌’ను ప్రవేశపెడుతున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. అలాగే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో తీసుకుంటున్న పలు చర్యలు సహకరిస్తాయని ఈనెల 12వ తేదీన విడుదల చేసిన నివేదికలో నీతి ఆయోగ్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Image copyright NITI Aayog

ఆంధ్రప్రదేశ్‌‌

జనాభా : 4.9 కోట్లు (2011 జనాభా లెక్కల ప్రకారం)

జాతీయ వర్షపాత నిష్పత్తి : 2.4 శాతం (2016 లెక్కల ప్రకారం)

జాతీయ భూగర్భ నీటి నిష్పత్తి : 4.9 శాతం (2013 లెక్కల ప్రకారం)

జాతీయ వ్యవసాయ ఉత్పత్తి నిష్పత్తి : 3.7 శాతం

బాగున్న అంశాలు:

భూగర్భ జల పునరుద్ధరణ - రాష్ట్రవ్యాప్తంగా అధికంగా నీటిని తోడేసిన బోర్లు, బావులను గుర్తించి, తగిన మౌలిక సదుపాయాల సాయంతో రీఛార్జి చేస్తోంది.

భాగస్వామ్య సాగు విధానం - మొత్తం సాగు విస్తీర్ణంలో 70 శాతాన్ని నీటి సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇవే సేవా రుసుములు వసూలు చేసి, వినియోగిస్తుంటాయి.

సమాచారం - నీటి సమాచారం కోసం అత్యున్నత స్థాయిలో ఆన్‌లైన్ ప్రజా వేదికను ఏర్పాటు చేసింది. నీటి వనరుల జీఐఎస్ ఆధారిత గుర్తింపుతో పాటు ఇందులో ప్రతిరోజూ సమాచారాన్ని పొందుపరుస్తుంటారు.

మెరుగుపడాల్సిన అంశాలు:

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు - రాష్ట్రవ్యాప్తంగా మూడోవంతుకు పైగా గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందుబాటులో లేదు.

మురుగునీటి పునర్వినియోగం - రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి, పునర్వినియోగించే మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. దీంతో పట్టణ మురుగునీటిలో 26 శాతాన్ని మాత్రమే శుద్ధి చేస్తోంది.

పట్టణ నీటి ఛార్జీలు - సగానికి పైగా పట్టణ గ‌ృహ కనెక్షన్ల నుంచి ఛార్జీలు వసూలు చేయట్లేదు. ఇది అధిక నీటి వినియోగానికి దారి తీస్తోంది.

Image copyright NITI Aayog

తెలంగాణ

జనాభా : 3.5 కోట్లు (2011 జనాభా లెక్కల ప్రకారం)

జాతీయ వర్షపాత నిష్పత్తి : 3.2 శాతం (2016 లెక్కల ప్రకారం)

జాతీయ భూగర్భ నీటి నిష్పత్తి : 3.6 శాతం (2013 లెక్కల ప్రకారం)

జాతీయ వ్యవసాయ ఉత్పత్తి నిష్పత్తి : 1.9 శాతం

బాగున్న అంశాలు:

ఉపరితల, భూగర్భ జల పునరుద్ధరణ - గుర్తించిన జల వనరుల్లో 70 శాతం సాగునీటి సామర్థ్యాన్ని పునరుద్ధరించింది. దుర్భర స్థితిలో ఉన్న 90 శాతం బోర్లను మెరుగుపర్చింది.

పట్టణ నీటి సరఫరా - రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని 80 శాతం గృహాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో 75 శాతం కనెక్షన్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

మెరుగుపడాల్సిన అంశాలు:

పంట పొలాల్లో వినియోగం - విద్యుత్ ఫీడర్ల వర్గీకరణ ప్రక్రియను రాష్ట్రం ఇంకా ప్రారంభించలేదు. వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా చేసే విద్యుత్‌కు ఛార్జీలు వసూలు చేయని కొన్ని రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. సూక్ష్మ సేద్యం విషయంలో పనితీరు చాలా తక్కువ.

గ్రామీణ తాగునీరు - రాష్ట్రవ్యాప్తంగా 55 శాతం గ్రామాలకే పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా జరుగుతోంది. నీటి నాణ్యత ఏమాత్రం మెరుగుపడలేదు.

ఏపీకి 3వ ర్యాంకు, తెలంగాణకు 8వ ర్యాంకు

నీటి వనరుల నిర్వహణకు సంబంధించి పలు అంశాల్లో వివిధ ప్రమాణాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు ఇచ్చింది. ఇందులో 17 హిమాలయేతర రాష్ట్రాలు, 7 హిమాలయ, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. హిమాలయేతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు, తెలంగాణకు ఎనిమిదవ ర్యాంకులు లభించాయి.

2015-16 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోగా.. తెలంగాణ మాత్రం మూడు స్థానాలు మెరుగు పర్చుకుని 11వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరుకుంది.

కంపోజిట్ వాటర్ ఇండెక్స్ స్కోరు వారీగా చూస్తే.. 76 పాయింట్లతో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉంది. 69 పాయింట్లతో మధ్యప్రదేశ్ రెండో స్థానంలోనూ, 68 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా.. కర్ణాటక (56 పాయింట్లు), మహారాష్ట్ర (55), పంజాబ్ (53), తమిళనాడు (51), తెలంగాణ (50), ఛత్తీస్‌గఢ్ (49), రాజస్థాన్ (48) ఉన్నాయి.

గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈ మధ్య తీవ్ర కరువును ఎదుర్కొన్నాయి. ఆ నేపథ్యంలో ఈ రాష్ట్రాలు తీసుకున్న చర్యలు, వాటి పనితీరుతో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనటానికి సానుకూల ఫలితాలు వచ్చాయి.

Image copyright NITIAayog
చిత్రం శీర్షిక భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనంతటి తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దేశంలో సుమారు 60 కోట్ల మందిని తాగునీటి కొరత తీవ్రంగా పీడిస్తోంది

తీవ్ర సంక్షోభం దిశగా.. తాగునీరు, ఆహార కొరత

భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనంతటి తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దేశంలో సుమారు 60 కోట్ల మందిని తాగునీటి కొరత తీవ్రంగా పీడిస్తోంది. దేశ జనాభాలో 70 శాతం మంది.. అంటే దాదాపు 80 కోట్ల మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వీరికి సురక్షిత నీటిని సరఫరా చేయటం అతిపెద్ద సవాలు అని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. పైగా, అందుబాటులో ఉన్న నీటి నాణ్యత కూడా బాగోలేదని తెలిపింది.

నీటి నిర్వహణలో - దేశ జనాభాలో దాదాపు సగం.. అంటే 60 కోట్ల మంది ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల పనితీరు నిరాశాజనకంగా ఉంది. జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 20-30 శాతం ఈ రాష్ట్రాల నుంచే జరుగుతోంది. ఈ నేపథ్యంలో తరిగిపోతున్న భూగర్భ జలాలు, తగినంతగా లేని విధానపరమైన చర్యల వల్ల దేశ ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది.

నీతి ఆయోగ్ నిర్వచనం ప్రకారం.. గ్రామీణులకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా అంటే - ప్రతి వ్యక్తికీ రోజుకు 70 లీటర్ల నీరు తన ఇంటి పరిధిలో లేదా 50 మీటర్లలోపు దూరంలో, ఎలాంటి సాంఘిక, ఆర్థిక వివక్ష లేకుండా లభించటం. రాష్ట్రాలు తలసరి 100 లీటర్లు కూడా ప్రమాణంగా పెట్టుకోవచ్చు.

మెరుగైన ఫలితాలు రావాలంటే ఇవి మెరుగుపడాలి

  • భూగర్భ, ఉపరితల నీటి వనరులు
  • భారీ, మధ్యతరహా సాగునీటి సరఫరా
  • వాటర్‌షెడ్‌ల అభివృద్ధి
  • భాగస్వామ్య సాగునీటి పద్ధతులు
  • పంట పొలాల్లో నీటి వినియోగ పద్ధతులు
  • గ్రామీణ తాగునీటి పథకాలు
  • పట్టణ నీటి సరఫరా, పారిశుధ్యం
  • విధానాలు, పరిపాలన

ఈ సమాచారంపై ఎంతవరకు ఆధారపడొచ్చు?

మన దేశంలో నీటికి సంబంధించిన సమాచార వ్యవస్థల విస్తృతి, సామర్థ్యం చాలా పరిమితం. ఇప్పటికీ గృహ, పారిశ్రామిక రంగాల్లో నీటి వినియోగ సమాచారం ఏకమొత్తంగా లభిస్తోందే తప్ప నిర్దిష్టంగా ఏయే స్థాయిల్లో ఎంతెంత ఖర్చవుతోందనేది స్పష్టత లేదని నీతి ఆయోగ్ తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారంపై కూడా ఆధారపడలేని పరిస్థితి. ఎందుకంటే చాలా పాత పద్ధతుల్లో ఈ సమాచార సేకరణ జరుగుతోంది. ఐదవ మైనర్ ఇరిగేషన్ లెక్కల ప్రకారం దేశంలో 1.2 కోట్ల బోర్లు, బావులు ఉంటే అందులో 55 వేల బోర్లు, బావులను ప్రామాణికంగా తీసుకుని భూగర్భ జల సమాచారం తయారు చేస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నీతి ఆయోగ్ నిర్వచనం ప్రకారం.. గ్రామీణులకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా అంటే - ప్రతి వ్యక్తికీ రోజుకు తలసరి 70 లీటర్ల నీరు తన ఇంటి పరిధిలో లేదా 50 మీటర్లలోపు దూరంలో, ఎలాంటి సాంఘీక, ఆర్థిక వివక్ష లేకుండా లభించటం

సిఫార్సులు

ఈ నివేదికలో భాగంగా నీతి ఆయోగ్ కొన్ని సిఫార్సులు చేసింది. వాటిలో ముఖ్యమైన మూడు సిఫార్సులు ఇవి..

జాతీయ సాగునీటి నిధి ఏర్పాటు

కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ నీటి నిధిని ఏర్పాటు చేసి, సమర్థ సాగునీటి యాజమాన్య పద్ధతులకు గాను ఆయా రాష్ట్రాల సాగునీటి శాఖలకు రాయితీలు, ఆర్థిక నిధులు ఇవ్వాలి. నీటి వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలి. సమర్థవంతంగా నీటి తీరువాలను వసూలు చేసే నీటి సంఘాలకు బోనస్ నిధులు ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో సాగునీటి నిధి అమలవుతోంది. భారతదేశంలో నీరు రాష్ట్ర జాబితాలోని అంశం. దీన్ని ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర జాబితాను కేంద్రం ఉల్లంఘించాల్సి వస్తుంది. అయితే, దీని ఏర్పాటుకు రాజకీయ, ఆర్థిక సాధ్యాసాధ్యాలు మెండుగా ఉన్నాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.

సూక్ష్మ సేద్యం.. ప్రత్యక్ష నగదు బదిలీ

సూక్ష్మ సేద్యానికి సంబంధించి ఇప్పటి వరకూ రాయితీలన్నీ ఆయా పరికరాల విక్రేతల వద్దే లభిస్తున్నాయి. దీనివల్ల పలు రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలా కాకుండా ఎవరైతే పరికరాలను కొనుగోలు చేస్తారో రాయితీలను నేరుగా వారికే ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలి. తద్వారా మార్కెట్‌లో పోటీ, నూతన ఆవిష్కరణలు పెరిగి.. పరికరాల ధరలు తగ్గుతాయి. ఇప్పటికే ప్రత్యక్ష నగదు బదిలీ భారతదేశంలో అమలవుతోంది. తద్వారా లీకేజీలు 24 శాతానికి తగ్గాయి.

ఇజ్రాయెల్ స్ఫూర్తితో పునర్వినియోగం

ప్రస్తుతం దేశంలో నీటిని శుద్ధి చేసి, పునర్వినియోగిస్తోంది 30 శాతం. ఇది చాలా తక్కువ. ఇలా నీటిని శుద్ధి చేయకుండా వదిలేయటం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోంది. గృహాల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. దీనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అయితే, ఈ విషయంలో భారతదేశం ఇజ్రాయెల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆ దేశం మున్సిపాలిటీ మురుగునీటిని వందకు వంద శాతం, వ్యవసాయ మురుగునీటిని 95 శాతం శుద్ధి చేసి, పునర్వినియోగిస్తోంది. దేశవ్యాప్తంగా 50 శాతం నీటి అవసరాలు ఈ పునర్వినియోగ నీటి ద్వారానే తీరుతున్నాయి. 1970-90 సంవత్సరాల మధ్య ఈ మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)