ప్రెస్‌రివ్యూ: వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌ మతతత్వ మిలిటెంట్ సంస్థలు - అమెరికా నిఘా సంస్థ

  • 16 జూన్ 2018
Image copyright Getty Images

అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఏటా ఫ్యాక్ట్‌బుక్ పేరుతో నివేదికను ప్రచురిస్తూ ఉంటుంది. ఈ ఏడాది ప్రకటించిన ఫ్యాక్ట్‌బుక్‌లో విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌లను మతతత్వ మిలిటెంట్ సంస్థలుగా, రాజకీయ ఒత్తిడి గ్రూపులుగా అభివర్ణించింది.

ఆరెస్సెస్, హురియత్ కాన్ఫరెన్స్, జమాయిత్ ఉలేమా ఏ హింద్ సంస్థలూ భారతదేశంలో రాజకీయ ఒత్తిళ్ల గ్రూపులని సీఐఏ వ్యాఖ్యానించింది.

సీఐఏ నివేదికపై వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్ మండిపడ్డాయి. ఇది పచ్చి బూటకమని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. సీఐఏ నివేదికపై జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సీఐఏ తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Image copyright KCR/FACEBOOK

కాళేశ్వరానికి రూ.20 వేల కోట్లివ్వండి: మోదీని కోరిన కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారని నవ తెలంగాణ రాసింది.

ఈ ప్రాజెక్టుకు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ శుక్రవారం దిల్లీలో ప్రధానితో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై మొత్తం పది వినతిపత్రాలు సమర్పించారు. వీటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

''పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తోపాటు అన్ని రాజ్యాంగ సంస్థల విభజన పూర్తయినా హైకోర్టు విభజన మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణతోపాటు ఆంధ్రా ప్రజలు, న్యాయవాదులు కూడా ప్రత్యేక హైకోర్టు కావాలని కోరుకుంటున్నారు. హైకోర్టును విభజిస్తామన్న హామీ నెరవేరేలా జోక్యం చేసుకోండి'' అని కేసీఆర్ కోరారు.

Image copyright Getty Images

ప్రపంచ సంపదలో సగభాగం కుబేరుల వద్దే

ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంపద వేగంగా వృద్ధి చెందుతోందని ఈనాడు ఒక కథనంలో రాసింది. గత ఏడాది అంతర్జాతీయంగా వ్యక్తిగత సంపద 201.9 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని, 2016తో పోలిస్తే ఇది 12 శాతం అధికమని చెప్పింది.

గత ఐదేళ్లలోనే ఇది వేగవంతమైన వృద్ధి కావడం విశేషం. ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా రాణించడం ఇందుకు ప్రధాన కారణమని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది. డాలర్‌తో పోలిస్తే ఇతర ప్రధాన కరెన్సీలు బలపడటమూ వ్యక్తిగత సంపద పెరగడానికి తోడ్పడిందని తెలిపింది.

ప్రపంచ సంపదలో దాదాపు సగం సంపన్నుల చేతిలోనే ఉంది. 2012లో ఇది 45 శాతం కంటే తక్కువగానే ఉంది. ప్రపంచ సంపదలో సంపన్నుల వాటా పెరుగుతోందని, అంత మాత్రాన పేదలు మరింత పేదవాళ్లు అవుతున్నారని కాదని నివేదిక పేర్కొంది.

మొత్తం సంపదలో 86.1 లక్షల కోట్ల డాలర్లు ఉత్తర అమెరికాలోనే ఉన్నాయి.

ఆసియాలో 57 శాతం వాటా చైనీయుల చేతిలోనే

ఆసియాలో వ్యక్తిగత సంపద వృద్ధి అధికంగా ఉంది. గత ఏడాది ఈ ఖండంలో సంపన్నుల సంపద 19 శాతం అధికమై 36.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో 57 శాతం వాటా చైనీయుల చేతిలోనే ఉంది.

గత సంవత్సరం చైనాలో సంపద సృష్టి అధికంగా జరిగింది. అంతర్జాతీయంగా అత్యధిక వ్యక్తిగత సంపదలో చైనా రెండో స్థానంలో నిలిచింది. సంపన్నుల సంఖ్యలో చైనా కంటే ముందు స్థానంలో అమెరికా ఉంది.

రాయుడు Image copyright Twitter/Ambati Rayudu

ఫిటెనెస్ పరీక్షలో విఫలమైన అంబటి రాయుడు

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల ముంగిట మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు యో యో ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమయ్యాడని, అతడు భారత జట్టులో స్థానం కోల్పోయే అవకాశం ఉందని ఈనాడు తెలిపింది.

శుక్రవారం జరిగిన ఈ పరీక్షలో కనీస అర్హత మార్కును రాయుడు చేరుకోలేకపోయాడు.

ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అంబటి 600పైన పరుగులు సాధించాడు.

నిరుడు సురేశ్ రైనా ఈ ఫిటినెస్‌ పరీక్షలో విఫలమై జట్టులో చోటు కోల్పోయాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)