డిజిటల్ ఇండియాపై మోదీ మాటల్లో వ్యత్యాసం

  • 17 జూన్ 2018
ప్రధాని డిజిటల్ ఇండియా వాస్తవాలు Image copyright PIB

2014 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రకటించారు. వీటిలో ఒక పథకమే డిజిటల్ ఇండియా.

డిజిటల్ ఇండియా ప్రచారంలో లబ్ధిదారులుగా చెబుతున్న వారితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మాట్లాడారు. డిజిటల్ ఇండియా ద్వారా దేశంలో మార్పు వస్తోందని వారికి చెప్పాలనుకున్నారు.

నమో యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. డిజిటల్ ఇండియా ప్రారంభించినప్పటి నుంచి దేశంలో సామాన్యులు, యవత, గ్రామీణులను డిజిటల్ వైపు మళ్లించాలన్నదే తన సంకల్పం అని చెప్పారు.

ఈ పథకం ద్వారా ఎంతోమంది గ్రామస్థులను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చామని ఎంతోమంది సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్) నిర్వాహకులు ప్రధాన మంత్రికి తెలిపారు.

Image copyright DIGITALINDIA.GOV.IN

డిజిటల్ ఇండియా ప్రజల అలవాట్లను మార్చేసిందని ప్రధాని మోదీ వారికి చెప్పారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని అన్నారు.

డిజిటల్ ఇండియా పథకం ద్వారా దేశం నిజంగానే మారుతోందా? దీని వల్ల గ్రామీణుల జీవితాల్లో మార్పు వచ్చిందా?

"ఎవరికి కనిపించినా, కనిపించకపోయినా దేశం మారుతోంది అని ప్రధాన మంత్రి చెప్పడం ఒక పెద్ద క్వశ్చన్ మార్కులా అనిపిస్తోంది" అని డిజిటల్ విషయాల్లో నిపుణులు, డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన ఒసామా మంజర్ అన్నారు.

Image copyright Thinkstock

డిజిటల్ ఇండియాతో ఉద్యోగాలు లభించాయా?

డిజిటల్ ఇండియా వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఒసామా మంజర్ మాత్రం ఇందులో ఏమాత్రం నిజం లేదంటారు.

"డిజిటల్ ఇండియా పథకం ద్వారా ప్రజలను క్యాష్ లెస్ చేసే ప్రయత్నంతో చాలా గందరగోళం ఏర్పడింది. గ్రామాల్లో ఇంటర్నెట్ పనిచేయదు. గత రెండు మూడేళ్లుగా ఎయిర్ టెల్ లాంటి కంపెనీలు కూడా సమస్యల్లో పడ్డాయి. ప్రభుత్వ బీఎస్ఎన్ఎల్ సంస్థ నెట్‌వర్క్ ప్రతి చోటా ఉంది. కానీ చాలా బలహీనంగా ఉంది. దానిపై లోడ్ చాలా పెరిగిపోయింది. ప్రభుత్వం పథకాలను ప్రకటించేస్తుంది, కానీ అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు" అన్నారు.

డిజిటల్ ఇండియా ట్విటర్ వివరాలను బట్టి 2014లో మొబైల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు దేశంలో కేవలం రెండే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 120 వరకూ పెరిగింది. వీటి ద్వారా యువతకు ఉద్యోగాలు లభించాయి. వీటి ద్వారా దాదాపు నాలుగున్నర లక్షల మందికి ఉపాధి లభించింది.

"కొత్త తరం ఈ-కామర్స్ సంస్థలు వచ్చినపుడు, డెలివరీ బాయ్, లాజిస్టిక్స్ రూపంలో ఉపాధి లభిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వీటివల్ల ఎన్ని ఉద్యోగాలు పోయాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది" అని సైబర్ అంశాల్లో నిపుణులు, వకీల్ అయిన విరాగ్ గుప్తా అన్నారు.

"అసంఘటిత రంగంలో ఎంతమంది ఉపాధి కోల్పోయారో కూడా గణాంకాలు బయటపెట్టాలి. దాని వల్ల మొత్తం ఉపాధి అవకాశాలు పెరిగాయా, తగ్గాయా అనేది స్పష్టం అవుతుంది. ఓలా, ఉబెర్ రావడం వల్ల దిల్లీలో ఎంతమందికి ఉపాధి లభించింది? ఆ రంగంలో ముందు నుంచీ పనిచేస్తున్న అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోలేదా?" అని గుప్తా ప్రశ్నించారు.

Image copyright SCREEN SHOT

అసలు సమస్య ఎక్కడుంది?

"ఈ-కామర్స్‌కు ఇప్పటివరకూ హద్దులు ఏర్పరచలేదు. ఇంటర్‌నెట్ కంపెనీలు డేటాను దుర్వినియోగం చేస్తున్నాయి. కానీ మనం ఇప్పటివరకూ డేటా ప్రొటెక్షన్ గురించి చట్టం చేయలేకపోయాం. అన్ని కంపెనీలు భారత దేశం బయట నుంచే ఆపరేట్ చేస్తున్నాయి. కానీ గ్రీవన్స్ ఆఫీసర్ నియామకం జరగలేదు. ఈ కంపెనీలు టాక్స్ చెల్లించడం లేదు, కానీ మనం జాగ్రత్త పడడం లేదు" అని విరాగ్ అన్నారు.

"కొత్త ఎకానమీ వృద్ధి చెందుతున్నప్పుడు, దానికి తగిన చట్టాలను కూడా చేయడం ప్రభుత్వం బాధ్యత. దీనికి నియమిత వ్యవస్థను ఏర్పాటు చేసి, దాని జవాబుదారీని నిర్ణయించడం కూడా సర్కారు బాధ్యతే. అంటే, వాట్సప్‌ను ఒకవేళ బ్యాంకింగ్ వ్యవస్థకు జోడించాల్సి వస్తే, దాని యజమాని ఎవరు, భారత్‌లో దాని ఆఫీస్ ఎక్కడుంది. దానికి జవాబుదారీ ఎవరు, అన్నీ చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత. డిజిటల్ పేరు మీద కంపెనీలు కల్లోలం సృష్టిస్తున్నాయి. కంపెనీలు డిజిటల్ మాఫియాకు తెరతీయడం చాలా చింతించాల్సిన విషయం" అని విరాగ్ చెప్పారు.

"భారత్‌లో వీధిలో ఒక చిన్న బండి పెట్టుకోవాలన్నా దానికి మీకు ఎంసీడీ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గూగుల్, ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి వాటికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు" అనే ప్రశ్నను లేవనెత్తారు విరాగ్.

Image copyright ..

డిజిటల్ ఇండియాలో మహిళలు ఎక్కడ?

డిజిటల్ ఇండియా వల్ల అందరికంటే ఎక్కువగా గ్రామీణ మహిళలకు ప్రయోజనం లభిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. డిజిటల్ ఇండియా కోసం ప్రారంభించిన వై-ఫై పథకంతో గ్రామీణ యువతులు ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియా వల్ల ఎక్కువ ప్రయోజనం గ్రామీణ మహిళలకే లభిస్తోందా?

"జనం సొంతంగా స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే చాలు, అన్నీ చక్కదిద్దేస్తామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం మంది మహిళల దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఇక మొత్తం దేశం విషయానికి వస్తే, 72 శాతం మహిళల దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ట్రాయ్ గణాంకాలు మాత్రం కోట్ల కనెక్షన్లు ఉన్నాయని చెబుతుంటాయి. ఆ లెక్కలు సిమ్ కనెక్షన్ గురించే చెబుతాయి. వాటికి ఇంటర్నెట్ ఉందా, లేదా అనేది చెప్పవు" అని ఒసామా మంజర్ చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపెద్దనోట్ల రద్దు తర్వాత ఇబ్రహీంపూర్‌లాంటి కొన్ని గ్రామాలు డిజిటల్ బాట పట్టాయి.

డిజిటల్ ఇండియా వల్ల ప్రయోజనం ఏంటి?

"డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పథకాలు చాలా బాగున్నాయి. వాటిలో ఒకటి డిజిటల్ లిటరసీ, మరొకటి భారత్ నెట్" అని ఒసామా మంజర్ అన్నారు.

"6 కోట్ల మందికి డిజిటల్ శిక్షణ అందించేందుకు బడ్జెట్ కూడా పాస్ చేశారు. ఇందులో కూడా లోపం ఉంది. అంకెలు పూర్తి చేయాలనే ఉత్సాహానికి బదులు, అసలు డిజిటల్ శిక్షణ ఎవరికి అందించాలి అనేది నిర్ణయించుకోవాలి. 6 కోట్ల మందిలో శిక్షకులను, పంచాయతీల్లో ఎన్నికైన సభ్యులను, ఆశా వర్కర్లు ఇలా అందరినీ కలపాల్సి ఉంటుంది. వీరందరికీ డిజిటల్ శిక్షణ ఇప్పిస్తే, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది" అని ఆయన చెప్పారు.

"లక్షన్నర గ్రామాలకు ఇంటర్నెట్ అందించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ మేం సుమారు 270 పంచాయతీల్లో సర్వే చేశాం. అక్కడ కేవలం 18 నుంచి 20 శాతం కనెక్షన్లు మాత్రమే పనిచేస్తున్నాయని, లేదా పనిచేసే స్థితిలో ఉన్నాయని తెలిసింది. ఎన్ని పథకాలు ప్రకటిస్తూ వస్తున్నారో కానీ అవి క్షేత్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయా, లేదా.. అనేది చాలా ముఖ్యం" అని ఒసామా అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవృద్ధులు, రోగులకు ఆసరా... డిజిటల్ పెట్

అసలు డిజిటల్ ఇండియా అంటే?

ఏ ప్రాంతంలో ఉన్నా ప్రజలు అందరికీ ఇంటర్నెట్ ద్వారా అన్ని సేవలను అందించాలి అనేదే డిజిటల్ ఇండియా కార్యక్రమం ఉద్దేశం. ఇందులో ఈ-డిస్ట్రిక్ట్ తయారు చేయడం, ఈ-గవర్నెన్స్ ద్వారా అన్ని సేవలను ఆన్‌లైన్ చేయడం లాంటివి ఉంటాయి. కానీ దృఢమైన పునాదులు లేకుండా నిర్మాణం ఎలా సాధ్యం?

ఇక్కడ బలమైన నిర్మాణం అంటే ఇంటర్నెట్ కనెక్షన్. డిజిటల్ ఇండియా ద్వారా ఏదైనా సేవతో ఫలితం పొందాలంటే మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ చాలా ముఖ్యం.

"భారత్ నెట్, కనెక్టివిటీ లేదా బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ అనేది డిజిటల్ ఇండియాకు వెన్నెముకలాంటిది. ప్రపంచమంతా 2 ఎంబీపీఎస్ ఉన్నందుకే జనం నవ్వుకుంటుంటే, మన అధికారిక బ్రాడ్‌బాండ్ ఇప్పటికీ 256 కేబీపీఎస్ మాత్రమే. మనం క్యాష్‌లెస్ ప్రపంచాన్ని సృష్టించాలంటే, ఏటీఎం, పేటీఎం లేదా ఆన్‌లైన్లో సెక్యూర్డ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే, అది మన బాండ్‌విడ్త్ ఎంత హై అనేదానిపై ఆధారపడుతుంది. 2జీ ద్వారా ఎవరైనా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయగలరా చెప్పండి?" అంటారు ఒసామా మంజర్.

Image copyright Getty Images

సాంకేతికత వినియోగంతో చిక్కులు

డిజిటల్ అనేది ఒక ప్రక్రియ అంటారు విరాగ్ గుప్తా. "సాంకేతికాభివృద్ధిలో ఎన్నో కోణాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత అది ప్రారంభమైంది. సాంకేతికతలోని ఒక అంశం వల్ల దేశాభివృద్ధి జరగవచ్చు. కానీ అభివృద్ధిలోని మరో అంశాన్ని అవహేళన చేస్తే, దేశంలో చాలా సమస్యలు కూడా తలెత్తుతాయి. సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా కూడా వినియోగిస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం వల్ల చాలా సమస్యలు పుట్టుకొస్తున్నాయి" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)