ప్రెస్‌రివ్యూ: 'వంచించడం సరికాదు'

  • 18 జూన్ 2018
Image copyright MODI/TWITTER

పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో చంద్రబాబు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. రాష్ట్రానికి న్యాయం చేయడంలేదంటూ ప్రధాని ముందు సూటిగా చెప్పారు.

గాయపడ్డ ఐదుకోట్ల మంది మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నవ్యాంధ్రకు హోదా కల్పించండి. విభజన చట్టంలోని ఇతర హామీలనూ నెరవేర్చాలి. ఇంకా మోసం చేయడం, వంచించడం సరికాదు అన్నారు.

జాతి నిర్మాణ ప్రక్రియలో ఆంధ్ర ప్రదేశ్‌ టీమ్‌ ఇండియా స్ఫూర్తితో సగర్వంగా పాల్గొంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు తగిన వాతావరణం కల్పించాలి.

సహకార సమాఖ్య సూత్రాలకు అనుగుణంగా మొత్తం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్ట్రాల ప్రత్యేక అవసరాలపై దృష్టి సారించాలి అని తెలిపారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright G ramu ramu/facebook

'రైతు బంధు' పథకం డబ్బులతో అన్నదాతలు ఫ్రిడ్జ్‌లు, కుక్కర్లు కొంటున్నారా?

వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో రైతుకు ప్రభుత్వం నేరుగా డబ్బులు అందజేస్తుంది. అయితే, ఇలా వచ్చిన నగదుతో కొందరు రైతులు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తున్నారని 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఒక కథనం ప్రచురించింది.

ఫ్రిడ్జ్‌లు, మిక్సీలు, కుక్కర్లు, కూలర్లు తదితర ఎలక్ట్రానిక వస్తువుల అమ్మకాలు ఇటీవల జోరందుకున్నాయి. వేలాది వ్యవసాయ కుటుంబాలు ఇప్పటి వరకు ఇలాంటి వస్తువులను కొనలేదు. కానీ, ఇప్పుడు వాటిని కొనగోలు చేసే స్థితికి వారు చేరుకున్నారు. ఇదంతా రైతు బంధు పథకం పుణ్యమే.

రైతులు ఇలా కొనుగోలు చేస్తుండటంతో స్థానికంగా వ్యాపారం పెరుగుతోంది. కొత్తగా ఉద్యోగాలు వస్తున్నాయి. కొందరు వ్యాపారులు తమ వస్తువులను గ్రామాల్లోని రైతులకు అమ్మేందుకు ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు.

నెలవారి వాయిదా పద్ధతుల్లో కూడా అమ్ముతున్నారు. రైతు బంధు పథకం తర్వాత తమ వ్యాపారం పెరిగిందని ఖమ్మంకు చెందిన వ్యాపారి రామారావు తెలిపారు అని 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.

Image copyright Ministry of railways/facebook

పాతిక లక్షల మందికి నిరీక్షణ శిక్ష!

వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు ఖరారు కాని ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నెన్నో. 2017-18లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ తరగతి బోగీల్లో 23.86 లక్షలమందికి రిజర్వేషన్‌ ఖరారు కాక టికెట్లు రద్దయ్యాయిని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

ఆఖరి నిమిషంలో ప్రత్యామ్నాయ రవాణా చూసుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ధైర్యం చేసి రైలు ఎక్కినా బెర్తులు దొరక్క, జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. గోదావరి, గరీబ్‌రథ్‌, గౌతమి, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఫలక్‌నుమా, శబరి, పట్నా వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ రద్దీ రోజుల్లో 400 దాటిపోతుంది.

ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే చెబుతున్నా అవీ చాలట్లేదు. పైగా అవి ఏ రోజుల్లో ఉంటాయో కచ్చితత్వం ఉండదు.. గంటల తరబడి ఆలస్యం. దీంతో ఉన్న రైళ్లలోనే, నిరీక్షణ జాబితా వందల్లో ఉంటున్నా టికెట్లు తీసుకుంటున్నారు.

ఒక రైల్లో రిజర్వేషన్‌ ఖరారు కాకపోతే ఆ తర్వాత రైల్లో రిజర్వేషన్‌ కల్పించేందుకు 'వికల్ప్‌' వెసులుబాటును కల్పించినా దాదాపు అన్ని రైళ్లు కిటకిటలాడుతుండటంతో ఉపయోగం నామమాత్రమేనని ఈనాడు తెలిపింది.

బాసర ట్రిపుల్ ఐటీ Image copyright Rgu iiit basara

పేద విద్యార్థులపై ఫీజు పిడుగు

బాసర ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన నిరుపేద విద్యార్థులకు ఫీజుల కష్టం వచ్చిపడింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు ఒక్కసారిగా ఫీజులు పెంచటం వారికి శాపంగా మారిందని 'సాక్షి' తెలిపింది.

గతేడాదితో పోలిస్తే రూ.5 వేల ఫీజు పెంచుతూ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) నిర్ణయం తీసుకుంది. దీంతో ఫీజులు చెల్లించలేక అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌కు సైతం హాజరుకాలేని దీన స్థితిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు దిక్కులు చూస్తున్నారు.

పదో తరగతి మెరిట్‌ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ కోర్సుకు ఆర్‌జీయూకేటీ ఎంపిక చేసింది. సెలెక్టయిన విద్యార్థులకు కాల్‌ లెటర్లు పంపింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే రూ.5,000 ఫీజును అదనంగా వడ్డిస్తున్నట్లు ఫీజుల వివరాలను అందులో పొందుపరిచింది.

యూనివర్సిటీ నిర్వాకాన్ని చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు పెంపు కారణాన్ని యూనివర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేసింది.

కోర్సుకు నిర్దేశించిన ఫీజును రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేయడం లేదని, అందులో కోత పెడుతోందని పేర్కొంది. దీంతో అంత మేరకు విద్యార్థులే భరించాలంటూ షరతు విధించిందని సాక్షి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)