'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'

  • 18 జూన్ 2018
రాణి లక్ష్మిబాయిని దొంగ దెబ్బ తీశారు Image copyright PIB.NIC.IN

ఆంగ్లేయుల్లో కెప్టెన్ రోడ్రిక్ బ్రిగ్స్ రాణీ లక్ష్మీబాయి యుద్ధరంగంలో పోరాడటం చూసిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

ఆమె గుర్రం కళ్లాన్ని పళ్ల మధ్య అదిమి పట్టింది. తన రెండు చేతులతో కత్తులు తిప్పుతోంది. ఒకేసారి రెండువైపులా ఉన్నవారితో యుద్ధం చేస్తోంది.

ఆయనకు ముందు మరో ఆంగ్లేయుడైన జాన్ లాంగ్‌కు కూడా, రాణీ లక్ష్మీబాయిని దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. కానీ అది యుద్ధరంగంలో కాదు, ఆమె హవేలీలోనే.

దామోదర్‌ను దత్తత తీసుకోవడం చెల్లదని ఆంగ్లేయులు చెప్పినపుడు, రాణీ లక్ష్మీబాయి ఝాన్సీలోని తన భవనాన్ని వీడాల్సి వచ్చింది. మూడు అంతస్తులున్న ఒక సాధారణ హవేలీ 'రాణీ మహల్'లో ఆమె ఆశ్రయం పొందింది.

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కేసు గెలిచిన వకీల్ జాన్ లాంగ్ నుంచి రాణి సేవలు పొందారు.

Image copyright RISCHITZ/GETTY IMAGES
చిత్రం శీర్షిక గవర్నర్ జనరల్ లార్డ్ ఫెనింగ్

'రాణీ మహల్‌'లో లక్ష్మీబాయి

లాంగ్ ఆస్ట్రేలియాలో పుట్టారు. ఆయన మీరట్‌లో 'మొఫుస్సిలైట్' అనే వార్తాపత్రికను నడిపేవారు. జాన్ లాంగ్ హిందీ, పర్షియన్ భాషలు చాలా బాగా మాట్లాడేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంటే ఆయనకు నచ్చేది కాదు. ఎందుకంటే వారు ఎప్పుడూ ఆయన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తుండేవాళ్లు.

లాంగ్ మొదటిసారి ఝాన్సీ వచ్చినపుడు రాణీ ఆయన కోసం ఒక గుర్రపు బగ్గీని ఆగ్రాకు పంపారు. ఆయన్ను ఝాన్సీకి తీసుకురావడానికి రాణీ తన దివానును, మరో అనుచరుడిని ఆగ్రాకు పంపించారు.

అనుచరుడి చేతిలో ఐసుగడ్డలతో నిండిన ఒక బకెట్ ఉండేది. అందులో నీళ్లు, మద్యం, ప్రత్యేకంగా తయారు చేసిన ద్రాక్షరసం సీసాలు ఉండేవి. విసనకర్రతో ఒక నౌకరు, దారి పొడవునా లాంగ్‌కు విసురుతూ ఉండేవారు.

ఝాన్సీ చేరగానే గుర్రాలపై ఉన్న 50 మంది లాంగ్‌ను పల్లకీలో రాణీ మహలుకు తీసుకువచ్చారు. అక్కడ ఉన్న ఒక తోటలో రాణి ఒక షామియానా వేయించారు.

Image copyright JHANSI.NIC.IN

పలచటి నూలు చీరలో రాణి

రాణీ లక్ష్మీబాయి షామియానాలో ఒక మూల తెర వెనుక కూర్చుని ఉన్నారు. అప్పుడే హఠాత్తుగా రాణి దత్త పుత్రుడు దామోదర్ ఆ తెరను తొలగించాడు. లాంగ్ కళ్లు రాణిని గమనించాయి.

ఆ సమయంలో లాంగ్ అనుభవం గురించి రెనర్ జెరోస్చ్ అనే రచయిత తన 'ద రాణీ ఆఫ్ ఝాన్సీ, రెబెల్ అగైనెస్ట్ విల్' అనే పుస్తకంలో రాశారు.

"రాణీ ఎత్తు మధ్యస్థంగా ఉండేది. యవ్వనంలో ఆమె చాలా అందంగా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఆమె ముఖంలో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. నాకు ఒక విషయం చాలా బాగా అనిపించింది. ఆమె ముఖం చాలా గుండ్రంగా ఉంది. ఆ.. ఆమె కళ్లు చాలా అందంగా ఉన్నాయి. ముక్కు కూడా చాలా నాజూగ్గా ఉంది. ఆమె అంత తెల్లగా ఏం లేదు. బంగారు చెవిపోగులు తప్ప ఆమె వేరే ఆభరణాలేవీ వేసుకోలేదు. పలచటి నూలు చీర కట్టుకుని ఉన్నారు. అందులోంచి ఆమె శరీరం స్పష్టంగా కనిపిస్తోంది. రాణి వ్యక్తిత్వానికి కాస్త నప్పనిది ఏదైనా ఉంది అంటే, అది ఆమె బొంగురు గొంతు ఒక్కటే" అని లాంగ్ భావించినట్టు చెప్పారు.

Image copyright HULTON ARCHIVES/GETTY IMAGES
చిత్రం శీర్షిక నానా సాహెబ్

రాణి చుట్టూ గుర్రాలపై సైనికులు

కెప్టెన్ రోడ్రిక్ బ్రిగ్స్ తనే స్వయంగా ముందుకు వెళ్లి రాణిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తను అలా చేయాలని అనుకున్న ప్రతిసారీ, రాణి చుట్టూ గుర్రాలపై ఉన్నవారు అతడిని అడ్డుకునేవారు. వారి దృష్టి మళ్లించాలని అతడు చాలా ప్రయత్నించాడు.

కొంతమందిని గాయపరిచి, చంపిన తర్వాత రోడ్రిక్ తన గుర్రాన్ని ముందుకు దూకించాడు. రాణి వైపు దూసుకెళ్లాడు.

అదే సమయంలో హఠాత్తుగా రోడ్రిక్ వెనుక నుంచి, జనరల్ రోజ్ సారథ్యంలోని అత్యంత నిపుణులైన ఒంటెల దళం ఎంట్రీ ఇచ్చింది. ఈ దళాన్ని రోజ్ రిజర్వ్‌లో ఉంచాడు.

ఎదురు దాడి కోసం దీనిని ఉపయోగించుకోవాలని వారు ఎత్తు వేశారు. ఒంటెల దళం హఠాత్తుగా యుద్ధరంగంలోకి అడుగుపెట్టడంతో బ్రిటిష్ సైన్యం ప్రాణం లేచొచ్చింది.

దాంతో రాణి కాస్త కంగారు పడింది. ఆమె సైనికులు యుద్ధరంగాన్ని వదిలి పారిపోలేదు, కానీ మెల్లమెల్లగా వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది.

Image copyright HULTON ARCHIVES/GETTY IMAGES

వెంటాడిన బ్రిటిష్ సైనికులు

ఆ యుద్ధంలో పాల్గొన్న జాన్ హెన్రీ సిల్వెస్టర్ తన 'రీకలెక్షన్స్ ఆఫ్ ద కాంపైన్ ఇన్ మాల్వా అండ్ సెంట్రల్ ఇండియా' అనే పుస్తకంలో దీని గురించి వర్ణించారు.

"హఠాత్తుగా రాణి 'నా వెనక రండి' అని గట్టిగా అరిచారు. గుర్రాలపై ఉన్న 15 మంది సైనికుల బృందం ఆమె వెనుక వెళ్లింది.

ఆమె యుద్ధ రంగం నుంచి ఎంత వేగంగా వెళ్లిపోయిందంటే, అది తెలుసుకోవడానికి ఆంగ్లేయుల సైన్యానికి కొన్ని క్షణాలు పట్టింది. హఠాత్తుగా రోడ్రిక్ గట్టిగా అరిచాడు. 'ట్రేస్ ద రాణి ఆఫ్ ఝాన్సీ, క్యాచ్ హర్' అని అనుచరులకు చెప్పాడు.

రాణి, ఆమె సైనికులు ఒక మైలు దూరం వెళ్లుంటారు. అప్పుడే కెప్టెన్ బ్రిగ్స్ సైనికులు గుర్రాలపై సరిగ్గా వారి వెనకే చేరుకున్నారు. ఆ ప్రాంతమే సరాయ్ కోట.

యుద్ధం మళ్లీ మొదలైంది. రాణి వైపు ఉన్న ఒక్కో సైనికుడితో ఇద్దరేసి బ్రిటిష్ సైనికులు పోరాడుతున్నారు. హఠాత్తుగా రాణికి తన ఎడమవైపు ఛాతీలో కాస్త నొప్పిగా అనిపించింది. అంటే ఒక పాము కాటు వేసినట్టు ఉంది.

వెనుక చాటుగా వచ్చిన ఒక ఆంగ్లేయ సైనికుడు ఆమె వీపులో చురకత్తిని దించాడు. వేగంగా వెనక్కు తిరిగిన రాణి తనపై దాడి చేసిన సైనికుడిపై కత్తితో విరుచుకుపడింది".

Image copyright HULTON ARCHIVES/GETTY IMAGES

రైఫిల్ గుండు తగిలింది

"రాణికి తగిలిన గాయం అంత లోతైనదేం కాదు. కానీ దాని నుంచి చాలా రక్తం పోతోంది. గుర్రంపై వేగంగా వెళ్తున్న ఆమెకు హఠాత్తుగా ఒక చిన్న జలపాతం ఎదురైంది. గుర్రంతో ఒక్కసారిగా లంఘిస్తే, ఆ జలపాతం దాటేయవచ్చు, తర్వాత తనను ఎవరూ పట్టుకోలేరని ఆమె అనుకుంది.

ఆమె గుర్రాన్ని ముందుకు దూకించినపుడు, అది దూకడానికి బదులు హఠాత్తుగా ఆగిపోయింది. దాంతో రాణి దాదాపు దాని మెడ పట్టుకుని వేలాడింది.

ఆమె మళ్లీ గుర్రంపైకి ఎక్కింది. కానీ అది ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనని మొరాయిస్తోంది. అప్పుడే ఆమెకు తన నడుములో ఎడమ వైపు చాలా వేగంగా ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది.

ఆమెకు రైఫిల్ గుండు తగిలింది. రాణి ఎడమ చేతిలోని కత్తి జారి నేలపై పడిపోయింది. ఆ చేత్తో ఆమె తన నడుము నుంచి కారిపోతున్న రక్తాన్ని అదిమిపట్టాలని ప్రయత్నించింది".

Image copyright HULTON ARCHIVES/GETTY IMAGES

రాణిపై ప్రాణం తీసిన దాడి

ఆంటోనియో ఫ్రేజర్ తన 'ద వారియర్ క్వీన్' పుస్తకంలో దాని గురించి రాశారు.

"అప్పటికే ఆంగ్లేయులు రాణి గుర్రం పక్కకు వచ్చేశారు. వాళ్లు రాణిపై దాడి చేసేందుకు తమ కత్తుల్ని పైకెత్తారు. రాణి కూడా వారిని అడ్డుకునేందుకు కుడి చేతిలో ఉన్న కత్తిని అడ్డుగా పెట్టారు.

కానీ, ఆంగ్లేయుల కత్తులు ఎంత వేగంగా కిందికి దిగాయంటే, ఆమె నుదురు ముక్కలైంది. అందులోంచి కారిన నెత్తుటి ధారలతో ఆమెకు దాదాపు ఏదీ కనిపించకుండా పోయింది.

అప్పటికీ రాణి తన మొత్తం బలమంతా కూడగట్టుకుంది. ఆంగ్లేయ సైనికులకు తన కత్తితోనే జవాబిస్తోంది. కానీ ఆమె వాళ్ల భుజాలను మాత్రమే గాయపరచగలిగింది. చివరికి రాణి గుర్రం పైనుంచి కిందికి పడిపోయింది.

అప్పుడే ఆమె సైనికుల్లో ఒకడు గుర్రం మీద నుంచి దూకి ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. దగ్గరే ఉన్న ఒక మందిరంలోకి తీసుకెళ్లాడు. రాణి అప్పటికీ బతికే ఉంది.

మందిరంలో ఉన్న పూజారి ఒక సీసాలో ఉంచిన గంగాజలంతో తడారిపోయిన ఆమె పెదాలను తడిపాడు. రాణి పరిస్థితి విషమిస్తోంది. మెల్లమెల్లగా ఆమె స్పృహతప్పిపోతోంది.

అక్కడ మందిరం ప్రహరీ బయట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.. చివరి సైనికుడిని చంపిన తర్వాత ఆంగ్లేయ సైనికులకు తమ పని పూర్తైందని అనిపించింది."

Image copyright JHANSI.NIC.IN
చిత్రం శీర్షిక ఝాన్సీలోని కోట

దామోదర్ కోసం తపన...

అప్పుడే రోడ్రిక్ గట్టిగా "వాళ్లు మందిరం లోపలకు వెళ్లారు. వారిపై దాడి చేయండి. రాణి ఇంకా బతికే ఉంది" అన్నాడు.

అక్కడ పూజారులు రాణి కోసం చివరి ప్రార్థన చేస్తున్నారు. ఆంగ్లేయ సైనికుడి కత్తి తగిలి, రాణి ఒక కన్ను మూసుకుపోయింది.

ఆమె చాలా కష్టంగా తన రెండో కంటిని తెరిచింది. అంతా మసగ్గా కనిపిస్తోంది. ఆమె నోటి నుంచి ఆగి ఆగి మాటలు వస్తున్నాయి. "దామోదర్ బాధ్యతను నేను మీకు అప్పగిస్తున్నా.. అతడిని ఛావానీకు తీసుకెళ్లండి.... పరిగెత్తండి, తనను తీసుకెళ్లండి".

ఆమె చాలా కష్టంగా తన మెడలోనుంచి ముత్యాల హారాన్ని తీయడానికి ప్రయత్నించింది. కానీ అలా చేయలేకపోయింది. తర్వాత స్పృహతప్పింది.

మందిరంలో పూజారి ఆమె మెడలోంచి హారాన్ని తీసి ఆమె అంగరక్షకుల్లో ఒకరి చేతికి ఇచ్చారు. "దామోదర్ కోసం దీన్ని ఉంచండి" అన్నాడు.

Image copyright JHANSI KI RANI MOVIE

ఆంగ్లేయులకు దొరకని రాణి మృతదేహం

రాణి వేగంగా ఊపిరి తీసుకుంటోంది. ఆమె గాయాల నుంచి కారుతున్న రక్తంతో శరీరం అంతా ముద్దైపోయింది. ఉన్నట్టుండి ఆమె మళ్లీ నోరు తెరిచింది.

"అంగ్లేయులకు నా శరీరం దొరకకూడదు" అంది.

అంతే, అలా చెప్పగానే ఆమె తల ఒక వైపు వాలిపోయింది. ఆమె మరోసారి బలంగా ఊపిరి తీసుకుంది. తర్వాత శరీరంలో కదలిక ఆగిపోయింది.

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తన ప్రాణాలు త్యాగం చేసింది. అక్కడ ఉన్న రాణి అంగరక్షకులు చుట్టుపక్కల ఉన్న కొన్నికట్టెలు తీసుకొచ్చారు. వాటిపైన రాణి పార్థివ దేహాన్ని ఉంచి దహనం చేశారు.

వారికి నలువైపులా రైఫిల్ శబ్దాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మందిరం గోడల బయట అప్పటికే వందల మంది బ్రిటిష్ సైనికులు చేరుకున్నారు.

మందిరం లోపల నుంచి మూడు రైఫిళ్లు మాత్రమే ఆంగ్లేయులపై గుళ్ల వర్షం కురిపిస్తున్నాయి. మొదట ఒక రైఫిల్ నుంచి కాల్పులు ఆగిపోయాయి, కాసేపటికి రెండోది, ఆ తర్వాత మూడోది కూడా మూగబోయింది.

Image copyright PIB.NIC.IN

ఆరని చితి మంటలు

ఆంగ్లేయులు మందిరం లోపలకు చొచ్చుకు వచ్చేసరికే అక్కడి నుంచి ఏ శబ్దాలూ రావడం లేదు.. అంతా ప్రశాంతంగా ఉంది. అందరికంటే మొదట రోడ్రిక్ లోపలికి వచ్చాడు.

అక్కడ రాణి సైనికులు, పూజారుల శవాలు రక్తసిక్తమై పడి ఉన్నాయి. వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. అందరూ లోపల ఒక మృతదేహం కోసం వెతుకుతున్నారు.

అప్పుడే వాళ్ల కళ్లు ఒక చితిపైన పడ్డాయి. దాని మంటలు అప్పటికి ఆరిపోయేలా ఉన్నాయి. వాళ్లు ఆ మంటలను తమ బూట్లతో ఆర్పాలని ప్రయత్నించారు.

అప్పుడే వాళ్లకు ఒక మనిషి శరీరం కాలిన అవశేషాలు కనిపించాయి. రాణి ఎముకలు అప్పటికే దాదాపు బూడిదగా మారిపోయాయి.

Image copyright WIKIPEDIA
చిత్రం శీర్షిక రాణి లక్ష్మిబాయి

ఈ యుద్ధంలో పోరాడిన కెప్టెన్ క్లెమెంట్ వాకర్ హెనీజ్ తర్వాత రాణి అంతిమ క్షణాలను వర్ణించారు.

"మా శత్రుత్వం అంతమైపోయింది. కేవలం కొంతమంది సైనికులు, ఆయుధాలు మాత్రమే ఉన్న ఒక మహిళ తన సైనికులకు ఊపిరిలూదాలని ప్రయత్నించింది. సైగలు చేస్తూ, గట్టిగా అరుస్తూ ఓడిపోతున్న సైనికుల మనోబలాన్ని పెంచే ప్రయత్నం చేసింది. కానీ అవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. కొన్ని నిమిషాల్లోనే మేం ఆ మహిళపై కూడా పట్టు సాధించగలిగాం. మా సైనికుడి కత్తి వేగంగా ఆమె తలపై పడింది. అంతే.. అంతా ముగిసిపోయింది."

"ఆ మహిళ ఎవరో కాదని, ఆమె స్వయంగా ఝాన్సీ రాణి లక్ష్మిబాయి అని మాకు తర్వాత తెలిసింది."

Image copyright PIB.NIC.IN
చిత్రం శీర్షిక తాత్యా టోపే

తాత్యా టోపేను ఉరి తీశారు

రాణి కొడుకు దామోదర్‌ను యుద్ధ రంగం నుంచి సురక్షితంగా కాపాడారు. ఇరా ముఖోటీ 'హీరోయిన్స్' పుస్తకంలో దామోదర్ గురించి రాశారు.

"దామోదర్ రెండేళ్ల తర్వాత 1860లో ఆంగ్లేయుల ముందు లొంగిపోయాడు. తర్వాత అతడికి ఆంగ్లేయులు పెన్షన్ కూడా ఇచ్చారు. చివరికి 58 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. చనిపోయేటప్పటికే ఆయన పూర్తిగా బికారిగా మారారు. ఆయన వంశస్థులు ఇప్పటికీ ఇండోర్‌లో నివసిస్తున్నారు. వాళ్లు తమను తాము "ఝాన్సీవాళ్లు"గా చెప్పుకుంటారు" అని తెలిపారు.

రాణి మరణంతో తిరుగుబాటుదారుల్లో ధైర్యం ముక్కలైంది. గ్వాలియర్ కూడా ఆంగ్లేయుల వశమైంది.

నానా సాహెబ్ అక్కడ నుంచి కూడా తప్పించుకున్నాడు. కానీ తాత్యా టోపేకు ఆయన ఆప్తమిత్రుడు నవాడ్ రాజు నమ్మక ద్రోహం చేశాడు.

తాత్యా టోపే పట్టుబడ్డాడు. ఆయన్ను గ్వాలియర్ దగ్గరున్న శివపురి తీసుకెళ్లి ఒక చెట్టుకు ఉరి తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు