ప్రెస్‌రివ్యూ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కేకే?

  • 19 జూన్ 2018
Image copyright k.keshavarao/facebook

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కె.కేశవరావు ఎన్నికయ్యే విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పావులు కదుపుతున్నారంటూ 'సాక్షి' ఒక కథనాన్ని ప్రచురించింది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న కురియన్‌ స్థానంలో కేకేను ఎన్నుకునే అంశంపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ చర్చించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్‌గా బీజేపీయేతర పార్టీకి అవకాశం ఇస్తే టీఆర్‌ఎస్‌కు చాన్స్‌ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానితో కేసీఆర్‌ భేటీ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది.

రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు.సభాపతిగా ఆ పార్టీకి చెందిన వెంకయ్యనాయుడు పదవిలో ఉన్నారు. ఇక డిప్యూటీ చైర్మన్‌గా బీజేపీయేతర పార్టీకి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించామన్న సంకేతాలు పంపినట్టు అవుతుందని బీజేపీ భావిస్తోందని సాక్షి పేర్కొంది.

Image copyright CM DASHBOARD

సీఎం డ్యాష్ బోర్డుపై 'రోగం' రట్టు

ప్రజారోగ్యానికి సంబంధించి వ్యక్తిగతంగా పౌరులు చేసే ఔషధాల కొనుగోళ్ల వివరాలూ ఏపీ సీఎం డ్యాష్‌ బోర్డ్‌లో పెట్టడం వివాదాస్పదంగా మారిందని 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'అన్న సంజీవని' స్టోర్లలో జరిగే కొనుగోళ్ల వివరాలను డ్యాష్‌ బోర్డులో పెట్టేస్తున్నారు.

ఉదాహరణకు.. అనంతపురంలోని 'అన్న సంజీవని' షాపులో ఒక వ్యక్తి వయాగ్రా టాబ్లెట్లు కొన్నాడనుకుందాం! లేదా... వాంతులు, నీరసాన్ని నిరోధించే వేరే టాబ్లెట్లని కొన్నాడనుకుందాం.

డబ్బు చెల్లించిన వెంటనే ఆ వ్యక్తి పేరు, ఊరు, ఫోన్‌ నెంబరు, ఏ స్టోర్‌లో కొన్నాడు, రిఫర్‌ చేసిన డాక్టరు పేరు ఇవన్నీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి చేరిపోతాయి.

ప్రభుత్వ పనులను పారదర్శకంగా ప్రజల ముందుంచాల్సిందే. కానీ... రోగికి, వైద్యుడికి, పరిమితంగా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాల్సిన వ్యక్తుల ఆరోగ్య సంగతులు పబ్లిక్‌లో పెట్టకూడదనే విషయాన్ని అధికారులు విస్మరించారు.

'అన్న సంజీవని' కొనుగోళ్ల సంగతులనూ డ్యాష్‌బోర్డులో అప్‌డేట్‌ చేస్తూ వస్తున్నారు.

'అన్న సంజీవని' వివరాలను పబ్లిక్‌ డొమెయిన్‌లో పెడుతున్నారని కొడాలి శ్రీనివాస్‌ అనే డేటా సెక్యూరిటీ నిపుణుడు గుర్తించారు. ఇది ప్రమాదకరమని, గోప్యతను హరించడమేనని ఆయన అధికారులకు లేఖలు రాశారు. కానీ, స్పందన శూన్యం.

ఈ అంశంపై ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌లో కథనం వచ్చాకగానీ సమస్య తీవ్రత డ్యాష్‌బోర్డు నిర్వాహకులకు అర్థం కాలేదు. దీనిపై వెంటనే అప్రమత్తమై అన్ని జిల్లాల డేటాను డిలీట్‌ చేసినట్లు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

పట్టదారు పాస్ పుస్తకం Image copyright facebook/kcr

‘పాసుపుస్తకాల పంపిణీలో యంత్రాంగం ఫెయిల్‘

ఏడు లక్షల పట్టాదారు పాసుపుస్తకాలు రెవెన్యూ యంత్రాంగాన్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయంటూ 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) అనంతరం 57 లక్షల పాసు పుస్తకాలు ముద్రించి ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. చివరికి ఆధార్‌ అనుసంధానం, ఇతర సమస్యలతో 50 లక్షల పుస్తకాలు ముద్రించేందుకు నిర్ణయించగా ఇప్పటికి 43 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి.

నిర్దేశిత లక్ష్యంలో ఇంకా 7 లక్షల పుస్తకాలు రైతులకు చేరాల్సి ఉంది. వీటిలో దాదాపు 4 లక్షల వరకు సవరణలకు సంబంధించినవే ఉన్నాయి. మిగిలినవి ఆధార్‌ అనుసంధానం, ఫొటోల్లో మార్పులు, డిజిటల్‌ సంతకాలు చేయాల్సి ఉంది. గత నెలాఖరును ముఖ్యమంత్రి ప్రక్షాళనపై సమీక్ష నిర్వహించారు.

తప్పులు దొర్లినవి, పంపిణీ కానివి ఈనెల 20 లోపు పూర్తిచేసి రైతులకు అందించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. సమస్యల పరిష్కారం, పంపిణీని వేగవంతం చేసేందుకు జిల్లాకో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించారు. వారు జిల్లాల్లో పరిస్థితిని పరిశీలించి సూచనలు జారీచేసినా లక్ష్యంలో ఒక వంతు పుస్తకాలు కూడా రైతులను చేరుకోలేదు.

సమాచారాన్ని పరిశీలించి సవరణలు చేయాల్సి ఉండగా ఇచ్చిన గడువు సరిపోదంటూ మొదటి నుంచే ఉద్యోగులు చెబుతున్నారు. దీనికితోడు ధరణి వెబ్‌సైట్‌ నెమ్మదిగా ఉండటం, ఐచ్ఛికాలను సకాలంలో ఇవ్వకపోవడంతో ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుందని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు