అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అమెరికా 'స్పేస్ ఫోర్స్': ట్రంప్

  • 19 జూన్ 2018
ట్రంప్

అంతరిక్షంలో అమెరికా సైనిక బలగం ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్పేస్ ఫోర్స్ ఏర్పాటుతో దేశ భద్రత పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన చెప్పారు.

''అంతరిక్షంలో అమెరికా ఉనికి ఉంటే సరిపోదు. అక్కడ అమెరికా ఆధిపత్యం కూడా ఉండాలి'' అని ట్రంప్ సోమవారం అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో చెప్పారు.

అంతరిక్ష సైనిక బలగాన్ని అమెరికా సైన్యంలో ఆరో శాఖగా ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రక్రియను తక్షణం మొదలుపెట్టాలని రక్షణ శాఖను, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ను ఆయన ఆదేశించారు.

అమెరికా సైన్యంలో ప్రస్తుతం ఐదు శాఖలు పదాతిదళం, వైమానికదళం, నౌకా దళం, కోస్ట్ గార్డ్, మెరీన్ కోర్ ఉన్నాయి. ఆరో శాఖగా ఏర్పడే అంతరిక్ష సైనిక బలగానికి వైమానిక దళానికి సమానమైన హోదా ఉంటుంది.

Image copyright NASA

'చైనా, రష్యా నాయకత్వం ఆమోదనీయం కాదు'

అంతరిక్షంలో చైనానో, రష్యానో నాయకత్వం వహించడం తమకు ఆమోదనీయం కాదని ట్రంప్ తెలిపారు. అంతరిక్ష ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత అధునాతన ఆలోచనలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఫెడరల్ సంస్థలను ఆదేశిస్తానని చెప్పారు.

స్పేస్ ఫోర్స్‌ విధివిధానాలు, ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అమెరికా సైన్యంలో కొత్త శాఖను ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు కాంగ్రెస్ ఒక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపిస్తామని ట్రంప్ చెప్పారు. అంగారక గ్రహం మీదకు కూడా వ్యోమగాములను పంపుతామన్నారు.

''ఇకపై మా అంతరిక్ష కార్యక్రమంలో- జెండా పాతడం, కాలిముద్రలు వదిలి వెనక్కు రావడం వరకే పరిమితంకాబోం. అక్కడ దీర్ఘకాలం పాటు కార్యకలాపాలు సాగిస్తాం. మా ఆర్థిక వ్యవస్థను విస్తరించుకుంటాం. అంగారక యాత్రకు పునాది వేసుకుంటాం'' అని ట్రంప్ జాతీయ అంతరిక్ష మండలితో సమావేశానికి ముందు వ్యాఖ్యానించారు.

Image copyright Universal History Archive/UIG via Getty Images
చిత్రం శీర్షిక అంగారక యాత్రలో ప్రభుత్వం కన్నా దేశంలోని ప్రైవేటు వ్యక్తులు ముందు నిలిస్తే సంతోషమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా సంపన్నులకు పిలుపు

అంతరిక్ష పరిశ్రమ వాణిజ్యపరంగా వృద్ధి చెందుతోందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తన యంత్రాంగానికి ట్రంప్ నిర్దేశించారు.

సంపన్నులకు ఎందుకోగాని రాకెట్లపై ఆసక్తి ఎక్కువని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అంతరిక్ష అన్వేషణలో పాల్గొనాలంటూ అమెరికా సంపన్నులకు పిలుపునిచ్చారు. రాకెట్ ప్రయోగ కార్యక్రమాలపై తాము రుసుములు కూడా ఎక్కువగా వసూలు చేయబోమని హామీ ఇచ్చారు.

అంగారక యాత్రలో ప్రభుత్వం కన్నా దేశంలోని ప్రైవేటు వ్యక్తులు ముందు నిలిస్తే సంతోషమేనని, అదే జరిగితే ఎంతో ఖ్యాతి కూడా వారి సొంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సైన్యంలో ఆరో విభాగంగా అంతరిక్ష సైనిక బలగం ఏర్పాటు గురించి ట్రంప్ గతంలోనూ మాట్లాడారు.

2000లోనే ప్రతిపాదించిన రమ్స్‌ఫెల్డ్

అంతరిక్ష యాత్రలు, అంతరిక్ష సైనిక దళం గురించి మాట్లాడేటప్పుడు ట్రంప్‌ ఉత్సాహంగా కనిపించారని బీబీసీ వైట్‌హౌస్ రిపోర్టర్ టారా మెక్‌కెల్వీ చెప్పారు. ఆయన అంతరిక్ష సైనిక బలగం ఏర్పాటు గురించి చెబుతున్నప్పుడు అక్కడున్న చాలా మంది ఆశ్చర్యపోయారని తెలిపారు. సైనిక దళం ఏర్పాటు కార్యక్రమానికి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్(జేసీఎస్) ఛైర్మన్ జోసెఫ్ డన్‌ఫర్డ్ సారథ్యం వహిస్తారు.

స్పేస్ ఫోర్స్ ఆలోచన కొత్తదేమీ కాదు. సైన్యంలో ఆరో విభాగంగా దీని ఏర్పాటు గురించి గతంలోనూ ట్రంప్ మాట్లాడారు. అంతరిక్ష సైనిక బలగం ఏర్పాటుపై రక్షణశాఖ మాజీ మంత్రి డొనాల్డ్ రమ్స్‌ఫెల్డ్ 2000వ సంవత్సరంలోనే ప్రతిపాదన చేశారు. తర్వాత దీనిపై అడుగు ముందుకు పడలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)