ముస్లిం ప్రతినిధిని మార్చినందుకు ఎయిర్‌టెల్‌పై ఆగ్రహం

  • 19 జూన్ 2018
ఎయిర్‌టెల్, కస్టమర్ కేర్, హిందు, ముస్లిం Image copyright Reuters

'డియర్ షోయబ్, నువ్వు ముస్లింవి. నీ పనిలోని నైతికత మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే కస్టమర్ కేర్ విషయంలో ఖురాన్‌లో వేరేగా రాసి ఉండొచ్చు. అందువల్ల ఎయిర్‌టెల్‌కు నా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి ఎవరైనా హిందూ ప్రతినిధిని నా కోసం ఏర్పాటు చేయండి.'

పూజా సింగ్ అనే మహిళ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోమవారం పూజ ఎయిర్‌టెల్‌కు ''మీ డీటీహెచ్ కస్టమర్ సర్వీస్ చాలా చెత్తగా ఉంది. నేను దానిపై ఫిర్యాదు చేస్తే మీ సర్వీస్ ఇంజనీర్ - నువ్వు ఫోన్ పెట్టేయ్. మళ్లీ కాల్ చేయొద్దు అంటూ అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. ఎయిర్‌టెల్ ఈ రకంగా వినియోగదారులను లూటీ చేస్తోంది'' అంటూ ట్వీట్ చేశారు.

దీనికి బదులుగా ఎయిర్‌టెల్ నుంచి- 'మేం త్వరలో మీ ఫిర్యాదును పరిశీలిస్తాం-షోయబ్' అంటూ జవాబు వచ్చింది.

ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేసినపుడు, దానికి బదులుగా ప్రతిస్పందిస్తున్న వారి పేరు రాయడం ఎయిర్‌టెల్ అలవాటు.

దానికి జవాబుగా పూజా తనకు ముస్లింపై నమ్మకం లేదని జవాబిచ్చింది.

ఆ తర్వాత ఎయిర్‌టెల్ ట్విటర్ హ్యాండిల్ @Airtel_Presence నుంచి పూజాకు మరో జవాబు వచ్చింది. దానిలో 'మీకు అనుకూలమైన సమయం చెప్పండి. మీ ఫోన్ నెంబర్ చెబితే నేను మీకు మరింత సహాయపడగలను -గగన్‌జోత్' అని ఉంది.

Image copyright TWITTER

షోయబ్ నుంచి గగన్‌జోత్ వరకు..

పూజా 'ముస్లిం కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడను' అన్నందువల్లే హిందూ ప్రతినిధి పేరిట మెసేజ్ వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ''నేను నా టైమ్ లైన్‌లో మీ పూర్తి సంభాషణ చూశాను. ఇలాంటి వివక్ష ప్రదర్శించినందుకు నేను మీ సంస్థకు ఇకపై రూపాయి కూడా చెల్లించను. నేను నా నెంబర్‌ను మరో టెలికాం కంపెనీకి బదిలీ చేసుకుంటున్నాను. అదే విధంగా నా ఎయిర్‌టెల్ డీటీహెచ్, బ్రాడ్ బ్యాండ్ కూడా రద్దు చేసుకుంటున్నాను'' అంటూ ట్వీట్ చేశారు.

Image copyright TWITTER

అయితే దీనిపై వివరణ ఇస్తూ ఎయిర్ టెల్, ''మేం కులమతాల ఆధారంగా వినియోగదారులు, ఉద్యోగుల మధ్య వివక్షను చూపం. మా కస్టమర్ కేర్ టీంలో షోయబ్, గగన్ జోత్‌లు ఇద్దరూ సభ్యులే'' అంటూ ట్వీట్ చేసింది.

ఎయిర్ టెల్, పూజా మధ్య జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో అనేక మంది ఎయిర్ టెల్‌పై విమర్శలు గుప్పించారు.

వాటిపై పూజా,''గత అనుభవాల దృష్టానే నేను కస్టమర్ కేర్ ప్రతినిధిని మార్చమని కోరాను. అది నా హక్కు కూడా. ఇప్పుడు నా మీద ఇలాంటి మాటలదాడి చూస్తే నేను చేసిన పని సరైనదే అనిపించేలా ఉంది'' అంటూ ట్వీట్ చేశారు.

జర్నలిస్ట్ బర్ఖాదత్, 'ముస్లిం వ్యతిరేక పూజా సింగ్ తాను భారతీయ సైన్యం అభిమానినని చెప్పుకుంటోంది. కానీ ఆమె భారతీయ సైన్యం యూనిఫామ్‌ను అవమానపరుస్తున్నారు'' అని ట్వీట్ చేశారు.

ఉమర్ ఆర్ ఖురేషీ,'' ఎయిర్‌టెల్ తన కస్టమర్ కేర్ ప్రతినిధిని ముస్లిం నుంచి హిందువుకు మార్చింది. సిగ్గు సిగ్గు'' అని ట్వీట్ చేశారు.

ఆశిష్ రమేష్ అనే యూజర్, ఒక మహిళ తన మనసులోని మాటను చెబితే దాన్ని వివాదాస్పదం చేయడాన్ని తప్పుబట్టారు.

అలీ ఖాన్ అనే మరో యూజర్, ''ఇతను హిందు, అతను ముస్లిం. ఇంతకూ మనిషి ఎక్కడికి పోయాడో ఎవరికి తెలుసు'' అంటూ ట్వీట్ చేశారు.

నాలుగేళ్లలో 61 వేల ట్వీట్లు

పూజా సింగ్ ట్విటర్ బయో ప్రకారం లక్నోకు చెందిన ఆమె ఒక మేనేజ్‌మెంట్ సంస్థలో పని చేస్తున్నారు.

2014 నుంచి ట్విటర్‌లో ఉన్న ఆమె ఇప్పటివరకు 61 వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఆమె తాను భారతీయురాలినని, హిందు అని చెప్పుకోవడం గర్వకారణమని రాసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు