ట్రాన్స్‌ ఫ్యాట్స్: ‘వడ, సమోసా, బజ్జీ, పిజ్జా అత్యంత ప్రమాదకరం’

  • పృథ్వీరాజ్, హరికృష్ణ
  • బీబీసీ ప్రతినిధులు

ప్రజల్లో గుండె సమస్యలు, డయాబెటిస్, బరువు పెరగడానికి కారణమయ్యే అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలను (ట్రాన్స్ ఫ్యాట్స్) దేశంలోని రెస్టారెంట్లలో ఉపయోగించకుండా నిషేధం విధించాలని హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌సీఎఫ్ఐ) వైద్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

అమెరికాలో రెస్టారెంట్లు, గ్రాసరీ స్టోర్లలో ట్రాన్స్-ఫ్యాట్స్ ఆహార పదార్థాలను ఆ దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల నిషేధించిందని.. అదే క్రమంలో భారతదేశంలోనూ వీటిపై నిషేధం విధించాలని ఆ లేఖలో కోరారు.

ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కృషి చేస్తోంది. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను సామాన్యులు తినకుండా ఉండేందుకు ట్రాన్స్ ఫ్యాట్స్ మీద నిషేధం సహకరిస్తుందని వైద్యులు భావిస్తున్నారు.

ఏమిటీ ట్రాన్స్ ఫ్యాట్స్?

కొవ్వు పదార్థాల్లో రెండు రకాలు ఉంటాయి.. ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్. ఇంకోటి అన్‌సాచురేటెడ్ ఫ్యాట్. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద (20 డిగ్రీల సెల్సియస్) గడ్డ కట్టే గుణం ఉండేవి - కొబ్బరి నూనె, నెయ్యి వంటివి - సాచురేటెడ్ ఫ్యాట్స్.

మిగతా కూర నూనెలు ఇలా గడ్డకట్టవు. అయితే.. వీటిని ఉపయోగించి తయారు చేసే ఆహార పదార్థాల నిల్వ కాలం (షెల్ఫ్ లైఫ్ పెంచటానికి, ఆ నూనెలు అధికంగా వేడి చేసినా నిలకడగా ఉండటానికి.. వాటిని కృత్రిమంగా రసాయనచర్యలతో గడ్డకట్టేలా చేస్తారు. అందుకోసం హైడ్రోజన్ ఉపయోగిస్తారు. వనస్పతి వంటివి ఇందుకు ఉదాహరణ. వీటినే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు.

‘‘ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల తినుబండారాల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. నూనెను ఎక్కువ సార్లు మరిగించుకోవచ్చు. ఆహార పదార్థాల వాస్తవ రుచి, వాసన పోదు. అందుకని వీటి వినియోగం మన దేశంలో చాలా విరివిగా ఉంది’’ అని హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ శంకర్ ప్రసాద్ వివరించారు.

‘‘ఈ నూనెలకు గడ్డకట్టే గుణం ఉంటుంది.. అవి శరీరంలోకి వెళ్లిన తర్వాత కూడా గడ్డ కడతాయని సైన్స్ నమ్ముతోంది. నెయ్యి, వెన్న వంటి మిగతా సహజమైన సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కన్నా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ప్రమాదమని పరిశోధనలు చెప్తున్నాయి’’ అని ఆయన తెలిపారు.

ఇవి శరీరంలోకి వెళ్లి రక్త నాళాల్లో గడ్డకట్టి అవరోధాలు (బ్లాక్స్) సృష్టిస్తాయి. గుండెపోటు వంటి హృద్రోగాలకు కారణమవుతాయి.

వీటి వల్ల నష్టమేమిటి?

కృత్రిమంగా తయారు చేసినదైనా, సహజంగా తయారయ్యేదైనా.. ట్రాన్స్ ఫ్యాట్ల వల్ల ఆరోగ్యంపై పలు దుష్ప్రభావాలు చూపుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సహా అనేక ప్రభుత్వ, స్వతంత్ర ఆరోగ్య సంస్థల అధ్యయనాలు చెప్తున్నాయి.

ట్రాన్స్ ఫ్యాట్లలో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు పెరగడం, గుండె నాళాల సంబంధిత వ్యాధులు, వాటివల్ల మరణాలు పెరుగుతాయి. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి.

శరీరంలో మంచి కొవ్వును తగ్గించి, చెడు కొవ్వులను ట్రాన్స్ ఫ్యాట్లు పెంచుతాయని.. దీనివల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు అధికమవుతాయని హెచ్‌సీఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

‘‘ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావాల గురించి తెలియకపోయినా.. రకరకాల రూపాల్లో వీటిని తినడం కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి జీవన విధానంలో ఇంటి బయట చాలా మంది ఇలాంటి పదార్థాలే తింటున్నారు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 5,40,000 మరణాలకు.. పారిశ్రామికంగా ఉత్పత్తి అయ్యే ట్రాన్స్ ఫ్యాట్లు కారణమని ఆ అధ్యయనాలను ఉటంకిస్తూ డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.

ట్రాన్స్ ఫ్యాట్లు ఏ ఆహారాల్లో ఎక్కువ?

భారతదేశంలో సాధారణంగా ‘ఫాస్ట్ ఫుడ్’, ప్రాసెస్డ్ ఫుడ్ అని వ్యవహరించే ఆహార పదార్థాలు, చిరుతిళ్లలో ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉన్నట్లు.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నియమించిన నిపుణుల కమిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనాల్లో వెల్లడైంది.

ముఖ్యంగా నూనెలో బాగా వేయించిన (డీప్ ఫ్రై) తినుబండారాల్లో ట్రాన్స్ ఫ్యాట్ల మోతాదు అధిక ప్రమాదకర స్థాయిల్లో ఉంటున్నాయి.

సమోసా, పూరీ, జిలేబీ, కచోరీ, పొటాటో చిప్స్, వడ, పకోడా, బజ్జీ వంటి నూనెలో బాగా వేయించే (డీప్ ఫ్రై) ఆహార పదార్థాలు, పిండివంటలు తినుబండారాలు.. మార్జరీన్, చీజ్ అనే కృత్రిమ ట్రాన్స్ ఫ్యాట్ పదార్థం ఉపయోగించే పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, సోన్ పాపిడి, బేసన్ బర్ఫీ వంటి చాలా రకాల స్వీట్లు, పఫ్, బిస్కట్లు, బ్రెడ్లు, కేక్‌లు, పేస్టరీలు వంటి ప్రాసెస్డ్ ఫుడ్‌లో ట్రాన్స్ ఫ్యాట్లు ఎక్కువ.

2010లో ప్రపంచ వ్యాప్తంగా ఆహారంలో తీసుకుంటున్న ట్రాన్స్ ఫ్యాట్లు సగటున 1.4 శాతంగా ఉందనేది అంచనాగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దేశాన్ని బట్టి ఇందులో వ్యత్యాసముంది. కొన్ని దేశాల్లో 0.2 శాతం ట్రాన్స్ ఫ్యాట్లు ఉంటే.. మరికొన్ని దేశాల్లో 6.5 శాతం ట్రాన్స్ ఫ్యాట్లు ఉన్నాయి.

అంటే.. ప్రపంచ ప్రజలు రోజూ తీసుకునే 2,000 కేలరీల ఆహారంలో 0.13 నుంచి 4.3 గ్రాములు ట్రాన్స్ ఫ్యాట్లు ఉంటున్నాయి. ఆహారంలో తీసుకునే ఈ ట్రాన్స్ ఫ్యాట్లను.. మొత్తం కేలరీల్లో 1 శాతం కన్నా తక్కువకు తగ్గించాలని ఆరోగ్య నిపుణులు, సంస్థలు చెప్తున్నాయి.

అమెరికాలో ట్రాన్స్ ఫ్యాట్ల నిషేధం

అమెరికాలోని అన్ని సంస్థలు 2018 జూన్ 18 కల్లా ట్రాన్స్ ఫ్యాట్స్ పదార్థాలను తొలగించాలని ఎఫ్‌డీఏ ఆదేశించినట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో హెచ్‌సీఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ ఉటంకించారు.

‘‘ఇది చాలా మంచి పరిణామం. దీనిని భారత్‌లో కూడా తక్షణం అమలు చేయాలి" అని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఇంతకుముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2010లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

ప్రస్తుతం ఎక్కువ మంది రెస్టారెంట్లలోను, వీధుల్లోను ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉండే ఆహారం తినడానికి అలవాటైన నేపథ్యంలో.. అలాంటి పదార్థాల అమ్మకాలకు వ్యతిరేకంగా గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా, భారత్‌లోనే కాదు.. ప్రపంచంలో ఆహార సరఫరా నుంచి.. పారిశ్రామికంగా ఉత్పత్తయ్యే ట్రాన్స్ ఫ్యాట్ల‌ను పూర్తిగా నిర్మూలించటం లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మే నెలలో ఒక ప్రణాళికను విడుదల చేసింది.

డబ్ల్యూ హెచ్ ఓ.. ‘రిప్లేస్ ట్రాన్స్ ఫ్యాట్స్’

ఈ ప్రమాదకర కొవ్వును నిర్మూలించటానికి.. దశల వారీగా చర్యలను అమలు చేసే ఈ ప్రణాళికను ‘రిప్లేస్ ట్రాన్స్ ఫ్యాట్’ అని పిలుస్తున్నారు.

ట్రాన్స్ ఫ్యాట్స్ వినియోగాన్ని సమీక్షించటం (రివ్యూ), ఆరోగ్యకరమైన కొవ్వులు, నూనెల వాడకాన్ని ప్రోత్సహించటం (ప్రొమోట్), ట్రాన్స్ ఫ్యాట్లను నిర్మూలించటానికి చట్టాలు చేయటం (లెజిస్లేట్), ప్రజల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పరిశీలించటం (అసెస్), ట్రాన్స్ ఫ్యాట్ల వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాల మీద అన్ని వర్గాల వారిలో అవగాహన పెంపొందించటం (క్రియేట్ అవేర్‌నెస్), విధివిధానాలు, చట్టాలను అమలు చేయటం (ఎన్‌ఫోర్స్) ఈ ప్రణాళిక సారాంశం.

నిజానికి.. పారిశ్రామికంగా ఉత్పత్తయ్యే ట్రాన్స్ ఫ్యాట్ల మీద ఆంక్షలు విధించిన మొదటి దేశం డెన్మార్క్. ఆ చర్య వల్ల దేశంలో ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్లు తగ్గిపోవటంతో పాటే.. గుండె సంబంధిత వ్యాధులు కూడా గణనీయంగా తగ్గాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం కూడా దశాబ్ద కాలం కిందటే ట్రాన్స్ ఫ్యాట్లను నిషేధించింది. ‘‘దీనివల్ల ఆహారం రుచి, ధరల్లో మార్పు లేకుండానే.. గుండెపోటుల సంఖ్య తగ్గిపోయింది’’ అని డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ అంబాసిడర్ మైఖేల్ ఆర్. బ్లూంబర్గ్ పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ట్రాన్స్ ఫ్లాట్లను నిర్మూలించటం ద్వారా లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చునని చెప్పారు.

భారతదేశం కూడా.. ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్ల పరిమాణం 5 శాతానికి పరిమితం చేస్తూ 2017లో ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో ట్రాన్స్ ఫ్యాట్ల నిషేధం ఎంతవరకూ సాధ్యం?

మన దేశంలో ట్రాన్స్ ఫ్యాట్ల వినియోగం చాలా విపరీతంగా ఉంది. దీనిపైన ఆధారపడిన వాణిజ్యం వేల కోట్లలో సాగుతోంది. పేరున్న బహుళజాతి పిజ్జా సంస్థల నుంచి.. ప్రాసెస్ ఫుడ్ తయారు చేసే కార్పొరేట్ సంస్థలు.. జనాదరణ గల రెస్టారెంట్లు.. గల్లీల్లోని మిర్చి బండి వరకూ.. ట్రాన్స్ ఫ్యాట్ల వినియోగం చాలా అధికంగా ఉంటుంది.

‘‘నూనె వాడుతున్న వస్తువుల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయనేది ఆ వస్తువుతో పాటు ప్రకటించాలి. కానీ కళ్లకు కనిపించని చిన్న అక్షరాలతో ఆ వివరాలు ఉంటాయి. చాలా ఆహారాల మీద ఆ వివరాలే ఉండవు’’ అని డాక్టర్ శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

‘‘ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ప్రమాదాల గురించిన అవగాహన ఇటు వ్యాపారుల్లోనూ అటు వినియోగదారుల్లోనూ తక్కువగానే ఉంది. నూనెను మరగ కాస్తే ట్రాన్స్ ఫ్యాట్ అవుతుందన్న విషయం షాపుల వాళ్లకి తెలియదు. అవి తింటే వచ్చే ప్రమాదాల గురించి సాధారణ ప్రజలకి తెలియదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలకు కేకులు, పిజ్జాలు, చిప్స్ తినిపిస్తుంటారు.. ఇలాంటి అవగాహన లేకపోవటం వల్లే. ముందు ఆ అవగాహన పెరగాల్సిన అవసరముంది’’ అని చెప్పారు.

ఏ ఆహారం ఉత్తమం?

ఫ్యాట్ ఫ్రీ లేదా 1 శాతం కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, తేలికపాటి మాంసం, చేపలు, చర్మం లేని కోడిమాంసం, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తినడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా డాక్టర్ అగర్వాల్ తమ లేఖలో ప్రధానిని కోరారు.

ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారం బదులు.. మోనో, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల చెడు కొవ్వులు పెరగకుండా ఉంటాయన్నారు.

కొవ్వు ఎక్కువగా ఉండే.. లివర్ తదితర మాంసాహారం, గుడ్డులోని పచ్చసొన, హోల్ మిల్క్ వంటి పాల ఉత్పత్తుల వినియోగాన్ని పరిమితం చేయాలి.

ట్రాన్స్ ఫ్యాట్లను నిషేధించాలంటూ హెచ్‌‌సీఎఫ్‌ఐ రాసిన లేఖను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లకు కూడా పంపించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)