జడ్జీల పనితీరుపైనా ప్రజల నిశిత పరిశీలన ఉండాలి: జస్టిస్ చలమేశ్వర్

  • 22 జూన్ 2018
జస్టిస్ జాస్తి చలమేశ్వర్ Image copyright Getty Images

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్వహణ దాని ప్రమాణాలకు తగినట్లుగా లేదంటూ.. కొద్ది కాలం కిందట మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి మీడియా ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జూన్ 22వ తేదీన (శుక్రవారం) పదవీ విరమణ చేశారు.

‘‘ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరి పనితీరునూ ప్రజలు నిశితంగా పరీక్షిస్తారు. మంత్రులు, గవర్నర్ల పనితీరుపైనా ప్రతి రోజూ ప్రజలు, మీడియా మాట్లాడుతుంటాయి. అవి అన్నివేళలా వారిని మెచ్చుకునేలా ఉండవు. న్యాయమూర్తులు కూడా ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారే. వారు కూడా తమ బలాలు, బలహీనతల మేరకు పనిచేస్తుంటారు. వారిని కూడా ప్రజలు నిశితంగా పరీక్షించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పదవిలో ఉన్న వారు ఎవరూ ఈ పరీక్షకు అతీతం కాదు’’ అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన తాజాగా ‘హిందుస్తాన్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

2018 జనవరిలో జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కలిసి జస్టిస్ చలమేశ్వర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేయడం దేశ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిది.

సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు సరిగా లేదని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ విషయంపై మాట్లాడినా ఫలితం లేకపోయిందని గత్యంతరం లేక, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని జస్టిస్ చలమేశ్వర్ అప్పుడు వివరించారు.

న్యాయవ్యవస్థ పతనం మొత్తం ప్రజాస్వామ్యాన్నే దెబ్బతీస్తుందని అన్నారు. నలుగురి సంతకాలతో విడుదల చేసిన లేఖలో తీవ్రమైన అంశాలున్నాయి. ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించిన ప్రశ్నలున్నాయి.

Image copyright PTI

‘ఆశించిన ఫలితం రాలేదు కానీ.. ప్రజల్లో అవగాహన పెరిగింది...‘

భారత న్యాయవ్యవస్థలో ఒక ‘విప్లవం’గా పలువురు నిపుణులు పరిగణిస్తున్న ఆ పరిణామంలో జస్టిస్ చలమేశ్వర్ కీలకంగా వ్యవహరించారు.

ఆనాడు తాము లేవనెత్తిన ప్రశ్నల వల్ల ఆశించిన వాస్తవ ఫలితాలు రానప్పటికీ.. వాస్తవ పరిస్థితి ఏమిటనేదానిపైనా, న్యాయవ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉందన్న దానిపైన ప్రజలలో అవగాహన పెంచిందని జస్టిస్ చలమేశ్వర్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

జస్టిస్ చలమేశ్వర్ 2011 అక్టోబర్ 10వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఏడు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగిన ఆయన 2018 జూన్ 22వ తేదీన పదవీ విరమణ చేశారు. జూన్ 23వ తేదీన జస్టిస్ చలమేశ్వర్‌కు 65 సంవత్సరాల వయసు వస్తుంది.

జస్టిస్ చలమేశ్వర్ విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు లభించింది.

1995 అక్టోబర్ 30వ తేదీన అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు.

2007 మే 3వ తేదీన గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆయన కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

2010 మార్చి 17న కేరళ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2011 అక్టోబర్ 10వ తేదీన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Image copyright PTI

ముఖ్యమైన తీర్పులు:

జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు ముఖ్యమైన తీర్పులు ఇచ్చారు.

వాక్‌స్వాతంత్ర్యం (2012): ఇంటర్నెట్‌లో 'తీవ్ర' వ్యాఖ్యలను పోస్టు చేయటం మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధంచగల నేరంగా పేర్కొన్న చట్టాన్ని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రోహిన్టన్ ఫాలీ నారిమన్‌లు కొట్టివేశారు.

గోప్యత హక్కు (2017): గోప్యత అనేది ప్రాధమిక హక్కు అని ప్రకటించిన తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ కూడా ఉన్నారు. రాజ్యంగ ధర్మాసనం 2017లో ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది.

జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) తీర్పు (2015): ఎన్‌జేఏసీ తీర్పు (2015)లో జస్టిస్ చలమేశ్వర్ విభేదిస్తూ వెల్లడించిన అభిప్రాయంలో.. న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ ''ఆశ్రిత పక్షపాతానికి అలంకారం''గా మారిందని.. అక్కడ ప్రతిభలేనితనాన్ని ప్రోత్సహించటం జరుగుతోందని, రాజ్యంగ ఉల్లంఘన దూరంగా ఉన్నట్లు కనిపించదని విమర్శించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)