ప్రెస్‌ రివ్యూ: 65 రూపాయలకే హైదరాబాదీ చికెన్ బిర్యానీ

  • 23 జూన్ 2018
Image copyright Thinkstock

పార్లమెంట్ క్యాంటీన్‌లో ఎంపీలకు రూ. 65కే హైదరాబాదీ చికెన్ బిర్యానీ అందిస్తున్నారని 'నవతెలంగాణ' ఒక కథనం ప్రచురించింది.

అలాగే, కాఫీ రూ. 5, మటన్‌ రూ. 45, చేపల కూర రూ. 40కు ఎంపీలకు అందిస్తున్నారు. పార్లమెంటు క్యాంటీన్‌లో ఆహార పదార్థాలు సబ్సిడీ ధరల్లో అందజేయటంపై 4 ఏళ్ల క్రితం పెద్ద వివాదం రేగింది.

80 శాతం సబ్సిడీతో పార్లమెంటు క్యాంటీన్‌లో ఆహార పదార్థాల్ని వడ్డిస్తున్నారని దేశవ్యాప్తంగా 2015లో విమర్శలు వెల్లువెత్తాయి.

100 రూపాయలున్న ఆహారాన్ని కేవలం 20 రూపాయలకు ఎంపీలకు అందజేస్తున్నారు. కోటీశ్వర్లు, శత కోటీశ్వర్లే సభ్యులుగా ఉన్న పార్లమెంటులో ప్రజల ధనం వృధా అవుతోందన్న ఆరోపణలు వెలువడ్డాయి.

సామాన్య ప్రజలెవరికీ అందుబాటులో లేని విధంగా అంత చౌక ధరలు పార్లమెంట్‌ సభ్యులకు ఉండటమేంటి? అన్న ఆగ్రహం దేశవ్యాప్తంగా ఏర్పడింది.

దీంతో క్యాంటీన్‌లో సర్వ్ చేసే ఆహార పదార్థాలపై సబ్సిడీని రద్దు చేస్తామని మోదీ సర్కార్‌ ప్రకటించింది. అంతే కాదు క్యాంటీన్ ధరలపై సమీక్షించేందుకు ఓ కమిటీ వేసింది.

'లాభం లేదు.. నష్టం లేదు' అనే విధానంలో ఆహార పదార్థాల్ని అమ్మాలన్న ప్రతిపాదన ఆ కమిటీ చేసింది. సబ్సిడీ రద్దు చేయమని సూచించింది.

కమిటీ చేసిన సూచన ప్రకారం, 2016, జనవరి 1 నుంచి పార్లమెంటు క్యాంటీన్‌లో ఆహార పదార్థాలు వాస్తవ ధరల్లో లభ్యమవుతాయని లోక్‌సభ స్పీకర్‌ స్వయంగా ప్రకటించారు.

కానీ, ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌ 'సమాచార హక్కు చట్టం' ద్వారా వివరాలు సేకరించగా సబ్సిడీ రద్దవలేదనే విషయం బయటపడిందని నవతెలంగాణ పేర్కొంది.

Image copyright danam nagendar/fb

టీఆర్ఎస్ పార్టీలోకి దానం నాగేందర్!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ నేత, ఆ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని 'ఈనాడు' వెల్లడించింది.

ఈ మేరకు లేఖల ప్రతులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపినట్లు ప్రకటించారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో మంతనాలు సాగించడంతో ఆయన తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలోనే ఆదివారం గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం.

తెరాసలో చేరే విషయాన్ని నాగేందర్‌ స్వయంగా ప్రకటించనప్పటికీ.. ఆయన సన్నిహితుల నుంచి ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఈనాడు తెలిపింది.

Image copyright ke krishna murthy/ facebook

శ్రీవారి నగల గురించి చెప్పిన ఐపీఎస్ ఎవరు?

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను వేదికగా చేసుకుని బీజేపీ, వైసీపీ, జనసేన మహా కుట్రకు పాల్పడుతున్నాయని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రీల్‌ లైఫ్‌‌కు, రియల్‌ లైఫ్‌కు మధ్య తేడాను గమనించాలని హితవు పలికారు.

గాలి వార్తలను నమ్మి వాటిని వల్లించడం తప్ప, స్వయంగా వివేకంతో విశ్లేషించే శక్తి ఆయనకు లేదని విమర్శించారు.

ఎవరో ఏదో చెబితే అదే నిజం అనుకుని జనం ముందు చెప్పడం ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనమన్నారు. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని సూచించారు.

శ్రీవారి నగలు ప్రత్యేక విమానంలో తరలిపోయాయని మీకు చెప్పిన ఐపీఎస్‌ అధికారి పేరు చెబితే వాస్తవాలు తెలుసుకుంటాం అని శుక్రవారమిక్కడ తెలిపారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

హైదరాబాద్ ట్రాఫిక్ Image copyright hyderabad traffic police/fb

దూకుడు తగ్గింది

ఉల్లంఘనుల్లో భయం... మితిమీరిన వేగంతో వెళ్లేవారు, సీటు బెల్టు ధరించని వారు పాయింట్ల లెక్కతో భయపడున్నారంటూ 'ఈనాడు' ఒక కథనం ప్రచురించింది.

వాహనదారుల అతివేగంపై కొన్నాళ్లుగా పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు.

స్పీడ్‌ లేజర్‌గన్‌లు, సీసీ కెమెరాలను రహదారులపై ఉంచారు. దీంతో బాహ్యవలయ రహదారితో పోల్చుకుంటే వాహనదారుల దూకుడు తగ్గుతోంది.. కార్లు నడిపే వారిలో 60 శాతం సీటుబెల్ట్‌ ధరిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై నమోదు చేసేందుకు మోటారు వాహన చట్టంలో పలు సెక్షన్లు ఉన్నాయి.

వీటితో పాటు పాయింట్ల లెక్క కోసం చట్టం 28(2)లో 45(ఎ)రూల్‌ను ప్రత్యేకంగా సవరించారు.

పలు ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని జరిమానా విధిస్తూనే.. వ్యక్తిగత రికార్డుల్లోకి పంపుతున్నారని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)