సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?

  • 23 జూన్ 2018
సంజయ్ గాంధీ Image copyright Keystone/Hulton Archive/Getty Images

ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతాను ఓసారి ఎవరో ఒక ప్రశ్న అడిగారు - "సంజయ్ గాంధీని చరిత్ర ఏ విధంగా గుర్తు చేసుకుంటుంది?"

"బహుశా ఆయనకు చరిత్రలో ప్రాధాన్యం లభించకపోవచ్చు. లేదా ఆయనను పట్టించుకోకపోవచ్చు. నా వరకైతే భారత రాజకీయాల్లో ఆయన ఉనికి ఒక మామూలు 'బ్లిప్' వంటిదే" అని ఆయన జవాబిచ్చారు.

ఇది వినోద్ మెహతా అభిప్రాయం. కానీ భారత రాజకీయాల్లో సంజయ్ గాంధీ పాత్రను మరో దృష్టితో చూసే వాళ్లకు కూడా కొదవేమీ లేదు.

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసిన పుష్పేష్ పంత్ ఇలా అంటారు.. "సంజయ్ గాంధీది మొండి ధైర్యం అనే చెప్పాలి. భారతదేశాన్ని బాగు చేయాలన్న పట్టుదల ఆయనలో ఉండేదనేది నా అభిప్రాయం. దాని గురించి ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే గాంధీ కుటుంబానికి తొత్తు అనో, లేదా వంతగాడనో ముద్రలు వేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ కాలంలో కుటుంబ నియంత్రణ విషయంలో చేపట్టిన కఠిన వైఖరినే తీసుకోండి. అదే గనుక జరిగి ఉండకపోతే 'చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం' అన్న భావననే బహుశా ఈ దేశం స్వీకరించి ఉండేది కాదు."

Image copyright NEHRU MEMORIAL LIBRARY

సంజయ్ గాంధీ పెట్టే డెడ్‌లైన్ ఒకే ఒక్క రోజు

అయితే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని బలవంతంగా అమలు చేయించిన కారణంగా భారతీయ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి ఏర్పడిందనేది నిజం. హిందుస్తాన్ టైమ్స్‌లో పని చేసిన పాత్రికేయురాలు కుమ్‌కుమ్ చడ్ఢా తన రిపోర్టింగ్‌లో భాగంగా సంజయ్ గాంధీని చాలా దగ్గరగా గమనించారు.

"వీటిని అమలు చేయాలని ఆయన ఎవరిని ఎలా పురమాయించే వారో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికీ ఆయన టార్గెట్లు నిర్ణయించే వారన్న విషయం నాకు తెలుసు. ఇక ఏది ఏమైనా సరే తమకు నిర్ధారించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రయత్నించేవారు" అని కుమ్‌కుమ్ చెప్పారు.

"ఎందుకంటే సంజయ్ దగ్గరకు వెళ్లి ఫలానా పని జరగలేదు అని చెప్పాలంటే ఎవరి వల్లా అయ్యే పని కాదు. సంజయ్ అంటే అందరూ భయపడేవారు. సంజయ్‌కు ముందు నుంచే సహనం చాలా తక్కువ. ఆయన ఎప్పుడు ఎవరికి డెడ్‌లైన్ విధించినా కేవలం ఒక్కరోజే ఇచ్చేవారు. అందుకే సంజయ్ ఆదేశాలతో ఎవరు ఏం చేసినా చాలా వేగంగా చేయాల్సి వచ్చేది. అలా పరిణామాలు ప్రతికూలంగా రావడం మొదలైంది" అని ఆమె వివరించారు.

"ఆ సమయంలో దేశమంతటా సెన్సార్‌షిప్ అమలులో ఉండేది. సంజయ్ గాంధీ దగ్గరకు వెళ్లి మీరు ఈ పని చేయడం మంచిది కాదు అని చెప్పే ధైర్యం ఎవరిలోనూ లేదు. అప్పుడు ఆయన ఎవరి మాటా వినే మూడ్‌లో ఉన్నారని నేననుకోను. అటువంటి మాటలు వినే స్వభావమే కాదు ఆయనది."

Image copyright NEHRU MEMORIAL LIBRARY

గుజ్రాల్‌తో సంజయ్ గాంధీ పోట్లాట

విపక్ష నేతలను అరెస్టు చేయాలని ఆదేశించడం, సెన్సార్‌షిప్‌ను కఠినంగా అమలు చేయడం, ఎలాంటి అధికారిక హోదా లేకున్నా ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం - ఇవీ ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీపై వచ్చిన అత్యంత తీవ్రమైన విమర్శలు. నాటి సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ఐకే గుజ్రాల్ తన మాట వినడం లేదని భావించిన సంజయ్ ఆయనను పదవి లోంచి తొలగించారు.

తన పుస్తకం 'వాట్ ప్రైస్ పర్జరీ - ఫ్యాక్ట్స్ ఆఫ్ ద షా కమిషన్'లో జగ్గా కపూర్ ఇలా రాశారు.. "ఆకాశవాణి బులెటిన్ ప్రసారాలు ప్రారంభించే ముందు ప్రతిసారీ తనకు చూపించాలని సంజయ్ గాంధీ మంత్రి గుజ్రాల్‌ను ఆదేశించారు. ఇది సాధ్యం కాదని గుజ్రాల్ అన్నారు. సంజయ్, గుజ్రాల్‌ల సంభాషణను ఆ సమయంలో గుమ్మం దగ్గరే ఉన్న ఇందిరాగాంధీ విన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు."

ఆయన ఇంకా ఇలా రాశారు - "మరుసటి రోజు ఇందిర అక్కడ లేని సమయంలో గుజ్రాల్‌తో సంజయ్ గాంధీ 'మీ మంత్రిత్వశాఖ పని సరిగా జరగడం లేద'ని అన్నారు. దానికి జవాబుగా గుజ్రాల్ ఇలా అన్నారు - నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మొదట నువ్వు సభ్యతతో, వినమ్రంగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రధానమంత్రితో నా అనుబంధం నువ్వు పుట్టడానికి ముందటిది. నా మంత్రిత్వశాఖలో అడ్డుపుల్లలు వేసే హక్కు నీకు లేదు."

Image copyright NEHRU MEMORIAL LIBRARY

మార్క్ టలీని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు

మరుసటి రోజు సంజయ్ గాంధీ సన్నిహిత మిత్రుడైన మహ్మద్ యూనుస్ గుజ్రాల్‌కు ఫోన్ చేసి దిల్లీలో ఉన్న బీబీసీ కార్యాలయాన్ని మూసెయ్యాలని చెప్పారు. బీబీసీ బ్యూరో చీఫ్ మార్క్ టలీని అరెస్టు చేయాలని కూడా ఆదేశించాడు. ఎందుకంటే జగ్జీవన్ రామ్, స్వర్ణ్ సింగ్‌లను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారన్న తప్పుడు వార్త ప్రసారం చేశారన్నది ఆయన ఆరోపణ.

"మార్క్ టలీని తీసుకురండి. అతని ప్యాంటు ఊడదీసి బెత్తాలతో కొట్టించి జైల్లో వెయ్యండి అంటూ మంత్రి ఐకే గుజ్రాల్‌ను యూనస్ ఆదేశించారు. అయితే 'ఒక విదేశీ పాత్రికేయుడిని అరెస్ట్ చేయించడం సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ చేయాల్సిన పని కాదు' అంటూ గుజ్రాల్ ఆ ఆదేశాన్ని తిరస్కరించారు" అని మార్క్ టలీ తన 'ఫ్రమ్ రాజ్ టు రాజీవ్' పుస్తకంలో రాశారు.

"అయితే ఫోన్ పెట్టేశాక వెంటనే గుజ్రాల్ బీబీసీ ప్రసారాల మానిటరింగ్ నివేదికను తెప్పించుకున్నారు. జగ్జీవన్ రామ్‌, స్వర్ణ్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారన్న వార్తను బీబీసీ ప్రసారం చేయలేదన్న విషయం ఆయనకు స్పష్టమైంది. వెంటనే ఆయన ఈ సమాచారాన్ని ఇందిరా గాంధీకి చేరవేశారు. కానీ అదే రోజు సాయంత్రం ఇందిరా గాంధీ ఆయనకు ఫోన్ చేసి ఇకపై సమాచార, ప్రసారాల శాఖను తానే చేపట్టనున్నట్టు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ శాఖను చూసేందుకు కఠినంగా వ్యవహరించే చేతులు కావాలని ఆమె చెప్పారు" అంటూ మార్క్ రాసుకొచ్చారు.

Image copyright NEHRU MEMORIAL LIBRARY
చిత్రం శీర్షిక రాహుల్ గాంధీతో సంజయ్ గాంధీ

రుఖ్సానా సుల్తాన్‌తో సంజయ్ సాన్నిహిత్యం

సంజయ్ గాంధీకి దగ్గరగా ఉన్న వాళ్లు ఎమర్జెన్సీ సమయంలో బాగా లాభపడ్డారు. అట్లాగే ఆయన ఇమేజిని దెబ్బతీయడంలో కూడా వాళ్లదే ముఖ్యమైన పాత్ర. వారిలో ఒకరు సినీ నటి అమృతా సింగ్ తల్లి రుఖ్సానా సుల్తాన్.

దీని గురించి కుమ్‌కుమ్ చడ్ఢా ఇలా చెబుతారు.. "ఒక స్థాయిలో వీళ్లిద్దరి గురించి చాలా రకాల మాటలు మాట్లాడుకునే వారు. రుఖ్సానా దీని గురించి ఏ మాత్రం దాపరికం లేకుండా చెప్పుకునేవారు. సంజయ్‌ తనకు చాలా దగ్గరి మిత్రుడని ఆమె నాతో కూడా చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో రుఖ్సానా కూడా చాలానే అధికారం చెలాయించేవారు. అధికారాన్ని ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకున్నారు. కుటుంబ నియంత్రణ విషయంలో కావొచ్చు, జామా మసీదు సుందరీకరణ విషయం కావొచ్చు. ఆయన పేరుతో ఆమె ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించడం కూడా జనం సంజయ్ గాంధీని ద్వేషించడానికి ఓ ముఖ్యమైన కారణం. కానీ సంజయ్ దగ్గరకు వెళ్లి ఆమె చేస్తున్న పనులు మంచివి కావని చెప్పే సాహసం చేయగలవారు ఆనాడు ఆయన స్నేహితుల్లో ఒక్కరు కూడా లేరు."

Image copyright NEHRU MEMORIAL LIBRARY

వ్యవహారం ముక్కుసూటి, మాటల్లో స్పష్టత

సాధారణంగా సంజయ్ గాంధీకి తక్కువగా, సూటిగా మాట్లాడేవాడనే పేరుండేది. తన సహచరుల పట్ల ఆయన మనస్సులో ఎలాంటి గౌరవం ఉండేది కాదు - వయస్సులో వాళ్లు తనకంటే ఎంతో పెద్ద వాళ్లయినా సరే.

ఒకప్పుడు సంజయ్ గాంధీకి సన్నిహితుడు, యువజన కాంగ్రెస్ నాయకుడైన జనార్దన్ సింగ్ గెహ్లాట్ ఇలా చెబుతారు - "ఆయనలో మొరటుతనం (రఫ్‌నెస్) ఏ మాత్రం ఉండేది కాదు. స్పష్టతతో వ్యవహరించేవాడు. కానీ నేటికీ ఆయనను దేశ ప్రజలు నిజమైన అర్థంలో స్వీకరించలేకపోయారు. ఈరోజు ఎక్కడ చూసినా చెంచాలదే ఆధిపత్యం. ప్రతి రాజకీయ నాయకుడూ తియ్యటి మాటలు మాట్లాడుతాడు. నా దృష్టిలో ఆయన వీటన్నింటికీ అతీతంగా ఉండేవాడు. దాంతో ఆయనకు అందరితో పొడిపొడిగా వ్యవహరిస్తాడనే ఇమేజి ఏర్పడింది. కానీ వాస్తవం అది కాదు."

"ఆయనకు ఏదైనా సరైందని అనిపిస్తే సూటిగా చెప్పేసేవాడు. ఆయన చేపట్టిన ఐదు సూత్రాల కార్యక్రమం దేశానికి మేలు చేసేదే అన్న విషయాన్ని దేశ ప్రజలు ఆ తర్వాతి కాలంలో గానీ గ్రహించలేకపోయారు" అని ఆయన చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు సంజయ్ గాంధీకి సన్నిహితుడు, అమేథీ నుంచి ఒకసారి ఎంపీ, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంజయ్ సింగ్ కూడా ఇదే విషయం చెబుతారు.

"ఆయనలో ఉన్న రెండు, మూడు లక్షణాలు నాకు బాగా నచ్చేవి. ఏది మాట్లాడినా స్పష్టంగా, డొంకతిరుగుడు లేకుండా మాట్లాడేవాడు. సౌమ్యంగా ఉండేవాడు. తక్కువ మాటల్లోనే సందేశం ఎదుటి వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. మరో విషయం ఏంటంటే ఏదైనా పని కోసం కమిట్ అయ్యాడంటే ఇక దాన్ని పూర్తి చేయడానికి శత విధాలా ప్రయత్నించేవాడు. ఇతరులు కూడా తన లాగే చెప్పిన మాటకు కట్టుబడి పని పూర్తి చేయాలని ఆశించేవాడు" అని సంజయ్ సింగ్ అంటారు.

Image copyright NEHRU MEMORIAL LIBRARY

సమయపాలనలో తనకు తానే సాటి

సంజయ్ గాంధీకి నెగెటివ్ ఇమేజిని తెచ్చి పెట్టడంలో అంటిముట్టనట్టుగా ఉండే అతని వ్యవహారశైలి కూడా ఒక ముఖ్య కారణమే.

సంజయ్ గాంధీ గురించి రాసిన 'ద సంజయ్ స్టోరీ' పుస్తకంలో వినోద్ మెహతా ఇలా పేర్కొన్నారు - "1 అక్బర్ రోడ్డులో సంజయ్ గాంధీ దైనందిన కార్యక్రమాలు ఉదయం సరిగ్గా 8 గంటలకు మొదలయ్యేవి. అప్పుడే జగ్‌మోహన్, కిషన్ చంద్, నవీన్ చావ్లా, పీఎస్ భిండర్ వంటి అధికారులు చేరుకొని తమ రోజువారీ రిపోర్టుల్ని సంజయ్‌కు నివేదించేవారు. ఆ సమయంలోనే వారు సంజయ్ గాంధీ ఆదేశాలను కూడా స్వీకరించేవారు. వీరిలో చాలా మంది ఆయనను 'సర్' అని సంబోధించేవారు."

సంజయ్ కేవలం ఒకటి, రెండు మాటలే మాట్లాడేవాడని జగదీశ్ టైట్లర్ చెబుతారు. "అతను అరవడం నేనెప్పుడూ చూడలేదు. ఆయన ఆదేశాలు స్ఫటికంలా స్పష్టంగా ఉండేవి. అతడి జ్ఞాపకశక్తి అమోఘం."

"సరిగ్గా 8 గంటల 45 నిమిషాలకు ఆయన తన మెటాడోర్‌లో బయలుదేరి గుర్‌గావ్‌లో ఉన్న తన మారుతి ఫ్యాక్టరీకి చేరుకునేవాడు. సమయాన్ని ఆయన చాలా కచ్చితంగా పాటించేవాడు. ఎంతగా అంటే, ఆయన దినచర్యను చూసి మన గడియారాల్లో టైం కలుపుకునేంతగా. సరిగ్గా 12 గంటల 55 నిమిషాలకు మధ్యాహ్న భోజనం కోసం ఆయన తన ఇంటికి వచ్చేవాడు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కలిసే మధ్యాహ్న భోజనం చేయాలనేది ఇందిరా గాంధీ ఆదేశం."

టైట్లర్ ఇంకా ఇలా అన్నారు - "తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన వివిధ వ్యక్తులను కలిసే ప్రక్రియ మొదలయ్యేది. ఈ సమయంలో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యువజన కాంగ్రెస్ నాయకులు ఆయనను కలుస్తుండేవారు. కలిసేందుకు వారికి కేటాయించే సమయం ఇలా ఉండేది: 4 గంటల 7 నిమిషాలు, 4 గంటల 11 నిమిషాలు, 4 గంటల 17 నిమిషాలు. ఎవరైనా గదిలోకి ప్రవేశించినప్పుడు మర్యాదపూర్వకంగా లేచినిలబడడం లేదా చేయి కలపడం వంటివేమీ సంజయ్ చేసేవారు కాదు."

Image copyright NEHRU MEMORIAL LIBRARY
చిత్రం శీర్షిక మారుతి ఫ్యాక్టరీలో సంజయ్ గాంధీ

'మారుతికి పునాదులు వేసింది ఆయనే'

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పని చేసిన నారాయణ్ దత్త్ తివారీ అభిప్రాయం ప్రకారం సంజయ్ గాంధీకి అకారణంగానే చెడ్డపేరు ఆపాదించారు. ఆయన చేసిన సేవలను తక్కువగా చేసి చూపించారని ఆయనంటారు.

"సంజయ్ చేపట్టిన ఐదు సూత్రాల కార్యక్రమం సరైందనీ, ఆచరణయోగ్యమైందని ఇప్పుడు అందరూ గుర్తిస్తారు. కుటుంబ నియంత్రణ జరగకుండా భారత్‌లో పేదరికాన్ని రూపుమాపడం సాధ్యం కాదని ఆయన భావించేవాడు" అని తివారీ అంటారు.

"అట్లాగే చెట్లు నాటడం, వివిధ వస్తువులు భారత్‌లోనే తయారు కావాలనేది ఆయన కార్యక్రమ లక్ష్యాల్లో భాగం. ఆయన మారుతి డిజైన్ రూపొందించేందుకు వర్క్‌షాప్‌లో కూడా పని చేశారు. నేడు మారుతి కార్లు భారత్‌లోనే తయారవుతున్నాయి. విదేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి. దీనికి పునాదులు వేసింది సంజయ్ గాంధీనే."

Image copyright NEHRU MEMORIAL LIBRARY
చిత్రం శీర్షిక పెళ్లి సమయంలో రిజిస్ట్రార్ కార్యాలయంలో సంజయ్ గాంధీ, మేనక, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నవీన్ చావ్లా (సంజయ్-మేనకల మధ్య)

వాహనాలను వేగంగా నడిపించే సరదా

సామాన్య ప్రజల్లో సంజయ్ గాంధీ ఇమేజి 'మేన్ ఆఫ్ యాక్షన్' అన్నట్టుగా ఉండేది. ఆయనకు సహనం తక్కువ అనుకునే వారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఆయన మద్యం, సిగరెట్ లాంటివే కాదు, ఆఖరుకు టీ తాగడానికి కూడా ఇష్టపడేవారు కాదు.

జనార్దన్ గెహ్లాట్ ఇలా అంటారు - "వాహనాల్ని అతి వేగంగా నడిపించడం ఆయన హాబీ. ఓసారి నేను, సంజయ్ గాంధీ, అంబికా సోనీ ముగ్గురం పంజాబ్‌లో పర్యటించి వెనక్కి వస్తున్నాం. తన కారును తానే స్వయంగా నడిపించడం ఆయనకు అలవాటు. ఇక ఆ కారుకు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని మేం హడలిపోయాం. 'కాస్త నెమ్మదిగా పోనివ్వు' అని మేం అంటే 'ఏం భయపడుతున్నావా' అనేవారు."

"ఆయన విమానం నడిపించడానికి వెళ్లిన రోజున కూడా మేనకా గాంధీ ఇందిర వద్దకు వెళ్లి విమానాన్ని పల్టీ కొట్టించవద్దని ఆయనకు నచ్చజెప్పమనీ, అతణ్ని ఆపమని కోరారు. అయితే ఇందిరా గాంధీ బయటకు వచ్చే లోగానే సంజయ్ తన మెటాడోర్ ఎక్కి వెళ్లిపోయారు. అదే రోజు ప్రమాదం జరిగింది."

గెహ్లాట్ ఇంకా ఇలా అంటారు - "ఆయన క్యాంపా కోలా, పెప్సీ వంటి డ్రింక్స్ తాగేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఎవరైనా పాన్ తింటే మీరెందుకిలా పాన్ తింటారంటూ వారిని ప్రశ్నించేవారు. దేశ యువతరాన్ని ఓ విభిన్న మార్గంలో తీసుకెళ్లాలని ఆయన ఆశించినట్టు నాకనిపిస్తుంది. ఎప్పుడూ ఖద్దరు కుర్తా, పైజామా ధరించే సంజయ్ చాలా సాదాగా ఉండేవారు. సాయంత్రం కాగానే జీన్స్, టీషర్టులు వేసుకొని తిరిగే ఇతరుల్లా కాదు."

Image copyright NEHRU MEMORIAL LIBRARY

కమల్‌నాథ్ డ్రాయింగ్ రూంలో సంజయ్ చిత్రం

సంజయ్ మిత్రబృందంలో ఎవరికీ మంచి లక్షణాలు గానీ, మేధో అర్హతలు గానీ లేవని విమర్శకులు భావించే వారు. వారిలో ఎవరూ నిబద్ధత ఉన్నవారు కాదన్నది వారి అభిప్రాయం. కానీ సంజయ్ పట్ల వారిలో గౌరవ భావం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. మొత్తం దేశం దేశమే ఆయనపై దుమ్మెత్తిపోసినా సరే వారిలో సంజయ్ పట్ల అంకితత్వం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

"ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో, సంజయ్ చనిపోయి అప్పటికి చాలా ఏళ్లు గడిచాక కూడా కమల్‌నాథ్ ఒక్కరే తన డ్రాయింగ్ రూంలో సంజయ్ గాంధీ ఫొటోను పెట్టుకునేవారు" అని కుమ్‌కుమ్ చడ్ఢా చెబుతారు.

"సంజయ్ గాంధీ ఇప్పుడు లేరు కదా. ఈరోజు ఆయన గురించి ఎవరూ కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది మీరు ఏకంగా ఆయన ఫొటోనే పెట్టుకున్నారెందుకు అని నేను కమల్‌నాథ్‌ను ఓ సందర్భంగా అడిగాను. దానికి జవాబుగా ఆయన 'ఇందిరా గాంధీ నా ప్రధానమంత్రి. కానీ సంజయ్ నా నాయకుడు, నా నేస్తం' అన్నారు. అలా కొంత మందికి సంజయ్ పట్ల గుడ్డి అంకితభావం, స్నేహం చెక్కుచెదరలేదు" అన్నారు కుమ్‌కుమ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా