ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు ఇది.. భారత్‌లోనే ఉంది

  • 24 జూన్ 2018

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు ఎక్కడ ఉందో తెలుసా? భారత దేశంలోనే ఉంది.

హిమాలయ పర్వతాలు Image copyright Sandipan Dutta

హిమాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయ పర్వతాల నడుమ మారుమూల స్పితి లోయలో ఉన్న హిక్కిం పోస్టాఫీసు అది.

సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పోస్టాఫీసు నుంచి ప్రపంచ నలుమూలలకూ ఉత్తరాలు వెళ్తుంటాయి.

హిమాలయ పర్వతాలు Image copyright Sandipan Dutta

ఇదో కొత్త ప్రపంచం

భూగోళంపై అత్యంత ఎత్తులో ఉన్న నివాస ప్రాంతాల్లో స్పితి లోయ ఒకటి.

ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే ఎత్తైన పర్వతాలు, మధ్యలో పాముల్లా పారే నదులు, అత్యంత ప్రమాదకరమైన దారులు, ఎముకలు కొరికే చలి ఈ లోయ ప్రత్యేకత.

ఒక్క మాటలో చెప్పాలంటే ఓ కొత్త ప్రపంచానికి వెళ్లినట్టుగా ఉంటుంది.

హిమాలయ పర్వతాలు Image copyright Sandipan Dutta

అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు

సముద్ర మట్టానికి 4,440 మీటర్ల(4.4 కిలోమీటర్లు) ఎత్తులో ఈ చిన్న పోస్టాఫీసు ఉంది. స్పితి లోయలో ఉన్న మరికొన్ని చిన్న ఊళ్లవాళ్లు కూడా ఈ పోస్టాఫీసుకే వస్తుంటారు.

ఉత్తరాలు పంపేందుకు, సేవింగ్స్ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు వస్తుంటారు.

ఇక్కడికి వచ్చే చాలా మంది పర్యాటకులు అత్యంత ఎత్తులోని ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు పంపడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తారు. అందుకే దేశ విదేశీ సందర్శకులు ఇక్కడి నుంచి తమ సొంతూళ్లకు, సన్నిహితులకు ఉత్తరాలు పంపుతుంటారు.

1983లో భారత తపాలా శాఖ ఈ పోస్టాఫీసును ప్రారంభించింది.

ఇక్కడి నుంచి ఉత్తరాలను బట్వాడా చేయాలంటే చాలావరకు కాలినడకనే వెళ్లాలి.

చలికాలంలో ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. దాంతో అప్పుడు చాలాసార్లు పోస్టాఫీసును మూసేయాల్సి వస్తుందని 1983 నుంచి ఇక్కడ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న రించెన్ చెరింగ్ చెబుతున్నారు.

హిమాలయ పర్వతాలు Image copyright Sandipan Dutta

స్పితి లోయకు ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా పట్టణానికి ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు తీసుకెళ్తారు.

అందుకు రోజూ ఇద్దరు పోస్ట్‌మెన్‌లు కొండాకోనలను దాటుకుంటూ రానుపోను కలిపి దాదాపు 46 కిలోమీటర్లు నడుస్తారు.

కాజా నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ఇతర ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గాల ద్వారా బస్సుల్లో ఉత్తరాలను పంపిస్తారు.

హిమాలయ పర్వతాలు Image copyright Sandipan Dutta

పోస్టాఫీసే దిక్కు

ఇక్కడి నాలుగైదు గ్రామాలకు కలిపి ఇదొక్కటే పోస్టాఫీసు ఉంది. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ చాలా తక్కువ. ఇక ఇంటర్నెట్ అన్న మాటే లేదు.

ఇక్కడ సముద్ర మట్టానికి 4,587 మీటర్ల ఎత్తులో కోమిక్ అనే పల్లె ఉంది. భూమి మీద అత్యంత ఎత్తులో ఉండి, రోడ్డు మార్గంతో అనుసంధానమైన ఊరు ఇదే.

ఈ ఊరిలో కేవలం 13 నివాసాలు, ఒక స్కూలు(ఐదుగురు విద్యార్థులు ఉన్నారు), ఒక పురాతన మఠం ఉన్నాయి.

బార్లీ, బఠానీ పంటలు పండిస్తున్నారు.

హిమాలయ పర్వతాలు Image copyright Sandipan Dutta

పట్టు సడలని స్థైర్యం

దట్టమైన మంచు కారణంగా ఇక్కడి గ్రామాలకు ఏడాదిలో దాదాపు ఆరు నెలలపాటు ఇతర ప్రాంతాలతో రవాణా మార్గాలు మూసుకుపోతాయి.

దాంతో ఇక్కడి వాళ్లు బయటకు వెళ్లడమే కష్టంగా మారుతుంది.

అయితే, అన్ని ఇబ్బందులున్నా స్థానికుల్లో ఆత్మస్థైర్యం మాత్రం చెక్కుచెదరడంలేదు. తమ జీవితం చాలా ప్రశాంతంగా, సాఫీగా సాగిపోతోందని ల్యాంగ్‌ఝా గ్రామానికి చెందిన ఓ మహిళ అన్నారు.

హిమాలయ పర్వతాలు Image copyright Sandipan Dutta

1,000 ఏళ్ల నాటి మఠాలు

స్పితి లోయలో చాలా ప్రసిద్ధి చెందిన బౌద్ధ మఠాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వెయ్యేళ్ల క్రితం నిర్మించినవి కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రజల్లో బౌద్ధమత స్ఫూర్తి కనిపిస్తోంది.

4,166 మీటర్ల ఎత్తులో ఉన్న 'కీ' అనే మఠం ఈ లోయలో అతిపెద్ద మఠం. ఎత్తైన పర్వతాల నడుమ నెలకొని ఉన్న ఈ మఠం పక్క నుంచే నది ప్రవస్తుంది.

స్థానికుల మతం, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక బాంధవ్యాలకు నెలవుగా ఈ మఠాలు నిలస్తున్నాయి.

అందరూ ప్రార్థనలు చేస్తారు. ధ్యానం చేస్తారు. సేవాభావం గురించి గురువు పాఠాలు బోధిస్తారు.

హిమాలయ పర్వతాలు Image copyright Sandipan Dutta

ఇక్కడ శతాబ్దాల కిందటి సంస్కృతి, సంప్రదాయాలు సజీవంగా కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు ఇక్కడి ప్రజల మీద కూడా గ్లోబలైజేషన్ ప్రభావం పడుతోంది.

చాలా మంది యువత పనుల కోసం పెద్ద పట్టణాలకు వెళ్తున్నారు.

ఇవి కూడా చూడండి:

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: గడ్డ కట్టే చలిలో సౌర విద్యుత్ ఉత్పత్తి , హిమాలయాల్లోని మారుమూల గ్రామాలకు విద్యుత్ కాంతులు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం