ప్రెస్‌రివ్యూ:‌ సొంత ఆదాయంలో తెలంగాణ టాప్

కె.చంద్రశేఖరరావు

ఫొటో సోర్స్, Telangana CMO

తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ధిలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందంటూ తెలంగాణ సీఎంవోను ఉటంకిస్తూ ఈనాడు పత్రిక తన కథనంలో వెల్లడించింది.

గత నాలుగేళ్లలో 17.2 శాతం సగటు వృద్ధితో తెలంగాణ స్వీయ ఆదాయంలో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని కాగ్‌ తాజా గణాంకాలు స్పష్టం చేశాయని సీఎంఓ పేర్కొంది.

14.2 శాతంతో హరియాణా రెండో స్థానంలో, 13.9 శాతంతో మహారాష్ట్ర మూడో స్థానంలో, ఒడిశా (12.4 శాతం), పశ్చిమ్‌బంగ(10.3శాతం)లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం, 2016-17లో 21.1, 2017-18లో 16.8 శాతం వృద్ధిరేటు సాధించిందని ఆ రాష్ట్ర సీఎంవో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

లోక్‌సభకు ముందస్తు.. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే దారి

ఈ ఏడాది చివర్లో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది. ముందస్తు ఎన్నికల దిశగా బీజేపీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం ఉందంటూ అందులో పేర్కొన్నారు.

''తమ అభిప్రాయాలతో ఏకీభవించే కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా ముందస్తు సంకేతాలను అందజేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుసగా రెండురోజులు ముందస్తు విషయాన్ని ప్రస్తావించడం ఈ విషయాన్ని ధృవపరుస్తోందని విశ్లేషకులంటున్నారు. ముందస్తుకు సిద్ధం కండి.. అని ఆయన తన సహచరులను అప్రమత్తం చేయడమే కాక- ప్రత్యర్థి శిబిరాల్ని నిర్వీర్యం చేసే రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించడం గమనార్హం. ముందస్తు సన్నాహాలు అనేక రాష్ట్రాల్లో కూడా కనిపిస్తున్నాయి'' అని ఆ కథనంలో విశ్లేషించారు.

''నవంబర్‌, డిసెంబర్‌‌లలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిపించేందుకు ఆయా రాష్ట్రాలను ఒప్పించాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నట్లు సమాచారం'' అని ఆ కథనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

పోలవరం ప్రాజెక్టు ఇచ్చింది బీజేపీ కాదు, కాంగ్రెస్: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును ఇచ్చింది బీజేపీ కాదు, కాంగ్రెస్‌ పార్టీ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారంటూ సాక్షి పత్రిక తన కథనంలో ప్రస్తావించింది.

ఆ కథనం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని.. 90 శాతం డబ్బులిస్తామని విభజన చట్టంలో పెట్టింది కూడా ఆ పార్టీయే అని చంద్రబాబు పేర్కొన్నారు.

2013లో వచ్చిన ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం ప్రకారం డబ్బులిస్తామని గతంలో కాంగ్రెస్‌ పార్టీ చెప్పిందని.. ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే తాను ప్రమాణం స్వీకారం చేయనని చెబితే.. ఆ మేరకు మాత్రమే బీజేపీ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు అన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నీతి ఆయోగ్‌ చెబితే రాష్ట్రానికి అప్పగించారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. అసలు ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన రూ.1,943 కోట్లను కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. డీపీఆర్‌ రెండు కూడా ఇంకా పూర్తిగా అమలు చేయలేదని, ఈ డబ్బులు వచ్చే పరిస్థితి కూడా కనబడడం లేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అరుణ మిల్లర్

అమెరికా కాంగ్రెస్‌కు కాట్రగడ్డ అరుణ మిల్లర్?

అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్ మహిళ అరుణా మిల్లర్ మేరీల్యాండ్ నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారని.. అందులో విజయం సాధిస్తే వాషింగ్టన్ రాష్ట్రం నుంచి అమెరికా ప్రతినిధుల సభలోకి ప్రవేశించనున్న రెండో ప్రవాస భారతీయ మహిళగా ఆమె నిలువనున్నారంటూ నమస్తే తెలంగాణ పత్రిక తన కథనంలో రాసింది.

ఇప్పటికే వాషింగ్టన్ నుంచి గెలుపొందిన ప్రమీలా జయపాల్ అమెరికా దిగువసభ సభ్యురాలిగా ఉన్నారు. మేరీల్యాండ్ నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి అదే పార్టీలోని సహచర నేత డేవిడ్ ట్రోన్‌తో అరుణ పోటీ పడుతున్నారు. మంగళవారం ఈ ఎన్నిక జరగనుంది.

ఇందులో విజయం సాధిస్తే డెమొక్రటిక్ పార్టీ ఆమెను తన అభ్యర్థిగా ప్రకటించనుంది. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ కంచుకోట మేరీల్యాండ్ నుంచి మిల్లర్ గెలుపు నల్లేరుపై నడకేనని ఆ కథనంలో విశ్లేషించారు.

కాగా 53 ఏళ్ల అరుణా మిల్లర్ వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్. కాట్రగడ్డ వెంకటరామారావు, హేమలత దంపతులకు 1964లో హైదరాబాద్‌లో జన్మించిన ఆమె తన ఏడేళ్ల వయసులో అమెరికా వెళ్లారు. తెలుగు అనర్గళంగా మాట్లాడటమేగాక తెలుగు సంప్రదాయాలను పాటించడం ఆమెకు ఇష్టం. డేవిడ్ మిల్లర్‌తో వివాహం తర్వాత ఆమె కాట్రగడ్డ అరుణా మిల్లర్‌గా మారారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)