ట్రంప్ టెంపుల్: ‘దేవుడు’ అమెరికాలో.. భక్తుడు బచ్చన్నపేటలో

  • 26 జూన్ 2018

పసుపు, కుంకుమ బొట్లు.. పూలమాలలు, విద్యుద్దీపాలతో అలంకరించిన పూజా మందిరం.

అందులో ఒక చిత్రపటం.. ఎదురుగా ధూపదీప నైవేద్యాలు, తీర్థ ప్రసాదాలు.

హారతి పళ్లెం, కంచు గంట.. కొబ్బరి కాయ కొట్టేందుకు రాయి.

...ఇవన్నీ చూడగానే అక్కడెవరో పూజ చేసుకుంటున్నారని వెంటనే అర్థమైపోతుంది.

మీరూహించింది నిజమే.. 'బుస్సా కృష్ణ' అక్కడ తన ఇష్టదైవానికి పూజ చేసుకుంటున్నారు.

బుస్సా కృష్ణ ఎవరు? ఆయన పూజ ఏంటి అనుకోవద్దు. బుస్సా కృష్ణ సాధారణ వ్యక్తే అయినా, ఆయన పూజ మాత్రం అసాధారణం.

అందరు భక్తుల్లా ఆయన దేవుడిని పూజించడం లేదు.

పోనీ.. సినీ ప్రేక్షకుల్లా హీరో, హీరోయిన్లను కొలవడం లేదు.

కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న మహానుభావులకు మొక్కడం లేదు.

ముకుళిత హస్తాలతో ఆయన మొక్కుతున్న ఆ చిత్ర పటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది.

అవును.. ఆయన ట్రంప్ భక్తుడు. ప్రతి రోజూ రెండు పూటలా స్నానం చేసి ట్రంప్ చిత్రపటానికి పూజలు చేస్తున్నారు.

అర్చనలు, అభిషేకాలు చేయడమే కాదు ఏకంగా తన ఇష్టదైవానికి గుడి కట్టేందుకు సిద్ధమవుతున్నారాయన.

ఎలాగైనా ట్రంప్‌ని కలిసి తలనీలాలు సమర్పిస్తాననీ చెబుతున్నారు.

చిత్రం శీర్షిక ట్రంప్ భక్తుడు బుస్సా కృష్ణ

ట్రంప్‌ని పూజించక ముందు ఆయన పేరు బుస్సా కృష్ణ.

...ట్రంప్‌ని పూజించడం మొదలుపెట్టిన తొలినాళ్లలో ఆయన పేరు ‘మెంటల్’ కృష్ణ.

...ఇప్పుడు ఆయన 'ట్రంప్ కృష్ణ' అయ్యారు.

బుస్సా కృష్ణది తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామం. సొంతూళ్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండే ఆయన సుమారు ఏడాది కిందట ట్రంప్ భక్తుడిగా మారారు.

గత ఏడాది దీపావళి రోజు నుంచి కృష్ణ తన ఇంట్లో ట్రంప్ చిత్రపటానికి నిత్య పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో పూజలు చేస్తుండటంతో పాటు నదీ తీరంలో జలాభిషేకాలు చేయడం అర్చనలు చేయడం చేస్తున్నారు.

ఓసారి వీరాభిమానంతో వేలికి గాయం చేసుకుని ఆ రక్తంలో ట్రంప్ చిత్రపటానికి తిలకం కూడా దిద్దారు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

చిత్రం శీర్షిక ట్రంప్ చిత్రపటానికి పూజలు చేస్తున్న కృష్ణ

ఆగ్రహించిన అమ్మానాన్న.. ఆటపట్టించిన స్నేహితులు

కృష్ణ తీరు చూని ఆయన తల్లిదండ్రులు తొలుత వారించారు. ఆయన చేస్తున్నదంతా భారతీయ సంస్క్రతి, సంప్రదాయాలకు వ్యతిరేకమంటూ విభేదించారు. అయినా వినకుండా పూజలు చేస్తుండటంతో తల్లిదండ్రులు సొంత ఇంటిని వదిలేసి వేరే అద్దె ఇంటికి తరలిపోయారు.

ఇక కృష్ణ స్నేహితులైతే చెప్పనవసరం లేదు. మెంటల్ కృష్ణ అంటూ ఆటపట్టించేవారు.

కానీ.. ఇప్పుడు గ్రామస్థులు తనను అర్థం చేసుకున్నారని అంటున్నారు బుస్సా కృష్ణ. ట్రంప్ కృష్ణ అని పిలుస్తూ తనకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని చెబుతున్నారు.

తన ఇంటిపరిసరాల్లో ట్రంప్‌కు శాశ్వతంగా ఆలయ నిర్మించాలనుకుంటున్నానని.. దీనికి గ్రామస్థుల సహకారం అందిస్తున్నారని చెబుతున్నారు.

చిత్రం శీర్షిక కృష్ణ ఎక్కడికి వెళ్లినా చేతి సంచిలో ట్రంప్ చిత్రపటాన్ని తీసుకెళ్లడం, పూజలు చేయడంతో స్నేహితులు కూడా ఆయన్ను ఆటపట్టించేవారు

ఎందుకింత అభిమానం?

ట్రంప్ తన కలలోకి వచ్చేవారని.. ఆయన ఫొటో చూసి రోజు మొదలుపెడితే తనకు మంచి జరుగుతుందని.. అందుకే ఆయన్ను పూజిస్తున్నానని బుస్సా కృష్ణ చెబుతున్నారు.

''2012 డిసెంబర్ 28న ట్రంప్ మొదటిసారిగా నా కలలో కనిపించారు. అప్పుడు నేను లైట్ తీసుకున్నాను. కొద్దిరోజుల తరువాత రెండోసారి కలలోకి వచ్చాడు. ఆ రోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై భారత్ గెలిచింది. ట్రంప్ నా కలలోకి వచ్చినందువల్లే భారత్ గెలిచిందని నమ్మాను. ఆ రోజు నుంచి ఉదయం లేవగానే మొదట ట్రంప్ ఫోటో చూస్తాను. ట్రంప్ ఫోటో చూస్తే నాకు మంచి జరుగుతుంది. గత ఏడాది నుంచి ట్రంప్ చిత్రానికి నిత్య పూజలు చేస్తున్నాను.. ట్రంపే నాకు దైవం. జీవితంలో ఒక్కసారైనా ట్రంప్‌ని కలిసి తలనీలాలు సమర్పించాలన్నదే నా చివరి కోరిక'' అని కృష్ణ చెప్పారు.

అయితే, ట్రంప్ ఫొటో చూస్తే మంచి జరగడం వంటివాటికి శాస్త్రీయతేమీ లేదని.. అవన్నీ కాకతాళీయంగా జరిగిన ఘటనలు కావొచ్చని హేతువాదులు చెబుతున్నారు.

చిత్రం శీర్షిక కృష్ణతో పాటు అప్పుడప్పుడు స్థానికులూ ఈ పూజల్లో పాల్గొంటున్నారు

'పిచ్చి పట్టిందనుకున్నాం'

కృష్ణ ఇలా ఒక విదేశీ వ్యక్తికి పూజలు చేయడం చూసి తొలుత భయపడ్డామని.. మూడేళ్లుగా ఆయన తీరు చూసి పిచ్చిపట్టిందని అనుకున్నామని.. దేవుళ్ల పటాల మధ్య ట్రంప్ ఫొటో పెట్టి పూజలు చేస్తుంటే ఆయన తల్లిదండ్రులు కృష్ణను ఎన్నోసార్లు అడ్డుకున్నారని, చివరకు వారు వేరే ఇంటికి మారిపోయారని స్థానికురాలు వేముల లక్ష్మి తెలిపారు. అయినా, కృష్ణ తన పూజలు మానకపోవడంతో అతనిలో భక్తిని గుర్తించి చుట్టుపక్కల వాళ్లందరం ఆయనతో పాటు అప్పుడప్పుడు ఈ పూజల్లో పాల్గొంటున్నామని లక్ష్మి చెప్పారు.

కృష్ణ సంగతి విని హైదరాబాద్ నుంచి వచ్చి చూశానని.. ఆయన ఆరాధనలో నిజాయితీ కనిపించిందని ఆయన బాల్య స్నేహితుడు రమేశ్ రెడ్డి అన్నారు.

చిత్రం శీర్షిక ట్రంప్ చేసినట్లుగా చెబుతున్న ట్వీట్.. టిమ్మీ డంకన్ దీన్ని షేర్ చేశారు.

ట్రంప్ స్పందించారంటున్న కృష్ణ.. అధ్యక్షుడి అధికారిక ఖాతాలో కనిపించని ట్వీట్

''భారత్‌కు చెందిన కృష్ణ నాకు సన్నిహిత మిత్రుడు. కోట్ల మంది భారతీయుల్లో ఆయనంటే నాకు అభిమానం. త్వరలోనే కలుస్తాను క్రిష్'' అంటూ ట్రంప్ జూన్ 19న ట్వీట్ చేశారని కృష్ణ అంటున్నారు.

తనకు ట్విటర్ అకౌంట్ లేదని, అమెరికాకు చెందిన 'టిమ్మి డంకన్' అనే ఫేస్‌బుక్ మిత్రుడి ద్వారా తాను తెలుసుకున్నట్లు కృష్ణ చెప్పారు.

అయితే... డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి జూన్ 19న నేరుగా అలాంటి ట్వీట్లేమీ లేవని బీబీసీ తెలుగు గుర్తించింది.

కాగా కృష్ణ.. క్రిష్ రాజ్ పేరుతో ఒక ఫేస్‌బుక్ పేజీ ద్వారా కూడా తన ట్రంప్ పూజల చిత్రాలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

క్రిష్ రాజ్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో జూన్ 19న కృష్ణ పెట్టిన పోస్టింగుకు వచ్చిన కామెంట్లలో 'Timmy Duncan' అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ ట్వీట్ ఇమేజ్ పోస్ట్ చేశారు.

క్రిష్ పేరు ప్రస్తావిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారంటూ టిమ్మీ డంకన్ ఆ చిత్రాన్ని కృష్ణకు పంపించారు.

ట్రంప్ ట్వీట్ నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఆయన్ను నిత్యం పూజిస్తున్న కృష్ణ.. ‘‘భారతీయులంటే ట్రంప్‌కు మరింత అభిమానం కలగాలన్నదే తన కోరికని’’ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)