ఏసీ‌ ‘టెంపరేచర్’ 24°C చేయాలని కేంద్రం ఆలోచన - అలా చేస్తే ఏమవుతుంది?

  • 27 జూన్ 2018
ఏసీ 24 డిగ్రీలు చేస్తే ఏమవుతుంది Image copyright BBC/KIRTISH

'చాలా వేడిగా ఉంది గురూ, ఏసీ 18లో పెట్టు'. ఈ మాట మనం తరచూ వింటూ ఉంటాం. మే, జూన్‌లో చిరచిరలాడించే ఎండయినా, వర్షాల తర్వాత జులై, ఆగస్టుల్లో ఉండే ఉక్కపోత అయినా దిల్లీ సహా ఉత్తర భారతంలో పలు చోట్ల ఎయిర్ కండిషనర్లు లేకుంటే ఉండడం చాలా కష్టం.

ఒకప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఏసీ పెట్టుకుంటే వాళ్లు బాగా డబ్బున్నవాళ్లు అని చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు గోడలు, కిటికీల బయట ఏసీలు కనిపించడం సాధారణం అయిపోయింది.

ఏసీ ఇప్పుడు మరో కారణంతో చర్చలోకి వచ్చింది. ఏసీని ఇక 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎగువన నడిపించాల్సి ఉంటుందని వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం కొంతే.

పూర్తి నిజం ఏంటంటే, విద్యుత్ మంత్రిత్వశాఖ ఏసీ డిఫాల్ట్ సెట్టింగ్ 24 డిగ్రీల సెల్సియస్ ఉంటే కరెంటు ఆదా అవుతుందని సలహా ఇస్తోంది.

వచ్చే ఆరు నెలలపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల స్పందన తెలుసుకోవాలని భావిస్తోంది.

అంతా అనుకున్నట్టే జరిగితే, ప్రభుత్వం ఏసీని 24 డిగ్రీల దగ్గర సెట్ చేయడం తప్పనిసరి చేసే ఆలోచనల్లో ఉంది. అలా చేయడం వల్ల ఏడాదికి 20 బిలియన్ యూనిట్లు ఆదా చేయవచ్చని మంత్రిత్వశాఖ భావిస్తోంది.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మొత్తం విషయాన్ని మరింత అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు.

"ఏసీలో ఒక డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచడం వల్ల 6 శాతం ఎనర్జీ ఆదా అవుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతను 21 డిగ్రీలకి బదులు 24 డిగ్రీలకు సెట్ చేయడం వల్ల 18 శాతం ఎనర్జీ ఆదా అవుతుంది" అని తెలిపారు.

‘గదిలో ఉష్ణోగ్రత తగ్గించి ఉంచడానికి కంప్రెసర్‌ ఎక్కువ సేపు శ్రమించాల్సి ఉంటుంది. 24 నుంచి 18 డిగ్రీలకు సెట్ చేసినంత మాత్రాన, ఉష్ణోగ్రత నిజంగా అంతకు తగ్గిపోవడం అనేది జరగదు.’ అని విద్యుత్ మంత్రి చెప్పారు.

Image copyright BBC/KIRTISH

ఏసీ గురించి చర్చ ఎందుకు?

కానీ ఇదంతా ఎందుకు? మన ఏసీ ఎంత ఉష్ణోగ్రతలో ఉండాలో నిజంగా ప్రభుత్వం నిర్ణయించేస్తుందా? అలా చేసినా దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏసీ టెంపరేచర్ ఎక్కువ ఉంచడం వల్ల ప్రకృతిని కాపాడగలమా?

సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ మేనేజర్ ( సస్టైనబుల్ స్టడీస్) అవికల్ సోమవంశి బీబీసీతో ఈ విషయంపై మాట్లాడారు. "ప్రభుత్వం దీనిని ప్రయోగించి చూడాలనుకుంటోంది" అని తెలిపారు.

"ఇందులో భాగంగా ఏసీలు తయారు చేసే కంపెనీలకు, ఎయిర్ కండిషనర్లలో డిఫాల్ట్ సెటింగ్ 24 డిగ్రీల దగ్గర ఉంచాలని చెప్పవచ్చు. దాంతో ఏసీ కంపెనీలు 18 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఈ ఉష్ణోగ్రతను ఉంచుతాయి".

"ఒకవేళ ఇది ఫలిస్తే, తర్వాత తయారు చేసే ఏసీల్లో 24 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత డీఫాల్ట్‌గా ఉండేలా సెట్ చేస్తారు. దాంతో వినియోగదారులు అవసరమైనప్పుడు తక్కువ లేదా ఎక్కువ చేసుకోడానికి వీలవుతుంది". అని సోమవంశీ చెప్పారు.

"విద్యుత్ పొదుపు, ప్రకృతిని కాపాడే విషయానికి వస్తే ఇది చాలా మంచి నిర్ణయం కావచ్చు" అని వివరించారు.

నిజానికి ఏసీలను గది ఉష్ణోగ్రతను 18 డిగ్రీలకు తగ్గించడం కోసం తయారు చేయలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏసీ ఉష్ణోగ్రత 18-20 సెల్సియస్ సెట్ అవుతుంది. జనం దాన్ని మార్చాలని కూడా అనుకోరు. అలా చేయడం వల్ల అవి ఎక్కువ ఎఫిషియంట్‌గా ఉండవు. ఎక్కువ కరెంటు కాలుస్తాయి.

Image copyright EPA

ఏసీ ఏ నిజాన్ని చూపిస్తుంది?

"మీకొక విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏసీ బోర్డు ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ చూపిస్తున్నప్పుడు గది ఉష్ణోగ్రత నిజానికి అంత ఉండదు".

ఏసీ డీఫాల్ట్ ఉష్ణోగ్రతలను నిర్ణయించే ప్రయత్నం ఇదే మొదటి సారి కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా అలా జరిగింది. జపాన్‌లో 28, హాంగ్‌కాంగ్‌లో 25.5, బ్రిటన్‌లో 24 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉండాలని నిర్ణయించారు.

కానీ ఇదంతా కొత్త ఏసీల్లో మాత్రమే సాధ్యం. ఎప్పటి నుంచో ఇళ్లలో అమర్చిన లక్షల ఏసీలను మార్చడం ఎలా. "విద్యుత్ మంత్రిత్వశాఖ తరఫున వచ్చిన ప్రకటన స్పష్టంగా ఏదీ చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న ఏసీ ఉష్ణోగ్రతను కూడా 24 లేదా అంతకంటే ఎక్కువ ఉంచేలా ప్రోత్సహిస్తామని సంకేతాలు ఇస్తోంది". అని సోమవంశీ తెలిపారు.

ప్రభుత్వం చేసిన కొత్త ప్రతిపాదనకు ఏసీ కంపెనీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ చెబుతోంది. కానీ ఏసీలకు డిఫాల్ట్ ఉష్ణోగ్రత సెట్ చేసే ప్రయత్నం 2016 నుంచీ ఉంది. దానిపై వ్యతిరేకత కూడా వ్యక్తమైంది.

ఇంతకు ముందు ఏసీ ఆన్ చేయగానే ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ ఉండాలనే ప్రతిపాదన ఉంచారని సీఎస్ఈ చెబుతోంది. అలా జరిగితే, వినియోగదారులకు సమస్యగా ఉంటుందని, ఏసీ వేసిన ప్రతిసారీ వాళ్లు దాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని కంపెనీలు చెప్పాయి.

దేశంలోని భవనాలన్నింటికీ ఇండోర్ కంఫర్ట్‌ స్టాండర్డ్స్ నిర్ణయించే నేషనల్ బిల్డింగ్ కోడ్(ఎన్‌బీసీ) సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ భవనాల్లో ఏసీ ఉష్ణోగ్రత 23.5-25.5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంచవచ్చని, ఇళ్లలో ఉండే ఏసీ విషయానికి వస్తే అది 29 డిగ్రీల వరకూ ఉండవచ్చని చెప్పింది.

Image copyright EPA

సరైన టెంపరేచర్ ఎంత?

2005లో జపాన్‌ అంతటా దీనిపై ప్రచారం చేశారు. కంపెనీలు, నివాసాల్లో ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచేలా ప్రోత్సహించారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా దీనికి ప్రమాణాలు నిర్ణయించారు. వేసవిలో 25.6 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండకూడదని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ దీనిని 23.3-25.6 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచాలని చెప్పింది. అదే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ 24 డిగ్రీల సెల్సియస్ దగ్గరగా ఉండాలని సూచించింది.

"నిజానికి ఏ కుటుంబం విద్యుత్ బిల్లు చూసినా, అందులో 80 శాతం ఏసీ వినియోగమే ఉంటుంది" అని సీఎస్ఈ తెలిపింది. ఒక అధ్యయనం ప్రకారం దిల్లీలో వేసవి నెలల్లో ఎంత విద్యుత్ వినియోగిస్తారో, అందులో సగానికి పైగా ఇంటిని చల్లబరచడానికే ఖర్చు చేస్తున్నారు.

ఎయిర్ కండిషనర్ నడవడానికి ఎక్కువ విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది. అదనపు విద్యుత్ వాడకం మన పర్యావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది.

సీఎస్ఈ ఒకప్పుడు చేసిన అధ్యయనంలో బయటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ 25 శాతం ఎక్కువ విద్యుత్ కాలుస్తుంది. దాని చల్లబరిచే సామర్థ్యం 13-15 శాతం తగ్గిపోతుంది అని తేలింది.

ఏసీ వర్సస్ కూలర్

ఏసీ వేడిని తరిమేస్తుందా? ఈ ప్రశ్నపై అవికల్ సోమవంశీ స్పందిస్తూ.. "ఏసీ నుంచి బయటకు వచ్చే వేడి, ప్రకృతి ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఏసీ మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఏసీ ఇంట్లో వేడిని బయటకు పంపిస్తుంది. అది వేడిని చల్లార్చదు, దాని చోటును మారుస్తుంది.. అంతే’’ అని చెప్పారు.

‘అదే డెజర్జ్ కూలర్ విషయానికి వస్తే ఇక్కడ మరో టెక్నాలజీ పనిచేస్తుంది. కూలర్ వేడి గాలిని తీసుకుని దానిని లోపల తిప్పుతుంది. నీటి సాయంతో అది గాలిని చల్లబరుస్తుంది. తర్వాత బయటకు పంపుతుంది. కూలర్‌లో వచ్చే సమస్య ఏంటంటే, భారత్‌లో దానికి ఏసీ, ఫ్యాన్లకు ఉన్నట్టు ఎలాంటి స్టార్ రేటింగ్స్ ఉండవు’ అని వివరించారు.

భారత్‌లో చాలా వేడిగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఉండే ప్రజలకు ఆ వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది. అలాంటప్పుడు ఏసీని 18 లేదా 20 దగ్గర పెట్టాల్సిన అవసరం సాధారణంగా ఉంటుందని చెప్పలేం.. అని సోమవంశీ అన్నారు.

యూరప్‌లోని కొన్ని దేశాల్లో ఉష్ణోగ్రత 28 డిగ్రీలు దాటినప్పుడు, వేసవి రికార్డులు బద్దలయ్యాయని అక్కడివాళ్లు చెప్పుకుంటారు. అదే భారత్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణం. అని ఆయన అన్నారు.

కానీ ఏసీ, కూలర్ సాయంతో మాత్రమే వేడి నుంచి ఉపశమనం పొందగలమా? భవనాలు నిర్మించే పదార్థాలు, వాటి డిజైన్ కూడా వేడి పెంచేలా ఉండడం భారత్‌లో పెద్ద సమస్యగా మారిందని కొందరు నిపుణులు అంటున్నారు.

"ఇక్కడ ఎక్కువ ఇళ్లను కాంక్రీట్‌తో కడుతారు. జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇళ్లు దగ్గరగా ఉంటాయి. దానికి తోడు భవనాలు నిర్మించేటపుడు వెంటిలేషన్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. రాత్రిళ్లు ఇళ్లలో చల్లదనం లేకపోవడానికి కారణం అదే" అంటారు సోమవంశీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?

'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం

వీళ్లు ఐసిస్ మిలిటెంట్ల పిల్లలు.. ఏతప్పూ చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు

మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?

ఇంక్లవ్ డేటింగ్ యాప్: వీలైతే వికలాంగులతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ, అన్నీ కలిస్తే అంతకు మించి

రూటు మారుస్తున్న కిమ్: ఎడాపెడా తనిఖీలు, చెడామడా తిట్లు

‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?

అయోమయంలో అమెరికా.. రష్యా జోక్యంపై ట్రంప్‌దో మాట, ఇంటెలిజెన్స్‌ది ఇంకో మాట