'వందేమాతరం' రచయిత బంకిమ్ చంద్ర గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే

  • 27 జూన్ 2018
బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ Image copyright Twitter@RailMinIndia

బంగ్లా భాషలోని అగ్ర రచయితల్లో ఒకరుగా భావించే బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ తన రచనలతో కేవలం బంగాలీ సమాజాన్నే కాదు, మొత్తం దేశాన్నే ప్రభావితం చేశారు.

బంకిమ్ చంద్ర ఉన్నత విద్యావంతుడు, రచయిత. ప్రచురితమైన ఆయన తొలి రచన బంగ్లా కాదని, ఆంగ్లమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాని పేరు 'రాజ్‌మోహన్స్ వైఫ్'

1838లో సంప్రదాయ, సంపన్న బెంగాలీ కుటుంబంలో జన్మించిన బంకిమ్ చంద్ర మొదటి బంగాలీ రచన 'దుర్గేష్‌నందిని'

దుర్గేష్‌నందిని ఒక నవల. కానీ తర్వాత మెల్లగా తన అసలు ప్రతిభ కవిత్వంలోనే ఉందనే విషయం ఆయనకు అర్థమైంది. దాంతో ఆయన కవితలు రాయడం ప్రారంభించారు.

ఎన్నో ప్రముఖ సాహిత్య రచనలు అందించిన బంకిమ్ విద్యాభ్యాసం హుగ్లీ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్‌లో నడిచింది.

Image copyright www.museumsofindia.gov.in

'దుర్గేష్‌నందిని' ప్రచురణ

ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారత్‌లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగిన 1857లోనే ఆయన బీఏ పాస్ అయ్యారు. 1869లో ఆయన లా డిగ్రీ అందుకున్నారు.

బంకిమ్ కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయన ఒక ప్రభుత్వ అధికారి కూడా. ఎన్నో ఉన్నత ప్రభుత్వ పదవుల్లో ఆయన ఉన్నారు. 1881లో ప్రభుత్వ సేవల నుంచి రిటైర్ అయ్యారు. ఆయన తండ్రి కూడా ప్రభుత్వ అధికారిగా పని చేశారు.

ఆయనకు 11 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. తర్వాత కొన్నేళ్లకే ఆయన భార్య చనిపోయింది. ఆ తర్వాత ఆయన రాజ్యలక్ష్మీ దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు పుట్టారు.

1865లో దుర్గేష్‌నందిని ప్రచురితమైంది. కానీ అప్పుడు దాని గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ తర్వాత ఏడాదికే 1866లో ఆయన తర్వాత నవల 'కపాల కుండల' చాలా పేరు తెచ్చుకుంది.

1872 ఏప్రిల్‌లో ఆయన బంగదర్శన్ పేరుతో ఒక పత్రిక ప్రచురణ ప్రారంభించారు. అందులో ఆయన విమర్శనాత్మకమైన సాహిత్య-సాంఘిక, సాంస్కృతిక అంశాలను లేవనెత్తేవారు. అప్పటివరకూ రొమాంటిక్ రచనలు రాసిన ఒక వ్యక్తికి అది కీలక మలుపు.

Image copyright Anand Math Movie

జాతీయవాదానికి చిహ్నం

రామకృష్ణ పరమహంస సమకాలీనులు, ఆయన సన్నిహిత మిత్రుడు అయిన బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ ఆనంద్‌మఠ్ రచించారు. తర్వాత దానికి వందేమాతరం గీతాన్ని కలిపారు. అది అలా చూస్తూ చూస్తూనే దేశవ్యాప్తంగా జాతీయవాదానికి ప్రతీకగా మారిపోయింది.

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి బాణీని సిద్ధం చేశారు. వందేమాతరం జనాదరణ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది.

1894 ఏప్రిల్లో బంకిమ్ చంద్ర మరణించారు. తర్వాత 12 ఏళ్లకు విప్లవకారుడు బిపిన్ చంద్రపాల్ ఒక రాజకీయ పత్రిక ప్రచురించడం ప్రారంభించారు. దానికి ఆయన వందేమాతరం అనే పేరు పెట్టారు.

లాలా లాజ్‌పత్ రాయ్ కూడా అదే పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు.

బహుముఖ ప్రజ్ఞావంతులు, జాతీయవాది, రచయిత అయిన బంకిమ్ చంద్రలో హాస్య చతురత ఉన్న వ్యక్తి కూడా కనిపిస్తారు. ఆయన హాస్యం-వ్యంగ్యం నిండిన 'కమలాకాంతేర్ దఫ్తర్' లాంటి రచనలు కూడా చేశారు.

Image copyright Getty Images

వందేమాతరంతో జతకలిసిన ఎన్నో అంశాలు

స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందేమాతరంను జాతీయగేయంగా స్వీకరించలేదు, దానికి జాతీయగీతం హోదా కూడా దక్కలేదు.

కానీ రాజ్యాంగబద్ధంగా సభ అధ్యక్షుడు, భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ 1950, జనవరి 24న వందేమాతరం గీతానికి జాతీయ గేయం హోదా ఇస్తున్నట్టు ప్రకటించారు.

వందేమాతరం చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బంకిమ్ చంద్ర వందేమాతరం గీతాన్ని 1870 దశకంలో రచించారు.

ఆయన భారతదేశాన్ని దుర్గాదేవి రూపంగా భావిస్తూ దేశప్రజలందరినీ ఆమె సంతానంగా చెప్పారు. భారతదేశాన్ని అంధకారం, బాధలు చుట్టుముట్టిన తల్లిగా వర్ణించారు. తల్లికి నమస్కరించి, ఆమెను దోపిడీ నుంచి రక్షించమని పిల్లలైన దేశ ప్రజలను బంకిమ్ చంద్ర కోరారు.

భారతదేశాన్ని దుర్గా మాత రూపంగా వర్ణించడంతో తర్వాత సంవత్సరాలలో ముస్లిం లీగ్, ముస్లిం సమాజంలోని ఒక వర్గం వందేమాతరం గీతాన్ని అనుమానాస్పద దృష్టితో చూడడం ప్రారంభించాయి.

Image copyright Topical Press Agency/Getty Images

గురుదేవ్ సలహా తీసుకున్న నెహ్రూ

ఈ వివాదంతో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వతంత్ర భారత దేశం జాతీయ గేయంగా స్వీకరించడానికి వెనకాడారు.

దేశానికి దేవుడి రూపం ఇవ్వడాన్ని, దానిని పూజించమని చెప్పడాన్ని వ్యతిరేకించే ముస్లింలీగ్, ముస్లింలు కూడా వందేమాతరంను వ్యతిరేకించారు.

స్వయంగా వెళ్లి రవీంద్రనాథ్ ఠాగూర్‌ను కలిసిన నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వాతంత్రోద్యమం మంత్రంగా చేయడానికి ఆయన అభిప్రాయం కోరారు.

బంకిమ్ చంద్ర కవితలను, ఆయన దేశభక్తిని రవీంద్రనాథ్ ఠాగూర్ అభిమానించేవారు. వందేమాతరంలోని మొదటి రెండు శ్లోకాలను బహిరంగంగా పాడవచ్చని నెహ్రూకు ఆయన చెప్పారు..

అయితే, బంకిమ్ చంద్ర దేశభక్తిపై ఎవరికీ అనుమానం లేదు.

ఆయన ఆనంద్‌మఠ్ రచించినపుడు అందులో ఆయన బెంగాల్‌ను పాలించే ముస్లిం రాజులు, ముస్లింలను ఉటంకిస్తూ ఎన్నో వాక్యాలు రాశారు. దీంతో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు ఏర్పడ్డాయి.

అయినా, వందేమాతరంను ఎన్నో ఏళ్ల ముందే ఆయన ఒక కవిత రూపంలో రాశారు. కానీ ఆ తర్వాత ప్రచురితమైన ఆనంద్‌మఠ్ నవలలో దానిని భాగం చేశారు.

Image copyright ANAND MATH MOVIE

ముస్లిం విరోధి అని చెప్పలేం

ఆనంద్‌మఠ్ కథ 1772లో పూర్ణియా, దానాపూర్, తిర్హుత్‌లో ఆంగ్లేయులకు, స్థానిక ముస్లిం రాజలకు వ్యతిరేకంగా సన్యాసుల తిరుగుబాటు ఘటనల ప్రేరణగా తీసుకుని రాశారు.

ఆనంద్‌మఠ్ కథ అంతా హిందూ సన్యాసులు, ముస్లిం పాలకులను ఎలా ఓడించారనేదానిపై సాగుతుంది. ఆనంద్‌మఠ్‌లో బంగాల్ ముస్లిం రాజులను బంకిమ్ చంద్ర చాలా విమర్శించారు.

అందులో ఒక దగ్గర ఆయన "మేం మా మతం, కులం, గౌరవం, కుటుంబం పేరు పోగట్టుకున్నాం. మేం మా జీవితాన్ని వదులుకుంటాం. ఈ..... (లను) తరిమేయనంతవరకూ, హిందువులు తమ మతాన్ని ఎలా రక్షించుకోగలరు" అని రాశారు.

చరిత్రకారులు తనికా సర్కార్ అభిప్రాయం ప్రకారం "బంకిమ్ చంద్ర ఒకటి అనుకునేవారు, భారతదేశంలోకి ఆంగ్లేయులు రావడానికి ముందే, ముస్లిం పాలకుల వల్ల బెంగాల్ నాశనం అయ్యిందని భావించారు. 'బంగ్లా ఇతిహాసేర్ సంబంధే ఎక్టీ కోథా'లో బంకిమ్ చంద్ర "మొఘలుల విజయం తర్వాత బంగాల్ సంపద బంగాల్‌లో ఉండలేదు, దిల్లీకి తరలించుకు పోయారు" అని రాశారు.

కానీ ప్రముఖ చరిత్రకారులు కేఎన్ పణిక్కర్ "బంకిమ్ చంద్ర రచనల్లో ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా కొన్ని వాక్యాలు ఉన్నంత మాత్రాన వాటి ఆధారంగా బంకిమ్ ముస్లిం వ్యతిరేకి అని చెప్పలేం. ఆనంద్‌మఠ్ అనేది ఒక సాహిత్యం" అన్నారు.

"బంకిమ్ చంద్ర ఆంగ్లేయుల పాలనలో ఒక ఉద్యోగి, అంగ్లేయుల గురించి రాసిన భాగాలను ఆనంద్‌మఠ్ నుంచి తొలగించాలని ఆయనపై ఒత్తిడి ఉండేది. 19వ శతాబ్దం చివర్లో జరిగిన ఈ రచనను ఆ సమయంలో ఉన్న పరిస్థితులను సందర్భాలను బట్టి చదివి, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు