తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే

  • 27 జూన్ 2018
భగవాన్ Image copyright Praveen/bbc

ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో తమిళనాడుకు చెందిన ఓ స్కూల్ విద్యార్థులు తమ ప్రియమైన టీచర్ వేరే స్కూల్‌కు బదిలీపై వెళ్లడాన్ని తట్టుకోలేకపోయారు.

వెళ్లొద్దంటూ ఆయన కాళ్లు పట్టుకున్నారు. కంటతడి పెట్టుకున్నారు. నినాదాలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో టీచర్ భగవాన్ బదిలీని తమిళనాడు ప్రభుత్వం తాత్కాలికంగా ఆపేసింది.

తాను బదిలీపై వెళ్తున్నానని తెలిసిన వెంటనే విద్యార్థులు చూపిన ప్రేమను గురించి భగవాన్ బీబీసీతో గుర్తు చేసుకున్నారు.

ఆయన ఏపీకి సరిహద్దుల్లో ఉండే తిరువళ్లూరు జిల్లాలోని వెలియాగరం పాఠశాలలో పని చేస్తున్నారు.

ఈ పాఠశాల ఏపీలోని నగరి రైల్వే స్టేషన్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Image copyright Prveen/bbc

నేను ఊహించలేదు

''నా విద్యార్థుల దృష్టిలో ఇంత గొప్పస్థాయిలో ఉంటానని ఊహించలేదు. నా పనితీరుతో వాళ్ల హృదయాలను గెలుచుకున్నాని అర్థమైంది. బదిలీపై వెళ్తున్నానని తెలియగానే వాళ్లందరూ కంటతడి పెట్టారు. కాళ్లు పట్టుకొని వెళ్లొద్దని ప్రాధేయపడ్డారు. నినాదాలు చేశారు. నేను కూడా వాళ్లను వదిలి వెళ్లలేను'' అని భగవాన్ అన్నారు. నాలుగేళ్లుగా ఆయన వెలియాగరమ్ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు.

విద్యార్థుల హృదయంలో ఈ స్థాయిలో స్థానం సంపాదించుకోడానికి భగవాన్ ఏ మాయ చేశారు? ఇదే విషయాన్ని ఆయనను అడిగితే,

'నాకు కూడా తెలియదు. అయితే, నేనెప్పుడు కొత్త పద్ధతుల్లో పిల్లలకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నించా. వాళ్లను ఉత్సాహపరిచేలా బోధించా. పాఠాలను కథలాగా, వీడియోలతో చెప్పేవాడ్ని. వాళ్లకు చెప్పిన పాఠాలను వారానికి ఒకసారి వీడియో తీసి మళ్లీ వాళ్లకు చూపించేవాడ్ని. నేను ఈ స్కూల్‌కు వచ్చిన ఆరు నెలల తర్వాత ఒక విద్యార్థి చెర్రీ ఫ్రూట్స్ రుచిచూడండి అని నాకు ఇచ్చాడు. అప్పుడే వారి మీద నా ప్రభావం ఉందని అర్థమైంది. ఏదో పాఠాలు చెప్పడమే కాదు వారి హృదయాల్లో నిలిచిపోయానని తెలిసింది’’ అని భగవాన్ బీబీసీతో అన్నారు.

Image copyright Praveen/bbc

పాఠాలు మాత్రమే చెప్పరు..

భగవాన్ గురించి విద్యార్థులను అడిగినప్పుడు అందరూ అతనితో ఉన్న అనుబంధాన్ని కథలుకథలుగా చెప్పారు.

'మా నాన్న తాగుబోతు. టీచర్ ఆయనతో మాట్లాడి మందు తాగడం మాన్పించారు. నా బాధను కూడా పోగొట్టారు' అని హేమాశ్రీ అని విద్యార్థిని బీబీసీకి తెలిపింది.

విద్యార్థులందరూ ఆయన గురించి చెప్పేదొకటే...''ఆయన మమ్మల్ని ప్రేమగా చూస్తారు. కేవలం పాఠాలు మాత్రమే చెప్పరు. మా సంతోషాలను, బాధలను కూడా పంచుకుంటారు అని.''

విద్యార్థుల ఆహ్వానం మేరకు వారి గ్రామంలో జరిగిన ఉత్సవానికి భగవాన్ ఒకసారి హాజరయ్యారు. అప్పటి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ఆయనకు సత్సంబంధాలు పెరుగుతూ వచ్చాయి.

‘'నా విద్యార్థుల కుటుంబాల ఆర్థిక నేపథ్యాన్ని అర్థం చేసుకోగలను. చదువులో వారు ఒక్కోసారి వెనకబడటానికి కారణాలు తెలుసు. అందుకే వారికి మరింత చొరవగా, ప్రేమతో పాఠాలు చెప్పాను. '' అని భగవాన్ పేర్కొన్నారు.

Image copyright Praveen/bbc
చిత్రం శీర్షిక వెలిగరమ్ పాఠశాల

మాకు గర్వంగా ఉంది

భగవాన్ బదిలీపై ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అరవింద్‌ బీబీసీతో మాట్లాడుతూ, 'ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్, స్టూడెంట్ నిష్పత్తిని మేం పాటించాలి.

నిబంధనల ప్రకారం ఈ స్కూల్ నుంచి ఇద్దరు జూనియర్ టీచర్ల బదిలీ కావాలి. భగవాన్ అందులో ఒకరు. అయితే, మా విద్యార్థులు ఆయనతో ఇంతలా మమేకం అవడం ఆనందాన్ని కలిగించింది.

కానీ, ఆయనను ఇక్కడే ఉండేలా చేసే అధికారం మాకు లేదు. నిబంధనలను పాటించాల్సిందే. అయితే, విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని భగవాన్ బదిలీని తాత్కాలికంగా నిలివేసినట్లు మాకు సమాచారం అందింది'' అని తెలిపారు.

''భగవాన్ మాదిరిగా టీచర్లందరూ విద్యార్థుల హృదయాలను గెలుచుకుంటే విద్యావేత్తలు చాలా సంతోషిస్తారు. ప్రభుత్వ పాఠశాలల గురించి గర్వంగా మాట్లాడుకునేలా భగవాన్ పనిచేశారు. మా స్కూల్ టీచర్ గురించి అందరు మాట్లాడుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది'' అని అరవింద్ చెప్పారు.

భగవాన్ మాతృభాష తెలుగు

తమిళనాడు పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తున్న భగవాన్ మాతృభాష తెలుగు.

తమిళనాడులోని దొమ్మరాజు పేటలో ఉంటున్న వీరిది చేనేత కుటుంబం. వీరంతా ఇంట్లో తెలుగే మాట్లాడుతారు.

తమిళనాడులో ఉండటం వల్ల భగవాన్ చిన్నప్పటి నుంచి తమిళంలో చదువుకుని అక్కడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు.

కొన్ని వందల సంవత్సరాల కిందట తమ పూర్వీకులు ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉంటారని ఈ సందర్భంగా భగవాన్ బీబీసీ తెలుగుకు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)