దక్షిణాది రాష్ట్రాల సీఎంలను మోదీ చిన్నచూపు చూస్తున్నారా

  • 28 జూన్ 2018
నరేంద్ర మోదీ Image copyright Sean Gallup/Getty Images

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవడానికి ఒక దక్షిణాది ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రయత్నించగా ఆయనకు తిరస్కారమే ఎదురైంది.

అలాగే, ఓ కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యమంత్రి మోదీ అపాయింట్ మెంట్ కోసం రెండు నెలల కిందట లేఖ రాశారు. కానీ, ఇప్పటికీ దానిపై స్పందన లేదు.

ఈ ఇద్దరు దక్షిణాది ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర సమస్యలను ప్రధానితో చర్చించేందుకే ఎదురు చూస్తున్నారు.

రాష్ట్రానికి ఆహార ధాన్యాల సరఫరా పెంపుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్ని పార్టీల ప్రతినిధులతో కలసి ప్రధానితో సమావేశం కావాలని వేచి చూస్తున్నారు.

అలాగే, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా కేంద్రపాలిత ప్రాంతం సాకుతో కేంద్రం ఆర్థికసాయం అందించకపోవడంపై చర్చించడానికి ఎదరుచూస్తున్నారు.

‘ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాను. రెండు నెలల కిందట పీఎంవోకు లేఖ కూడా రాశాను. కానీ, ఇప్పటి వరకు నాకు సమాధానం రాలేదు.’ అని నారాయణస్వామి బీబీసీకి తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

ప్రధానమంత్రి మోదీ, ఆయన కార్యాలయం నుంచి ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నది కేరళ, పుదుచ్చేరి మాత్రమే కాదు. చాలా దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వ సంబంధాలు సరిగా లేవు.

కాగా, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను మోదీ సర్కారు నెరవేర్చడం లేదని, నాలుగేళ్లు ఎదురుచూసినా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకుంటున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జోనల్ వ్యవస్థపై చర్చించడం కోసం ఇటీవల దిల్లీ వెళ్లగా ఆయనకు ప్రధానమంత్రితో అపాయింట్‌మెంట్ దొరకలేదని వార్తలొచ్చాయి.

ఇక, కర్ణాటకలో ఎన్నికల ఫలితాలతో బీజేపీ కంగుతింది. కుమారస్వామి సీఎం అయ్యారు. ఈ రాష్ట్రం విషయంలోనూ కేంద్రం వైఖరిలో మార్పేమీ లేదు.

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు వివాదం ముగిసిన మరుసటి రోజు కావేరీ నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆ బోర్డు నిర్ణయం వెలువడిన తర్వాత, కావేరీ నుంచి కర్ణాటకకు ఎంత, దిగువన ఉన్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరీలకు ఎంతెంత నీటిని విడుదల చేయాలన్నది కేంద్రం నిర్ణయిస్తుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ప్రధాని మోదీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ

'రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని.. గవర్నర్ సమీక్షలా?'

బీజేపీతో స్నేహపూరితంగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న తమిళనాడులో.. రాజ్‌భవన్ వెళ్లే మార్గాలను దిగ్బంధించి, ధర్నా చేస్తానన్న డీఎంకే నేత స్టాలిన్‌ను ఐపీసీ నిబంధనల కింద శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ హెచ్చరించారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టి, జిల్లాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో గవర్నర్ 'సమీక్ష' నిర్వహించడంపై డీఎంకే అభ్యంతరం చెప్పింది.

మాజీ ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న అరోపణలు వచ్చాయి.

"రాష్ట్రాలపై పెత్తనం చెలాయించడంపై ప్రధాన మంత్రి లేదా దిల్లీలోని ఆయన కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. బహుశా.. అన్నీ కేంద్రం చేతుల్లోనే ఉండాలని వారు అనుకుంటున్నారేమో" అని కేరళ ఆర్థిక మంత్రి డాక్టర్ థామస్ ఐజాక్ విమర్శించారు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రధానమంత్రిని కలిసేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ అపాయింట్‌మెంట్ అడిగారు.

"కేరళకు ఎయిమ్స్ మంజూరు చేయాలని అడిగితే నిరాకరించారు. మా రాష్ట్రంలో 1960 నుంచి పౌరసరఫరాల విభాగం సమర్థవంతంగా పనిచేస్తోంది. కానీ, ఆహార భద్రత చట్టంతో మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆహార ధాన్యాల కోటాను పెంచాలని కోరుతున్నాం. ఈ విషయాలన్నింటినీ ప్రధానితో చర్చించేందుకు అపాయింట్‌మెంట్ అడిగితే.. ఇవ్వడంలేదు" అని థామస్ ఐజాక్ బీబీసీతో చెప్పారు.

Image copyright Getty Images

సమస్య ఏమీ లేదు: బీజేపీ ఎమ్మెల్యే

కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ మాత్రం ప్రధాని మోదీ, పినరయి విజయన్‌‌ల మధ్య ఎలాంటి సమస్యలూ లేవని అంటున్నారు.

"ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కేరళలో బీజేపీ బలపడటం సీపీఎంకు మింగుడుపడటం లేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచి పనులు చేయించుకోవాలని వాళ్లు ఆలోచిస్తున్నారు. ప్రధానిని కలిసేందుకు అసలు వాళ్లు వెళ్లనే లేదు. వాళ్ల పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం కోసం దిల్లీ వెళ్లారు. పినరయి విజయన్ ప్రధానితో ఏం చర్చించాలనుకుంటున్నారో చెప్పాలని పీఎంఓ అడిగింది. వాళ్లు చెప్పిన అంశం పౌరసరఫరాల శాఖకు సంబంధించింది కాబట్టి, ఆ శాఖ మంత్రి వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రికి పీఎంఓ సూచించింది. అందులో తప్పేముంది?" అని రాజగోపాల్ ప్రశ్నించారు.

ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు ఎంజీ రాధాకృష్ణన్ బీబీసీతో మాట్లాడుతూ.. "ప్రధాని మోదీకి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్నంత వ్యక్తిగత విరోధం, పినరయితో ఉందని నేను అనుకోవట్లేదు. మొదట్లో కేరళ మీద ప్రధాని చాలా శ్రద్ధ చూపించారు, కానీ.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా పలుమార్లు వచ్చారు. అయినా, ఏమీ ప్రయోజనం కలుగలేదు" అని అన్నారు.

"గతంలో ప్రధానిని కలిసేందుకు ఏ ముఖ్యమంత్రికీ ఇబ్బంది ఎదురుకాలేదు. ఇప్పుడు మాత్రం అలాంటి ఇబ్బందులను చూస్తున్నాం. బీజేపీ ప్రాబల్యం పెద్దగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతం మీద ప్రధాని పెద్దగా ఆసక్తి చూపడంలేదనిపిస్తోంది" అని రాధాకృష్ణన్ చెప్పారు.

'గవర్నర్‌కూ లక్ష్మణ రేఖ ఉంటుంది'

కేరళ పట్ల కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని, ఇది రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను అతిక్రమించడమే అవుతుందని మాజీ ఎంపీ, సీపీఎం పత్రిక 'దేశాభిమాని' సంపాదకుడు పీ. రాజీవ్ అన్నారు.

డీఎంకే అధికార ప్రతినిధి, న్యాయవాది మనురాజ్ షణ్ముగమ్ మాట్లాడుతూ.. "బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా టార్గెట్ చేస్తోంది. ఇది దేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మీ పరిధి మేరకు వ్యవహరించాలని, మీకు కూడా లక్ష్మణ రేఖ ఉంటుందని గవర్నర్‌ను అనేకసార్లు కోరాం. విమర్శలు ఎదుర్కొంటున్నది తమిళనాడు గవర్నర్ ఒక్కరే కాదు. కేరళ గవర్నర్ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వివరణ అడుగుతూ ఓసారి సమన్లు పంపారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది" అని చెప్పారు.

బిహార్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల గురించి ప్రస్తావిస్తూ.. "గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా మాత్రమే కాదు, దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీకి ప్రతినిధులుగా మారిపోతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ రాజ్యాంగ విరుద్ధమైన పనులను ప్రజలకు తెలియజేసేందుకు చట్టబద్ధంగా ఎందాకైనా వెళ్తాం" అని షణ్ముగమ్ చెప్పారు.

"రాష్ట్రాల హక్కులపై జరిగే జాతీయ సమ్మేళనానికి మద్దతు ఇస్తున్నాం. ఈ విషయాలన్నీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాయి" అని కేరళ ఆర్థిక మంత్రి ఐజాక్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)