#mPassport Seva: దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్ట్ అందించే సరికొత్త యాప్‌ విశేషాలు

  • 27 జూన్ 2018
భారత పాస్‌పోర్ట్ Image copyright Getty Images

పాస్‌పోర్ట్ తెలుసు కదా! ఏ దేశంలోనైనా ఇది లేకుండా అడుగుపెట్టలేరు. ఉన్నత చదువుల కోసం కొందరు, ఉపాధి కోసం మరికొందరు, విహారయాత్రలంటూ ఇంకొందరు మనదేశం నుంచి విదేశాలకు ప్రతి ఏడాదీ ఎగిరిపోతూ ఉంటారు. అలా ఎగిరి పోవాలంటే చేతిలో పాస్‌పోర్ట్ ఉండాల్సిందే.

అంత ముఖ్యమైన పాస్‌పోర్ట్‌ను ఇప్పుడు అతి సులభంగా పొందొచ్చు. మీరు దేశంలో ఎక్కడున్నా సరే. మీ శాశ్వత నివాస ప్రాంతం ఏదైనా సరే. పాస్‌పోర్ట్ కోసం ఎక్కడ నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపై దరఖాస్తు కోసం ఒకసారి, పోలీసు విచారణ కోసం మరోసారి ఇంటికి వెళ్లనక్కర్లేదు.

సరికొత్త యాప్

అలాగే అన్నిరకాల పాస్‌పోర్ట్ సేవలు ఒకేచోట సులభంగా లభించేలా భారతప్రభుత్వం సరికొత్త మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. దాని పేరు 'mPassport Seva'. ఇంతకు ముందు ఆన్‌లైన్ దరఖాస్తు, పోలీసు విచారణ వంటి కోసం కొన్ని యాప్‌లు ఉన్నాయి. కానీ తాజాగా విడుదల చేసిన యాప్‌లో అన్ని సేవలు లభిస్తాయి. దరఖాస్తు దగ్గర నుంచి పాస్‌పోర్ట్ చేతికి వచ్చేదాకా ప్రతి సేవా కొత్త యాప్‌లో లభిస్తుంది.

Image copyright getty images/Hindustan Times

లభించే సేవలు

  • పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఇప్పటికే దరఖాస్తు చేసి ఉంటే దాని పురోగతి ఏమిటో తెలుసుకోవచ్చు
  • పాస్‌పోర్ట్ గడువు పొడిగించుకోవడం
  • సమర్పించాల్సిన ధ్రువపత్రాల వివరాలు
  • దగ్గర్లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సమాచారం
  • సేవలకు వసూలు చేసే రుసుముల వివరాలు
  • అఫిడవిట్ల నమూనాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • సందేహాలు-సమాధానాలు
  • టోల్‌ఫ్రీ నంబరు

ఈ సేవలన్నీ కొత్త యాప్‌లో లభిస్తాయి.

Image copyright Google Play

యాప్ ఎక్కడ ఉంటుంది?

ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 'mPassport Seva' అని టైప్ చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సేవల పేరిట అనేక యాప్‌లు ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా గమనించాలి. యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్ ధ్రువీకరణ ఉందోలేదో సరి చూసుకోవాలి. ఐఫోన్ వినియోగదార్లకు యాపిల్ స్టోర్‌లో ఈ యాప్ లభిస్తుంది.

ఎలా పని చేస్తుంది?

యాప్ ద్వారా పాస్‌పోర్ట్ సేవల కోసం రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఇమెయిల్ ఐడీ, పాస్‌వార్డ్ సహాయంతో లాగినై కావాల్సిన సేవలు వినియోగించుకోవచ్చు.

Image copyright Ministry of External Affairs, GOI
చిత్రం శీర్షిక భారత విదేశీవ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్

దేశంలో ఎక్కడ ఉన్నా సరే

భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవలను మరింత సరళీకరించింది. దేశంలో ఎక్కడనుంచైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు నచ్చిన ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని, దాని పరిధిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. ఇటీవల పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాలు తెలిపారు.

మీ శాశ్వత నివాసం సంబంధిత ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోకి రాకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దరఖాస్తులో రాసిన చిరునామాకు వచ్చి పోలీసులు విచారణ జరుపుతారు.

స్వస్థలానికి పోనక్కర్లేదు

ఉదాహరణకు మీరు బెంగళూరులో పని చేస్తున్నారు. మీ శాశ్వత నివాసం ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉంది.

పాస్‌పోర్ట్ కావాలంటే గతంలో విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు.

బెంగళూరులోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ కేంద్రం పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీసు విచారణ కూడా బెంగళూరులో జరుగుతుంది. ఒకవేళ అవసరమైతే ఒంగోలులో విచారణ జరుపుతారు.

బెంగళూరు కార్యాలయమే పాస్‌పోర్టను జారీ చేస్తుంది. దరఖాస్తులో మీరు రాసిన చిరునామాకు పాస్‌పోర్ట్‌ను పంపిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)