గ్రౌండ్ రిపోర్ట్: ఈ 24 దళిత కుటుంబాలు ఎందుకు ఊరొదిలేయాల్సి వచ్చింది?

మహారాష్ట్రలోని ఒక గ్రామంలో 'అగ్ర' కులస్థులకూ, దళితులకూ మధ్య జరిగిన గొడవ కారణంగా 24 దళిత కుటుంబాలు తమ ఇంటినీ, ఊరిని వదిలేసి వీధిన పడ్డాయి. ఒక ప్రేమ వ్యవహారం కారణంగా ఈ గొడవ జరిగిందని చెబుతున్నారు.
ఈ ఘటన లాతూర్ జిల్లాలోని రుద్రవాడీ గ్రామంలో జరిగింది. ఇక్కడ 'అగ్ర' కులంగా పిలిచే మరాఠా కులస్థులకూ, ఎస్సీ కులమైన మతాంగ్ కులస్థులకు మధ్య ఘర్షణ తలెత్తడంతో 24 కుటుంబాలు ఊరొదిలేసి అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉద్గీర్ సమీపంలో ఉన్న కొండ మీద శిథిలావస్థలో ఉన్న హాస్టల్లో ఉంటున్నాయి.
గ్రామంలో అసలు గొడవ ఎందుకు జరిగింది? 24 కుటుంబాలు తమ ఊరినే వదిలిపెట్టి వెళ్లిపోవాలనే తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ వివరాలు తెలుసుకోవడం కోసం బీబీసీ బృందం రుద్రవాడీ గ్రామానికి వెళ్లింది.
ఔరంగాబాద్ నుంచి దాదాపు 370 కి.మీ. దూరంలో ఉన్న ఉద్గీర్‌కు మేం చేరుకొని అక్కడున్న బాధిత కుటుంబాలతో మాట్లాడాం.

రుద్రవాడీ గ్రామం ఉద్గీర్ తాలూకాలో ఉంది. ఇక్కడి జనాభా దాదాపు 1200.
ఒక వ్యక్తి మమ్మల్ని ఉద్గీర్-అహ్మద్‌పూర్ రోడ్డుపై లచ్ఛాపూర్తి మారుతి మందిరం నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి బాధిత కుటుంబాలు నివాసం ఉంటున్న ఆ కొండపైకి చేరుకున్నాం.
అక్కడ మాకు ఒక పాత, శిథిలావస్థలో ఉన్న భవనం కనిపించింది. ఇది శ్యామ్‌లాల్ హాస్టల్. దీనిని చాలా కాలం కిందటే ఖాళీ చేశారు.


'మేమిక వెనక్కి వెళ్లం'
"అసలు మీరెందుకు మీ ఊరిని వదిలిపెట్టి ఇక్కడి వచ్చారు?" అని మేం ఒక వ్యక్తిని అడగగా అతడు.. "ఈ విషయం మా సర్పంచ్ బాయిని అడగండి" అన్నాడు.
శాలూబాయి షిందే అనే మహిళ ఈ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. శాలూబాయి దళిత కులానికి చెందిన వారే.
ఊరికి ఆమె సర్పంచే అయినా.. ఆమె కూడా తన ఇంటిని వదిలిపెట్టి ఈ హాస్టల్లోనే ఉంటున్నారు.
"సర్పంచ్ అయినా ఏం లాభం? ఇక్కడ ఇట్లాంటి గొడవలు ఎన్నో జరుగుతుంటాయి. నా భర్తపై కూడా ఎన్నో సార్లు దాడులు జరిగాయి" అని ఆమె బీబీసీతో చెప్పారు.

"ఇలాంటి గొడవలు ఇప్పటి వరకు మూడుసార్లు జరిగాయి. ఇంతకు ముందు రెండు సార్లు మతాంగ్ కులానికి చెందిన గుణ్వంత్ షిందే ఈ గొడవలకు కారకుడయ్యాడు" అని శాలూబాయి తెలిపారు.
"ఈసారి గొడవ పెళ్లిళ్ల సీజన్లో జరిగింది. ఈ గొడవలతో మేం విసిగిపోయాం. ఇప్పుడు మేం మా ఊరికి తిరిగి వెళ్లదల్చుకోలేదు. ఈ కొట్లాటలు ఇక వద్దు మాకు."
శాలూబాయి షిందే వెంట ఉన్న ఆమె కుమారుడు ఈశ్వర్ ఇలా అన్నారు - "ఇప్పుడు మేం మా గ్రామానికి వెళ్లాలనుకోవడం లేదు. అక్కడ మేం గౌరవంగా బతకలేం. ఆఖరుకు మేం కొత్త బట్టలు తొడుక్కున్నా, రిక్షాలో మ్యూజిక్ పెట్టుకున్నా వాళ్లు అభ్యంతరం చెబుతారు."


అసలు ఆరోజు జరిగిందేమిటి?
వారి గ్రామంలో మే నెలలో జరిగిన ఘటన గురించి ఈశ్వర్ షిందే వివరించారు. ఆ ఘటన తర్వాతే వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
"నా కజిన్ మనీషా వైజీనాథ్ షిందే పెళ్లి మే 9న జరగాల్సి ఉండగా.. మే 8న మేం పక్కనే ఉన్న మారుతి ఆలయానికి వెళ్లి పసుపు పూయడం అనే తంతు నిర్వహించాం. ఆ సమయంలో అక్కడికి కొందరు యువకులు వచ్చి మమ్మల్ని కొట్టసాగారు. అక్కడ మేం ఏం చేస్తున్నామని అడుగుతూ వారు మమ్మల్ని కొట్టారు. ఆ తర్వాత మేం అక్కడి నుంచి వెళ్లిపోయాం. మరుసటిరోజు గ్రామంలో పెళ్లి పూర్తయింది."
"మేం గొడవలు వద్దనుకున్నాం. అందుకే మేం తంతాముక్తి (వివాదాల నివారణ) సమితి అధ్యక్షుడు పిరాజీ అతోల్కర్ సహా గ్రామంలోని ఇతర పెద్దల వద్దకు వెళ్లాం. 10 నాడు ఒక పంచాయితీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారిని కోరాం. ఆ తర్వాత వాళ్లు 13న మాట్లాడదామని చెప్పారు."


అయితే ఈ లోపుగానే మరో ఘటన జరిగిందని ఈశ్వర్ షిందే తెలిపారు.
"మా బంధువు ఒకరికి గ్రామంలోని ఒక యువకుడితో గొడవ జరిగింది. ఆ తర్వాత మొత్త గ్రామమంతా కలిసి మాపై దాడి చేసింది. ఆ సమయంలో పోలీసులు వచ్చి మమ్మల్ని రక్షించారు. దీనిపై మేం కూడా ఫిర్యాదు కూడా చేశాం."
ఈ క్రమంలోనే గ్రామ సర్పంచ్ శాలూబాయి షిందే, సామాజిక న్యాయ మంత్రి రాజకుమార్ బడోలేకు ఓ లేఖ రాశారు. బాధిత కుటుంబాలు ఈ హాస్టల్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, గుణ్వంత్ షిందే అనే యువకుడు ఆ గ్రామానికి చెందిన 'అగ్ర' కుల యువతితో ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నందున నిందితులు అతన్ని పదే పదే బెదిరించసాగారు అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదులో మే 8, 10 తేదీల్లో జరిగిన ఘటనలను కూడా పేర్కొన్నారు. దళితులను వారి ఇళ్లలోకి చొరబడి కొట్టారని కూడా ఫిర్యాదులో రాశారు.

అవతలి పక్షం వాదన ఎలా ఉంది?
ఈ కేసులో ఎదుటి పక్షం వాదనేంటో తెలుసుకోవడం కోసం బీబీసీ బృందం రుద్రవాడీ గ్రామానికి వెళ్లింది. అట్లాగే మేం గ్రామంలోని తంతాముక్తి సమితితో కూడా మాట్లాడింది. వారు మాకు గణ్వంత్ షిందే రాసిచ్చిన క్షమాపణ పత్రాన్ని చూపించారు.
గ్రామస్థులు జూన్ 22న జిల్లా అధికారుల ఎదుట ఒక వాంగ్మూలం కూడా ఇచ్చారు. అందులో వారు, "గ్రామంలో కులం ఆధారంగా దాడులు గానీ, వివక్ష చూపిన ఘటనలు గానీ ఎప్పుడూ చూడలేదు. మరాఠా సముదాయానికి చెందిన 23 మందిపై అక్రమ అట్రాసిటీస్ కేసు మోపారు. కొన్ని సంఘాలు రాజకీయ ద్వేషంతో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి" అని పేర్కొన్నారు.
ఈ గ్రామంలో ఉండే మరి కొందరితో కూడా బీబీసీ బృందం మాట్లాడింది.
కౌశల్యాబాయి రాజారామ్ అతోల్కర్ అనే మహిళ, "మీరు మా గ్రామ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారు కదా. పొలాల్లో నాట్లు వేయాల్సిన సమయంలో గ్రామంలోని మగవాళ్లందరినీ అరెస్ట్ చేశారు. ఎన్నో తరాలుగా చూస్తున్నా. మా ఊళ్లో కులవివక్ష ఘటనలు ఎప్పుడూ జరగడం చూడలేదు" అని అన్నారు.
బీబీసీ బృందం గ్రామానికి వెళ్లిన సమయంలో చాలా మంది పొలాల్లో పనులకు వెళ్లారు. పొలాల నుంచి తిరిగి వస్తున్న కొందరు యువకులు మాట్లాడారు.
గుణ్వంత్ షిందేతో, 'అగ్ర' కులానికి చెందిన యువతి ప్రేమ వ్యవహారమే ఈ మొత్తం గొడవకు మూలమని యాదవ్ వైజీనాథ్ అతోల్కర్ అన్నారు. దీనికి కులం రంగు పులుముతున్నారని ఆయనన్నారు.

- ఈ దళితులు బౌద్ధ మతంలోకి ఎందుకు మారుతున్నారు?
- అభిప్రాయం: దళితుల్లో పెరుగుతున్న ఆగ్రహం, బీజేపీ 'సామరస్యం'పై ముసురుతున్న సందేహాలు

తంతాముక్తి సమితి అధ్యక్షుడు పిరాజీ అతోల్కర్ మాట్లాడుతూ.. "వాళ్లు 9వ తేదీన పంచాయితీ పెట్టాలని అన్నారు. కానీ 12వ తేదీ నాడు గ్రామంలో ఒక పెళ్లి జరగాల్సి ఉంది. మేం 13 నాడు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పాం. కానీ ఈలోగా గొడవ మరింత ముదిరి పోలీసుల దాకా వెళ్లింది" అని ఆయన చెప్పారు.
ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని దర్యాప్తు అధికారి శ్రీధర్ పవార్ మాతో అన్నారు.
"అన్ని కోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు మేం 23 మంది నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేశాం. 12 మంది పరారీలో ఉన్నారు" అని ఆయన తెలిపారు.
ఈ కేసులో ప్రభుత్వం ఏం చేస్తోందని అని సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్‌కుమార్ బడోలేను అడగగా, "మొట్టమొదట నేను ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అప్పుడే నేను దీనిపై ఏమైనా వ్యాఖ్యానించగలను" అని ఆయన జవాబిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- భారత్, అమెరికాలది ప్రేమా? ద్వేషమా?
- దక్షిణాది రాష్ట్రాల సీఎంలను మోదీ చిన్నచూపు చూస్తున్నారా
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- #గ్రౌండ్‌రిపోర్ట్: ఉద్దానం - ఎవరికీ అంతుబట్టని కిడ్నీ వ్యథలు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్‌లో గాలి ఎందుకిలా మారింది?
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)