ప్రెస్ రివ్యూ: తెలంగాణ ప్రభుత్వం కులవివక్ష చూపిస్తోందంటున్న దళిత ఐఏఎస్‌లు

  • 28 జూన్ 2018
Image copyright NurPhoto/Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

'తమను ప్రాధాన్యం లేని పోస్టులకు పరిమితం చేయడంపై తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు భగ్గుమంటున్నారు' అని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనంలో వెల్లడించింది.

కొద్ది రోజులుగా తమలో తాము సమావేశమై చర్చించుకుంటున్న వీరు బుధవారం తమ అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందంటూ మురళి, భారతి లక్పతి, శర్మన్‌లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషిని కలిసి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తమను ప్రాధాన్యం కలిగిన పోస్టులకు దూరంగా ఉంచుతున్నారని, అప్రాధాన్య పోస్టులు కేటాయిస్తున్నారంటూ గోడు వెళ్లగక్కారు.

తమకు పోస్టింగులు ఇవ్వకుండా, కార్యాలయాలు లేకుండా వెయిటింగులో ఉంచి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీనియార్టీ లేకున్నప్పటికీ కొన్ని ఆధిపత్య కులాల వారికి కీలక శాఖలు కేటాయిస్తున్నారని, సీనియారిటీ ఉన్న దళిత, గిరిజనులమైన తమపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గోడు వెళ్లబుచ్చారు.

తమలా మరో ఏడుగురు ఐఏఎస్ లు సైతం ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright NAdendla manohar/facebook

పీసీసీ అధ్యక్షుడిగా నాదెండ్ల?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రకమిటీలో త్వరలో సమూల మార్పులు జరగనున్నాయని 'ప్రజాశక్తి' ఒక కథనాన్ని ప్రచురించింది.

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయనున్న ఈ మార్పులలో భాగంగా పీసీసీ అధ్యక్షుడిని కూడా మార్చను న్నారని సమాచారం.

ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్ని రాష్ట్రాల్లో పార్టీల అధ్యక్షులను మార్చాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిలో భాగంగా ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.

రఘువీరారెడ్డికి ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించి ఏదో ఒక రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని, ఆయన స్థానంలో నాదెండ్ల మనోహర్‌ను నియమించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

పార్టీకి విధేయుడిగా ఉండటంతో పాటు, ఆయన కులం కూడా నాదెండ్లకు కలిసివచ్చే అవకాశమని భావిస్తున్నారు.

జాతీయ అవసరాల రీత్యా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనివార్యమైతే ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్‌ నేతల అంచనా అని ప్రజాశక్తి పేర్కొంది.

Image copyright Getty Images

తెలుగు సంఘాల డర్టీ పిక్చర్

మోదుగుమూడి కిషన్‌-సెక్స్‌ రాకెట్‌ స్కాండల్‌ నేపథ్యంలో అమెరికాలోని వివిధ తెలుగు సంఘాలలో ఉన్న లుకలుకలన్నీ బయటపడుతున్నాయిని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

అక్కడి వివిధ తెలుగు సంఘాలకు సంబంధించి ఒకరినొకరు విమర్శించుకుంటూ వాట్సాప్‌ మెసేజ్‌లు, వాయిస్‌ మెసేజ్‌లు, కోర్టు కేసుల వివరాలు సోషల్‌ మీడియాలో బయటపెట్టుకుంటున్నారు.

ప్రస్తుత 'తానా' అధ్యక్షుడు సతీష్‌ వేమనపై తాజాగా వైరల్‌ అయిన ఏడు నిమిషాల వీడియో దీనికి ఒక ఉదాహరణ అంటున్నారు ప్రవాసీలు!

దీనిలో మోదుగుమూడి వ్యవహారంతోపాటుగా.. బోర్డు రూమ్‌లో సతీష్‌ తిట్టాడని చెబుతున్న ఆడియో రికార్డింగ్‌లు కూడా ఉన్నాయంటున్నారు.

టాలీవుడ్‌ హీరోయిన్లు.. టీవీ యాంకర్లను తీసుకువచ్చి ప్రదర్శనలు ఇప్పించే సంస్కృతి అమెరికాలో గత ఐదారేళ్లుగా బాగా పెరిగిపోయింది.

ఏదైనా సభ జరుగుతోందంటే దానిలో చర్చించే విషయాల గురించి కాకుండా.. ఏ హీరోయిన్‌ వస్తోంది? ఏ యాంకర్‌ వస్తోందనే విషయాన్నే తెలుగు సంఘాలు ప్రచారం చేయటం మొదలుపెట్టాయిని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ప్రకాశ్ రాజ్ Image copyright Prakashraj/facebook

'నన్ను చంపేందుకు ప్రణాళిక'

పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ను హత్య చేసిన దుండగులు.. ఆ తరువాత నన్నూ హతమార్చాలని ప్రణాళిక రూపొందించుకున్నారని నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారని 'ఈనాడు' పేర్కొంది.

గౌరీని హత్య చేసిన హంతకులను ప్రత్యేక దర్యాప్తు దళం అధికారులు విచారణ చేసిన సమయంలో ఈ విషయం వెలుగు చూసిందన్నారు.

ఈ అంశంపై టీవీ ఛానెళ్లు, వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయంటూ ఆయన ట్విట్టర్‌లో బుధవారం వెల్లడించారు.

'జస్ట్‌.. ఆస్కింగ్‌' పేరిట వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో మోదీని విమర్శించాననే నిందితులు నన్ను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారని తెలుసుకున్నానని ప్రకాశ్‌ వెల్లడించారు.

గౌరీ లంకేశ్‌ను హత్య చేసుకునేందుకు 'ఆపరేషన్‌ ఆయి'(మరాఠీలో అమ్మ) పేరు పెట్టుకున్న నిందితులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గిరీశ్‌ కర్నాడ్‌ను హత్య చేసేందుకు 'ఆపరేషన్‌ కాకా' అని పేరు పెట్టారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్వహించిన దర్యాప్తులో గుర్తించారని ఈనాడు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)