హైదరాబాద్ పేరెత్తకుంటే కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- జయ్ మక్వానా
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, PHOTO DIVISION
సర్దార్ వల్లభాయ్ పటేల్
కశ్మీర్ విలీనం విషయంలో సర్దార్ పటేల్ వైఖరిపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ తాజా వివాదానికి తెరతీశారు.
పాకిస్తాన్ గనుక హైదరాబాద్ సంస్థానం పేరెత్తకుండా ఉంటే, కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేసేందుకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సుముఖత వ్యక్తం చేశారని కశ్మీర్ నేత సైఫుద్దీన్ అన్నారు.
తాను రాసిన 'కశ్మీర్: గ్లింప్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ద స్టోరీ ఆఫ్ స్ట్రగుల్' పుస్తకంలో సైఫుద్దీన్ ఈ విషయాల్ని పేర్కొన్నారు. దేశ విభజన, సంస్థానాల విలీనం జరిగిన సమయంలో చోటు చేసుకున్న పలు సంఘటనలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
మరి నిజంగానే కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేయాలని సర్దార్ పటేల్ అనుకున్నారా? సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవమెంత?
సోజ్ తన పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం.. సర్దార్ పటేల్ చేసిన ప్రతిపాదనను లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్తాన్ 'కశ్మీర్ ఆపరేషన్స్' బాధ్యులు హయత్ ఖాన్‌కు వివరించారు.
పాకిస్తాన్ హైదరాబాద్ దక్కన్ పేరెత్తకుంటే, కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేందుకు సిద్ధమేనని సర్దార్ పటేల్ షరతు పెట్టారన్నది ఆ ప్రతిపాదన.
హయత్ ఖాన్ ఆ విషయాన్ని పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్‌కు చేరవేశారు.
అందుకు లియాఖత్ స్పందిస్తూ.. "కశ్మీర్ కోసం, అక్కడి బండరాళ్ల కోసం పంజాబ్ కంటే విశాలమైన ప్రాంతాన్ని(హైదరాబాద్)ను వదులుకునేందుకు నేనేమీ పిచ్చివాడిని కాదు" అని వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, Getty Images
సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ ప్రతిపాదనను లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్తాన్‌కు చేరవేశారు.
సరిహద్దున ఉన్న కశ్మీర్ కంటే కూడా కనీసం రోడ్డు, రైలు మార్గాల ద్వారా కూడా అనుసంధానం లేని హైదరాబాద్ కోసం అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ చాలా ఆత్రుతగా ఉండేవారని సైఫుద్దీన్ చెప్పుకొచ్చారు.
ఇదే పుస్తకంలో కశ్మీర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు ఏ.జీ. నూరానీ రాసిన ఓ కథనాన్ని కూడా ప్రస్తావించారు.
1972లో ఓ సమావేశంలో పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మాట్లాడుతూ.. హైదరాబాద్, జునాగఢ్‌ల గురించి పాకిస్తాన్ మాట్లాడకుండా ఉంటే.. అందుకు బదులుగా కశ్మీర్‌ను ఇచ్చేందుకు సర్దార్ పటేల్ సిద్ధంగా ఉన్నారని చెప్పినట్టు ఆ కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో
హిందూ రాజు పాలనలో కశ్మీర్
తొలినాళ్లలో కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేసేందుకు పటేల్ సుముఖంగానే ఉండేవారని భారత హోంశాఖ మాజీ కార్యదర్శి, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దగ్గర పనిచేసిన వీ.పీ మీనన్ కూడా చెప్పారు.
భారత్ లేదా పాకిస్తాన్ ఏ దేశంలో విలీనమవుతారో మీరే తేల్చుకోండంటూ సంస్థానాలకు 1947 జూన్ 3న పటేల్ ఓ అవకాశం ఇచ్చారని 'ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్' పేరుతో మీనన్ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.
ముస్లిం జనాభా అధికంగా ఉన్న కశ్మీర్‌ను అప్పుడు హిందువు అయిన మహారాజా హరి సింగ్ పాలిస్తున్నారు. ఏ దేశంతో కలవాలో తేల్చుకునేందుకు మహారాజా చాలానే కష్టపడాల్సి వచ్చింది.
ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆయనతో లార్డ్ మౌంట్ బాటన్ నాలుగు రోజులు చర్చించారు.
"ఒకవేళ పాకిస్తాన్‌తో వెళ్లాలని కశ్మీర్ నిర్ణయించుకున్నా అందుకు సర్దార్ పటేల్ ఏమీ అభ్యంతరం చెప్పబోరు" అని మహారాజాకు లార్డ్ మౌంట్ బాటన్ వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్‌లో భారత సైన్యం
రామచంద్ర గుహ ఏమంటున్నారు?
సైఫుద్దీన్ తన పుస్తకంలో ప్రస్తావించిన విషయాలతో చరిత్రకారుడు రామచంద్ర గుహ కూడా అంగీకరిస్తున్నారు.
"కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేసేందుకు పటేల్‌కు మొదట్లో అభ్యంతరమేమీ లేదు. రాజ్‌మోహన్ గాంధీ రాసిన పటేల్ జీవిత చరిత్రలోనూ ఈ విషయం చెప్పారు" అని రామచంద్ర గుహ ట్విటర్‌లో తెలిపారు.
'పటేల్: ఏ లైఫ్' పేరుతో రాజ్‌మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో.. 1947 సెప్టెంబర్ 13 వరకు కశ్మీర్ విషయంలో వల్లభ్ భాయ్ పటేల్ వైఖరి తటస్థంగా ఉండేదని తెలిపారు.
అప్పటి భారత రక్షణ మంత్రి బల్‌దేవ్ సింగ్‌కి రాసిన లేఖలోనూ పటేల్ అదే వైఖరిని వ్యక్తపరిచారు.
ఒకవేళ వేరే దేశం పాలనలోకి వెళ్లాలని కశ్మీర్ నిర్ణయించుకున్నా.. అందుకు అభ్యంతరం ఏమీ లేదని సర్దార్ ఆ లేఖలో అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ కచ్చితంగా భారత్‌లోనే ఉండాలని నెహ్రూకు ఉండేది.
నెహ్రూకు అంత కోపమొచ్చింది
అయితే, ఎప్పుడైతే తమను విలీనం చేసుకోవాలంటూ జునాగఢ్ నవాబు చేసిన అభ్యర్థనను పాకిస్తాన్ స్వీకరించిందో.. అప్పటి నుంచే కశ్మీర్ విషయంలో సర్దార్ అభిప్రాయం మారిందని రాజ్‌మోహన్ గాంధీ తన పుస్తకంలో వెల్లడించారు.
జునాగఢ్‌ను విలీనం చేసుకోవాలని అనుకున్న పాకిస్తాన్.. చివరికి జునాగఢ్‌తో పాటు, కశ్మీర్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చింది.
సర్దార్ పటేల్ అభిప్రాయంలో మార్పు గురించి వివరిస్తూ.. ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను రాజ్‌మోహన్ గాంధీ తన పుస్తకంలో ప్రస్తావించారు.
1947 అక్టోబర్ 26న జవహర్‌లాల్ నెహ్రూ నివాసంలో ఓ సమావేశం జరిగింది.
తమకు భారత ఆర్మీ సాయం చేయాలని కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ దూతగా పంపించిన అధికారి మెహర్ చాంద్ మహాజన్ భారత్‌ను కోరారు.
తమ డిమాండ్‌కు భారత్ స్పందించకపోతే, తాము పాకిస్తాన్ సాయం కోరుతామని కూడా మహాజన్ అన్నారు.
అది విన్న నెహ్రూ.. తీవ్రమైన కోపంతో... ’తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపో’.. అని మహాజన్‌ను ఆదేశించారు.
అయితే, ఆ సమయంలో సర్దార్ పటేల్ కలగజేసుకుని మహాజన్‌ను ఆపి.. 'మహాజన్, మీరు పాకిస్తాన్‌తో కలవడంలేదు' అని హామీ ఇచ్చారు.
ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్‌ను వదిలేయాలని పటేల్ ఎందుకు అనుకున్నారు?
'సర్దార్: సచో మానస్ సాచి వాట్' పేరుతో గుజరాతీలో పుస్తకం రాసిన ఊర్విష్ కొఠారీ బీబీసీతో మాట్లాడారు.
సంస్థానాల విలీనం సమయంలో కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసేందుకు సర్దార్ పటేల్ ఏమీ బలవంతపెట్టలేదని ఊర్విష్ అన్నారు.
"అందుకు రెండు ప్రధాన కారణాలు ఉండేవి. ఒకటి.. ఆ రాష్ట్ర భౌగోళిక స్థానం. రెండోది.. రాష్ట్ర జనాభా. ప్రధాన అంశం ఏమిటంటే.. కశ్మీర్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. దాంతో కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు సర్దార్ పటేల్ పెద్దగా పట్టుబట్టలేదు. అయితే, స్వయానా కశ్మీరీ అయిన నెహ్రూకు మాత్రం.. కశ్మీర్ ప్రాంతం భారత్‌లోనే ఉండాలని బాగా ఉండేది."
"కశ్మీర్‌లో కీలక నేతలు మహారాజా హరిసింగ్, షేక్ అబ్దుల్లా ఇద్దరూ నెహ్రూతో స్నేహంగా ఉండేవారు. కశ్మీర్ పట్ల నెహ్రూ మృదువుగా వ్యవహరించడానికి అది కూడా ఒక కారణమని చెప్పొచ్చు."
"అదే సమయంలో జునాగఢ్ వివాదం మొదలైంది. కశ్మీర్ అంశంలోకి సర్దార్ ప్రవేశించారు. ఆ తర్వాత కశ్మీర్ ఇక భారత్‌లోనే ఉంటుందని తేల్చిచెప్పారు" అని ఊర్విష్ కొఠారీ బీబీసీకి వివరించారు.
ఫొటో సోర్స్, KEYSTONE FEATURES
సీనియర్ పాత్రికేయుడు హరి దేశాయి బీబీసీతో మాట్లాడుతూ.. "మొదట్లో కశ్మీర్ పాకిస్తాన్ వైపు వెళ్లినా పర్వాలేదన్న అభిప్రాయంతో సర్దార్ పటేల్ ఉండేవారు. అనేక పత్రాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. 1947 జూన్‌లో కశ్మీర్ మహారాజా హరిసింగ్‌కు రాసిన లేఖలోనూ సర్దార్ ఆ విషయం చెప్పారు. కశ్మీర్ పాకిస్తాన్‌తో కలుస్తానన్నా తాము అభ్యంతరం చెప్పబోమని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆగస్టు 15లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మహారాజాకు పటేల్ గడువు విధించారు" అని తెలిపారు.
"ఆనాడు జరిగిన చారిత్రక సంఘటనలకు సంబంధించిన ఆధారాలుగా మా వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయి. నెహ్రూ, పటేల్‌లు ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకున్నారో ఆ పత్రాలను విశ్లేషిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కానీ, ఆ సంఘటనల గురించి ప్రస్తుత నాయకులు తమ అజెండాలో భాగంగా అర్ధసత్యాలనే చెబుతున్నారు. ఏది ఏమైనా.. నెహ్రూ, పటేల్ అభిప్రాయాలను, ఉద్దేశాలను అనుమానించాల్సిన అవసరం మాత్రం లేదు" అని కొఠారీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్, అమెరికాలది ప్రేమా? ద్వేషమా?
- దక్షిణాది రాష్ట్రాల సీఎంలను మోదీ చిన్నచూపు చూస్తున్నారా
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- #గ్రౌండ్‌రిపోర్ట్: ఉద్దానం - ఎవరికీ అంతుబట్టని కిడ్నీ వ్యథలు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్‌లో గాలి ఎందుకిలా మారింది?
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)