#YouTubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారారు?

  • 1 జూలై 2018
Harsha

సినిమాల్లో స్టార్లు ఉంటారు. తర్వాత టీవీల్లో స్టార్లు వ‌చ్చారు. ఇప్పుడు వాళ్ల‌తో స‌మానంగా స్టార్ల‌ను అందిస్తున్నాయి సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్. అలాంటి యూట్యూబ్‌లో టాప్ తెలుగు స్టార్ హ‌ర్ష. అదేనండీ వైవా హర్ష. ఆయన అసలు పేరు చెముడు హర్ష. ఆయన త‌న ప్ర‌యాణం గురించి బీబీసీతో పంచుకున్న విశేషాలు.

చెముడు హ‌ర్ష 'వైవా' హర్ష ఎలా అయ్యారు?

మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దివిన హ‌ర్ష ఒక ఫార్మా కంపెనీలో పని చేశాడు. ఆయ‌న స్నేహితుడు శ‌బ‌రీశ్. అతను సాఫ్టువేర్ ఉద్యోగి. ఇద్ద‌రూ త‌రచూ క‌లుకుసుని త‌మ ఉద్యోగాలపై అసంతృప్తిని, సినిమాల‌పై ఉన్న ప్రేమ‌ గురించీ మాట్లాడుకునేవారు. ఓ రోజు వారు ఉద్యోగాలు మానేయాలని నిర్ణ‌యించారు.

హ‌ర్ష ఫార్మా ఉద్యోగానికి రాజీనామా చేసి.. నైట్ షిఫ్ట్ ఉండే కొత్త ఉద్యోగం చూసుకున్నారు. ప‌గ‌లు వీడియోల‌పై ఫోక‌స్ చేయ‌డం కోసం ఆ నిర్ణ‌యం తీసుకున్నారు.

అప్ప‌టికే శ‌బరీశ్ ద‌గ్గ‌ర 10 - 12 వరకూ స్క్రిప్టులున్నాయి. వాటిలో ఏదో ఒక‌టి చేద్దామనుకుని మొద‌లుపెట్టారు.

క‌ట్ చేస్తే.. అదే వైవా!

"అలా జ‌రిగిపోయింది. అస‌లు ముందు వైవానే ఎందుకు చేశామో మాకే తెలియ‌దు. అదెంత వైర‌ల్ అయిందంటే.. ఆ వీడియో స్థాయికి చేరుకోవాలని ట్రై చేశాం కానీ ఇప్పటికీ దాన్ని అందుకోలేకపోయాం." అని హర్ష తన తొలి వీడియో అనుభవాన్ని వివరించారు.

‘టాలీవుడ్‌లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్!‘

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionYoutubestars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారాడు?

ముందుకు నడిపించిన 'ఛత్రపతి'

హ‌ర్ష ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్న‌ప్పుడు స్నేహితుల‌తో స‌ర‌దాగా ఛ‌త్ర‌ప‌తి సినిమా స్పూఫ్ చేశారు. ఆ నిమిషమున్న‌ర వీడియో ఫేస్ బుక్ ద్వారా కాలేజీలో బాగా ఫేమ‌స్ అయింది. ప్ర‌తీ డిపార్టుమెంటులోనూ అంద‌రూ హ‌ర్ష‌ను గుర్తుప‌ట్టి ప‌ల‌క‌రించేవారు. ఆ ఉత్సాహం హ‌ర్ష బృందాన్ని ముందుకు నడిపించింది.

"నాకు ఆస్త‌మా ఉండేది. దానికోసం స్టెరాయిడ్లు వాడి వాడి లావ‌యిపోయాను. చిన్న‌ప్పుడు కాస్త క్యూట్‌గా ఉండేవాడిని. కానీ పెద్ద‌య్యే కొద్దీ ఆత్మ‌న్యూన‌త పెరిగింది. న‌న్ను చూసి న‌వ్వుతార‌ని క‌నీసం రైలు కూడా ఎక్కేవాడిని కాదు. 'వాడు చూడు ఎలా ఉన్నాడో' అని నా మొహం మీదే న‌వ్వేవారు. ఇంటికి చుట్టాలెవ‌రైనా వ‌స్తే నేను లేన‌ని చెప్పు అనేవాడిని."

"కానీ కాలేజీలోకి వ‌చ్చాక నా ఆలోచ‌న‌లు మారాయి. మ‌న‌ల్ని చూసి న‌వ్వుతున్నారంటే మ‌న వ‌ల్ల వాళ్లు హ్యాపీగా ఉన్నార‌నే క‌దా అర్థం. నేను వారికి ఆనందం ఇచ్చాను. వారి ముఖం మీద రెండు నిమిషాల న‌వ్వు తెప్పించాను. ఇంకా ఎక్కువ మందికి చేరాలి. ఎక్కువ మందిని న‌వ్వించాలి. అందుకు క‌మెడియ‌న్ అవ్వాలి అనుకున్నాను. ఈవెన్ దో అయామ్ ఎ మెకానిక‌ల్ ఇంజినీర్, అయామ్ ఎ క‌మెడియ‌న్ బై ఛాయిస్." అంటూ తాను క‌మెడియ‌న్‌గా ఎలా మారిందీ చెప్పుకొచ్చారు హర్ష.

Image copyright HARSHA

వైవా తర్వాత మూడో రోజే సినిమా అవకాశాలు

"మేం సినిమాల్లోకి రావాల‌నే అనుకున్నాం. ఎవ‌రి ద‌గ్గ‌రికైనా ముందే వెళ్లిపోయి అవ‌కాశాలు అడ‌గడం కంటే, మ‌న వ‌ర్క్ ఇంట‌ర్నెట్లో పెట్టి, వాటిని చూపించి అవ‌కాశాలు అడ‌గ‌వ‌చ్చ‌నుకున్నాం. క‌నీసం 10 వీడియోలు చేసి చూపించి అవ‌కాశాలు అడ‌గాలి అనుకున్నాం." కానీ మ‌రోలా జ‌రిగింది.

వీడియో విడుద‌లైన మూడో రోజే హ‌ర్ష చేతిలో నాలుగు సినిమా ఆఫ‌ర్లు ఉన్నాయి.

2013 జూలై 11న వీడియో విడుద‌ల అయితే జూలై 15న సినిమా వారితో చ‌ర్చించ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చారు హ‌ర్ష. 17న తిరిగి విశాఖ‌ప‌ట్నం వెళ్లి, 29న హైద‌రాబాద్ లో శాశ్వ‌తంగా ఉండ‌టానికి వ‌చ్చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగుతో పాటూ త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టించారు. టీవీ షోలు కూడా చేస్తున్నారు.

అస‌లు సినిమా ఎక్కువ‌, యూట్యూబ్ త‌క్కువ‌నే భావ‌న పోవాలంటారు హ‌ర్ష‌. తాను డిజిట‌ల్ నుంచి వ‌చ్చాన‌నీ, డిజిట‌ల్ వేదిక‌గా వినోదాన్ని పంచుతానని చెబుతున్నారు. "యూట్యూబ్ ఇప్పుడో ప‌రిశ్ర‌మ‌. దానిపై ఆధార‌ప‌డి చాలా మంది బ‌తుకుతున్నారు" అని వివ‌రించారు హ‌ర్ష‌.

"కాలేజ్ హ్యూమ‌ర్, క్లీన్ కామెడీని తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. యూత్‌కి త‌ర‌గ‌తి గ‌దితో ఉండే అనుబంధం అలాంటిది. ఆ అనుబంధంలో నుంచే మా స్క్రిప్టులు కూడా వ‌చ్చాయి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే చిన్న పిల్ల‌లు కూడా మా వీడియోల‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. దీంతో మేం మ‌రింత బాధ్య‌తాయుతంగా, (పిల్ల‌ల చూస్తున్నారు కాబ‌ట్టి) వీడియోలు తీస్తున్నాం. క్లీన్ హ్యూమ‌ర్ మా ప్రాధాన్య‌త‌." అన్నారు.

ఆయన ఫోన్ చేసినపుడు ఆనందానికి అంతే లేదు

"వైవా విడుద‌లైన 5 రోజుల త‌రువాత ఒక ఫోన్ వ‌చ్చింది. బ్ర‌హ్మానందం గారు మీతో మాట్లాడ‌తారు. ఫ‌లానా టైమ్ కి ఈ నంబ‌రుకు కాల్ చేయండి అని చెప్పారు. ముందు నేను ఏ బ్ర‌హ్మానందం అని అడిగాను. త‌ర్వాత షాక్. నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే, త‌ల‌దువ్వుకుని, పౌడ‌ర్ రాసుకుని రెడీ అయ్యి, మా అమ్మ ద‌గ్గ‌ర ఉండ‌గా స్పీక‌ర్ ఆన్ చేసి వాళ్లిచ్చిన నంబ‌రుకు ఫోన్ చేశా."

"చాలా బాగా చేశావ్ నాన్నా అని బ్ర‌హ్మానందం అన్నారు. సినిమాల్లోకి వ‌స్తావా అని అడిగారు. త‌ప్ప‌కుండా సార్ అన్నాను. హైద‌రాబాద్ వ‌చ్చాక కూడా ఆయ‌న్ను చాలా సార్లు క‌లిశాను. రోల్ మోడల్ అయిన బ్ర‌హ్మానందం గారు ఎక్క‌డో ఉన్న నా నంబ‌ర్ క‌నుక్కుని మాట్లాడ‌డం చాలా ఆనందాన్నిచ్చింది."

"సినీ ప‌రిశ్ర‌మ‌లోకి రాగానే అందరూ చాలా బాగా ఆద‌రించారు. మొద‌టి ఏడాదే 11 సినిమాలు చేశాను. కానీ కొంద‌రు జీర్ణించుకోలేక‌పోయారు. అన్ని చోట్ల ఉన్న‌ట్టే ఇక్క‌డ కూడా కొన్ని స‌మ‌స్య‌లున్నాయి. చాలా మంది సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి వ‌చ్చిన వారు కొందరు.. స‌డెన్ గా వ‌చ్చిన న‌న్ను త‌మ ప‌క్క‌న చూసి కాస్త ఇబ్బంది పెట్టాల‌ని చూశారు. ఇప్పుడంతా సర్దుకుపోయింది."

Image copyright HARSHA

నాన్న‌కు ఆ వీడియో చూపించ‌లేదు!

హ‌ర్ష నాన్న‌గారు రిటైర్డ్ బ్యాంకు మేనేజ‌ర్. వారి కుటుంబం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి వ‌చ్చి విశాఖ‌ప‌ట్నంలో స్థిర‌పడింది.

హ‌ర్ష సినిమాల్లోకి వెళ్ల‌డం వాళ్ల నాన్న‌గారికి మొద‌ట్లో పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఆయ‌న సోద‌రి, త‌ల్లి ప్రోత్స‌హించారు. "నా ఉద్యోగ భ‌ద్ర‌త కోస‌మే ఆయ‌న అలా అనే వారు. నాన్న త‌రువాత మెల్లిగా ఒప్పుకున్నారు" అన్నారు హ‌ర్ష‌.

"సినిమాలంటే ఇష్ట‌మైతే మెకానిక‌ల్ ఇంజినీరింగ్ ఎందుకు చ‌దివావు అన్నారు డాడీ. దానికి అప్పుడు నా ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. తపనకు.. హాబీకి తేడా ఉంది. సినిమా నా తపన. ఆటోమొబైల్ నా ఇంట్రెస్ట్. మెకానిక‌ల్ ఇంజినీరింగ్ నెల నెలా జీతం తెచ్చే మంచి ఉద్యోగ‌మే. కానీ నేను తపనను ఫాలో అయ్యాను. నాన్న కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడంతా హ్యాపీ."

"వైవా విడుద‌లైన కొత్త‌లో డాడీ ఇంటికి వ‌చ్చి, ఏదో వీడియో చేశావంట క‌దా, చూపించు అన్నారు. నేను చూపించ‌ను. మీరు వ‌ద్దంటున్నారు. నేనెందుకు చూపిస్తాను అంటూ స‌ర‌దాగా చూపించ‌లేదు. త‌రువాత బ్యాంకులో ఆయ‌న కొలీగ్ ఒక‌రు ఆ వీడియో చూపించారు. అది అంత ఫేమ‌స్సా అని నాన్న త‌న‌ కొలీగ్ ని అడిగితే, స్టాఫ్ అంతా వాళ్ల సెల్‌ఫోన్లలో ఉన్న వీడియో చూపించారట‌."

Image copyright HARSHA

యూట్యూబ్ నన్ను 'అనాథ'గానూ చూపించింది

"ఒక‌సారి మా అమ్మ నాకు ఒక వీడియో పంపించింది. అందులో నా ఫోటో పెట్టి 'అనాథగా ఎదిగి ఈ స్థాయికి చేరిన హ‌ర్ష - ఈ స్టోరీ వింటే క‌న్నీరు పెట్టుకుంటారంటూ' ఏదేదో రాశారు. అది చూసి, ఏరా నువ్వు అనాథ‌వంట క‌దా అని మా అమ్మ అంటే, 'ఏమో అమ్మా నాకూ ఇప్పుడే తెలిసింది' అని చెప్పుకుని న‌వ్వుకున్నాం."

"నిజానికి ఇటువంటి వాటి వ‌ల్లే యూట్యూబ్ వీడియోల‌పై వ‌చ్చే ఆదాయం ప‌డిపోతోంది. 'షాకైపోతారు' అని హెడ్డింగ్ పెడ‌తారు. అందులో ఏమీ ఉండ‌దు. ప్ర‌స్తుతం యూట్యూబ్ ఇటువంటి వీడియోల‌ను సీరియ‌స్ గా ఫిల్ట‌ర్ చేస్తోంది."

ప్ర‌స్తుతం హ‌ర్ష సినిమాల‌తో పాటూ వైవా చాన‌ల్లో వీడియోలు చేస్తున్నారు. వైవా ద‌ర్శ‌కుడు శ‌బ‌రీశ్ ప్ర‌స్తుతం ఆ బాధ్య‌త‌లు చూస్తున్నారు. ఆయ‌న‌తో పాటూ సుమారు 30 మంది వ‌ర‌కూ ఆ చాన‌ల్ కోసం ప‌నిచేస్తారు. ఇప్పుడు వైవా చాన‌ల్ ముంబైకి చెందిన క‌ల్చ‌ర్ మెషిన్‌లో భాగంగా ఉంది. ప్ర‌స్తుతం (28.06.18) వైవా చాన‌ల్‌కి 8 ల‌క్ష‌ల 15 వేల స‌బ్స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వారికి 11 కోట్ల 70 ల‌క్ష‌లపైగా వ్యూస్ వచ్చాయి.

"మొద‌టిరోజు వైవా ఎలా చేశామో ఇప్పుడూ కూడా ప్ర‌తీదీ అలానే చేస్తున్నాం. పూర్తి శ్ర‌ద్ధ‌తో మా ప్ర‌య‌త్నం చేస్తాం." అన్నారు హ‌ర్ష‌.

బైక్ రేసర్ కూడా..

హ‌ర్ష కేవ‌లం న‌టుడు, ఇంజినీర్ మాత్రమే కాదు. బైక్ రేస‌ర్ కూడా. దూసుకెళ్లే బైక్‌ల‌ను విదేశాల నుంచి తెప్పించుకుని న‌డుపుతారు. హ‌ర్ష ఇల్లు మొత్తం బైక్, కార్ వంటి ఆటోమెబైల్ స్టిక్క‌రింగ్‌తో నిండిపోయి ఉంటుంది. తాను చ‌దివిన మెకానిక‌ల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ రంగాల‌పై హ‌ర్ష‌కు మంచి ప‌ట్టు ఉంది. ఇప్ప‌టికీ రేసింగ్ హాబీగా కొన‌సాగిస్తున్నారు!

ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది

హర్ష వద్ద భవిష్యత్తు ప్రణాళికలు గురించి ప్రస్తావించగా.. "నా ప్లాట్ ఫామ్ డిజిట‌ల్ - టీవీ - సినిమా అని కాదు.. నేను ఎంట‌ర్టైన‌ర్ని. వినోదం పంచ‌డం నాకిష్టం. అది ఎక్క‌డ బాగా కుదిరితే అక్క‌డ‌. నేను చేసిన అన్ని సినిమాల్లో రోల్స్ అదిరిపోవాల‌ని లేదు. కానీ డిజిటల్లో మాత్రం మేం రాసుకున్న‌దే మెయిన్. ఇక్క‌డ ఫ్రీడ‌మ్ ఉంటుంది. కానీ మ‌న ప్ర‌య‌త్నం సిన్సియ‌ర్ గా, సెన్సిబుల్ గా ఉండాలి. వీడియో చేద్దామ‌నుకున్న పాయింట్‌ను సెన్సిబుల్ గా తీసుకోవాలి" అని ముగించారు.

(రిపోర్టింగ్: బళ్ల సతీశ్, షూట్ ఎడిట్: కె.నవీన్‌ కుమార్, ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?

'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం

వీళ్లు ఐసిస్ మిలిటెంట్ల పిల్లలు.. ఏతప్పూ చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు

మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?

ఇంక్లవ్ డేటింగ్ యాప్: వీలైతే వికలాంగులతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ, అన్నీ కలిస్తే అంతకు మించి

రూటు మారుస్తున్న కిమ్: ఎడాపెడా తనిఖీలు, చెడామడా తిట్లు

‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?

అయోమయంలో అమెరికా.. రష్యా జోక్యంపై ట్రంప్‌దో మాట, ఇంటెలిజెన్స్‌ది ఇంకో మాట