ఒకే రోజు ఇద్దరి కలలు భగ్నం: ప్రపంచ కప్‌లో మళ్లీ మెస్సీ.. రొనాల్డో ఆట చూడగలమా?

  • 1 జూలై 2018
MESSI, RONALDO Image copyright Getty Images

ఆ పాదాల మధ్య బంతి పాదరసంలా జారుతుంది.. వారి వేగం చూస్తే మైదానంలోకి చిరుతలొచ్చాయా అన్నట్లుంటుంది.. గోల్ కొడితే గురి తప్పడం అరుదు.

దశాబ్ద కాలానికి పైగా ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులను మైమరిపిస్తున్న ఆ మాయగాళ్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.

ప్రస్తుత ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ ప్రారంభానికి ముందు నుంచే ఈ పేర్లు ప్రపంచమంతా హోరెత్తుతున్నాయి.

ప్రపంచకప్‌ను ముద్దాడాలనీ వారూ కలలు కన్నారు. కానీ.. ఆ కలలు నెరవేరలేదు.

మెస్సీ, రొనాల్డోలు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఫీఫా ప్రపంచకప్ నుంచి ఒకే రోజు నిష్క్రమించడంతో ఫుట్‌బాల్ ప్రేమికుల్లో ఎడబాటు భయం మొదలైంది.

వారికిదే చివరి వరల్డ్ కప్ కావొచ్చని క్రీడాభిమానులు భావిస్తున్నారు.

Image copyright Getty Images

లియోనల్ మెస్సీ

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అర్జెంటీనా జట్టుకు ప్రత్యేక స్థానముంది. ఇప్పటివరకు ఒక్క ప్రపంచకప్ కూడా గెలవనప్పటికీ డీగో మారడోనా వంటి ఆటగాడిని అందించిన జట్టుగా గుర్తింపు ఉంది.

అలాంటి మారడోనాను మరిపించిన ఆటగాడు ఎవరంటే అంతా చెప్పే సమాధానం లియోనల్ మెస్సీ.

అతడి ఆటలో వేగం ఉంటుంది.. ప్రతి కదలికలో నైపుణ్యం ఉంటుంది.. ప్రతి కిక్‌లో పర్ఫెక్షన్ ఉంటుంది.. అన్నిటికీ మించి స్టైల్ ఉంటుంది. అందుకేనేమో అభిమానులు మెస్సీ ఆటంటే పడిచస్తారు.

Image copyright Getty Images

దేశాధ్యక్షుడి విజ్ఞప్తితో రిటైర్మెంట్ రద్దు

గత ప్రపంచకప్ తరువాత 2016 కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిపోయింది. వెంటనే మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

మెస్సీ నిర్ణయంతో అర్జెంటీనా తల్లడిల్లిపోయింది. చివరకు దేశాధ్యక్షుడే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఆయన విజ్ఞప్తి చేయడంతో మెస్సీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు.

Image copyright Getty Images

నాలుగు వరల్డ్ కప్‌లు..

మెస్సీ తన క్రీడాజీవితంలో 4 ప్రపంచకప్‌లు ఆడాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఆడుతోందంటే అది ఆయన ప్రతిభే. క్వాలిఫైయింగ్ టోర్నీలో చివరి మ్యాచ్‌లో మెస్సీ మూడు గోల్స్ చేయడంతో అర్జెంటీనాకు బెర్తు దొరికింది.

ఇప్పటికే మూడు పదులు దాటిన మెస్సీ వచ్చే ప్రపంచ కప్ ఆడకపోవచ్చని సాకర్ అభిమానులు భావిస్తున్నారు.

2006లో తన తొలి వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు ఆయన నాలుగు వరల్డ్ కప్‌లలో 19 మ్యాచ్‌లు ఆడి ఆరు గోల్స్ చేశాడు.

2014 వరల్డ్ కప్‌లో అత్యధికంగా నాలుగు గోల్స్ చేసి తన జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈసారి ఒక్క ఆయన ఖాతాలో ఒక్క గోల్ మాత్రమే ఉంది.

Image copyright Getty Images

క్రిస్టియానో రొనాల్డో

అర్జెంటీనాలా భారీ అంచనాలున్న జట్టేమీ కాదు పోర్చుగల్. ఆ జట్టుకున్న ఆకర్షణ అంతా క్రిస్టియానో రొనాల్డో ఒక్కడే.

చురుకైన కదలికలే కాదు కిక్ కొట్టేటప్పుడు ఆయన చేసే విన్యాసాలూ సాకర్ అభిమానులకు కిక్ ఇస్తాయి.

బైసికల్ కిక్ వంటి ఆయన విన్యాసాల కోసం పోర్చుగల్ మ్యాచ్‌లను కన్నార్పకుండా చూస్తారు క్రీడా ప్రేమికులు.

అయితే, జట్టులో రొనాల్డోకు దరిదాపుల్లో నిలవడం కాదు కదా ఆయనకు మైదానంలో సపోర్టు ఇవ్వగలిగే ఆటగాళ్లే కరవు.

దీంతో ఎప్పటిలాగే పోర్చుగల్ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.. జట్టుతో పాటే రొనాల్డో కూడా నిష్క్రమించాల్సి వస్తోంది.

Image copyright Getty Images

గత ప్రపంచకప్‌లో పోర్చుగల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించినా రెండేళ్ల కిందట రొనాల్డో ప్రతిభతో యూరో ఛాంపియన్‌గా నిలవడం, అప్పటి నుంచి జట్టు నిలకడగా రాణిస్తుండడం.. అన్నిటికీ మించి రొనాల్డో మ్యాజిక్‌పై నమ్మకంతో రష్యాలో అడుగుపెట్టింది.

పోర్చుగల్ అభిమానులు కోరుకున్నట్లు రొనాల్డో తిరుగులేని ప్రదర్శన చేసినా నాకౌట్ దశలో వెనుదిరగాల్సి వచ్చింది.

ఈ ప్రపంచ కప్‌లో పోర్చుగల్ కథ ముగియడంతో రొనాల్డో ఆటను ఇక వరల్డ్ కప్‌లో చూడలేకపోవచ్చని ఫుట్‌బాల్ అభిమానులు అంటున్నారు. ఇప్పటికే 33 ఏళ్ల వయసున్న ఆయన వచ్చే వరల్డ్ కప్‌లో ఆడడం అనుమానమేనన్నది అభిమానుల మాట.

Image copyright Getty Images

రొనాల్డోకు ప్రపంచకప్‌లో ఇదే అత్యుత్తమం..

నాలుగు ప్రపంచకప్‌ల అనుభవం క్రిస్టియానో రొనాల్డోది. 2006 ప్రపంచకప్‌తో మొదలుపెట్టి ఇప్పటివరకు జరిగిన నాలుగు వరల్డ్ కప్‌లలో మొత్తం 17 మ్యాచ్‌లాడిన ఆయన మొత్తం 7 గోల్స్ చేశాడు.

2006, 2010, 2014లో ఒక్కో గోల్ చేసిన రొనాల్డో ఈసారి విజృంభించి 4 గోల్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు