ప్రెస్‌రివ్యూ: పవన్ కల్యాణే మా సీఎం అభ్యర్థి - సీపీఐ

సీపీఐ రామకృష్ణ, పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, JANASENA PARTY/FACEBOOK

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని, మహా కూటమి ఏర్పడితే సీఎం అభ్యర్థి ఆయనే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

ప్రజల్లో పవన్‌కు ఇమేజ్‌, క్రేజ్‌ రెండూ ఉన్నాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం అయితే బాగుంటుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

కర్నూలు జిల్లా ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గాలి జనార్దన్‌ రెడ్డి తనకు రెండేళ్ల సమయం ఇస్తే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి 85 శాతం నిధులు కేంద్రం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం సిగ్గుచేటని అన్నారు.

బీజేపీతో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పొత్తులు పెట్టుకుంటే ఆ పార్టీలకు ప్రజలే బుద్ధిచెబుతారని రామకృష్ణ వ్యాఖ్యానించారని 'ఆంధ్రజ్యోతి' రాసింది.

ఫొటో సోర్స్, Balakrishna/facebook

మా అమ్మ పడిన బాధ ఎవరూ పడకూడదు- బాలకృష్ణ

విజయవాడలోని సూర్యారావుపేటలో బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌, రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే, ఆసుపత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ ఆదివారం ప్రారంభించారు.

వారంలో రెండు రోజుల పాటు ఇక్కడ రోగులకు వైద్యసేవలు అందనున్నాయి. త్వరలోనే రాజధాని అమరావతిలో 1000 పడకలతో పూర్తిస్థాయి ఆసుపత్రి ఏర్పాటు కానుందని ఆంధ్రజ్యోతి ఓ కథనంలో పేర్కొంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్‌ సోకిన వ్యక్తి జీవితం ముగిసిన అధ్యాయం కాదని, పోరాడే తత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎన్టీఆర్‌ పుట్టిన కృష్ణాజిల్లాలో ఆసుపత్రిని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

తన తల్లి బసవతారకం క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న సమయంలో, ఆ బాధను భావితరాలవారు అనుభవించకూడదని, అందరికీ చికిత్స అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ ఈ ఆసుపత్రికి అంకురార్పణ చేశారని చెప్పారు.

రేషన్‌కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందిస్తున్నామని, మరీ పేదవారికి ఉచిత వైద్యంతో పాటు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుచేసి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నామని వివరించారు.

అమరావతిలో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మూడు దశల్లో చేపడతామని, దానికి ఆగస్టులో భూమిపూజ చేస్తామని ఆయన ప్రకటించారు.

ఫొటో సోర్స్, facebook.com/TelanganaCMO

దేశంలో ఏజీ లేని రాష్ట్రం తెలంగాణ

దేశంలో అడ్వొకేట్ జనరల్(ఏజీ) లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.

కీలకమైన ఏజీ పదవి రాష్ట్రంలో 3 నెలలుగా ఖాళీగా ఉంది. రాష్ట్ర విభజన జరిగి ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే తెలంగాణ తొలి ఏజీ నియామకం జరిగింది.

తొలి ఏజీగా కె.రామకృష్ణారెడ్డిని నియమిస్తూ జూన్‌ 21న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన మూడేళ్లు పదవిలో కొనసాగారు. 2017 జూలై 12న రాజీనామా చేశారు.

సరిగ్గా 5 రోజులకు (జూలై 17న) కొత్త ఏజీగా దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో ఏడాది తిరగక ముందే మార్చి 26న ఏజీ పదవికి ఆయన రాజీనామా చేశారు.

ఆ రాజీనామాను 3 నెలలైనా ఇప్పటివరకు ప్రభుత్వం ఆమోదించకపోవడం విశేషం. ప్రస్తుతం ఏజీ లేక న్యాయ వ్యవహారాల్లో ప్రభుత్వానికి దిశానిర్దేశం కరవుతోందని సాక్షి రాసింది.

ఫొటో సోర్స్, iStock

సాహోరే సర్కారు బడి

తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరుగుతునున్నాయంటూ 'నమస్తే తెలంగాణ' ఓ కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. 2014-15 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాల్లో గత విద్యా సంవత్సరం మొత్తం 28,48,232 మంది విద్యార్థులుంటే.. ఈ ఏడాది ఇప్పటికే 20 శాతానికి పైగా అడ్మిషన్లు పెరిగాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

అంటే ఈ విద్యాసంవత్సరంలో సుమారు ఐదున్నర లక్షల మందికిపైగా విద్యార్థులు సర్కారు బడుల్లో చేరినట్టు.

బడిబాట కార్యక్రమంతో మళ్లీ బడుల్లో చేరినవారితో పాటు, ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులే వీరంతా.

అంతకు ముందు రెండు విద్యాసంవత్సరాల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. 2015-16లో 24,98,846 మంది విద్యార్థులుంటే.. 2016-17లో 26,78,903కు.. అంటే దాదాపు లక్షా 80వేల మంది పెరిగారు.

ఈ ఏడాది ఒకటో తరగతిలో దాదాపు 3.55 లక్షల మంది విద్యార్థులు నమోదు కాగా.. 2వ తరగతి నుంచి ఆ పై తరగతులలో అన్ని కలిపి మరో 50 వేల వరకు విద్యార్థులు చేరారని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య:

2015-16లో 24,98,846

2016-17లో 26,78,903

2017-18లో 28,48,232

ఫొటో సోర్స్, AFP

ఇక బంగాళాఖాతమే దిక్కు..!

ఈ ఏడాది రుతుపవనాల కదలికలు సాధారణ స్థాయిలో ఉండటం, తుపాన్ల జాడలేకపోవడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

జూన్‌ 1 నుంచి నెలాఖరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం(142.4 మి.మీ) కన్నా 20 శాతం అధిక వర్షపాతం(171.2 మి.మీ) నమోదైనా.. చాలా ప్రాంతాల్లో వాన జాడ లేదు.

'గతేడాది జూన్‌లో బంగళాఖాతంలో మూడు అల్పపీడనాలు ఏర్పడి, అధికంగా వర్షాలు కురవడంతో 202.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఈ సారి తుపాన్ల జాడ లేకపోవడంతో అంతకన్నా 31 మి.మీ.లు తగ్గింది.

రానున్న 3 నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలే వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్నట్లు' హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారి రాజారావు చెప్పారు.

గత నెల 8న నైరుతి రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకగా.. ఆ ప్రభావంతో 14వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

తిరిగి 15 నుంచి ఇప్పటివరకూ ఆ స్థాయిలో కురవలేదు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు గాను జూన్‌లో ఏడు జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువగా, మరో 14 జిల్లాల్లో ఎక్కువగా, మిగతా 10 చోట్ల సాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో సాధారణం కన్నా 73 శాతం, మహబూబాబాద్‌లో 59, మంచిర్యాలలో 57 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)