దక్షిణాఫ్రికా: మార్చురీ నుంచి బతికొచ్చిన మహిళ

  • 2 జూలై 2018
మార్చురీ Image copyright Shutterstock

హాస్పిటల్‌లో శవాలను ఉంచే గది అది. అక్కడి శీతల పెట్టెలన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. సిబ్బంది ఒక్కో బాక్సును తెరిచి చూస్తున్నారు. అందులో ఒక మహిళ ‘మృతదేహం’ ఉంచిన పెట్టెను తెరవగానే షాకయ్యారు.

చనిపోయిందనుకున్న మహిళ అతికష్టం మీద ఊపిరి పీలుస్తున్నట్లుగా గుర్తించారు.

వెంటనే వైద్యులను పిలిచి మళ్లీ ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స మొదలుపెట్టారు.

దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Image copyright Getty Images

వారే చూసుండకపోతే..!

దక్షిణాఫ్రికాలోని గాటెంగ్ రాష్ట్రంలో వారం కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మహిళను అంబులెన్సులో కార్లటన్‌విల్లె ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అక్కడ ఆమెను పరీక్షించిన పారామెడికల్ సిబ్బంది అప్పటికే చనిపోయిందని తేల్చడంతో ఆమెను మార్చురీకి తరలించారు.

కానీ, మార్చురీ సిబ్బంది ఆమె చనిపోలేదని గుర్తించి ఆమె ప్రాణాలు కాపాడారు.

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగిందో తమకు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని.. ఆసుపత్రి, అంబులెన్సు సిబ్బంది.. పోలీసులు తమకు సమాధానం చెప్పాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు తమ సిబ్బంది నిర్లక్ష్యమేమీ ఇందులో లేదని అంబులెన్సు సంస్థ 'డిస్ట్రెస్ అలర్ట్' అధికారులు చెబుతున్నారు.

ఇదే తొలిసారి కాదు

కాగా దక్షిణాఫ్రికాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. ఏడేళ్ల కిందట ఈస్టర్న్ కేప్‌లోని ఆసుపత్రిలో 50 ఏళ్ల వ్యక్తిని చనిపోయాడని మార్చురీకి తరలించగా అక్కడ బతికే ఉన్నట్లు గుర్తించారు.

2016లో కూడా క్వాజులు నతాల్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకురాగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు.

కానీ, మరుసటి రోజు మార్చురీలో ఆయన బతికే ఉన్నట్లు గుర్తించారు. అయితే, 5 గంటల్లోనే ఆయన మృతిచెందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు