అభిప్రాయం: ‘అస్సాంలో భయాందోళనలో 90 లక్షల మంది ముస్లింలు’

  • హర్ష్ మందర్
  • సామాజిక కార్యకర్త బీబీసీ కోసం
అస్సాం

ఫొటో సోర్స్, BBC/SHIB SHANKAR CHATTERJEE

అస్సాంలో నివసిస్తున్న వారి వివరాలను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్ కొన్నాళ్లుగా అప్‌డేట్ చేస్తోంది.

ఈ ప్రక్రియ జూన్ 30 నాటికి పూర్తికావాలి. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగిన ఈ ప్రక్రియ ‘ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ అస్సాం’ ముసాయిదా బిల్లు ఏర్పాటుతో ముగుస్తుంది.

కానీ, ఇది అస్సాంలో నివసిస్తున్న బెంగాలీ మాట్లాడే 90 లక్షల మంది ముస్లింలను భయాందోళనలకు గురిచేస్తోంది. బెంగాలీ హిందువులదీ ఇదే పరిస్థితి కానీ, వారి సంఖ్య చాలా తక్కువ.

అస్సాంలో ఉన్న 48 లక్షల మంది, తాము భారతీయులమేనని నిరూపించే ఆధారాలు ఇవ్వడంలో విఫలమయ్యారని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ స్టేట్ (ఎన్‌ఆర్‌సీ) కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలా పేర్కొన్నారు.

కానీ, తర్వాత తన పేరుతో విడుదలైన ఆ ప్రకటనను హజేలా ఖండించారు. అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 50 వేలేనని తెలిపారు.

భారత్-బంగ్లాల మధ్య ఒప్పందమే లేదు

విదేశీయులుగా అస్సాంలో ఉంటున్నవారి పరిస్థితి ఏంటి? భారతీయులు కాని వాళ్లను వెనక్కి పంపడంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. కానీ, కొన్ని తరాలుగా ఇక్కడే ఉంటూ భారత్ తమ దేశమే అనుకుంటున్న వారి పరిస్థితి ఏంటి? వీటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేదు.

అస్సాం మంత్రి, బీజేపీ నేత హిమంత్ బిశ్వ శర్మ గతంలో మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను గుర్తించేందుకే ఈ ప్రక్రియ మొదలుపెట్టామని తెలిపారు. బెంగాలీ మాట్లాడే హిందువులు మాత్రం అస్సాంలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ ప్రకటన బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉంది.

ఫొటో సోర్స్, BBC/SHIB SHANKAR CHATTERJEE

నిర్బంధ క్యాంపుల్లోనే మగ్గిపోతున్న ప్రజలు

ఒకవేళ అస్సాంలో ఉన్నవాళ్లు తాము భారతీయులమని నిరూపించుకోవడంలో విఫలమైతే వారి పరిస్థితి ఏంటి?

నిర్బంధ శిబిరాల్లో వారిని ఉంచుతారు. వారి విడుదల కూడా కష్టమే. మానవహక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలాంటి క్యాంపులను సందర్శించడాన్ని సాధారణంగా అనుమతించరు. దాంతో నిర్బంధ క్యాంపుల్లో ఉండేవారి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. సామాన్యులకు వారి కష్టాలు తెలిసే పరిస్థితి ఉండదు.

గతేడాది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోరడంతో నేను కమిషన్ తరఫున స్పెషల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ మైనారిటీస్‌గా బాధ్యతలు తీసుకొని అస్సాంలోని నిర్బంధ శిబిరాలను సందర్శించాను.

జనవరి 22 నుంచి 24 వరకు అస్సాంలోని కొన్ని శిబిరాల్లో పరిస్థితిని గమనించాను. అక్కడున్నవారితో మాట్లాడాను. అప్పుడే వారి చీకటి, భయానక జీవితం నాకు అర్థమైంది.

నిర్బంధ క్యాంపుల్లో పరిస్థితిపై, వారిని ఏం చేయాలనే దానిపై నేను నివేదిక తయారు చేసి పంపినప్పటికీ హ్యూమన్ రైట్స్ కమిషన్, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

ఇప్పుడు నేషనల్ సిటిజన్‌షిప్ రిజస్టర్ ప్రక్రియ పూర్తి అయింది. లక్షలాది మంది తాము స్వదేశంలోనే విదేశీయులం అవుతున్నామని భయపడుతున్నారు. వాళ్లను నేను కాపాడటానికి ఒకే మార్గం ఉంది. అదే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కింద స్పెషల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ మైనారిటీస్‌గా నాకిచ్చిన పదవికి రాజీనామా చేయడం. అలాగే, నా నివేదికను ప్రజల ముందుకు తేవడం.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

న్యాయ సహాయమే లేదు

నిర్బంధ క్యాంపుల్లో ఉండేవారికి న్యాయ సహాయం లభించడం లేదు. ఉగ్రవాద చర్యలకు, అత్యాచారాలకు పాల్పడి మరణశిక్ష పడిన వారికి కూడా మానవతా దృక్పథంతో న్యాయ సహాయం కల్పిస్తున్నాం. కానీ, అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారికి మాత్రం ఆ సహాయం కూడా అందడం లేదు.

అక్రమంగా నివశిస్తున్నవారిని జైల్లోనే నిర్భందిస్తున్నారు. అక్కడే వారు చాలా ఏళ్లుగా బతుకీడుస్తున్నారు. అక్కడి వారికి ఏలాంటి పని ఉండదు. ఏం చేయడానికీ ఉండదు. కనీసం కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కూడా కల్పించరు. వారి విడుదలకు అవకాశాలు తక్కువే.

కనీసం జైలులో ఉండే ఖైదీలకైనా పని చేయడానికి, విశ్రాంతి తీసుకోడానికి స్వేచ్ఛ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలను వేరు చేస్తారు

నిర్భంధ క్యాంపుల్లో భార్యభర్తలను వేర్వేరుగా ఉంచుతున్నారు. వారి సంతానం 6 ఏళ్లు దాటితే వారిని కూడా వేరే క్యాంపుల్లోకి తీసుకెళ్తున్నారు. చాలామంది వారి కుటుంబాన్ని కలుసుకోవడమే లేదు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం అక్రమ వలసదారులను జైల్లో ఉంచొద్దు. వాళ్లను నేరస్తులుగా చూడొద్దు, కుటుంబానికి దూరంగా ఉంచొద్దు. కానీ, ఇక్కడ ఆ చట్టాలేవీ అమలుకావడం లేదు.

అంతేకాదు, అక్రమంగా నివసిస్తున్నవారిని జైల్లో ఉంచడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)