1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
1971 | తూర్పు పాకిస్తాన్‌లో భారత సైన్యం ఆపరేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1971 | తూర్పు పాకిస్తాన్‌లో భారత సైన్యం ఆపరేషన్

దిల్లీలోని లోధీ రోడ్డులో ఉన్న 11 అంతస్థుల భారత విదేశీ నిఘా సంస్థ రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) కార్యాలయ భవనంలోకి అడుగుపెట్టగానే.. ఆ సంస్థ ఎంత గోప్యత పాటిస్తుందో అర్థమైపోతుంది.

అక్కడ పనిచేసే సిబ్బంది తప్ప.. మరెవరినీ భవనంలోకి అంత సులభంగా అనుమతించరు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ భవనంలోని ఏ గది తలుపుపైనా పేర్లు కనిపించవు. ఎక్కడ ఏ అధికారి ఉంటారో తెలిపే బోర్డులూ ఉండవు.

జాయింట్ సెక్రటరీ కంటే పై అధికారుల గదుల ముందు మాత్రం ఒక డోర్ మ్యాట్, రెండు పూల కుండీలు పెట్టారు.

11వ అంతస్థులో రా చీఫ్ కార్యాలయం ఉంది. భవనం వెనుక భాగం పెరటిలోంచి ఆ ఆఫీసుకు నాన్- స్టాప్ లిఫ్టు ఉంది. అది మధ్యలో ఎక్కడా ఆగదు.

రా అధికారులు తమ సంభాషణల్లో RAW(రా) అనే పదాన్ని ఎప్పుడూ వాడరు. ఒకవేళ ఆ పేరును తప్పనిసరిగా ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు R & W అని అంటారు.

ఇందుకు ఓ కారణం ఉంది. రా(RAW) అంటే అసంపూర్ణం అనే అర్థం వస్తుంది. అది నెగెటివ్ భావాన్ని సూచిస్తుంది. అందుకే ఆ పదాన్ని వాడరు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' పాత్ర

'రా' సాధించిన విజయాల గురించి మాట్లాడాలంటే.. అందులో బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ఆ సంస్థ పోషించిన పాత్ర మొదటిది.

భారత ఆర్మీ రంగంలోకి దిగక ముందు.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా 'ముక్తివాహిని' పేరుతో లక్ష మంది సైన్యానికి 'రా' శిక్షణ ఇచ్చింది.

1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోంది అన్న విషయం రాకి ముందే తెలుసని 'ద కావ్ బాయ్స్ ఆఫ్ రా' పేరుతో రాసిన పుస్తకంలో ‘రా’ మాజీ అదనపు సెక్రటరీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

యుద్ధం సమయంలో తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న శరణార్థులు

'రా'మాజీ చీఫ్‌ ఆనంద్ కుమార్ వర్మ బీబీసీతో మాట్లాడుతూ...

"అప్పుడు ఫలానా రోజున దాడి జరగబోతోంది అన్న స్పష్టమైన సమాచారం మాకు అందింది. ఆ సమాచారం మాకు వైర్‌లెస్ ద్వారా వచ్చింది. అయితే.. ఆ మెసేజ్‌ను డీకోడ్ చేయడంలో కొంత పొరపాటు జరిగింది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం.. డిసెంబర్ 1న దాడి జరగాల్సి ఉంది. దాని ప్రకారం.. వాయుసేనను అప్రమత్తం చేశాం. కానీ.. డిసెంబర్ 2 వరకు కూడా పాక్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో వాయుసేన చీఫ్ కాస్త ఆందోళన చెందారు. మీరు ఇచ్చిన సమాచారం సరైనదేనా? అని రా చీఫ్ రామేశ్వర్‌నాథ్ కావ్‌ను ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అడిగారు. యుద్ధ విమానాలను మరీ ఎక్కువ సమయం గగనతలంలో ఉంచలేమని. అయితే మరొక్క రోజు వేచిచూడాలని కావ్ ఆయనను కోరారు."

''సరిగ్గా మరునాడు డిసెంబర్ 3న భారత్‌పై పాక్ దాడికి దిగింది. అప్పటికే భారత వాయుసేన యుద్ధానికి సిద్ధంగా ఉంది. పాక్ దాడి విషయాన్ని రా ఏజెంట్ మాకు కోడ్ భాషలో చేరవేశారు.'' అని నాటి పరిణామాలను వర్మ గుర్తు చేసుకున్నారు.

ఫొటో క్యాప్షన్,

భారత్‌లో సిక్కిం విలీనం తర్వాత సిక్కిం రాజు చొగ్యల్‌తో సిక్కిం తొలి ముఖ్యమంత్రి కాజీ లెండప్ దోర్జీ, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి కేవాల్ సింగ్(ఎడమ)

భారత్‌లో సిక్కిం విలీనం

1974లో భారత్‌లో సిక్కిం విలీనంలోనూ రా అత్యంత కీలక పాత్ర పోషించింది.

''సిక్కిం విలీన ప్రణాళిక కూడా రా చీఫ్ రామేశ్వర్‌నాథ్ కావ్ ఆలోచనే. అప్పట్లో ఇందిరాగాంధీ భారత ఉపఖండంలో తిరుగులేని నేతగా ఎదిగారు. బంగ్లాదేశ్ విజయంతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఉపఖండంలోని సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని ఆమె భావించారు. సిక్కిం రాజు చొగ్యల్ అమెరికా వనితను పెళ్లి చేసుకోవడంతో అసలు సమస్య మొదలైంది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ అప్పటికే సిక్కింలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది'' అని మాజీ రా అధికారి ఆర్కే యాదవ్ బీబీసీకి తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

బీబీసీ ప్రతినిధి రేహాన్ ఫజల్‌తో రా మాజీ అధికారి ఆర్కే యాదవ్(ఎడమ)

"సిక్కింను భారత్‌లో విలీనం చేసుకోవాలని ఇందిరా గాంధీకి సలహా ఇచ్చింది రామేశ్వర్‌నాథ్ కావ్‌.

ఆ విషయం ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు మాత్రమే తెలుసు. వాళ్లు ఇందిరా గాంధీ, పీఎన్ హక్సర్, రామేశ్వర్‌నాథ్ కావ్.

విలీనం ఆపరేషన్‌లో రా నుంచి ముగ్గురు అధికారులు మాత్రమే పాల్గొన్నారు. ఆ ఆపరేషన్‌ విజయవంతమైంది. 3,000 చదరపు కిలోమీటర్ల సిక్కిం భారత్‌లో విలీనమైంది" అని ఆర్ కే యాదవ్ వివరించారు.

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM

కహుటా అణుకేంద్రం

కహుటా ప్రాంతంలో పాకిస్తాన్ అణు కేంద్రం ఏర్పాటు చేస్తోందన్న వార్త మొట్టమొదట ఒక రా గూఢచారి నుంచే వచ్చింది.

కహుటాలోని ఓ క్షురకుడి నుంచి పాకిస్తాన్ అణు శాస్త్రవేత్తల వెంట్రుకల శాంపిళ్లను ఆ గూఢచారి సేకరించారు. వాటిని తీసుకొచ్చి పరీక్షించగా.. రేడియోధార్మికత ఆనవాళ్లు కనిపించాయి. దాని ఆధారంగా.. అణ్వాయుధాల కోసం పాకిస్తాన్ రహస్యంగా యురేనియం అభివృద్ధి చేసిందని, అది కహుటా సమీపంలో ఉండి ఉంటుందని నిర్ధారణైంది.

1977లో కహుటాలోని ఆ న్యూక్లియర్ ప్లాంటు డిజైన్‌ను(బ్లూప్రింట్) రా ఏజెంట్‌ ఒకరు సంపాదించారు.

అయితే.. 10 వేల డాలర్లకు ఆ డిజైన్‌ను కొనాలన్న ప్రతిపాదనను అప్పటి భారత ప్రధాని మోరార్జీ దేశాయ్ తిరస్కరించడమే కాకుండా.. ఆ విషయాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా- ఉల్- హాక్‌కి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మోరార్జీ దేశాయ్, పాకిస్తాన్ జనరల్ జియా ఉల్ హాక్

'రా'లో చాలా ఏళ్ల పాటు పనిచేసిన మేజర్ జనరల్ వీకే సింగ్.. 'సీక్రెట్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్' పేరుతో ఓ పుస్తకం రాశారు.

"కహుటా అణు కేంద్రానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌ను రా ఏజెంట్ సంపాదించారు. అది భారత్‌కు ఇవ్వాలంటే 10 వేల డాలర్లు చెల్లించాలని అతడు డిమాండ్ చేశారు. అప్పుడు మోరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నారు. ఆ ఏజెంట్ పెట్టిన డిమాండ్‌ గురించి చెప్పగానే.. దాన్ని ప్రధాని తిరస్కరించడమే కాదు.. పాక్ అధ్యక్షుడు జియాకి ఫోన్ చేసి.. మీ న్యూక్లియర్ ప్లాంటు గురించి సమాచారం మా దగ్గర ఉందని చెప్పారు. దాని బ్లూ ప్రింట్ మాత్రం మాకు అందలేదు. మరోవైపు ఆ ఏజెంట్‌ను పాకిస్తాన్ చంపేసింది'' అని వీకే సింగ్ తన పుస్తకంలో వివరించారు.

ఫొటో క్యాప్షన్,

బీబీసీ స్టూడియోలో రేహాన్ ఫజల్‌తో మేజర్ జనరల్ వీకే సింగ్

ముషారఫ్ సంభాషణల ట్యాపింగ్

1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో పాక్ సైన్యాధిపతిగా ఉన్న జనరల్ పర్వేజ్ ముషారఫ్ చైనా పర్యటనలో ఉన్నారు. అప్పుడు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్‌ అజీజ్ ఖాన్ బీజింగ్‌లో ఉన్న ముషారఫ్‌కు ఫోన్ చేశారు. "వైమానికదళం, నౌకాదళం అధిపతులతో ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడారు. కార్గిల్ యుద్ధం గురించి తనకు ముషారఫ్ ముందస్తు సమాచారం ఇవ్వలేదని వారితో చెప్పారు" అని ముషారఫ్‌కు అజీజ్ ఖాన్ ఫోన్‌లో తెలిపారు.

ఆ టెలిఫోన్ సంభాషణను రా రికార్డు చేసింది. అంతే కాదు.. ఆ రికార్డింగులను భారత్‌లోని అమెరికా సహా అన్ని దేశాల దౌత్యవేత్తలకూ పంపింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ముషారఫ్

"అలా సంభాషణలను రికార్డు చేయడం కొత్తేమీ కాదు. అలాంటి రికార్డింగులు రా ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ముషారఫ్ చేసిన సంభాషణ చాలా కీలకమైంది. పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్‌కు ప్రణాళిక రచించిందన్న విషయం దాని ద్వారా తెలిసిపోయింది.

అలా నిఘా పెట్టి ఎలాంటి సమాచారమైనా సేకరించవచ్చు. కానీ, దాన్ని బహిర్గతం చేయకూడదు. ఒకవేళ బయటపెడితే.. ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? అన్న విషయాలు ప్రత్యర్థులకు తెలిసిపోతాయి.

అయితే.. ముషారఫ్ సంభాషణ బయటకు రావడంతో మేము వారి శాటిలైట్ లింకును అడ్డగించి వాయిస్ రికార్డు చేస్తున్నామని పాకిస్తాన్‌కు తెలిసిపోయింది. అప్పటి నుంచి వాళ్లు శాటిలైట్ ఫోన్ ద్వారా మాట్లాడటం ఆపేశారు.

ఆ విషయం పాకిస్తాన్‌కు తెలియకపోతే.. ఆ ఉపగ్రహం లింకు ద్వారా మాకు ఇంకా చాల విషయాలు తెలిసే అవకాశం ఉండేది" అని వీకే సింగ్ వివరించారు.

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాజీ చీఫ్ హామిద్ గుల్

ఐఎస్‌ఐ కూడా ట్యాంపింగ్ చేస్తుంది

'రా' చేసిన ఆ ట్యాంపింగ్‌కు అంత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాజీ చీఫ్ హామిద్ గుల్ వ్యాఖ్యానించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "ఆ రికార్డింగును బహిర్గతం చేయడం ద్వారా 'రా' ప్రొఫెషనల్ సంస్థ కాదన్న విషయాన్ని అదే నిరూపించుకుంది. ట్యాపింగ్ అనేది పెద్ద విషయమేమీ కాదు. మేము కూడా మీ అందరి సంభాషణలనూ ట్యాప్ చేస్తున్నాం. 1987లో నేను ఐఎస్‌ఐలో ఉన్నప్పుడు శ్రీలంకకు సైన్యాన్ని పంపాలని రాజీవ్ గాంధీ అనుకున్నారు. ఆ విషయాలన్నీ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుగానే మాకు చేరిపోయాయి. ఫోన్‌ను ట్యాప్ చేయడం గొప్ప విజయం కాదు. వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవడమే అసలైన గెలుపు. అఫ్గానిస్తాన్‌లో ఐఎస్‌ఐ చాలా ప్రభావంతంగా పనిచేసింది. అందుకు మాకు అమెరికా శిక్షణ ఏమీ ఇవ్వలేదు" అని చెప్పుకొచ్చారు.

ఫొటో క్యాప్షన్,

రా తొలి డైరెక్టర్ రామేశ్వర్‌నాథ్ కావ్

'రా' రూపకర్త రామేశ్వర్‌నాథ్ కావ్‌

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ నిఘా సమాచారం సేకరించేందుకు సీఐఏ, ఎంఐ6 ‌లాంటి సంస్థను భారత్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇంటలిజెన్స్ బ్యూరోకి డైరెక్టర్‌గా ఉన్న రామేశ్వర్‌నాథ్ కావ్.. 1968లో 'రా' ఏర్పాటుకు బ్లూ ప్రింట్ రూపొందించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దాని తొలి డైరెక్టర్ కూడా ఆయనే.

1970వ దశకంలో ప్రపంచంలోని టాప్ 5 ఇంటెలిజెన్స్ చీఫ్‌లలో కావ్ ఒకరని.. ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఫ్రాన్స్ (ఎస్‌డీఏసీఏ) అధినేత కౌంట్ అలెక్సాండ్రే ది మెరెనే 1982లో ప్రశంసించారు.

కావ్ ఎప్పుడూ వార్తల్లో కనిపించేందుకు ప్రయత్నించేవారు కాదు. అందుకే ఆ ఒక్క ఫొటో కూడా వార్తాపత్రికల్లో.. మేగజీన్లలో ప్రచురితం కాలేదు.

రా మాజీ డైరెక్టర్, కావ్‌తో కలిసి పనిచేసిన జ్యోతి సిన్హా మాట్లాడుతూ.. "సహచరులు, కిందిస్థాయి ఉద్యోగులతో కూడా కావ్ చాలా మర్యాదగా మాట్లాడేవారు. ఆయన మాటలు ఎవరినీ మనసు నొప్పించేలా ఉండేవి కావు. మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తిని విషంతోనే ఎందుకు చంపాలి? తేనెతో ఎందుకు చంపకూడదు? అని ఆయన అనేవారు. మంచితనంతో ఎదుటి వ్యక్తులను మార్చాలన్నది ఆయన ఉద్దేశం. అప్పుడు యువకులుగా ఉన్న మేం ఆయనను ఓ హీరోగా చూసేవాళ్లం'' అని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

రా తొలి డైరెక్టర్ రామేశ్వర్‌నాథ్ కావ్‌(ఎడమ)తో ప్రధాని ఇందిరా గాంధీ కార్యదర్శి పీ ఎన్ ధర్

సిక్కు వేర్పాటువాదం తీవ్రతను అంచనా వేయడంలో..

సిక్కు వేర్పాటువాదం తీవ్రతను సరిగా అంచనా వేసి.. ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో రా విఫలమైనప్పుడు తొలిసారిగా ఆ సంస్థపై విమర్శ వచ్చింది.

అలాగే.. కశ్మీర్‌లో జరిగే కార్యకలాపాలను కూడా స్పష్టంగా విశ్లేషించలేకపోయిందన్న ఆరోపణ కూడా రాపై ఉన్నాయి..

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఐఎస్ఐ మాజీ చీఫ్ హమిద్ గుల్‌(మధ్యలో)

పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల్లోకి చొరబడి..

ఐఎస్ఐ మాజీ చీఫ్ హామిద్ గుల్‌ చనిపోవడానికి కొద్ది రోజులముందు ఆయన్ను.. 'మీ దృష్టిలో ప్రొఫెషనల్ గూఢచార సంస్థగా రా విజయవంతం అయ్యిందని భావిస్తున్నారా?' అని అడిగాను. అందుకు ఆయన స్పందిస్తూ..

"రా మా దేశంలోని విశ్వవిద్యాలయాల్లోకి చొరబడింది. పాకిస్తాన్‌లో 'అనిశ్చితి' సృస్టించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండేది. షియా, సున్నీ అల్లర్లలో.. బలూచిస్తాన్‌లో ఉద్రిక్తలను రెచ్చగొట్టడంలో అది కీలక పాత్ర పోషించింది. అయినా పాకిస్తాన్‌ను ఏమీ చేయలేకపోయింది" అని ఆయన అన్నారు.

రా వర్సెస్ ఐఎస్‌ఐ

పాకిస్తాన్ ఆర్మీ నుంచి సహకారం ఉండటం ఐఎస్‌ఐకి బాగా కలిసొచ్చే విషయమని రా మాజీ అదనపు డైరెక్టర్ జ్యోతి సిన్హా అభిప్రాయపడ్డారు.

అయినా.. 'రా'తో పోల్చితే ఐఎస్‌ఐ పెద్దగా సాధించిందేమీ లేదని అన్నారు.

ఫొటో క్యాప్షన్,

రేహాన్ ఫజల్, ఏఎస్ దులాత్(కుడి)

"ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకోవడం ద్వారా భారత్‌ను విచ్ఛిన్నం చేయవచ్చని, అది పాకిస్తాన్‌కు గొప్ప విజయం అవుతుందని ఐఎస్‌ఐ ఆలోచన. కానీ.. దానివల్ల పాకిస్తాన్‌ మీద మోయలేని భారం పడింది" అని జ్యోతి సిన్హా వ్యాఖ్యానించారు.

ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసిన ఘనత 'రా'కు ఉందని.. అయినా అందుకు బయట గొప్పలు చెప్పుకునేందుకు ఆ సంస్థ ఇష్టపడదని మరో మాజీ డైరెక్టర్‌ ఎ.ఎస్ దులత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇందిరా గాంధీ

భారత్, అమెరికా సంబంధాల్లో రా పాత్ర

నిఘా సంస్థలు విజయం సాధించినా.. విఫలమైనా అన్నిసార్లూ బయటకు వెల్లడికావు.

అత్యంత కీలకమైన వ్యవహారాల్లోనూ బాధ్యతలు తీసుకుంటాయి. కానీ.. క్రెడిట్ మాత్రం ఆ సంస్థలకు వెంటనే దక్కదు. వాటి పాత్ర ఎలాంటిదో కూడా బయటి ప్రపంచానికి చాలావరకు తెలియదు.

ఆనంద్ కుమార్ వర్మ ఓ సందర్భాన్ని గుర్తుచేశారు.

"అది 1980-81, ఎన్నికల్లో ఇందిరా గాంధీ గెలుపొందారు. అమెరికా ప్రభుత్వంతో కొత్త సంబంధాలు నెలకొల్పేందుకు ఆమె సంకల్పించారు. అయితే.. అప్పట్లో సోవియట్ మిలిటరీ మాకు సలహాలిస్తోందన్న భావనతో.. అమెరికా రక్షణ శాఖ భారత్‌కు పూర్తి వ్యతిరేకంగా ఉంది. అమెరికా రక్షణ శాఖ, భారత విదేశాంగ శాఖల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో అమెరికాను ఒప్పించడం కష్టమైంది"

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జార్జ్ బుష్ సీనియర్

"అప్పుడు భారత విదేశాంగ విధానాన్ని అమెరికాలో సమీక్షించాలని భారత ప్రధాని ఇందిరా గాంధీ అనుకున్నారు. కానీ.. భారత విదేశాంగ శాఖ మాత్రం అందుకు సమ్మతించలేదు. దాంతో రా రంగంలోకి దిగింది. భారత విదేశాంగ శాఖ, అమెరికా రక్షణ శాఖలతో సంబంధం లేకుండానే.. మరో మార్గం ద్వారా అమెరికాతో రా సంప్రదింపులు జరిపింది. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలనుకుంటోందన్న విషయాన్ని అమెరికాకు వివరించింది. మీ రక్షణ శాఖ, మా విదేశాంగ శాఖ చెబుతున్న విషయాలను పట్టించుకోవద్దు అంటూ రా అమెరికాను ఒప్పించింది. దాంతో 1982లో అమెరికా నుంచి ఇందిరా గాంధీకి ఆహ్వానం వచ్చింది. ఆమె వెళ్లారు, కానీ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఓ పని చేశారు. భారత్‌ను సందర్శించాలంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జార్జ్ బుష్‌ను ఆహ్వానించారు. సాధారణంగా ప్రధాన మంత్రి దేశాధ్యక్షులను ఆహ్వానిస్తారు. ఇందిరా గాంధీ ఆహ్వానాన్ని బుష్ స్వీకరించారు. దాంతో భారత్, అమెరికాల మధ్య సరికొత్త సంబంధాలకు బీజం పడింది" అని ఆనంద్ కుమార్ వర్మ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)