మీ వేలిముద్రలు ఎవరూ దొంగిలించకుండా కాపాడుకోండి

 • 4 జూలై 2018
ఆదార్ ఫింగర్ ఫ్రింట్స్ Image copyright AFP

ఇప్పుడు దేశంలో అన్నింటికీ ఆధారే ఆధారమైంది. సిమ్ కార్డు నుంచి పాన్ కార్డు వరకు దేనికైనా ఆధార్ తప్పనిసరి. కానీ, ఆధార్ భద్రత విషయంలో పదే పదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొన్నాళ్ల కిందట రూ.500 లకే ఆధార్ డేటా వివరాలు బయటకొస్తున్నాయని ట్రిబ్యూన్ పత్రిక ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టింది.

ఇటీవల తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన సంతోశ్.. కృత్రిమ వేలిముద్రలతో ఆధార్ ధ్రువీకరణ చేసి సిమ్ కార్డులు తీసుకున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది.

అసలు మన వేలిముద్రల నకలను సృష్టించవచ్చా? వాటితో ఆధార్‌ డేటా వివరాలను సేకరించడం సాధ్యమేనా..?

Image copyright Getty Images

రబ్బరు వేలిముద్రలతో ఆధార్ వివరాలు

తెలంగాణలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునేవాళ్లు తమ వేలిముద్రలు ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్లను అధికారులు తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తారు.

ఎవరైనా ఆ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో సంతోష్ ఆ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోని వాటిలోని వేలి ముద్రలు సేకరించాడు.

మార్కెట్లో రబ్బరు (పాలిమర్)పై వేలిముద్రల నకలను తయారు చేసే పరికరాలు వస్తున్నాయి.

ఈ పరికరాన్ని కొన్న సంతోశ్ దాని ద్వారా తన దగ్గర ఉన్న వారి వేలి ముద్రల నకలను తయారు చేశాడు. బయోమెట్రిక్‌లో ఆ రబ్బరు వేలిముద్రలను ఉపయోగించి వారి ఆధార్ డేటాను సేకరించాడు. వాటితో దీంతో సిమ్ కార్డులు తీసుకున్నాడు.

అయితే, ఆ సిమ్ కార్డుల్లో ఎవరూ రీచార్జ్ చేసుకోకపోవడంతో సదరు మొబైల్ కంపెనీకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎస్.ఆర్. నగర్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

సిమ్ కార్డులు అమ్మితే వచ్చే కమీషన్ కోసమే తాను ఈ పని చేసినట్టు సంతోష్ చెబుతున్నాడు. కానీ, దీని వెనుక కుట్ర కోణం, తీవ్రవాదుల ప్రమేయం ఉందా అన్న అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Image copyright Getty Images

ఆధార్ భద్రతపై అనుమానాలు

భూమి కొనుగోలుదార్ల వేలిముద్రలు ఉండే డాక్యుమెంట్లను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో బహిరంగంగా ఎందుకు పెడుతోంది? సంతోశ్‌లా మరికొందరు ఆ వేలిముద్రలతో ఆధార్ డేటాను తస్కరించి వేరే పనులకు ఉపయోగిస్తే పరిస్థితి ఏంటీ?

కేవలం రబ్బరు వేలిముద్రలతో ఆధార్ ధ్రువీకరణ జరిగిపోతుందా? అలా అయితే ఇక ఆధార్‌ అవసరం ఉండదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

అయితే, కొన్ని జాగ్రత్తలతో మన ఆధార్ వివరాలు ఇతరుల చేతికి చిక్కకుండా చర్యలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Image copyright Mansi Thapliyal

'ఫోన్, ఈ మెయిల్స్‌లతో జాగ్రత్త'

సాంకేతిక మీద సరైన అవగాహన పెంచుకోవడం, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవడంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని కంప్యూటర్ ఎరా మాస పత్రిక సంపాదకులు నల్లమోతు శ్రీధర్ తెలిపారు. ఆధార్ భద్రతపై ఆయన కొన్ని సూచనలు చేశారు.

 • మీ ఫోన్ పాస్‌వర్డ్, పిన్, స్క్రీన్ లాక్ పాటర్న్ ఎవరికీ చెప్పొద్దు.
 • ఆధార్, బ్యాంకు వంటి కీలక పత్రాలతో అనుసంధానమైన ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వంటి సాధారణ వివరాలు ఎవరికీ తేలిగ్గా ఇవ్వవద్దు.
 • మీ ఆధార్ సంఖ్యతో మీరు ఎన్ని సిమ్‌లు తీసుకున్నారో చూసే వ్యవస్థ ఉంది. దాన్ని ఉపయోగించి మీ పేరుతో ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
 • ఆధార్‌లో ఈ-మెయిల్ అప్‌డేట్ చేస్తే.. మీ ఆధార్ ధ్రువీకరణ జరిగిన ప్రతీసారీ ఏ సంస్థ మీ ఆధార్ ధ్రువీకరణ చేసిందో మెయిల్ వస్తుంది. దీని ద్వారా మీ ఆధార్‌పై కన్నేసి ఉంచొచ్చు.
 • మీ వేలిముద్రలున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం మంచిది.
 • సిమ్ కార్డు కోసం వేలిముద్రలు ఇచ్చేప్పుడు ఆథరైజ్డ్ షోరూమ్ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ అన్నది సరిచూసుకోవాలి. (గతంలో ఓ టెలికామ్ సంస్థ ఆధార్ వెరిఫికేషన్ కోసం తీసుకున్న వేలిముద్రలతో ఈ వాలెట్ క్రియేట్ చేసింది.) ఇలాంటి సమయంలో మీ ఆధార్ వేరే దేనికీ వాడబోమన్న హామీని తీసుకోవాలి.
 • ఈ- మెయిల్స్, ఇతరత్రా ఎకౌంట్లకు డబుల్ వెరిఫికేషన్, ఓటీపీ వెరిఫికేషన్ పెట్టుకోవాలి.

#AadhaarFacts: ఆధార్ అంత మంచిదైతే ఇన్ని సమస్యలెందుకు?

భర్తను హత్య చేసిన భార్య..ఆధార్‌తో గుట్టురట్టు

సుప్రీంకోర్టు: ‘ఆధార్ లింకింగ్‌ తప్పనిసరికాదు’.. మార్చి 31 డెడ్‌లైన్ కాదు

Image copyright Mansi Thapliyal

'లోపాలు సరిద్దిదాలి.. నిఘా పెంచాలి'

ప్రజలు వ్యక్తిగతంగా తమ ఆధార్ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడటమే కాదు ప్రభుత్వ కూడా ఎవరి ఆధార్ వివరాలు బహిర్గతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని నల్లమోతు శ్రీధర్ అన్నారు.

 • వేలి ముద్రలను కృత్రిమంగా తయారు చేసే పరికరాలు అందుబాటులో లేకుండా ప్రభుత్వం నిఘా పెట్టాలి.
 • తక్కువ ఖరీదు ఉండే కేవైసీ వెరిఫికేషన్ మెషీన్ల (వేలిముద్రలు తీసుకునే పరికరాలు) వల్ల సమస్య ఉంటుంది. సిలికాన్ వేలిముద్రలను గుర్తించే వెసులుబాటు వాటిలో లేదు. అటువంటివి కాకుండా నిజంగా మనిషి చేయిని గుర్తించి వెరిఫై చేసే పరికరాలనే వాడేలా చర్యలు తీసుకోవాలి.
 • డిజిటలైజేషన్‌తో అందరికీ సమాచారం ఇవ్వడం మంచిదే. కానీ, ఎవరు ఏ సమాచారం ఎప్పుడు ఎంత తీసుకుంటున్నారో తెలుసుకునే వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకు తెలంగాణ స్టాంపుల శాఖ వెబ్‌సైట్లో ఒక ప్రోగ్రామ్‌తో 10 నిమిషాల్లో వేల డాక్యుమెంట్లు తీసుకునే అవకాం ఉంది. కనీస జాగ్రత్తలు లేవు.
 • ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉండే వ్యక్తిగత సమాచారం ఎవరికి యాక్సెస్ ఉంటుంది? ఎంత వరకూ ఉంటుంది? అనేది స్పష్టంగా ఉండాలి. దీనిపై సిబ్బందికి అవగాహన కల్పించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)