దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి

  • 5 జూలై 2018
తెలుగు అక్షరాలు దిద్దుతున్న చిన్నారులు Image copyright Getty Images

భారత్‌లో తెలుగు మాట్లాడేవారి శాతం తగ్గింది. 50 ఏళ్ల కిందట దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది.

దేశంలో అత్యధికులు మాట్లాడే మాతృభాషల్లో తెలుగు నాలుగో స్థానానికి పడిపోయిందని 2011 జనాభా లెక్కల్లో తేలింది.

1961 జనాభా గణన ప్రకారం దేశంలో హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడే అతిపెద్ద భాషగా తెలుగు ఉండేది. మూడో స్థానం బెంగాలీది.

అయితే.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.

1971 జనాభా గణనలో స్వల్ప తేడాతో తెలుగును అధిగమించిన బెంగాలీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. తెలుగు తృతీయ స్థానానికి పడిపోయింది.

అనంతరం మరో మూడు దశాబ్దాల పాటు ఆ స్థానాలు అలాగే కొనసాగాయి.

కానీ.. 2011 జనాభా లెక్కల్లో తెలుగు మరో స్థానాన్ని కోల్పోయింది.

తెలుగు నాలుగో స్థానానికి పడిపోయింది. మూడో స్థానాన్ని మరాఠీ ఆక్రమించింది. అంతకుముందు మరాఠీ నాలుగో స్థానంలో ఉండేది.

నిజానికి మరాఠీల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూనే ఉంది. కానీ.. ఆ తగ్గుదల రేటు మరాఠీ కంటే తెలుగులో ఎక్కువగా ఉంది.

2001 గణాంకాల ప్రకారం దేశ జనాభాలో తెలుగును మాతృభాషగా ఎంచుకున్నవారు 7.19 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాత దశాబ్ద కాలంలో అది 6.70 శాతానికి పడిపోయింది.

దేశంలో 2011 నాటికి మొత్తం తెలుగువారు 8.11 కోట్ల (8,11,27,740) మంది ఉన్నారు. అత్యధికంగా 43.63 శాతం హిందీని మాతృభాషగా ఎంచుకున్నారు.

ఏ భాషీయులు ఎంత శాతం?

దక్షిణాది భాషలన్నింటిలోనూ తగ్గుదల నమోదైంది. తెలుగుతో పాటు మలయాళం కూడా ఓ స్థానం కోల్పోయింది. 2001లో మలయాళం 9వ స్థానంలో ఉండగా.. 2011 నాటికి 10కి దిగజారింది. 9వ స్థానంలోకి ఒడియా వచ్చి చేరింది.

హిందీ మాట్లాడేవారి శాతం మాత్రం పెరిగింది.

2001 లెక్కల్లో దేశ జనాభాలో హిందీ భాషీయుల శాతం 41.03 ఉంటే.. 2011 నాటికి 43.63 శాతానికి చేరింది.

దేశంలో 52.83 కోట్ల (52,83,47,193) మంది హిందీ తమ మాతృభాష అని చెప్పారు.

అదే సమయంలో గుజరాతీల శాతం కూడా 0.10 శాతం పెరిగింది. కశ్మీరీ మాట్లాడేవారి సంఖ్య 0.2 శాతం పెరిగింది.

గమనిక: 2011 జనాభా లెక్కల నాటికి ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రం. కాబట్టి.. తాజా నివేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గణాంకాలను వేరువేరుగా చూపించలేదు.

1961 జనాభా లెక్కల ప్రకారం చూస్తే..

భారత దేశంలో హిందీ మాట్లాడేవారి సంఖ్య 13,34,35,360(ప్రథమ స్థానం)

తెలుగు తమ మాతృభాష అని చెప్పిన వారి సంఖ్య 3,76,68,132 (ద్వితీయ స్థానం)

బెంగాలీ మాట్లాడేవారు 3,38,88,939 మంది (మూడో స్థానం)

చిత్రం శీర్షిక 2011 జనాభా లెక్కల ప్రకారం

రాష్ట్రాల వారీగా తెలుగు జనాభా

తెలుగును మాతృభాషగా ఎంచుకున్న వారు దేశంలో ఎక్కడ ఎంత మంది ఉన్నారో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారిగా పరిశీలిస్తే(2011 నాటికి)..

అండమాన్ నికోబార్ దీవుల్లో 50,404 మంది తెలుగువారున్నారు.

జమ్ము కశ్మీర్‌లో 13,970 మంది ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాంలో 26,630 మంది ఉన్నారు. దేశ రాజధాని దిల్లీలో 25,934 మంది ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల అత్యధికంగా తెలుగువారు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ 42,34,302 మంది ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్ష ద్వీప్‌లో అతి తక్కువగా 42 మంది మాత్రమే ఉన్నారు. వారిలో 35 మంది పురుషులు, ఏడుగురు మహిళలు.

Image copyright Getty Images

తెలుగు మాట్లాడేవారు ఎందుకు తగ్గుతున్నారు?

దేశంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్యలో తగ్గుదలకు కారణం ఇతర రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో స్థిరపడ్డ చాలామంది తెలుగువారు తమ భాష తెలుగు అని చెప్పకపోవడమేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

2006లో తమిళనాడు ప్రభుత్వం నిర్బంధ తమిళ బోధన చట్టాన్ని తీసుకువచ్చింది.

ఆ చట్టం ప్రభావం చాలామంది తెలుగువారిపై పడిందని.. వారు తమ భాష తమిళం అని చెప్పడానికి అదో కారణమని మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

‘‘ఎవరికైనా తమ మాతృ భాష మీద మమకారం ఉంటే ఎక్కడి కెళ్లినా దాన్ని మరచిపోరు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డవారు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు.

మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా అలాగే ఉండాలి.

ఏ రాష్ట్రంలో స్థిరపడినా.. ఇంట్లో అమ్మానాన్నలు తెలుగులో మాట్లాడుతుంటే వారి పిల్లలు కూడా తెలుగు నేర్చుకుంటారు.

ఇతర ప్రాంతాల్లో స్థిరపడి తెలుగు భాష, సంస్కృతి మూలాలను కాపాడుకునేవారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

కర్ణాటక వాళ్లు కన్నడ భాష పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలల్లో కన్నడలో బోధించే ఏర్పాట్లు చేస్తూ.. తమ సంస్కృతిని పరిరక్షించుకుంటున్నారు.

అలా మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషా ప్రాధికార సంస్థ వస్తే అలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించే వీలుంటుంది.

అండమాన్ నికోబార్ దీవుల్లో ఎన్నికల్లోనూ తెలుగువాళ్లు గెలుస్తున్నారు. తమిళనాడు రాజకీయ నేతల్లో తెలుగువాళ్లు అనేకమంది ఉన్నారు. మదురై ఎమ్మెల్యే కూడా తెలుగు వ్యక్తే. కానీ.. వాళ్లు తెలుగు సమావేశాలకు రారు. మన భాష గురించి మాట్లాడరు’’ అని బుద్ధప్రసాద్ చెప్పారు.

వలసల ప్రభావం

దేశ జనాభాలో తెలుగు వారి శాతం తగ్గడానికి తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వలసలు ప్రధాన కారణమని తెలుగు యూనివర్శిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ మృణాళిని అభిప్రాయపడ్డారు.

"గత ముప్పై ఏళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా.. బ్రిటన్.. గల్ఫ్ సహా.. అనేక దేశాలకు వలసలు భారీగా జరిగాయి. అలా వెళ్లినవారు జనాభా లెక్కల్లో పాల్గొనకపోవడం దేశంలో తెలుగువారి శాతం తగ్గడానికి ప్రధాన కారణం.

వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగువారు తెలుగు మాట్లాడుతున్నప్పటికీ.. వివిధ కారణాల రీత్యా వారు తమ మాతృభాష తెలుగు అని జనాభా లెక్కల సమయంలో చెప్పకపోవడం మరో కారణం.

అలాగే.. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలో జనాభా నియంత్రణ పటిష్టంగా అమలవుతోంది. దాంతో దక్షిణాదిన జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉంటోంది. ఇది మరో కారణం కావచ్చు.

మరోవైపు.. సాధారణంగా ప్రజలు రోజూ మాట్లాడే భాష ఒకటి ఉంటుంది, వారి మాతృభాష మరొకటి ఉంటుంది. సర్వేలో మాత్రం వారి మాతృ భాషనే పరిగణనలోకి తీసుకొని ఉండవచ్చు" అని మృణాళిని వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2011 జనాభా సర్వే సమయంలో తీసిన చిత్రం

మరాఠీ పెరగడానికి కారణం ఇదేనా?

అంకెల్లో కొద్దిపాటి మార్పులు వచ్చినంత మాత్రాన తెలుగు మాట్లాడేవారు తగ్గిపోయారని కచ్చితంగా చెప్పలేమని ప్రముఖ భాషా నిపుణులు, భాషా పరిశోధకులు గణేశ్ దేవీ అన్నారు.

"2011లో జనగణన జరిగినప్పుడు తెలుగు ప్రాంతంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రభావం వల్ల జనాభా లెక్కలు పూర్తిస్థాయిలో జరగకపోయి ఉండవచ్చు. అలాగే.. ఇతర రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళం మాట్లాడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. వాళ్లు గతంలో తమ భాష తెలుగు అని చెప్పి, 2011లో మరాఠీ, కన్నడ అని పేర్కొని ఉండవచ్చు. అందువల్లనే మరాఠీ మూడో స్థానంలోకి పెరిగి ఉండవచ్చు. అలా అని తెలుగు మాట్లాడేవారు తగ్గిపోయారని చెప్పలేం" అని గణేష్ దేవీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)