సొనాలీ బింద్రేకు క్యాన్సర్ ఎలా వచ్చింది?

ఫొటో సోర్స్, FB / Sonali Bendre Behl
నటి సొనాలీ బింద్రేకు క్యాన్సర్. శరీరంలోని ఇతర భాగాలకూ క్యాన్సర్ వ్యాపించింది.
సొనాలీ బింద్రే స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అమెరికాలో గత కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్న ఆమె, ఇప్పుడు భారత్‌కు తిరిగొచ్చారు. అంతకు ముందు "క్యాన్సర్ వస్తుందని అస్సలు ఊహించలేదు. జీవితంలో ఒక్కోసారి ఊహించనివి జరుగుతుంటాయి" అని ఆమె అన్నారు.
తాను హైగ్రేడ్ కాన్సర్‌తో బాధపడుతున్నానని, ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నానని ఆమె చెప్పారు.
సొనాలీకి క్యాన్సర్ ఉందన్న విషయం అనుకోకుండా బయటపడింది.
తరచుగా పొత్తికడుపులో నొప్పి రావడం, కడుపులో ఇబ్బందిగా ఉండటంతో సొనాలీ బింద్రే వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
సొనాలీకి క్యాన్సర్ ఉందని వైద్యులు నిర్ధరించారు.
అది కూడా తీవ్రస్థాయిలో ఉందని, అది ఇతర శరీర భాగాలకు వ్యాపించిందని తేలింది.
దీంతో న్యూయార్క్ వెళ్లి అక్కడ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు సొనాలీ బింద్రే.
తాను ప్రస్తుతం కాన్సర్‌తో పోరాటం చేస్తున్నానని, క్యాన్సర్‌లో ఎదురయ్యే ప్రతీ సవాల్‌ను ఎదుర్కొంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు ఎంతో అండగా ఉంటున్నారని సొనాలీ బింద్రే ట్వీట్ చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
సొనాలీ బింద్రే హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు.
మురారీ చిత్రంతో మహేశ్ బాబు సరసన తెలుగు తెరకు సొనాలీ బింద్రే పరిచయం అయ్యారు.
ఆ తర్వాత ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖడ్గం, మన్మధుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
2013లో అక్షయ్ కుమార్ సరసన "వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దుబారా" చిత్రంలో చివరిసారిగా నటించారు.
సొనాలీ బింద్రే నిర్మాత గోల్డీ బేహ్ల్ను వివాహం చేసుకున్నారు.
సొనాలీ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, స్నేహితులు కోరుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు.
గతంలో నటి గౌతమి రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. గౌతమి పోరాడి క్యాన్సర్‌ను జయించారు.
"జీవితమే ఒక పోరాటం. నేను కేన్సర్‌కి ఎదురు తిరిగాను. జయించాను. ఊపిరి ఉన్నంత వరకు పోరాడాల్సిందే. పోరాటానికి లింగ బేధం లేదు" అని గతంలో గౌతమి బీబీసీకి చెప్పారు.
గౌతమి కేన్సర్‌ను జయించడమే కాదు ఇతరులకూ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఫొటో సోర్స్, FB / Manisha Koirala
గౌతమి ఒక్కరే కాదు, ఇటీవల హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. గౌతమి రొమ్ము క్యాన్సర్‌ను జయించగా.. మనీషా కోయిరాలా ఇంకా చికిత్స తీసుకుంటోంది.
మనీషా కోయిరాలాకు అండాశయ క్యాన్సర్ ఉందని 2012లో తేలింది. దాన్ని అప్పడామె అస్సలు నమ్మలేదు. పరీక్షల్లో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిజం తెలిసి దానితో పోరాటం చేస్తున్నారు.
మనీషా కోయిరాలా బంధువుల్లో కూడా క్యాన్సర్ వచ్చిన వారున్నారు. దాంతో క్యాన్సర్ వచ్చిందని తెలిసి మనీషా పెద్దగా షాకవ్వలేదు.
ఫొటో సోర్స్, Twitter / Manisha Koirala
తనకు క్యాన్సర్ ఉందన్న విషయం ఎలా బయటపడిందో 'ఇండియా టుడే' కు మనీషా వివరించారు.
"నేను తరచూ జబ్బుపడుతున్నాను. శరీరం లోపల ఏదో తేడా జరుగుతోందని నాకు సంకేతాలు అందుతున్నాయి. రోగ నిరోధక శక్తి కూడా తగ్గినట్లు కనిపిస్తోంది. కొన్నిరోజుల తర్వాత నా కడుపు చాలా ఉబ్బిపోయింది. దాంతో నేను వ్యాయామం మళ్లీ మొదలుపెట్టాను. బరువు తగ్గాను. కానీ ఉదర భాగంలో మాత్రం తగ్గలేదు. దాంతో నాకు ముసలితనం వచ్చిందని అనుకున్నా. కానీ వైద్య పరీక్షల్లో నాకు అండాశయ క్యాన్సర్ ఉందని తేలింది" అని మనీషా కోయిరాలా వివరించారు.
క్యాన్సర్ వస్తుందని ఆమె అస్సలు అనుకోలేదు. తనకు ఆ వ్యాధి ఉందని తెలిసి కుంగిపోలేదు. దానితో మనీషా పోరాటం చేస్తోంది. తనను తాను క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్న యోధురాలిగా మనీషా అభివర్ణించుకుంటారు.
ఫొటో సోర్స్, FB / Irrfan Khan
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు క్యాన్సర్ ఉందన్న విషయం ఈ ఏడాది మార్చిలో బయటపడింది.
ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంగా ఉన్నారని మార్చిలో వార్తలొచ్చాయి..
తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని మార్చి 4న ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్ చేశారు. అది క్యాన్సర్ అని తర్వాత తెలిసింది. ప్రస్తుతం ఆయన లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
ఇది జరిగిన సరిగ్గా నాలుగు నెలల తర్వాత అంటే జులై 4న సొనాలీ బింద్రే కూడా ట్విటర్ వేదికగా తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
రొమ్ము క్యాన్సర్‌ను సూచించే 12 లక్షణాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)