ప్రెస్ రివ్యూ: తెలంగాణలో బంగారం సెజ్.. ఏడాదికి 30 టన్నుల బంగారం శుద్ధి

  • 5 జూలై 2018
Image copyright Getty Images
చిత్రం శీర్షిక హైదరాబాద్ శివారులో బంగారు శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు రెండు సంస్థలు ముందుకొచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో త్వరలోనే గోల్డ్ సెజ్ ఏర్పాటు కాబోతోందంటూ 'దక్కన్ క్రానికల్' పత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో ఈ సెజ్(ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు కోసం 25 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఈ సెజ్ ఏర్పాటు చేయాలని హాంకాంగ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థతో పాటు, మరో భారతీయ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది.

ఇక్కడ రెండు బంగారం శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థలు ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం.

అందుకోసం తొలి దశలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 30 టన్నుల బంగారం, 100 టన్నుల వెండి శుద్ధి చేయగల కర్మాగారం ఏర్పాటుకు భారతీయ సంస్థ ముందుకొచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

రెండో దశలో.. 750 కోట్ల పెట్టుబడితో 50 టన్నుల బంగారం, 150 టన్నుల వెండి శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.

ఈ గోల్డ్ సెజ్ నెలకొల్పితే.. దేశంలో రెండో సెజ్ అవుతుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో అలాంటి సెజ్ ఉంది.

అక్కడ దక్షిణ ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న ముడి బంగారాన్ని శుద్ధి చేస్తున్నారని డక్కన్ క్రానికల్ పేర్కొంది.

నరేంద్ర మోదీ Image copyright Getty Images

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక ఓ కథనం రాసింది.

విభజన హామీలపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర రెడ్డి వేసిన పిటిషన్‌పై కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పింది.

హోదాకు బదులుగా ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

2015-2020 సంవత్సరాల్లో విదేశీ ఆర్థిక సంస్థల రుణం రూపంలో సాయం చేస్తామని ప్రకటించినట్లు తెలిపింది.

లోటు భర్తీ, మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలు, ఇలా అనేక అంశాలపై ఇవ్వాల్సింది ఎంతో చెప్పలేదు. 'రైల్వే జోన్‌' ప్రస్తావన నామమాత్రంగా కూడా తీసుకురాలేదు.

ఉద్యోగుల విభజన, ఉమ్మడి ఆస్తుల పంపిణీ వంటి ఎన్నో కీలకాంశాలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నా... 'అన్నీ చేసేశాం' అని కేంద్రం చెప్పింది.

ఏపీకి ఐదేళ్లలో 22వేల కోట్లు చెల్లిస్తామని, అందులో ఇప్పటికే 15,969 కోట్లు ఇచ్చామని కేంద్రం పేర్కొంది.

అమరావతి నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. మరో వెయ్యి కోట్లు తగిన సమయంలో చెల్లిస్తామని 'హామీ' ఇచ్చింది.

కాగ్‌ నివేదిక ప్రకారం రాష్ట్రానికి రూ.16వేల కోట్లు రెవెన్యూ లోటు ఉన్నట్లు కేంద్రం అంగీకరించింది. అయితే... తమ లెక్కల ప్రకారం అది రూ.4117.50 కోట్లేనని, ఇందులో 3979.5 కోట్లు ఇచ్చామని తెలిపింది.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి ఇప్పటిదాకా రూ.6564.70 కోట్లు విడుదల చేసినట్లు, మొత్తం నిర్మాణ వ్యయాన్ని తామే భరించాల్సిందని కూడా తెలిపింది. నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకు దీని నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికే అప్పగించినట్లు తెలిపింది.

దుగరాజపట్నం పోర్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ పరిశీలన జరుపుతోందని కేంద్రం అఫిడవిట్‌లో తెలిపిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

నానో కారు Image copyright Getty Images

టాటా నానో కార్ల కథ ముగిసినట్లేనా?

దశాబ్ద కాలంలోనే టాటా నానో కార్ల శకం ముగిసిపోయేలా అనిపిస్తోంది అంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

నానో కార్ల తయారీని ఆపేస్తున్నామని టాటా మోటార్స్‌ అధికారికంగా ప్రకటించకపోయినా.. తాజాగా జరుగుతున్న ఉత్పత్తిని చూస్తోంటే ఇకపై ఈ కార్ల తయారీ ఉండదేమో అనిపిస్తోంది.

ఎందుకంటే జూన్‌ నెలలో కేవలం ఒక్కటంటే ఒక్క కారు మాత్రమే తయారైంది.

మధ్య తరగతి వారి కోసం రూ.లక్షకే కారును అందుబాటులోకి తీసుకురావాలని రతన్‌ టాటా కలలు కన్నారు.

2008లో ఈ కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. 2009లో మార్కెట్లోకి వచ్చింది. తొలుత నానో కార్లను రూ.లక్షకే అందించారు.

కానీ.. ఆ తరవాత వ్యయాలు పెరిగిపోవడంతో 2017 వచ్చేసరికి ధర రూ.2,15,000 అయ్యింది.

తొలి రెండేళ్లలో 70,000 కార్ల చొప్పున విక్రయించారు. అయితే 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 7,591 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

గత నెలలో దేశీయ మార్కెట్‌లో మూడు మాత్రమే అమ్ముడయ్యాయి. అందుకే తయారీ కూడా తగ్గించి ఒక్కటే కారును ఉత్పత్తి చేశారు.

జూన్‌లో ఈ కార్ల ఎగుమతులు కూడా ఏమీ లేవని టాటా మోటార్స్‌ తెలిపిందని ఈనాడు పత్రిక రాసింది.

Image copyright Naveen Kumar/BBC
చిత్రం శీర్షిక ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం వరకూ, తెలంగాణలో 50 శాతం వరకూ ఏటీఎంలు నో క్యాష్ బోర్డులు ప్రదర్శిస్తున్నాయి

రాత్రి 11 దాటితే ఏటీఎం బంద్?

హైదరాబాద్‌లో ఇకపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎం కేంద్రాలు మూతపడనున్నాయంటూ 'సాక్షి' ఓ కథనం రాసింది.

ఏటీఎంల నిర్వహణ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాయి. నిర్ణీత లావాదేవీల కంటే తక్కువ ఉన్న ఏటీఎం కేంద్రాలను రాత్రి వేళల్లో డీ-లింక్‌ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి.

శనివారం సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించాయి.

నిర్వహణ భారంతో పాటు స్కిమ్మింగ్‌ వంటి సైబర్‌ నేరాలు తగ్గించడానికి డీ-లింక్‌ చేయడమే కాక ఆయా కేంద్రాలను నిర్ణీత సమయంలో పూర్తిగా మూసేయాలని పోలీసులు సూచించారు.

ఈ అంశాన్ని ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు.

రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలు ఉండే ఏటీఎంలను రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు డీ-లింక్‌ చేసి ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకర్లు పోలీసులకు తెలిపారు.

ఇలాంటి ఏటీఎంల వల్ల ఏసీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మినహా ఎలాంటి ఉపయోగం ఉండట్లేదని వారు పేర్కొన్నారు.

డీ-లింక్‌ చేయడం ద్వారా ఏటీఎం మిషన్‌ పని చేయకుండా పోతుంది. అప్పుడు ఏసీలను ఆఫ్‌ చేసినా మిషన్‌కు ఎలాంటి నష్టం ఉండదు. నిర్ణీత సమయం తర్వాత మళ్లీ సదరు ఏటీఎంను సర్వర్‌తో లింక్‌ చేయడం ద్వారా యథావిధిగా పని చేసేలా చేయవచ్చు.

నిర్వహణ వ్యయం తగ్గించడంతో పాటు సైబర్‌ నేరాలను నియంత్రించడానికి ఏటీఎంలను డీ-లింక్‌ చేయడమే కాక పూర్తిగా మూసేయాలని స్పష్టం చేశారని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)